శ్రీ వారి కైంకర్యాలు - షట్కాలార్చన

 


గత సంచిక తరువాయి


శ్రీ వారి కైంకర్యాలు - షట్కాలార్చన


తిరుమలశ్రీ వారి ఆలయంలో శతాబ్దాలుగా, అనాదిగా వస్తున్న సంప్రదాయం మేరకు, కైంకర్యాల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా, వైఖానస అర్చకులచే నిర్వహింపబడుతోంది. ఆలయంలో మొదటి కైంకర్యంగా సుప్రభాతసేవ నుండి చివరి కైంకర్యంగా ఏకాంతసేవ వరకు ప్రతినిత్యం వైభవంగా జరుగుతుంది. ఈ రెండు కైంకర్యాల మధ్యలో అనేక ఇతర కైంకర్యాలు నిత్య ఆరాధనలో భాగంగా జరుపబడుతున్నాయి. శ్రీ వైఖానస భృగు సంహితలో చెప్పబడిన విధంగాశ్రీ వారికి షట్కాలార్చనలు నిర్వహిస్తారు. భృగు ప్రణీతమైన ప్రకీర్ణాధికారం అనే వైఖానస సంహితలో రోజుకి ఒక్కసారి, రెండుసార్లు, మూడుసార్లు లేక ఆరుసార్ల వరకు శ్రీ వారిని ఆరాధించవచ్చని చెప్పబడింది. అంతేగాక ఈ ఆరు కాలములు...


ప్రత్యూష - (సూర్యోదయాత్పూర్వం బ్రాహ్మీముహూర్తంలో), ప్రాతఃకాలం (సూర్యోదయంలో), మధ్యాహ్నం, అపరాహం, సాయంకాలం మరియు అర్థరాత్రి అని భృగుసంహితలో చెప్పబడిన విధంగా శ్రీ వారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నాయి.


షట్కాలార్చన ఫలం :


సమస్త మానవాళికి ఐహిక (భౌతికమైన) ప్రయోజనం కొరకే షట్కాల పూజ అని ఆగమాలు పేర్కొంటున్నాయి. ప్రత్యూషకాల పూజ ప్రజా పశువృద్దిని కలిగిస్తుంది. ప్రాతఃకాల పూజ జపహోమాదులను వృద్ధి చేస్తుంది. మధ్యాహ్న పూజ, రాజ రాష్ట్ర అభివృద్ధిని కలిగిస్తుంది. సాయంకాల పూజ వలన లోకంలో పంటలన్నీ సమృద్ధిగా పండుతాయి. అపరాహ పూజ దైత్య వినాశనాన్ని కలిగిస్తుంది. ఇక అర్థరాత్రి పూజ పశుగణాభివృద్ధి కొరకు ప్రయోజనంగా చెప్పబడింది. శ్రీ వారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే వైఖానస అర్చకులు సాంప్రదాయంగా ఆలయానికి ఉత్తరం వైపున ఉత్తర మాడవీధిలో నివాసం ఉంటారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆచారం మేరకు అర్చకులు ఆలయానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ క్రమంలో వెళ్ళాలి. అందువల్లనే ఇప్పటికీ అనేక ప్రాచీన వైష్ణవ దివ్యదేశములలో అర్చకుల – నివాసగృహం సన్నిధి వీధిలో లేక ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయబడి ఉంటుంది.


శ్రీ వారికి కైంకర్యాలను నిర్వహించే అర్చకులు వారి గృహంలో శుచిగా తలస్నానం చేసి, మడిగా ఆరవేయబడిన తెల్లటి ధోవతులను ధరించి, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను (12 నామములు), కేశవాది నామములను పఠిస్తూ, తిలకధారణ చేస్తారు. మరియొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వారి అర్చకులు, తిరుమల పొలిమేరలు దాటి వచ్చినట్లయితే మరల శ్రీ వారి కైంకర్యానికి వచ్చే ముందు, నూతన యజ్ఞోపవీతాన్ని (జంధ్యం) ధరించాలి. ఇది చాలా ప్రాచీన కాలం నుండి అమలులో ఉన్న, తిరుమల ఆలయానికి మాత్రమే ప్రత్యేకమైన ఆచారం. అంతమాత్రమే గాక వైఖానస అర్చక స్వాముశ్రీ వారి అర్చన కైంకర్యంలో ఉన్నసమయంలో అనగా తిరుమల క్షేత్రంలో బ్రహ్మచర్యవ్రతం అన్నది విధిగా పాటించవలసిన అంశం.


అర్చకుని ఆలయ ప్రవేశం


అర్చకుడు కైంకర్యానికి వెళ్ళేటప్పుడు పంచాంగ భూషణములైన కటకం (చేతి కంకణం), ఉపవీతం (జంధ్యం), కుండలం (చెవిపోగులు), అంగుళీయకం (ఉంగరం), గైవాలంకరణ (మెడలో వేసుకునే ఆభరణములు) ధరించాలని భృగుసంహిత నిర్దేశిస్తుంది. ఇవేకాక పద్మాక్ష (తామరపూసలు), తులసీమాలలను ధరించాలి. ఇవి ధరించటం వలన కోటిగుణితమైన ఫలితాలను పొందవచ్చని శ్రీ నివాస దీక్షీ యంలో చెప్పబడింది. ఆలయ ఆచారం మేరకు సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా, అతన్ని అనుసరిస్తూ నలుగురు వైఖానస అర్చకులు, కుంచెకోల అనే తాళంచెవిని గైకొని ఉత్తరమాడవీధి నుండి ఆలయానికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో శ్రీ వరాహస్వామి వారికి, శ్రీ విఖనస మహరుల సన్నిధికి ప్రణామముల నర్పించి ఆలయం చేరుకుంటారు. ద్వితీయ ప్రాకార ద్వార దేవతలైన వక్రతుండ (గణేశుడు), నాగరాజులకు ప్రణామములర్పించి, పడికావలి దాటి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటారు. బలిపీఠమునకు నమస్కారములర్పించి, వెండివాకిలి దాటి ప్రథమ ప్రాకార ద్వారపాలకుడైన కిష్కింధుడు, తీర్థుడు వీరికి నమస్సులర్పించి, వరదరాజస్వామికి, పాకలక్ష్మికి (పోటు తాయారు లేక వకుళమాలిక) నమస్కారం చేసి, విమాన ప్రాకారం ప్రదక్షిణగా చుట్టివస్తారు. రెండు ప్రదక్షిణలు చేయాలని ఆగమ శాస్త్ర వచనం. దారిలో విమాన వేంకటేశ్వరుడు, యోగ నరసింహస్వామి, శంకుస్థాపన స్తంభమునకు నమస్సులర్పిస్తారు. బంగారువాకిలి ప్రవేశించి గర్భాలయ ద్వారపాలకులైన మణిక, సంధ్యలకు నమస్సులర్పించి, కుంచెకోలతో ద్వారములు తెరిచి లోపలికి ప్రవేశిస్తారు. లోనికి ప్రవేశించేటప్పుడు ప్రణవాన్ని ఉచ్చరిస్తూ కుడివైపుగా ప్రవేశించాలి. ద్వార దేవతలైన భువంగునికి నమస్కరిస్తూ గడపని దాటుకుని స్నపన మంటపం లోనికి ప్రవేశిస్తారు. స్వామివారి దివ్యమైన ముఖారవిందాన్ని దర్శించుకుంటూ అర్చకులు వేదమంత్రాల్ని స్మరిస్తారు. కుడిచేతిలో ఎడమ చేతిని తగిలిస్తూ మూడుసార్లు చప్పట్లు కొడతారు. ఒకసారి చప్పట్లు కొడితే మరణం, రెండుసార్లు వ్యాధిపీడ, మూడుసార్లు సుఖ సంతోషములు కలుగుతాయని చెప్పబడింది.


శ్రీ వైఖానస ఆగమంలో చెప్పబడిన విధంగా, ఆలయ ద్వారములు తెరిచి, అర్చకులు లోపలికి ప్రవేశించిన తర్వాత, మొదటగా స్వామివారి దృష్టి పథంలో గోవు, వేద బ్రాహ్మణుడు, ఆదర్శం (అద్దం), అశ్వం, ఏనుగులను నిలిపిశ్రీ వారి ప్రథమ దృష్టి వీరిపై ప్రసరింపచేయాలని నిర్దేశింపబడింది. ప్రాచీనకాలం నుండి శ్రీ వారి ఆలయంతో అనుబంధం కలిగిన అర్చకులతో బాటు, సన్నిధిగొల్ల కూడా శ్రీ వారిసేవలో తరించాలని అనూచానంగా వస్తున్న సంప్రదాయం. ఒకానొక కాలంలో సన్నిధి గొల్ల అర్చకులతో బాటుగా, ఒక ఆవును కూడా సన్నిధి వరకు తీసుకెళ్ళిశ్రీ వారి ప్రథమ దృష్టి పథంలో నిలిపే ఆచారం ఉండేదని, పారంపర్య అర్చకుల వలన తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సంప్రదాయం కొనసాగకపోయినా, వైఖానస భగవదారాధన క్రమంలో తెలుపబడిన విశిష్టమైన ' గోసూక్తం' అనే వేదమంత్ర పఠనంతో ఇప్పటికీ అర్చకులు మంత్రసహితంగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


ఈ సమయంలో ఆలయ సంప్రదాయాన్ననుసరించి, తిరుమలనంబి (ప్రథమాచార్య పురుషులు) వంశీయులు ఆలయానికి సమీపంలోని ఆకాశగంగ తీర్థం నుండి మూడు బిందెల తీరాన్ని సన్నిధికి చేరుస్తారు. అర్చకులు సన్నిధిలోకి ప్రవేశించి శ్రీ వారి దివ్యమైన సాలగ్రామ శిలాబింబాన్ని మొదటగా భక్తిపూర్వకంగా స్పృశించి పాదసేవ చేసికొంటారు. అనంతరం ముందురోజు రాత్రి పవళింపు సేవలో శయనించిన శ్రీ శ్రీ నివాసమూర్తి వారిని, జీవస్థానానికి వేంచేపు చేస్తారు. ఏకాంగి మైసూరా అఖండం, బ్రహ్మ అఖండం అనే రెండు పెద్ద దీపాలను వెలిగిస్తారుశ్రీ వారికి ప్రత్యూష కాల అర్చనలో భాగంగా మొదటి నివేదనగా ధారోష్ణం కలిగిన పచ్చి ఆవుపాలను సమర్పిస్తారుశ్రీ వారి ముఖమండలమునకు పునుగు తైలంతో మర్దన చేసి పచ్చకర్పూరంతో 'గడ్డం బొట్టు' అనే చుక్కను తీర్చిదిద్దుతారు. కైంకర్యపరుల హారతి జరిగిన తర్వాత, గొల్లహారతినిశ్రీ వారికి సమర్పిస్తారు. అనంతరం ముందుగా అర్చకులు బ్రహ్మతీర్థాన్ని తాము స్వీకరించి, తర్వాత జియ్యర్ స్వామికి, సన్నిధి గొల్లకు బ్రహ్మతీర్థం, శఠారి మర్యాదలు చేస్తారు.


శ్రీ వారి ఆరాధనలు – షడాసనములు


శ్రీ వారికి ఒకరోజు పూర్తిగా జరిపే కైంకర్యాలను ఆగమ శాస్త్రాలలో షడాసనములుగా వర్గీకరణ చేయబడింది. 8వ శతాబ్దానికి చెందిన వైఖానస పండితుడు శ్రీ మన్నసింహవాజపేయ యాజులవారు శ్రీ మద్భగవదర్చా ప్రకరణమ్' అనే గ్రంథాన్ని రచించారు. పరిశోధకుల అభిప్రాయం మేరకు ఈ గ్రంథం అప్పట్లో 18వ శతాబ్దం) తిరుమజీ వారి ఆలయంలో జరిగే కైంకర్యాలను ఆగమశాస్త్ర మంత్రసహితంగా పొందుపర్చారని చెప్పబడుతున్నది. ఇది పంచ ఖండ తిరువారాధన క్రమంగా వైఖానస ఆలయాలలో ప్రసిద్ధి చెందినది. పూజాక్రమము ఆరు విధములుగా విభాగింపబడినది. 1.మంత్రాసనము 2. స్నానాసనము 4. అలంకారాసనము 4. భోజ్యాసనము 5. యాత్రాసనము 6. పర్యంకాసనము. వీటి గురించి వివరంగా తరువాతి భాగములలో తెలుపబడింది.


పంచశుద్ధి


వైఖానసాగమాన్ననుసరించి ఆలయంలో పూజాదికాలు ప్రారంభం చేసే ముందు, అత్యుత్తమ ఫలితములు పొందటానికి 'పంచశుద్ధులు' నిర్వహించాలని భృగు ప్రణీతమైన 'వాసాధికారం'లో చెప్పబడింది.


అయిదు రకాల శుద్ధి ప్రక్రియలో 1.దేహశుద్ధి 2. స్థానశుద్ధి 3. పాత్రశుద్ధి 4. ఆత్మశుద్ధి 5. బింబశుద్దిగా చెప్పబడింది. దేహశుద్ది అనగా పూజచేసే అర్చక స్వాములు శుచిగా తల స్నానం చేసి, మడి ధోవతులు ధరించి సంధ్యావందనం, జపం, నిత్యహోమం (గృహ సంబంధితమైన) మొదలైన అనుషానములు చేసుకోవటం. ఇక స్థానశుద్ది అనగా గర్భాలయం మరియు పూజ జరిగే స్థలమును చీపురుతో శుభ్రము చేసి, వేదమంత్రాలతో స్థలశుద్ధి జరిపి ఆరాధనకు సిద్ధం చేయటం. శ్రీ వారి ఆరాధనకు గర్భాలయంలో బంగారు పంచపాత్రల (ఐదు పాత్రల)ను ఉపయోగిస్తారు. అందులో నాలుగు చిన్న బంగారు పాత్రలు వరుసగా పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం ఉపచారాలకు వినియోగిస్తారు. మధ్యలో ఉన్న పెద్ద బంగారు పాత్ర శుద్ధతోయ పాత్రగా వినియోగిస్తారు. ఇంకా స్వామివారికి శంఖోదక సమర్పణ (శంఖంలో నీరు) కొరకు బంగారు శంఖం, ఉపచార సమర్పణకు బంగారు ఉద్దరిణ మరియు ఈ పాత్రలన్నీ ఉంచటానికి ఒక వెండి వేదిక, ఆచమన తీర్థం పరిగ్రహించటానికి బంగారు పతద్దహ పాత్ర మొదలగునవి నిత్యార్చనలో ఉపయోగిస్తారు. వీటినన్నింటినీ ఆరాధనకు ముందు చక్కగా శుభ్రం చేయాలి. ఆరాధన సమయంలో అర్చకస్వామి వేదమంత్ర పురస్సరంగా ప్రోక్షణ చేసి శుద్ధి జరుపుతారు. ఈ ప్రక్రియనే పాత్ర శుద్ధి అంటారు. ఈ ఆరాధన సమయంలో భగవంతుని మూలబేరంలో నిక్షిప్తమై ఉన్న మహత్తర దివ్యసాన్నిధ్య శక్తిని,శ్రీ నివాసుని ఇతర 4 రూపములలోకి మంత్రపూర్వకంగా ప్రసరింపచేస్తారు. అంతేగాక ఈ శక్తిలో కొంత భాగాన్ని అర్చకస్వామి స్వయంగా తన దేహములో ప్రవేశపెట్టుకొనడం జరుగుతుంది. అంతటి దివ్యమైన శక్తిని స్వీకరించటం కొరకు, ఆగమ శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ప్రాణాయామాది యోగక్రియలు మరియు ఆత్మసూక్తి పఠన జరిపి అర్చకులు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. అర్చకులు చేసుకునే శరీర శుద్ధి ప్రక్రియనే ఆత్మశుద్ధి అంటారు. ఇక బింబశుద్ధి అనగా శ్రీ వారి దివ్యమైన రూపాన్ని నిర్దేశించబడిన ద్రవ్యములతో (పాలు, పెరుగు మొ||వి) మంత్రపూర్వకంగా శుద్ధి చేయటం.


పంచపాత్రలు - విశేషాలు


పంచపాత్రలను ఆయా స్థానాలలో ఎలా ఉంచాలో ఆగమంలో విశదీకరించబడి ఉంది. స్నానపాత్ర ఆగ్నేయ దిక్కులోనూ, అర్ఘ్యపాత్ర నైఋతి నందు, పాద్యపాత్ర వాయవ్యంలో, ఆచమనపాత్ర ఈశాన్యంలో ఉంచాలి. శుద్దతోయ పాత్ర మధ్యలోనూ, పతథహ పాత్ర పంచపాత్రల వేదికకు ఉత్తరం వైపున ఉంచాలిశ్రీ వారికి వివిధ ఉపచారములను సమర్పించడానికి ఉపయోగించే పంచపాత్రలలో చెప్పబడిన ఆయా ద్రవ్యములతో నింపవలెను. స్నానపాత్రలో కర్పూరం, ఉశీరం (వట్టివేరు), తక్కోలం (సుగంధతైలం), నల (లేపనం కొరకు), ఏలక్కాయలు, లవంగములు మొదలైనవి స్నాన పాత్ర ఉపచారములకు సంబంధించిన ద్రవ్యములు. దర్భలు, అక్షతలు, తిలలు (నువ్వులు త్రీ హి (బియ్యం ), యవలు, మాష (మినుములు), ప్రియంగు (కొఱ్ఱలు), సిద్ధార్థకం (తెల్ల ఆవాలు) మొదలైనవి అర్యద్రవ్యాలు.


ఇక పాద్య పాత్ర ద్రవ్యములు (తామరలు) పంకజం, విష్ణుపల్లి (పొన్న), శ్యామాకం (చామలు) దౌర్వమంకురములుగా చెప్పబడినవి. ఏలకులు, లవంగములు, ఉశీరము (వట్టివేరు), కర్పూరం, అగరుచందనం మొదలైనవి ఆచమన ఉపచార ద్రవ్యములుగా నిర్దేశింపబడినవి.


ఈ ద్రవ్యములన్నీ సమయ సందర్భముల ననుసరించి అన్నీ దొరకడం దుర్లభం కావచ్చు. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయం కూడా ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. పై ఉపచారములకు సంబంధించిన ద్రవ్యములలో ఏదీ లభ్యం కాకపోయినా, ఆయా ద్రవ్యముల పేర్లు ఉచ్చరిస్తూ తులసీదళములు ఉపయోగించి ఆరాధన జరుపవచ్చు.