నరనారాయణులు - జీవ బ్రహ్మైక్యతకు నిదర్శనం


నరనారాయణులు


జీవ బ్రహ్మైక్యతకు నిదర్శనం


                                                                           - డా|| కె.బి.రాజేంద్రప్రసాద్


శ్లో || ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేఘాపజాయతే | సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే || క్రోధాద్బవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః | స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||


అంటోంది గీత. విషయ చింతన అనగా ఇంద్రియ లోలత వలన మానవులలో ఆసక్తి కలుగటం. ఆసక్తి కోరికలకు దారి తీస్తుంది. కోరికలు తీరనప్పుడు క్రోధం పుడుతుంది. కోపం వ్యామోహానికి బాటలు వేస్తుంది. దానివలన స్మృతి విభ్రమం కలుగుతుంది. స్మృతి నశిస్తే బుద్ధినాశం కల్గుతుంది. బుద్ధినాశం వలనమానవమనుగడపతనమవుతుంది. అందుకే అహంకారం ధర్మనాశనానికి మూలమని గుర్తించాలి. అహం నశిస్తేనే ఇహం బోధపడుతుంది. ఇహమే దృశ్య ప్రపంచం. ఇది కలగన్న భాగ్యం. ఇదొక వైష్ణవమాయ. మాయను వదిలితే సత్యం బోధపడుతుంది. కనుక, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అహం నుండి పుట్టినాయని తెలిసి అహాన్ని అంతం చేసుకోవాలి. మనో నైర్మల్యం ఆచార శుద్ధికి దారి తీస్తుంది. ఆచారశుద్ది ఆధ్యాత్మికబుద్ధికి, ఆనందస్థితికి మూలం. ఇందుకు ఎన్నో నిదర్శనాలు. నరనారాయణులు సనాతన మహరులు. తపోనిధులు. శాంత సంయమనాలకు నెలవులు. నిజమైన, నిర్మలమైన ఆచారశీలతకు, ఆధ్యాత్మికనీతికి, ధార్మికరీతికి, తపోనియతికి, మంత్రానుష్టాన అనుభూతికిని నిలువెత్తు సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం నర నారాయణులు. ఒకప్పుడు వీరు సోదరులు. ఇంకొకప్పుడు మిత్రులు. మరొకప్పుడు గురుశిష్యులు. "పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదుశ్రీ హరి సర్వోపగతుడు. ఎందెందు వెదకూ చిన అందందే గలడు" అంటూ తండ్రికి చెప్పి, స్తంభం నుండి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి ప్రహ్లాదుడు తెరదీశాడు.మొత్తానికి అహంకారంతో, తనను ఎదిరిని ఆలోచింపక, క్రోధంతో విర్రవీగుతూ తన భక్తుని సదా హింసిస్తున్న హిరణ్యకశిపుని సంహరించడానికి, ఆ ఆదిదేవుడైన విష్ణువు నృసింహమూర్తిగ ఒక స్తంభం నుండి పుట్టి, దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. అవతార లక్ష్యం నెరవేరింది. కాని స్వామి భయంకరాకృతి లోకాలకు భయానకమై ఉంది. అప్పుడు సదాశివుడు శరభరూపంలో నరుడు - సింహము రెండుగ నరసింహ రూపాన్ని చేశాడు. ఈ నరసింహములనే రెండు రూపాలే అనంతర జన్మలో ధర్మునకు నర నారాయణులుగ జన్మించారు.


నరనారాయణులు సరస్వతీ నదీతీరంలో బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు. వారి మనస్సులు నిర్మలములు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నారు. సదాచార ప్రతులై తమ ఆయుధాలను సమీపంలోనే ఉంచుకొని తపస్సులో మునిగిపోయారు. ఇది తెల్సిన ఇంద్రుడు నరనారాయణుల తపోభంగానికి మన్మథుణ్ణి, అప్సరసలను పంపాడు. కాని మన్మథ బాణాలు ఆ మునుల యెడల నిర్వీర్యమైనాయి. అప్సరసల శృంగార చేష్టలు చెల్లని నాణాలైనాయి. నరనారాయణులకు ఇంద్రుని కుతంత్రం తెలిసింది. నారాయణుడు తన ఊరువును లీలగా గీరాడు. అచట మరొక సుందరాంగి ప్రత్యక్షమైంది. అప్సరసల మోములు చిన్నబోయినాయి. నరనారాయణులు మందస్మితంగా కన్పించారు. ధైర్యం, ఆత్మౌన్నత్యం, తపోనిష్ఠ, శమదమాదుల నిగ్రహం గమనించిన అప్సరసలకు బుద్ది వికసించింది. "స్వామీ! మీరు సామాన్యులు కాదు. సమ్మాన్యులు. సాక్షాత్తు వైష్ణవ తేజోవిరాజితులు. ఆ నరసింహదేవుని ఆకృతియే ఇలా మీ ఇద్దరి రూపంలో కన్పిస్తున్నారు. దివ్యమూర్తులైన మీ దర్శనభాగ్యం కల్గడం మా పురాతన సుకృతం. దేవేంద్రుని స్వార్థ బుద్ధికి ఇలా దిగబడ్డాము. అయినా ఆగ్రహించక, నిగ్రహంతో మా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించారు" అంటూ అంజలి ఘటించారు. నరనారాయణులు కూడా దివ్యకాంతల వినయ విధేయతలకు, బుద్ధి కుశలతకు ముచ్చటపడ్డారు. "కాంతలారా! మీరేమైనా వరం కోరుకోండి. నా ఊరువుల నుండి పుట్టిన ఈ దివ్యకాంత ఊర్వశిగా పిలువబడుతుంది. ఈమెను మీతో స్వర్గానికి కొనిపోండి. ఇది స్వర్గానికి మా కానుక. దేవేంద్రునకు ఉపహారం. దివ్యులకు మేలు కలుగుగాక. ఎన్నడూ తపోధనుల యెడల అనుచితంగ ప్రవర్తించకండి" అని చెప్పారు. దివిజకాంతలు నర నారాయణుల పాదపద్మాలకు నమస్కరించి దివిజలోకం చేరుకొన్నారు.


తపోధనులకు శాంతం, సహనం, నిగ్రహం, అనుగ్రహం, ఇంద్రియాలను జయించి విషయభోగాలను తిరస్కరించడం కావాలి. స్థితప్రజ్ఞత అవసరం. పొంగిపోవడం, క్రుంగిపోవడం ఉండరాదు. జీవుడు దేవుడు ఒక్కడే. ఆత్మజ్ఞానంతోనే జీవుడు దేవుడవుతాడు. జీవబ్రహ్మైక్యత సనాతనం. అయినా ఆ దివ్య తత్త్వానుభూతి నిత్యనూతనమే. నరనారాయణుల తత్త్వం అలాంటిదే. నర నారాయణ జన్యం స్పూర్తిదాయకం, సత్య సందేశాత్మకం, విశ్చ యోదాయకం. అంతేనా మరేమైనా పెద్ద ప్రయోజనముందా? అంటే తప్పక ఉంది. కర్మబంధాలు జన్మ గంధాలకు దారి తీస్తాయి. ఫలితంగా అవతారాల ఆవిర్భావానికి లక్ష్యాలు నిర్దేశించబడతాయి. లక్ష్య సాధనకు ఆత్మబలం, ఆధ్యాత్మిక శక్తి సమన్వయపడాలి. అందుకే దివ్యులు తపజపాలను, మంత్రానుష్ఠాలను మహిమోన్నతంగా పాటించారు. అలాగే నరనారాయణులు వేల సంవత్సరాల తపస్సునకును ఒక లక్ష్యం ఉంది. అదే సహస్ర కవచుని సంహారం.


సహస్ర కవచుడు ఒక రాక్షసుడు. పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కల్గియున్నాడు. వానితో పోరు సలపాలంటే వేయి సంవత్సరాల తపోబలం కావాలి. వాడి సంహారం కానట్లయితే దివిజులకు, మానవులకు, మహర్షులకు కంటకమవుతుంది. ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది. నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు. ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున నర నారాయణులు ఆ రాక్షసుని 999 కవచాలు ఛేదించారు. ఇంక ఒక్క కవచం మాత్రమే ఉంది. కాని వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు. వాని ఆత్మ మాత్రం రాక్షస భావంతో రగిలిపోతూ మరలా జన్మించాడు. వాడే కర్ణుడు. పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. అలాగే నర నారాయణులు మరలా వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం మహాయుద్ధంలో ఒకరు రథి (వీరుడు) మరొకరు సారథిగానై ధర్మయుద్ధం నిర్వహించారు. కృష్ణుడు మాయోపాయం పన్ని ఇంద్రుని బ్రాహ్మణరూపంలో పంపి, దానకర్ణుడైన ఆ సహస్రకవచుని కవచకుండలాలను స్వీకరించడంతో కర్ణుని ఓటమి, కర్ణుని శక్తి సామర్థ్యాలు నిర్దేశించబడ్డాయి. నరుడైన అర్జునుని చేతిలో కర్ణుడు వీరమరణాన్ని పొందడం జరిగింది. రాక్షస బలం అసామాన్యమైంది. రాక్షస ప్రవృత్తి కూడా చాలా తీవ్రమైంది. ఒక సహస్రకవచుని సంహరించడానికి భగవానునికే రెండు జన్మలు అవసరమైనాయి. మానవునిగా భువికి వచ్చినవారు దివ్యులైననూ మానవాతీతమైన శక్తి సామర్థ్యాల సాధనకు ప్రయత్నం చేయాల్సిందే. అందుకే వేల సంవత్సరాల తపోబలం సాధించడం. అలాగే కర్ణుని కవచ కుండలాలను అపహరించడానికి ఇంద్రుణ్ణి మాయా బ్రాహ్మణునిగా పంపడం ఇదంతా విధిలీల. జగత్తునకు, జగత్తులో జీవించే ప్రాణులకు హితంకల్లాలి.సనాతన వైదిక ధర్మం నిరాటంకంగా కొనసాగాలి. అందుకు పరమాత్మ ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎన్ని ఎత్తులకైనా తెరదీస్తాడు. అందుకు నిదర్శనమే నర నారాయణ జననం. నిజానికి కర్ణుడు దానశీలుడు, శౌర్యవంతుడే కాని అతడనుసరించిన సేవాధర్మం రాక్షస ప్రవృత్తికి, అధర్మవర్తనకు బలాన్ని సమకూర్చుతోంది. అందునా సహజంగా అతనిలో ఉన్న రాక్షసావేశం అందుకు ప్రోత్సహించింది. చివరి క్షణాలలో కర్ణుడు అర్జునునితో... -


"అర్జునా! ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందంటారు. మేము కూడా నిరంతరం యథాశక్తి, యథాశ్రుతం ధర్మాన్నే అనుసరించాం. కాని ఆ ధర్మం తన భక్తులమైన మమ్ము రక్షింపజాలకున్నది" అంటూ ఎదురైన శాపాలకు తాపం చెందుతూ కొద్దిసేపు యుద్ధం ఆపుమని కోరుతూ చెప్తాడు. అప్పుడు పరమాత్మ "కర్ణా! ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా? లాక్షా గృహదహనం, ద్రౌపదీ వస్త్రాపహరణం, బాలుడైన అభిమన్యుని వధ మొదలైన సన్నివేశాలలో ధర్మాధర్మ విచక్షణ లేదే" అంటూ "నీచులు కష్టాలలో దైవ నింద చేస్తారు కాని, తాము గతంలో చేసిన దుష్కృతాల వలననే దుష్పలితాలను పొందుతున్నామని భావించరు" అని తెలియజెప్పి, నరుని ప్రోత్సహించగా, అర్జునుని అస్తాలకు కర్ణుడు వీర మరణం పొందడం జరిగింది. ఆవేశం, ఆలోచనా రాహిత్యం , అహంకారం, కామ క్రోధాదులు రాక్షస ప్రవృత్తికి సంకేతం. మనం చేసే లోభం, పాపం శాపాలై మానుష ప్రయత్నాన్ని పతనం చేస్తాయి. శేషకవచంతో కర్ణునిగా జన్మించిన సహస్ర కవచుడు అలాంటి శాపాల తాపాలకు గురియైనాడు. అతడి పౌరుష ప్రతాపాలు అవసరమైనప్పుడు అక్కరకు రాలేదు. నర నారాయణుల లక్ష్యానికి సాధ్యం కానిదేముంటుంది?


నరనారాయణులు,వరంతీసుకొన్నకుంతి,కవచకుండలాలు గ్రహించిన ఇంద్రుడు అనుచితాలతో నిరుత్సాహ పరచిన శల్యుడు, భూమాత శాపం మొదలగు ఆరుగురి వలన కర్ణుడు మరణించాడని చెప్తారు.


నరనారాయణ జననం జగతికి మోదం. ప్రమోదం. ఆమోదం. ప్రబోధం. సత్యసందేశాత్మకం. నిత్య జ్ఞానానందమయమే కాదు జగద్దితం. అనగా లోక కళ్యాణ కారకం. జీవననాదం. మానవబ్రతుకు వేదమయిన భగవద్గీతకు మూలం కూడా వారే. వారి అవతార లక్ష్యాలు అసంఖ్యాకం. ఆలోచించిన కొద్దీ ఆత్మానందానుభూతి, జీవ బ్రహ్మైక్యతలకు నిలువెత్తు సాక్ష్యం. విశ్వగురుడు పరమాత్మ. విశ్వ విద్యార్థి పరమాత్మే. వారే జీవాత్మలు కూడా. నర నారాయణుల కలయికయే ఒక అద్భుత సృష్టి. మాధవునితోనే మానవుడు. మానవునిలోనే మాధవుడు. నిజం తెలిస్తే సర్వం బ్రహ్మమయం. -