చరణాలే శరణు


భక్తుల సమస్త పాప సంహారకాలశ్రీ వారి దివ్య చరణాలు. అవి ఆశ్రితులకు మోక్ష ప్రదాయకాలు. సర్వాంతర్యామి మంగళ చరణాల ప్రాశస్త్యం అనేక సందర్భాల్లో వెల్లడైంది.


ప్రహ్లాదుడు జన్మతః విష్ణు భక్తుడు. అతడి మనసు ఎల్లప్పుడూ శ్రీ హరిపాదపద్మాలపై నేలగ్నమై ఉండేది.పోతనఅనేకసందర్భాల్లో ప్రహ్లాదుణ్ని హరిపాద పయోరుహ చింతనాక్రియలోలుడు, శ్రీ నారాయణ పాదపద్మయుగళ చింతనామృతాస్వాద సంధానుడు వంటి విశేషణాలతో వర్ణించాడు. ప్రహ్లాదుడి చేత హరిపూజ మానిపించాలని హిరణ్యకశిపుడు అనేక విధాలుగా ప్రయత్నించాడు. చండుడు, అమర్కుడు అనే గురువులు ప్రహ్లాదుడికి ధర్మార్థకామాలను (రాక్షసులు మోక్షాన్ని కోరుకోరు) బోధించారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రహ్లాదుడు గురువులనుద్దేశించి... తుమ్మెద మందార పుష్పంలోని మకరంద ఆస్వాదనంలో తేలియాడుతుంది. అది ఉమ్మెత్త పూలవైపు కన్నెత్తి అయిచూ డదు. అలాగే నా మనసూ విష్ణు పాదపద్మాలను ధ్యానించడంలో నిమగ్నమైందంటాడు. వామనుడికి మూడడుగుల నేలను దానమివ్వడానికి బలి సిద్ధమవుతాడు. ముందుగా అతడి పాద ప్రక్షాళన చేస్తాడు. ఆ సందర్భంలో శ్రీ హరి పాదాలకు వేదాలు అందెలుగా మారాయంటూ పోతన ప్రస్తుతిస్తాడు. వామనుడు త్రివిక్రముడై పరాక్రమిస్తాడు. ఒక పాదంతో భూమండలాన్ని ఆక్రమిస్తాడు. మరో పాదాన్ని ఆకాశమంతా వ్యాపింపజేస్తాడు. అది బ్రహ్మలోకాన్ని చేరుతుంది. అక్కడ పుణ్యాత్ములు, యోగులు, సిద్దులు ఉంటారు. వారందరూ ఆ పాదాన్ని దర్శిస్తారు. తామందరం కోరుకునే పెన్నిధి తమకు లభించిందంటూ మనసులో సంతోషపడతారు. బ్రహ్మ తన కమండలంలోని జలధారలతో ఆ పాదాన్ని కడుగుతాడు. పునీతుడవుతాడు. వాల్మీకి అనేక ఘట్టాల్లో శ్రీ రామ పాదపద్మాల ప్రాముఖ్యాన్ని వర్ణిస్తాడు. విశ్వామిత్రుడి కోరిక మేరకు రామలక్ష్మణులు యాగ సంరక్షణకు వెళతారు.శ్రీ రామ పాద ధూళి స్పర్శతో శిల అహల్యగా రూపాన్ని పొందుతుంది. ఎంతటివారి పాపాన్నెనా క్షయం చెయ్యగల శక్తి ఆ చరణ రేణువులది. భరతుడశ్రీ రామ పాదుకలకు పట్టాభిషేకం జరిపిస్తాడు. వాది, ప్రతివాదుల వాదన విని తీర్పు చెప్పగల సమర్థత ఆ పాదుకలది. ఆంజనేయుడు ఆ పాదాలకు దాసుడయ్యాడు. సీతారామ లక్ష్మణులతో కలిసి పూజలందుకొంటున్నాడు. భక్తులనూ దైవసమానులుగా మార్చగలవి ఆ దివ్య చరణాలు.


ఒకనాడు మందాకినీ తీరంలో సీతాదేవి నిద్రిస్తుంటుంది. కాకాసురుడనే రాక్షసుడు అక్కడకు వెళ్తాడు. పదునైన గోళ్లతో సీతమ్మను గాయపరుస్తాడు. శ్రీ రాముడు కోపగించి బాణ ప్రయోగం చేస్తాడు. కాకాసురుడు ప్రాణరక్షణ కోసం రాముడి పాదాలపై పడి శరణు కోరతాడు. అతడి ప్రాణాలను హరించకుండా విడిచిపెడతాడు. పాదాలను ఆశ్రయిస్తే ఎంతటి శత్రువునైనా క్షమించగల ఔదార్యశ్రీ రాముడిది. . శ్రీ హరి దివ్యచరణాలు ఎప్పుడు, ఎవరిని అనుగ్రహిస్తాయో ఊహించడం దుర్లభం. కాళియుడు దుష్టుడైన సర్పరాజు. అతడి పడగలపై శ్రీ కృష్ణుడు నాట్యం చేస్తాడు. గర్వాన్ని అణచి వేస్తాడు. బాలకృష్ణుడి నాట్యానికి గుర్తుగా కాళియుడి పడగలపై పాదముద్రలు పడతాయి. అవే గరుత్మంతుడి బారినుంచి కాపాడతాయశ్రీ కృష్ణుడు వరం అనుగ్రహిస్తాడు. శ్రీ హరి పాదపద్మాలను నిత్యం స్మరించాలంటాడు ముకుందమాల కర్త కులశేఖర మహారాజు. భద్రాచల రామభక్తుడైన గోపన్న కూడా 'చరణములే నమ్మితీ... నీ దివ్య చరణములే నమ్మితీ' అంటూ భగవంతుడి చరణ పద్మాలను స్తుతిస్తాడు. భక్తులకు ఆ దివ్య చరణాలే శరణు!