సంపాదకీయం ... భగవంతునితో సంబంధం... .. పుల్లగూర్ల సాయిరెడ్డి (గోవిందదాసు)

సంపాదకీయం .....


ఈ అనంత కాలగమనంలో నేటి మన జీవితం చాలా అత్యల్పమైనది. ఈ సృష్టి క్షణ క్షణము మార్పు చెందుచున్నది. మనము కూడా ఇందులో భాగమే కనుక ప్రతి క్షణము మార్పు చెందుచున్నాము. ఏ క్షణాన ఏమి జరుగునో ఎవ్వరికీ తెలియదు. అసలు మనమెందుకు జీవించుచున్నాము? ఈ భూమి మీదకు రావలసిన అవసరమేమిటనేది కూడా తెలియదు. ఎంతకాలము ఈ భూమిపై జీవించగలమనేది అసలు తెలియదు. కాని మన పెద్దలు, పురాణాలు, వేదాలు చెప్పింది ఒక్కటే. ఈ మానవ జన్మ అదృష్టం కొద్దీ లభించిందని, దేవతల జన్మ కంటే మానవుడిగా పుట్టడమే గొప్ప అని, ఇంతటి జనను వ్యరపరచక, భగవదారాధనతో పునీతులం కావాలని సూచించారు. ముందు ప్రతి మనిషి తనకు తాను తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. నిజానికి తాను ఒంటరివాడు. కాని శ్రీ వేంకటేశ్వరుడి కృపవల్ల మనకంటూ ఒక కుటుంబము, నావారు, బంధువులు, మిత్రులు ఏర్పడ్డారు. వీరందరూ నావారేనని భావించరాదు. కేవలం మన లక్ష్యసాధనకు సహాయకారులుగా ఉండగలరంతే. ప్రతి జీవి ఒంటరిగానే ప్రయాణించాలని గమనించాలి. నేడు మనం ఎదుర్కొంటున్న 'కరోనా' పరిస్థితి కూడా కాలగమనంలో వచ్చే మార్పుల్లో ఒక మార్పు మాత్రమే. ఇది కూడా మన మంచికే అని భావించాలి. ప్రతి మార్పును మనకు అనుకూలంగా మార్చుకుంటూ భగవత్సాధన జరిపినవాడు ధన్యుడుగా పరిగణించబడతాడు. ఈ విశ్రాంతి సమయాన గతంలోని తప్పులను తెలుసుకుని తగిన మార్పులు చేర్పులతో నూతన జీవన విధానమును ఏర్పాటు చేసుకొనుట మన కర్తవ్యం. జీవించుటకు కూడు, గుడ్డ, ఇల్లు కావాలి. ఆపై భగవధ్యానం వైపు మన మనస్సును మరల్చి జీవించాలి. ఏ క్షణాన ఏమి జరుగునో తెలియదు కావున భగవంతునికి సంపూర శరణాగతి కావడమే ఏకైక మార్గము. క్షణ క్షణానికి మనస్సులో ఆలోచనలు మారుతుంటాయి. నేడు మంచిదనిపించింది రేపు చెడుగా మారుతుంది. ఎదురయ్యే ప్రతి సమస్య మన మంచికే అని భావించాలి. భగవంతుడు నిర్మించిన ఈ చక్రవ్యూహమనే జీవితంలో రకరకాల సమస్యలు, సమాధానాలు, పరిసితులు, సంతోషాన్ని చేవి, దుఃఖాన్ని చేవి ఇలా ఎన్నో రకాల పరిస్థితుల మధ్య నుండి వాటికి బానిస కాక ప్రయాణించుటే మన లక్ష్యం. దృష్టి కేవలం భగవంతునిపై కేద్రీ కరించాలి. ఇహలోక విషయాలను పట్టించుకోవద్దు. అప్పుడే మనిషిగా జన్మించిన మనకు సార్థకత సిద్ధిస్తుంది. ప్రతి వ్యక్తి భగవంతునితో ఒక సంబంధమును తప్పక ఏర్పాటు చేసుకోవాలి. ఇది వారి వారి అభిరుచి ననుసరించి ఉంటుంది. ఆ తరువాత అదే సంబంధముతో భగవంతునికి సర్వము సమర్పించి జీవితాంతము సేవించుట ఉత్తమము. భగవంతుడు కూడా మనము కల్పించుకున్న సంబంధాన్ని అనుసరించే మనతో ఉండగలడు. మనలను సంతోష పెట్టగలడు. ప్రతివారు ప్రయత్నించి చూచుట మంచిది. కాని మనము కల్పించుకున్న సంబంధముపై (భగవంతునిపై) అచంచల విశ్వాసాన్ని ఏర్పరచుకొనుట అత్యంత ముఖ్యము. ఈ కలియుగములో మనందరి రక్షణకై శ్రీ మన్నారాయణుడు తిరుమల కొండపై శ్రీ వేంకటేశ్వరుని రూపంగా వెలశాడు. ఇంత మంచి అవకాశం లభించుట మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. శ్రీ వేంకటేశ్వరునితో నీవు తప్ప ఇతరులను ఎరుగను ప్రభూ అంటూ శరణాగతితో ఆయనను మనసులో నిల్పుకొని సదా ఆయన నామస్మరణతో జీవిద్దాం. శ్రీ వేంకటేశ్వరుడు మనలను సదా రక్షించుగాక.


శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు 


పుల్లగూర్ల సాయిరెడ్డి (గోవిందదాసు)