శ్రీవారి కథలు - పద్మసరోవరంలో ఆవిర్భావం


   --శ్రీవారి కథలు                                                                                           ధారావాహిక ......  


చెట్టుపై నుంచి తనపై రాలుతున్న పారిజాత సుమదళాల్లో శ్రీ నివాసునికి పరమ పావని మహాలక్ష్మి కనిపించింది. ఆమె మధుర మందహాసం కనిపించింది. ఆమె దివ్య చరణ మంజీరనాదం వినిపించింది. ఆమె కర కంకణ నిర్వాణం వినిపించింది. ఆమె బంగారు మేనికాంతుల తళతళలు కనిపించాయి. నల్లని క్రీగయా పుల తూపులు కనిపించాయి. ఆమె వయ్యారం కనిపించింది. ఆయన కళ్ళు నులుముకుసా శాడు. ఎదురుగా పూలమొక్కలు చిరుగాలికి ఊగుతూ కనిపించాయి. అంతతో నివాసునికి గంభీరంగా ఆకాశవాణి వినిపించింది. శ్రీ' నివాసా! నీకు ఇక్కడ మహాలక్ష్మి దర్శనమివ్వదు. అందుచేత నువ్వు వెంటనే ఇక్కడి నుంచి సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి పుష్కరకాలం పాటు కఠోరమయిన తపస్సు చేస్తే ఆమె తప్పక కరుణించి నీకు దర్శనమిస్తుంది!" ఆకాశవాణి మాటలు విన్నశ్రీ నివాసుడు క్రుంగిపోయాడు. కాసేపు విచారించాడు. తర్వాత తనని తానుసంబాళించుకున్నాడు. పారిజాత వృక్షం క్రింద నుంచి లేచి ప్రాకారాలన్నీ దాటి మొదటి ప్రాకారం ప్రవేశద్వారం దగ్గరికి వచ్చాడు నివాసుడు. అక్కడ ఆయనకి నారదమహర్షి కనిపించాడు.నారాయణ నామస్మరణం చేస్తూ వచిశ్రీ నివాసునికి నమస్కరించాడు నారదమహర్షి. "నారదా! ఇక్కడ... నువ్వు..." ఆశ్చర్యంగా అడిగాడు శ్రీ నివాసుడు .


"నీ కోసమే వచ్చాను స్వామీ!" నవ్వుతూ చెప్పాడు నారదమహర్షి. - "నా కోసమా....?" అడిగాడశ్రీ నివాసుడు. "అవును. నీ కోసమే!" అన్నాడు నారదుడు. ఇద్దరూ ప్రాకారం ముందున్న పూలతోటలో కూర్చున్నారు. "నారదా! ఇప్పుడు చెప్పు. విషయం ఏంటి?" ఆసక్తిగా అడిగాడశ్రీ నివాసుడు. "స్వామీ ఆకాశవాణి మాటల్ని విన్నావు గదా! నీకు సాయం చేద్దామని వచ్చాను!" అన్నాడు నారదుడు. "అలాగా.... అయితే దారూ పించు... త్రిలోక సంచారివి కదా!" అన్నాడశ్రీ నివాసుడు. "చెబుతాను... చెబుతాను! చెప్పటానికే వచ్చాను" అన్నాడు నారదుడు. "ఊఁ..." అన్నాడు నివాసుడు. "స్వామీ! భృగుమహరి చేసిన పనివల్ల అలిగి కోపంతో మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది కదా! కానీ భూలోకంలో ఆగకుండా పాతాళలోకంలో ఉన్న కపిలమహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. కొంతకాలం అక్కడ ఉండి దేవతలు... మునులు ప్రార్థించగా ఆమె పాతాళం నుంచి భూలోకంలోని కోలాహపురానికి వచ్చింది. అంటే... ఇక్కడికి. లోక కంటకుడయిన కోలహుడు అనే రాక్షసుని వధించి... సత్త్వ రజో గుణాలతో కూడిన ఉగ్రరూపాన్ని ధరించి ఇక్కడే కొలువయింది మహాలక్ష్మి. ఆ రూపంతో నీకు దర్శనమివ్వటం ఆమెకు సుతరామూ సమ్మతం కాదు. అందుకే నీకు కనిపించకూడదని... ఇక్కడి నుంచి ఆమె మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఆమె దర్శనం లభించదు" చెప్పాడు నారదమహర్షి. "అయితే... ఇప్పుడు నా కర్తవ్యం?" అన్నాడు నివాసుడు. "ఈ ప్రదేశంలో ఆమె నిన్ను అనుగ్రహించదు కనుక వెంటనే నువ్వు ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగా వెళ్ళు. కృష్ణానది వస్తుంది. ఆ నదికి ఇరవై రెండు యోజనాల దూరంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి ఉత్తర తీర ప్రాంతమంతా మునుల ఆశ్రమాలతో నిండి ఉంటుంది. వేద ఘోషలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. హోమాలు జరుగుతూ ఉంటాయి..." చెప్పాడు నారదుడు. "ఊఁ..." విన్నాడు నివాసుడు. - "స్వామీ! అటువంటి పరమ పావన ప్రదేశంలో నీ ఆయుధమైన బల్లెంతో స్వయంగా ఒక సరస్సుని తవ్వాలి. అందులో దేవలోకం నుంచి తెప్పించిన సువర్ణ కమలాలు నాటాలి. ఆ సరోవరంలో పూచిన సువర్ణ కమలాలతోనే మహాలక్ష్మిని అర్చించాలి. ఇలా పన్నెండేళ్ళ పాటు ఆమెను అర్చిస్తూ తపస్సు చేస్తే అప్పుడు కరుణిస్తుంది" అంటూ చెప్పటం ముగించి వెళ్ళిపోయాడు నారదమహర్షి. .


వెంటనే శ్రీ నివాసుడు గరుత్మంతుని అధిరోహించి వేంకటాచలానికి వెళ్ళాడు. పుష్కరిణిలో స్నానం చేసి ఆయన వరాహస్వామిని దర్శించుకున్నాడు. జరిగిన విషయాలన్నీ ఆయనకు పూస గుచ్చినట్లు వివరించాడుశ్రీ నివాసుడు. తన కష్ట సుఖాల్ని చెప్పుకోవటానికి ఆయనకి వరాహస్వామి తప్ప మరెవరున్నారు? తల్లిలాంటి వకుళమాలిక దగ్గరికి వెళ్ళలేదు. ఇష్టసఖి అయిన పద్మావతిని కలవలేదు.. ఆమె పదేళ్ళుగా వియోగాన్ని అనుభవిస్తోంది. మరెవరితోనూ ఆయన మాట్లాడలేదు. మళ్ళీ గరుత్మంతుని అధిరోహించి సువర్ణముఖి నదీతీరానికి చేరుకున్నాడు నివాసుడు. ఆ నదికి ఉత్తర దిక్కులో శుకమహర్షి ఆశ్రమం ఉంది. శుకుని దర్శించుకుని తర్వాత ఆ ఆశ్రమానికి సమీపంలో తన బల్లెంతోనే ఆయన స్వయంగా ఒక సరస్సుని తవ్వాడు. తర్వాతశ్రీ నివాసుడు మనసులోనే వాయుదేవుని స్మరించాడు. వెంటనే వాయుదేవుడు వచ్చి ఆయనకి ఎదురుగా నిలబడి నమస్కరించాడు. "వాయూ!" ఆప్యాయంగా పిలిచాడు నివాసుడు. "ఆదేశించండి స్వామీ!" అన్నాడు వాయుదేవుడు. "నువ్వు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుని అనుమతితో ఆకాశగంగలో ఉన్న ఎనిమిది సువర్ణ కమలాల్ని తీసుకురావాలి" ఆదేశించాడశ్రీ నివాసుడు.


"చిత్తం స్వామీ!" అంటూ మహావేగంతో దేవలోకానికి వెళ్ళి సువర్ణ కమలాల్ని తెచ్చి వాటినిఖీ నివాసునికి సమర్పించాడు వాయుదేవుడు. గంగాదేవిని స్మరించాడు నివాసుడు. క్షణాల్లో సరోవరమంతా గంగనీటితో నిండిపోయింది. ఆ సరోవరంలో దేవలోకం నుంచి తెప్పించిన సువర్ణ పద్మాల పిలకల్ని స్వయంగా నాటాడుశ్రీ నివాసుడు. నాటిన ఎనిమిది పిలకలు వేయి పిలకలుగా విస్తరించాయి. తామర తంపర... సరోవరం నిండా బంగారు పద్మాలు... ఆ సరోవరం పద్మ సరోవరం అయింది. ఆ సరస్సుకి తూర్పు దిక్కున పద్మాలు వికసింపచేసే సూర్యభగవానుశ్రీ వైఖానస ఆగమానుసారంగా ప్రతిష్ఠించాడు శ్రీ నివాసుడు. ఆయన తీవ్రంగా తపస్సుని ఆరంభించాడు. అనునిత్యం ఆయన పద్మసరోవరంలో స్నానమాచరించి మహాలక్ష్మీ మంత్రాన్ని మూడువేల సార్లు ఏకాగ్రమైన మనస్సుతో జపిస్తున్నాడు. పద్మసరోవరంలో పూసిన వేయి బంగారు పద్మాలతో అమ్మవారిని అర్చిస్తున్నాడు. ఆవుపాలని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడు. మౌనంగా ఉంటున్నాడు. కంటికి కునుకు లేదు. అనుక్షణం మహాలక్ష్మి నామస్మరణంతోనే కాలం గడుపుతున్నాడు నివాసుడు. పుష్కరకాలం గడిచింది. దేవేంద్రుడు తన పదవిని నిరంతరం పదిలంగా ఉంచుకుంటాడు. తన పదవికి భంగం కలిగించేవారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటూనే ఉంటాడు. అటువంటి పటిష్టమైన వ్యవస్థ ఆయనకి ఉంది. భూలోకం నుంచి వేగులు వెళ్ళారు. "


"దేవరాజా! భూలోకంలో ఒక రాజకుమారుడు చాలా సంవత్సరాల నుంచి కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. దానివల్ల మీ పదవికి ముప్పు కలుగుతుందని..." చెప్పారు వేగులు. "ఎక్కడ తపస్సు చేస్తున్నాడు?" ఆత్రుతగా వేగుల్ని అడిగాడు దేవేంద్రుడు. - "సువర్ణముఖి నదీతీరంలో ప్రభూ!" చెప్పారు ఆ వేగులు. దేవేంద్రునికి ఆలోచన మందగించింది. మాయపొర కమ్మింది. పదవి పోతుందనే భయం పట్టుకుంది. ఆ వేగుల్ని పంపేశాడు. అప్సరస అయిన రంభని పిలిపించాడు. "రంభా! నువ్వు భూలోకానికి వెళ్ళి పద్మ సరోవరం దగ్గర తపస్సు చేస్తున్న రాజకుమారుని నీ వలలో వేసుకోవాలి" ఆదేశించాడు దేవేంద్రుడు. రంభ వెళ్ళింది.శ్రీ నివాసుని వివరాలు తెలుసుకుంది. ఆయన మహాలక్ష్మి కోసం తపమాచరిస్తున్నాడని గ్రహించింది. ఆమె గుండె జల్లుమంది. క్షణకాలం అక్కడ ఉన్నా ప్రమాదం అని గజగజా వణికిపోయింది. పరుగు పరుగున స్వర్గలోకానికి వెళ్ళి విషయమంతా వివరంగా చెప్పింది అప్సరస. ఆ మాటల్ని వింటూనే మూర్ఛిల్లాడు దేవేంద్రుడు. - పద్మసరోవరం దగ్గర తపస్సు చేస్తున్న శ్రీ నివాసుడు బాగా చిక్కిపోయాడు. మొహం పాలిపోయింది. కళ్ళు పీక్కుపోయాయి. అయినచూ పులు మాత్రం చురుకుగా ఉన్నాయి. బుగ్గలు తరిగిపోయాయి. శరీరం మరింత నీలమేఘ శ్యామలమయింది. అనునిత్యం శుకమహర్షి వచ్చి ఆయనని పరామర్శించి వెడుతున్నాడు. మహరులూ మునులూ వస్తూనే ఉన్నారు. లక్ష్యం నెరవేరందే తపస్సుని విరమించనని దృఢంగా నిర్ణయించుకున్నాడు నివాసుడు. మునులు మధ్యవర్తులుగా పాతాళానికి వెళ్ళారు. "మహాలక్ష్మీ! సిరులతల్లీ! మోహన తనువల్లీ! అక్కడ పద్మసరోవరం దగ్గర నీకోసం నిద్రాహారాలు మాని తపస్సు చేస్తూ స్వామి కృశించిపోయాడు... నువ్వేమో ఇక్కడ అలకబూని ఒంటరిగా ఉన్నావు. ఇద్దరూ కలిసి ఉండాలని మా కోరిక!" చెప్పారు మునులు. -


కపిలమహర్షి కూడ పరిపరి విధాలుగా హితవచనాలు పలికాడు. మహాలక్ష్మికి కోపం తగ్గింది. వెంటనే పాతాళంలో ఆమె మాయమైంది. ఆరోజు... కార్తీకమాసం... శుక్లపక్షం... పంచమి... శుక్రవారం... ఉత్తరాషాఢ నక్షత్రం... మైత్రమనే అమృత ఘడియలో... పద్మసరోవరం మధ్యలో వేయిరేకుల బంగారు పద్మం పూర్తిగా వికసించింది. ఆ పద్మంలోని కర్ణిక మధ్యలో వేయి వెలుగులు విరజిమ్ముతూ... సువర్ణాభరణాల్ని ధరించి మందహాసం చేస్తూ మహాలక్ష్మి ఆవిర్భవించింది. శంఖనాదాలు వినిపించాయి. భేరీ మృదంగ నాదాలు మోగాయి. స్వర్ణ రథాన్ని అధిరోహించి ఆమెశ్రీ నివాసుని దగ్గరికి వచ్చింది. తన చేతిలోని కలువపూలమాలని ఆప్యాయంగా అనురాగంతో శ్రీ నివాసుని మెడలో వేసి నమస్కరించింది మహాలక్ష్మి. ఆమెను తన రెండు చేతులతో ఎత్తి వక్షస్థలంలో నిలుపుకున్నాడు నివాసుడు.