ప్రపత్తి స్వరూపములు - రామానుజ భట్టర్


'ప్రపత్తి' అనగా భగవానుని పొందుటకు భగవానుడే 'ఉపాయము' అని మనసున దృఢముగా విశ్వసించుట. దీనినే 'శరణాగతి' అందురు. ప్రపత్తిని ఇట్టి దేశములో చేయవలయునని గాని, ఇట్టి కాలములో చేయవలయునని గాని, ఇటి విధముగానే చేయవలయునని గాని, ఇటివారే చేయవలయునని గాని, ఇందులకు ఇట్టి ఫలమే సిద్దించుననెడి నియమము గాని లేదు. అనగా దేశ నియమము, కాల నియమము, ప్రకార నియమము, అధికారి నియమము, ఫల నియమము అనునవి లేవు అని తాత్పర్యము.


1. దేశ నియమము: ప్రపత్తికి దేశ నియమము, కాల నియమము గాని లేవు. 2. కాల నియమము: ఏ దేశములోనైనను, ఏ కాలములోనైనను భగవానుని యెడ దృఢమైన విశ్వాసము కలుగుటయే ప్రధానము. సముద్ర తీరమున విభీషణుడశ్రీ రామచంద్రుని శరణాగతి చేసినప్పుడు "ఇది తగిన దేశము కాదు. తగిన కాలము కాదు” అని జాంబవంతుడు చెప్పినాడు. కాని, ఆ మాటను కాదని హనుమ "ఇదే తగిన దేశము. తగిన కాలము. శరణాగతికి దేశ కాలనియమము లేదు” అన్నాడు. “బద్ధవైరాచ్చ పాపాచ్చ, రాక్షసేంద్రాద్విభీషణః, అదేశకాలే సంప్రాప్తః, సర్వధా శంక్యతామయం” , అని జాంబవంతుడనినాడు. అనగా “బద్ద విరోధి, పాపాత్ముడు అయినవాడు రావణాసురుడు. అతని కొలువు నుండి వచ్చినవాడు విభీషణుడు. అతడు వచ్చుటకు ఇది తగిన దేశము కాదు. కాలము కాదు. కనుక మనము వీనిని స్వీకరింపరాదు. అతనిని శంకింపవలెను” అనినాడు. అప్పుడు, “దౌరాత్మ్యం రావణే దృష్యా విక్రమం చతథా త్వయి, యుక్తమాగమనం తస్య సదృశం తస్య బుద్దితః" అనినాడు. అనగా “రావణుని దుష్టస్వభావమునూ చి మీయందు గల పరాక్రమమునచూ చి, అతని బుద్ధిని బట్టి విభీషణుడు మిమ్ములను శ్రీ రాముని) కలువవలెనని


నిశ్చయించుకొని ఇప్పుడు ఇచ్చటకు వచ్చుట తగినదే” అని హనుమ అనినాడు. శరణాగతి చేయుటకు దేశకాల నియమములు లేవని ధర్మజుడైన హనుమ నిర్ణయముశ్రీ రాముడు ధర్మజ్ఞుడు కనుక విభీషణునకు అభయమిచ్చినాడు. 3. ప్రకార నియమము: వేదములలో చెప్పిన కర్మలు ఆచరించునప్పుడు, యజ్ఞ యాగాదులు నిర్వహించునప్పుడు, నిర్ణీత ప్రదేశములోనే, నిర్ణీత ఋతువులందే, నిర్ణీత సమయములందే నిర్వహించవలెనను నియమములు ఉండును. కాని ప్రపత్తికి అట్టి నియమములు లేవు. ఎట్టి స్థితిలో ప్రపత్తి చేసినను, తనతో సంబంధము కలవారిని పవిత్రులను చేయును. రక్షించును. భగవానుని ఎట్లు ప్రపత్తి చేయవలయునో “ద్వయమంత్రము” శ్రీ మన్నారాయణ చరణ్ శరణం ప్రపదేశ్రీ మతే నారాయణాయ నమః) మనకు విశదీకరించుచున్నది. ఈ మంత్రములలోని మొదటి పదము, (శ్రీ మన్నారాయణ చరణా శరణం ప్రపద్యే” - అనునది) జీవునకు ఎప్పుడు భగవానుని శరణు పొందవలెనను కోరిక కలుగునో అప్పుడే మనసున నిర్ణయించుకొని ఆశ్రయింపవచ్చునని స్పష్టముగా తెలుపుచున్నది. దీనికి ఒక ప్రకారముగా అనగా పద్దతి అవసరము లేదు. స్నానము చేయవలయును, శుచిగా ఉండవలయును అను సామాన్య నియమములు కూడా అవసరము లేదు.


ఇక రెండవది. యుద్ధభూమిలో అర్జునుడు యోధ వేషములో ఉన్నాడు. అట్టి అర్జునునకు భగవానుడు ప్రపత్తియే నిశ్చితార్థముగా గల భగవద్గీతను ఉపదేశించినాడు. నీచులైన కౌరవుల మధ్యలోనే అర్జునునకు గీతోపదేశము చేసినాడు. అపరిశుద్ధమైన స్థలములో, అపరిశుద్ధులైన వారి మధ్యలో, అపరిశుద్ధమైన వేషములో నున్ననూ “త్వమేవ శరణం మమ” అనిన అర్జునునకు గీతోపదేశము చేసి “మా శుచః” అని ఓదార్చి అభయమిచ్చినాడు. రక్షించినాడు. ఇట్టి సంఘటనలను బట్టి ప్రపత్తి చేయుటకు గాని, ప్రపత్తి మార్గమును ఉపదేశించుటకు గాని "ప్రకార నియమము” లేదని తెలియుచున్నది. 4. అధికారి నియమము: శరణాగతిని ఎవరు చేయవచ్చును? శరణాగతి చేయుటకు ఎట్టి యోగ్యత ఉండవలెను? అని శంకించ నవసరము లేదు. శరణాగతిని “ఇట్టివారే చేయవలయును” అను నియమము లేదు. ధర్మరాజు మొదలైన పాండవులు క్షత్రియులు. వీరందరును శ్రీ కృష్ణుని శరణువేడి, రక్షణ పొందినారు. ద్రౌపది స్త్రీ అయినను శరణు వేడి రక్షణ పొందినది. "కాకము” పక్షి. ఇంద్రుని కుమారుడు. ముల్లోకములలో తిరిగి, ఎచ్చటను రక్షణ పొందక తుదకశ్రీ రామచంద్రునే శరణు వేడినాడు. భగవానుడు ఎంతో క్రూర కర్ముడైన ఆ కాకమును సైతము రక్షించినాడు. - కాళీయుడు క్రూరజాతికి చెందిన సర్పమశ్రీ కృష్ణ భగవానుని పదఘట్టనలచే శ్రమపడుచు, తనను తాను రక్షించుకొనుటకు ఎంతో ప్రయత్నించి, సాధ్యము కాక తుదకశ్రీ కృష్ణ భగవానునే శరణు వేడినాడు. స్వామి అతనిని రక్షించినాడు. " గజేంద్రుడు తిర్యక్ జాతికి చెందినవాడు. తనను తాను రక్షించుకొనవలయునని ఎంతకాలమో ప్రయత్నించి విఫలుడై తుదకు “నీవే తప్ప నియిత:పరం బెరుగ, సంరక్షించు భద్రాత్మకా!” అని మొరలిడి శరణాగతుడైనాడు. “సిరికిం జెప్పడు, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు” అను త్వరలో శంఖ చక్రములను అస్తవ్యస్తముగా ఉన్ననూ గుర్తించక, గజ ప్రాణావనోత్సాహియై వేంచేసి గజరాజును రక్షించాడు. విభీషణుడు రాక్షసుడు. రాముడే తనకు రక్షకుడని తలచి శరణు వేడినాడు.శ్రీ రాముడు అభయమిచ్చి రక్షించినాడు. అతనిని శంకించవలెనని జాంబవంతునివంటివారు నిరోధించ ప్రయత్నించిననూ, “యదివారావణస్స్వయం” అని భగవానుడు వారికి చెప్పి, తన శరణాగతత్రాణ పరాయణత్వమును స్పష్టపరిచినాడు. ఇంత ఎందుకుశ్రీ రాముడు చక్రవర్తి. అయినను సముద్రుని శరణు వేడినాడుశ్రీ రామునంతటి లోకోత్తర పురుషుడు నన్ను శరణుకోరుటయా? అని తలచి సముద్రుడు సేతు నిర్మాణమునకు మార్గము చెప్పినాడు. లక్ష్మణుడు శేషుని అవతారము. అట్టివాడుకూడ రామావతార సమయమున మానవాకారములో నునశ్రీ రామునికి సోదరుడై తనకు నిత్యము సేవ చేయు భాగ్యము కలుగవలెనని శరణువేడి కృతకృత్యుడైనాడు. క్షత్రియ కులములో పుట్టి, నీచ కృత్యములు చేసిన "ముచికుందుడుశ్రీ కృష్ణుని శరణు వేడి రక్షణ పొందినాడు. ఇంద్రాది సమస్త దేవతలు, వానరులు - ఇట్లు అనేకులు అనేక విధములుగా భగవానుని శరణు గోరి రక్షణ పొందినారు. కాబట్టి శరణాగతి చేయుటకు ఇట్టివారే తగినవారను నియమము లేదు. భగవానుని యందు రుచి కలవారందరునూ అధికారులే. అధికారి నియమము లేదు.


5. ఫల నియమము:


"ఇట్టి ఫలములకే ప్రపత్తి సాధనము” అను నియమము లేదు. ఏ ఫలమును కోరిన ఆ ఫలము సిద్ధించును. ధర్మరాజు మొదలగు పాండవులకు రాజ్యము లభించినది. ద్రౌపదికి వస్త్రము లభించినది. కాకమునకు, కాళీయునకు ప్రాణము లభించినది. గజేంద్రునకు కైంకర్యము లభించినది. శ్రీ రామునకు సముద్రమును దాటుటకు మార్గము లభించినది. లక్ష్మణునకు రాముని వెంట అరణ్యములకు వెళ్ళి, అతనికి నిరంతరము సేవ చేయు భాగ్యము లభించినది. శేషావతారమైన లక్ష్మణునకు “నివాస శయ్యాసన పాదుకాదిషు............. శేష ఇతిర్యతే జనైః” అను భాగ్యము లభించి అన్వర నామధేయుడైనాడు. ఇట్లు ప్రపత్తి వలన అనగా శరణాగతి వలన ఏ ఫలమును ఆశించిన వారికి ఆ ఫలము సిద్ధించును. అందుకే ప్రపత్తికి “ఫల నియమము” లేదు అని చెప్పబడినది. అయితే, “ప్రపత్తి”కి “విషయ నియమము” మాత్రము ఉన్నదని పెద్దలు చెప్పుచున్నారు. గుణములు పూర్తిగా ఉన్నవారి వద్దనే శరణాగతి చేయవలయును. గుణములు పూర్తిగా ఉండి, మనకు అనుకూలముగా ఉన్నవాడు "అర్చామూర్తి”గా ఉన్నభగవానుడే. ఇట్టి "అర్చామూర్తి” వైశిష్ట్యమును తెలుసుకొందము.