దీపావళి మహాలక్ష్మి పూజ


దీపావళి మహాలక్ష్మి పూజ                                      - మరుదాడు అహల్యాదేవి


అర్థరాత్రాత్ పరం యచ్చముహూర్తజ్ఞయ మేవచ | సా మహారాత్రి రుటిటషాతా ఊతాం చాక్షయం భవేత్ ||


దీపావళి అర్థరాత్రి తర్వాత రెండు ముహూర్తాల సమయం 'మహానిశ' అవుతుంది. ఆ సమయంలో ఆరాధన చేయడం వల్ల అక్షయలక్ష్మి ప్రాప్తమవుతుంది. ఆ రోజు సూర్యుడు, చంద్రుడు తులారాశిలో ఉంటారు. రుద్రయామం గ్రంథంలో కూడా ఈరోజు లక్ష్మీపూజ చేయడం వల్ల ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయని చెప్పడమైంది. తులారాశి అధిపతి శుక్రుడు. నవధాన్యాలకు ప్రతీక. అమావాస్యకు ముందు రెండు రోజులు తర్వాతి రెండు రోజులు ుణ్యమయంగా భారతీయ మేధావులు నిర్ణయించారు. అందుచేత ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన్వతరి త్రయోదశి, చతుర్దశి - నరక చతుర్దశి, అమావాస్య - దీపావళి (లక్ష్మీపూజ), కార్తీక శుక్ల పాడ్యమి అనకుండా పాడ్యమి, కార్తీక శుక్ల ద్వితీయ - యమ ద్వితీయగా జరుపుకుంటారు.


                               దీపావళి  పండుగ 'త్రిరాత్ర పర్వం' అని శాక్త గ్రంథాల్లో పేర్కొనబడింది. మహాకాళి - మహాలక్ష్మి - మహాసరస్వతి త్రిగుణాత్మక శక్తుల పూజాక్రమంలో ధనత్రయోదశి, రూపచతుర్దశి, దీపావళి పండుగల రాత్రులను కలిపి 'అఖండ త్రిరాత్ర దీపం' వెలిగిస్తారు. కాలాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ధనత్రయోదశి సాయంకాలం నుండి దీపావళి తెల్లవారేదాకా అఖండదీపం వెలిగించే పద్ధతి శాక్త సంప్రదాయంలో ఉంది. దీపావళి రాని కాళరాత్రిగా పురాణాల్లో ఉదహరించారు. ఈ రాత్రికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. కాళరాత్రి శక్తి ఉపాసన, సాధన వల్ల సుఖ సౌఖ్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. కాళరాత్రి ఒకవైపు శత్రువినాశిని అయితే మరొకవైపు శుభఫలానికి ప్రతీక. సుఖ సౌభాగ్య దాయిని. శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మి రూపాలలో పూజించే సంప్రదాయం మనది. ఆ తల్లి రూపాలు అనంతమైనప్పటికీ ముఖ్యంగా ఎనిమిది రూపాలను పూజిస్తుంటాం. .


ఆదిలక్ష్మి: లక్ష్మి మూర్తులలో ప్రధానమైన పరాశక్తి రూపంగా ఆదిలక్ష్మిని వ్యవహరిస్తుంటారు. సర్వవ్యాప్తమై, అన్ని రకాలైన ఐశ్వర్య స్వరూపిణిగా ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది. పద్మంతో కూడిన అభయముద్ర, వరదముద్ర, మంగళకరమైన ఉత్తమ సాముద్రిక లక్షణాలతో ఆ తల్లి దర్శనమిస్తుంటుంది. అందుకే ఈ లక్ష్మి రూపాన్ని ఆదిలక్ష్మి అంటారు.


విద్యాలక్ష్మి: ఈ లక్ష్మిని ఐశ్వర్యలక్ష్మి అని కూడా అంటారు. అభయ, వరద ముద్రలతో మరో రెండు చేతులలో పద్మాలతో విద్యాలక్ష్మి దర్శనమిస్తుంటుంది. బుద్ధి, జ్ఞానాలతో పాటు, ఈ తల్లి సమస్త విద్యలను ప్రసాదిస్తుంది. "


ధనలక్ష్మి: అభయ వరద ముద్రలతో రెండు తామరలతోమిగిలిన నాలుగు చేతులలో విల్లు, సువర్ణకలశం, శంఖ చక్రాలతో దర్శనమిచ్చే ధనలక్ష్మి సద్యోగాలనిచ్చే ధనానికి అధిష్టాన దేవత. గోధనం, భూధనం అంటూ సమస్త సంపదలు ఈ తల్లి ప్రసాదాలు.


ధాన్యలక్ష్మి: అభయ, వరద ముద్రలతో, రెండు తామరపువ్వులు, గద, చెరకుగడ, సస్యం, అరటిగెలను చేతులలో ధరించి దర్శనమిచ్చే ఈ తల్లి సమస్త సస్యదాయిని. సమస్త భూతకోటికి ఆధారం అన్నం. ఆ అన్నాన్ని అధిష్టించిన దేవత ధాన్యలక్ష్మి. స్వాహా, స్వధా రూపిణిగా పితృదేవతలకు కూడా అన్నాన్ని అందిస్తున్న ఆ తల్లి కరుణ లేనిదే జీవజాలం లేదు. భూ ప్రపంచలోని సమస్త సస్య, అరణ్య నదీ నదాలు ఆ తల్లికి ప్రతిరూపాలే.


ధైర్యలక్ష్మి: ఈ తల్లినే వరలక్ష్మి అని కూడా కొలుస్తుంటారు. ఏ పని చేయాలన్నా ధైర్యం అత్యంతావశ్యకం. ఒక పని చేయాలనుకున్న తర్వాత చివరదాకా దాన్ని సఫలం చేసేందుకు తప్పనిసరిగా కావాల్సింది ధైర్యం. ఆ ధైర్య గుణానికి అధిష్టాన దేత ధైర్యలక్ష్మి. .


గజలక్ష్మి: అభయ, వరద ముద్రలతో రెండు తామర పువ్వులతో దర్శనమిచ్చే గజలక్ష్మి మన ఇంటిని, సంపదలతో నింపే కరుణామయి.


కొలనులో పద్మంపై ఆసీనురాలై ఏనుగుల చేత అభిషేకింపబడుతూ దర్శనమిచ్చే ఈ తల్లి ప్రతిరూపాన్ని గృహద్వారానికి పైన ఉంచితే, ఆ ఇల్లు అష్టయిశ్వర్యాలతో కళకళ లాడుతుందని శాస్త్రం.


సంతానలక్ష్మి: ఒడిలో బిడ్డతో, అభయ వరముద్రతో, కత్తి, డాలు, రెండు కలశాలతో, సాక్షాత్కరించే సంతానలక్ష్మి కరుణ లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. అందుకే అందరూ ఆ తల్లి కరుణ కోసం ప్రార్థిస్తుంటారు. మానవజాతి మనుగడకు ప్రధానమైన సంప్రదాయంగా ఈ ఎనిమిది లక్ష్ములను శాస్త్రం అందించింది.


మత్స్య పురాణంలో లక్ష్మీదేవి వర్ణన : నవ యౌవనావస్థలో ఉన్న దేవి కపోలాలు ఉన్నతమైనవి. పెదవులు ఎరుపు వర్ణం, కనుబొమలు వంగి ఉన్నాయి. వక్షోజాలు ఉన్నతమై మణికుండలాలు అలంకరించుకొని దేవి ప్రకాశిస్తోంది. ఆ కుండలాలు పద్మ, శంఖ, స్వస్తికాది ఆకారాల్లో ఉన్నాయి. ముఖంపై ముంగురులు ముసురుతుండగా, కంచుకంపై నుండి వక్షస్థలంపై రత్నహారాలు శోభిస్తున్నాయి. ఆమె భుజాలు ఏనుగు తొండాల్లా స్థూలమై విశాలంగా ఉన్నాయి. భుజాలు కేయూరాలతో అలంకృతాలు. కుడిచేతిలో కమలం, ఎడమచేతిలో శ్రీ ఫలం (నారికేళం) ధరించి ఉంటుంది. నడుమున ఒడ్డాణం అలంకరించింది. శరీరం బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. ఇరువైపులా చామరధారిణులైన స్త్రీలు సేవిస్తున్నారు. పద్మసింహాసనంపై లక్ష్మీదేవి పద్మాసనంలో కూర్చుని ఉంది. రెండు గజాలు ఇరువైపులా కలశాలతో నీరు అభిషేకిస్తున్నాయి. ఈ విధంగా లక్ష్మీదేవి ప్రతిమను నిర్మించి పూజించాలని మత్స్యపురాణం చెబుతోంది.


దీపం లక్ష్మీ రూపం : దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఆ ప్రపంచంలోని మరి ఏ ఇతర పదార్థానికీ లేదు. అంధకారాన్ని పటాపంచలు చేయడమే ఆ శక్తి. చీకటినీ పోగొట్టే అద్భుతశక్తి మరి ఏ ఇతర పదార్థాలకి లేదు. కాబట్టే మనం దీపాన్ని పూజిస్తున్నాం. దీపారాధన లేకుండా అసలు ఏ పుణ్యకార్యం జరుగదు.