కేదారేశ్వర వ్రతం 


కేదారేశ్వర వ్రతం                                                           --    చింతలపాటి శివశంకర శాస్త్రి


కత్తికా నక్షత్రముతో కూడి, పున్నమి గల అమాసాన్ని కార్తీకమాసమని అంటారు. కృత్తిక అగ్ని నక్షత్రము. కార్తీకం కమనీయం, రమణీయం, మహనీయం, కైవల్యకారకం, హరిహర ప్రియం, సర్వజగద్రక్షాకరం. "మాసానాం కార్తీకవ్రే ష్ఠః". మాసాలలో కార్తీకశ్రీ ష్ఠమైనది. ఆయురారోగ్యాలను, సౌఖ్యాన్ని కోరేవారికిది అత్యంత ప్రధానమైనది. ఈ మాసం శరదృతువులో వస్తుంది. జీవనగమనంలో మనకు తెలిసి కాని, తెలియకుండా కాని చేసిన పాపాలను అంతరింప చేస్తుంది. కనుక ఈ మాసం మహత్తరమైనది. కార్తీకంగా, దామోదర మాసంగా, ఊర మాసంగా మూడు పేర్లతో పిలిచే ఈ మాసం సమన్వయానికి సంకేతం. నదీస్నానాలు, దీప తోరణాలు, వన భోజనాలు, దానాలతో మానవ సమాజంలోని మానవులను అనుగ్రహించడానికి, దేవతలలోనూ కూడా సమైక్యతను, నిరాడంబరతను, అద్వైతాన్ని, అభేదాన్ని కల్పించే కార్తీకం అన్ని మాసాలలోను గొప్పది. ఈ మాసంలో చేసే పూజలు, స్నానాలు, యాగాలు, నోములు, వ్రతాలు విశేష ఫలితాన్నిస్తాయి.


భారతదేశం ధర్మ ప్రధానమైన దేశం. కనుక ఇక్కడ ధార్మికపరమైన కర్మలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. భగవంతుని అవతారాలు, దేవీ దేవతల మహత్తులు, ఋషుల, మునుల వ్రత మహోత్సవాలకు గొప్ప విలువ ఇవ్వబడింది. ప్రతధారులు క్రోధము, లోభము, మోహము మొదలగునవి ఎల్లవేళలా పరిత్యజించవలెనని గరుడ పురాణములో చెప్పబడింది. భవిష్య పురాణంలో ఇలా చెప్పబడింది. ,


అనగా వ్రతాచరణ సమయమున, క్షమ, దయ, దాన, శౌచ, ఇంద్రియ నిగ్రహం, దైవపూజ, అగ్నిహోత్రం మున్నగునవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి ప్రతాలు సహాయపడతాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం - ఇవి మహావ్రతాలుగా పేర్కొనబడ్డాయి. కార్తీకమాసం అంటే నోముల మాసం అంటారు. ఈ మాసంలో చేపట్టే నోములలో విశిష్టమైనది కేదార గౌరీ వ్రతం. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి నాడు ఎక్కువమంది నిర్వహించుకుంటారు. -


కేదారమనగా వరిమడి, పాదు, శివక్షేత్రమని పేరు. ఈశ్వరుడనగా ప్రభువు. పరమాత్మ అని అర్థము. కేదారేశ్వరుడనగా శివుడు. వేద ప్రతిపాదితమైన రుద్రుడే శివుడు. మహాదేవుడు. పశుపతి. కేదారేశ్వర వ్రతం భార్యా భర్త లిద్దరూ కలిసి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చును. భార్యకు వీలుకాకపోతే మాత్రం భర్త ఒక్కడే చేయరాదు. వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చును. గతంలో దీపావళి పండుగనాడు చేసుకునేవారు. ఇటీవల కార్తీకమాసంలో నిర్వహించుకుంటున్నారు. ఈ వ్రతానికి ముందుగా 21 పేటల పట్టుదారాన్ని కాని, నూలుదారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. 21 మంది ద్విజులను పూజించిన అనంతరం కలశం / ప్రతిమ లోకి కేదారేశుని ఆవాహనం చేసుకోవాలి. పూజలో గోధుమ పిండితో చేసిన అతిరసాలను (అరిసెలను) పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తేనె తప్పనిసరిగా ఉండాలి. 21 సంఖ్యకు ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారనగా శిశువు పుట్టినప్పటి నుంచి ఏకవింశతి (21) దోషాలు ఉంటాయి. కేదారుని పూజించడం వల్ల ఆ దోషాలు నశిస్తాయి. అరిసెలను గోధుమపిండితో చేయడంలోనూ ఆరోగ్య, జ్యోతిష్య రహస్యం ఇమిడి ఉంది. గోధుమలు సూర్యునికి ప్రీ తిపాత్రమైన ధాన్యం. సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు (ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్). పాలు పెరుగుతో శుక్రుని, తేనెతో గురువును, నెయ్యితో శనీశ్వరుని, కూరలతో చంద్రుని, ఫలాలతో బుధుణ్ణి, బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది. కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్త నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది. సంఖ్యాపరంగా 21ని ఏకసంఖ్యగా చేసిన '3' (మూడు) వస్తుంది. ఈ మూడు అనేది త్రిమూర్తిమత్వానికి సంకేతం. అందువలననే ఈ వ్రతంలో 21 సంఖ్యకు అంతటి ప్రాధాన్యం. -


ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఏకధాటిగా ఇరువది ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి, 21వ సంవత్సరములో పూజాంతములో ఉద్యాపనం చేసుకోవాలి. నైవేద్యం చేయాలి. ఇది సుదీర్ఘమైన వ్రతం కాబట్టి వంశపారంపర్యంగా పెద్దల నుండి పిల్లలకు వస్తూ ఉంటుంది. కుటుంబంలో సంప్రదాయం ఉన్నవారే ఈ నోము ఎక్కువగా చేస్తారు. నోచుకున్నవారు ఉద్యాపన సంకల్పం చెప్పుకుంటే చాలునని పెద్దలమాట. ఆసక్తి ఉన్నవారు తమ శక్తికొద్దీ చేసుకోవచ్చు.


ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై యుండగా, ప్రమధ గణాలకు నాయకుడైన భృంగి పరమేశ్వరునికి నమస్కరించి, పార్వతీదేవికి నమస్కరించలేదు. అందుకు పార్వతీదేవి కోపించి భర్తను కారణమడుగగా బ్రహ్మజ్ఞానియైన భృంగి నీకు ప్రదక్షిణం చేయరాదని చెప్పాడు. భర్త మాటలకు ఖిన్నురాలైన పార్వతి కోపించి శివునిలో దాగి యున్న తన శక్తిని తీసుకొని, కైలాసమును వదిలి గౌతముని ఆశ్రమాన్ని చేరుకొని భర్తతో పాటు సమాన గౌరవ సత్కారాలు పొందే వ్రతాన్ని బోధించమని ప్రార్థించింది. దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకొని, అమ్మా శాంభవీ! నువ్వు కేదారేశ్వర నోమును నోచినట్లైతే, నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. గౌతముని ఆజ్ఞతో గౌరి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి వరాన్ని పొందింది. ఆనాటి నుండి అర్ధనారీశ్వరునిగా పూజలందుకుంటున్నారు. వరాన్ని పొందిన సంతోషంతో గౌరి ఎవరైతే ఈ వ్రతాన్ని నిష్టతో చేస్తారో వారికి భర్తలతో అన్యోన్యత పొందుటయే గాక చెరిసగంగా ఉండే సమాన గౌరవ ప్రతిష్టలను అనుగ్రహిస్తున్నానని వరమిచ్చింది. మహిమాన్వితం, అపురూపమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఆచరించి జగతికి పితరులైన ఆదిదంపతుల అనుగ్రహాన్ని పొంది మన జీవితాలను ధన్యత చేసుకుందాం. సర్వేజనాః సుఖినో భవంతు