| శ్రీవేంకటేశ అష్టోత్తర శతనామావళి - డా|| కె.వి. రాఘవాచార్య


మోకాలు వరకు పుట్టలో నుండగా వరాహ రూపమున కన్పించిన (ఆవిర్భవించిన) వేంకటేశునకు నమస్కారము. పూర్వకాలంలో వేంకటాద్రిపై వసువు అనే కిరాతుడు నివసించేవాడు. అతని భార్య పేరు చిత్రావతి. కుమారుని పేరు వీరుడు. ఆ కుటుంబం అంతాశ్రీ నివాసునిపై భక్తి కలిగి జీవించింది. ఒకనాడు కిరాతుడు తన శ్యామాక (కొర్రలు) పొలములో పైరును తిని నాశనం చేస్తున్న ఒక శ్వేత వరాహమును చూ చాడు. వెంటనే దానిని తరిమివేసినాడు. అది కొద్దిదూరంలో ఉన్న చింతచెట్టు క్రింద నున్న పెద్దపుట్టలో దూరింది. ఆకాశవాణి ఆదేశానుసారం కిరాతుడు (వసువు) నారాయణపురం రాజు తొండమాన్ చక్రవర్తికి శ్వేత వరాహ వృత్తాంతమును తెలియజేశాడు. రాజు ఆ వరాహాన్ని దర్శింప ఆరాటపడ్డాడు. తొండమానుడు వసువు వెంట వచ్చి నిషాదుని పొలం చేరినాడు. ఆ రాత్రి రెండవ జాములో శ్యామాక పైరును తినుటకు వచ్చిన శ్వేతవరాహం కన్పించింది. తొండమానుడు, వసువు దానిని తరిమి వెంటబడినారు. అది చింతచెట్టు క్రిందనున్న పెద్దపుట్టలో దూరింది. ఆకాశవాణి ఆదేశానుసారం తొండమానుడు గునపముతో పుట్టను త్రవ్వించక నీల గోక్షీరముతో అభిషేకించి పుట్టను కరుగ జేశాడు. వారికి పుట్టలో పాదములు భూమిలో దిగబడియుండి మోకాలు వరకు మాత్రమే కన్పించుచున్న


వరాహమూర్తి దర్శనమిచ్చాడు. తొండమానుడు వరాహమూర్తిని దర్శించి, సంతృప్తి పడక, పాదముల వరకూ డాలన్న కోరికతో పాలతో పుట్టను కరిగించుటకు ప్రయత్నించాడు. అంతట వరాహమూర్తి...


రాజా! వ్యర్థ ప్రయత్నమును చాలింపుము. ఈ మోకాలి వరకే నీకు దర్శనము. పాదములు నీకు కన్పించవు. ఈ వరాహ రూపమునే శిలలో నిర్మింపజేసి, ప్రతిష్ఠను చేయించి, సర్వ భోగములను సమర్పించి, వైఖానస అర్చకులను రప్పించి వారిచే ఆరాధన చేయింపుము అని తొండమాను రాజును ఆదేశించినాడు. - పాద్మ, 29-50-53 శ్లో || , అంతట తొండమానుడు, వసువు, వీరుడు వరాహస్వామిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకొన్నారు. స్వామి దర్శనముచే కిరాత దంపతులు దుర్వాసుని శాపమునుండి విముక్తులై కిన్నర దంపతులై స్వీయలోకమునకు వెళ్ళినారు. తొండమానుడు వరాహస్వామి ఆదేశానుసారం వరాహస్వామిని ప్రతిష్ఠించి నిత్య ఆరాధనలు వగైరా ఏర్పాటు చేసి సద్దతిని పొందినాడు. వల్మీకము నుండి జానుదఘ్నంగా ఆవిర్భవించిన శ్వేతవరాహస్వామి సాన్నిధ్యం చేత, నివాసము చేత వేంకటాద్రి వరాహ క్షేత్రంగా ప్రసిద్ధమయింది. ఈ సంఘటనను


వరాహాకారముతోనున్నదివ్యపురుషుడు శిరస్సునుండి మోకాళ్ళ వరకు మాత్రమే దర్శనమిచ్చెను అని పద్మపురాణం వర్ణించింది. ప్రియంగు ప్రియ భక్షాయ నమః (85) శ్వేత కోల వరాహాయ నమః (86) నీల ధేను పయోధారాసేక దేహోద్భవాయ నమః (87) కిన్నర ద్వంద్వ శాపాంత ప్రత్రే నమః (60) అను వేంకటేశ నామములు అష్టోత్తర శతనామావళిలో గలవు. ఈ పేర్లన్నియు ఈ సంఘటన కారణంగా ఏర్పడిన నామములే. శ్వేత వరాహ రూపమున విష్ణుదేవుడు హిరణ్యాక్షుని సంహరించి, పాతాళమున పడియున్న భూమండలమును ఉద్దరించి యథాస్థితిలో నిల్పినాడు. అనంతరం సృష్టి ప్రారంభమయింది. దానితోపాటు కాలగణనము, శ్వేతవరాహ కల్పము ప్రారంభమయినది. నేడు శ్వేతవరాహ కల్పములో 27 మహాయుగములు గడిచిపోయి 28వ మహాయుగములో కృత, త్రే త, ద్వాపర యుగములు గడిచి కలియుగము నడుస్తున్నది. నేటికి 2015 నాటికి ఈ కలియుగములో మన్మథ నామ సంవత్సరం 5116వ సంవత్సరము జరుగుచున్నది. శ్వేత వరాహ కల్పములో మన్మథ సంవత్సరమునకు 197, 85, 55, 116వ మానవ సంవత్సరము జరుగుచున్నది.


శ్వేతవరాహ విష్ణుదేవుడు లోకహితము కోరి ఆకల్పాంతము భూమిపై నివసింప దలంచినాడు. గరుడుని పిలిచి వేంకటమను తన క్రీడా పర్వతమును వైకుంఠము నుండి భూమికి తెప్పించి సువర్ణముఖి సమీపమున ఉత్తర దిశలో ప్రతిష్ఠించమని ఆదేశించినాడు. గరుడుడు వెంటనే స్వామి ఆజ్ఞను నెరవేర్చినాడు. హిరణ్యాక్షుని వధించిన శ్వేత వరాహ విష్ణుదేవుడు భయంకరమైన ఉగ్రరూపములో నుండగా బ్రహ్మాది దేవతలు మనుజ హితార్థం సౌమ్య రూపమును దాల్చమని ప్రార్థించారు. వరాహ విష్ణువు దేవతల ప్రార్థనను మన్నించి సౌమ్యరూపమున భూదేవి సహితుడై పుష్కరిణికి పడమర దిశలో దివ్యవిమానమున నివసించినాడు. ఆనాటినుండి వేంకటాద్రి వరాహ క్షేత్రముగా పిలువబడింది. ఈ క్షేత్రమునకు అధిపతి వరాహ స్వామియే. ఈ కలియుగాదిలోశ్రీ కృష్ణుడు అర్చావతారముగా వేంకటాద్రిపై వెలసినాడు. అందువలననే వేంకటేశ్వరునికి ముందు తిరుమలలో వరాహస్వామికి ప్రథమపూజ, ప్రథమ నైవేద్యము, ప్రథమ దర్శనములు జరుగుచున్నవి. విష్ణుదేవుడు వరాహావతారమున భూమిని ఉద్దరించుటచే, భూమిని నివాస యోగ్యముగా చేయుటచే వరాహస్వామి భూమిని రక్షించుచున్న భూపాలురకు ఆదిమ (మొదటి) భూపాలకుడుగ – ప్రతీకమూర్తిగ (Archetypal image) గౌరవింపబడినాడు. ఆంధ్రదేశమును పాలించిన తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు వరాహ లాంఛనులు. వీరి శిలాశాసనములలో మొట్టమొదట వరాహస్వామి స్తుతి ఉన్నది.


మేరు పర్వతము గొడుగు మీది గుబ్బగ, భూమి గొడుగుగా ఉన్నశ్రీ హరి లీలావతార రూపుడైన వరాహస్వామి దంష్టా దండము మమ్ము రక్షించు గాక! తిరుమలలో నేటికీ సంకల్పములో వరాహత్రే అని అర్చకస్వాములు చెప్పుచున్నారు. వరాహస్వామి శ్వేతవరాహ కల్ప ప్రారంభ కాలంలో వేంకటాద్రిపై వెలసిన ఆది దేవుడు. వేంకటేశ్వరుడు. నివాసుడు) ఈ కలియుగ ప్రారంభములో తిరుమలలో అర్చామూర్తిగా వెలసినాడు. కలౌ వేంకటనాయకః అని ఆర్యోక్తి కదా!


59. ఓం కూర్మమూర్తయే నమః


కూర్మ రూపము ధరించిన వేంకటేశునకు నమస్కారము. శ్వేత వరాహ మూర్తిచే (వరాహ రూపము, మానవ శరీరము, నరసింహుని రూపమువలె) ఉదరింపబడిన భూమండలమునకు ఆధారముగ (మోయుచున్న) కూర్మ రూపమును ధరించిన వేంకటేశునకు నమస్కారము. దశావతారములు ధరించిన విష్ణుదేవుడు, వేంకటేశ్వరుడు అభిన్నులని, ఒకరే అని ఇది ధ్రువపరచుచున్నది. దశావతారములలో మొదటిది జలములో నివసించు మత్స్యరూపము. రెండవది జల స్థలములందు సంచరించగల కూర్మరూపము. మూడవది సలములో మాత్రమే నివసించగల, భూమిని ఉద్దరించుటకు తగిన వరాహ వదనము, మానవ శరీరము కలిగిన వరాహరూపము. నాలవది హిరణ్యకశిపుని సంహరించుటకు తగిన సింహముఖము, మానవ శరీరము కలిగిన నరసింహ రూపము. అయిదవది మనుష్యరూపములో పొట్టివాడైన వామనుడు. ఆరవది సంపూర్ణ మానవుడైన ఉగ్ర స్వభావము కలిగిన పరశురాముని రూపము. ఏడవ అవతారము పురుషోత్తముడైన, ఆదర్శ పరిపాలకుడైన శ్రీ రాముని రూపము. ఎనిమిదవ అవతారము హలమును ధరించిన బలరాముని రూపము. తొమ్మిదవ అవతారము సాక్షాత్తు భగవంతుడేశ్రీ కృష్ణుని రూపమున అవతరించాడు. ఆశ్రీ కృష్ణుడే కలియుగమున అర్చామూర్తిగా వేంకటేశునిగా వేంకటాద్రిపై వెలసినాడు. ఈ దశావతారములలో కొన్ని వేంకటేశ అష్టోత్తర నామావళిలో గలవు. ఇవి దశావతారములు ధరించిన విష్ణుదేవుడు, వేంకటేశుడు ఒక్కరే, వారికి భేదము లేదని తెలుపుచున్నవి. భగవంతుడు కూర్మరూపము ధరించి సమస్త జగత్తునకు ఆధారమై యుండి, సమస్త భూమండల భారమును వహించుచున్నాడు. కనుక “అఖిల జగదాధారాయ కూర్మరూపిణే నమః” అని స్తుతించబడుచున్నాడు. ఇదియే గాక దేవతలు, రాక్షసులు అమృతము కొరకు పాల సముద్రమును చిలుకునపుడు మందర పర్వతమును కవ్వముగా ఉపయోగించిన సమయమున ఆ కవ్వమైన మందర పర్వతము పాల సముద్రములో దిగబడిపోకుండా భగవన్నారాయణుడు కూర్మావతారమును ధరించి, ఆ పర్వత భారము వహించి సముద్రమును చిలుకు కార్యము సఫలమగునట్లు చేసినాడు అని విష్ణుపురాణము వర్ణించింది. కమఠంబై జలరాశి జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్ నమఉద్రి ంద్రము నెత్తి... భాగవతం, 8-203 అని పోతన వర్ణించినాడు.


పాలసముద్రములో మునిగిపోకుండా మందర పర్వతమును భరించుటకు, దేవతలకు అమృతమొసంగి రక్షించుటకు కూర్మావతారమును ధరించిన పురాణ పురుషుడగు శ్రీ మన్నారాయణుని శరణు వేడుచున్నాను (పద్మ, 26-9) అని శుకమహరి ప్రస్తుతించాడు.


ఈ జగత్తు ఆధారము లేక, ఆశ్రయము లేక యున్న సమయమున నీవు కూర్మావతారము ధరించి ఆధారముగ నిలిచితివి అని వాయువు విష్ణుదేవుని స్తుతించినాడు. ఆధార కూర్మరూపుడైన విష్ణుదేవుని అర్చావతారమే వేంకటేశ్వరుడు కనుక వీరికి అభేదము చెప్పబడింది. ఇట్లు వేంకటేశ్వరుడు కూడ జగదాధార రూపుడని నిష్కర. శ్రీ కూర్మ పృష్ట మధ్యస్థ శేష మూర్యబ సంస్థితమ్” – ఆది కూర్మము యొక్క వీపునకు మధ్యగల శేషరూపమున ఉన్న తామరపుష్పములో వరాహ విష్ణువు ఉన్నట్లు వరాహ పురాణము (2-15) వర్ణించింది. * * *