తిరుమల కొప్పెర అంటే ఏమిటి?
కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రని హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమశ్రీ వారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పని చేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకుని తిరుపతిలోని హాథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసేవాళ్ళని కొప్పెరవాళ్ళని, వాళ్ళు నివసించే పల్లెకు "కొప్పెరవాండ్ల పల్లి" అని పేరు వచ్చిందంటారు. శ్రీ నివాస మంగాపురం వెళ్ళే దారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది.
హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును "పరకామణి" అంటారు. ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని "తోకముల్లె" అని అంటారు. కొప్పెరలో మన డబ్బే కాదు విదేశీ కరెన్సీ, నాణాలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించలేకపోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిశ్రీ వారి ఖజానాలో భద్రపరుస్తారు.