"ప్రపత్తి” , ప్రపన్నులు”.


"ప్రపత్తి” చేయువారు " ప్రపన్నులు”. వీరు రెండు విధములుగా ఉందురు. ఉపాయనిష్ఠులు, ఉపేయనిష్టులు. ఉపాయముకూడ ఉపేయముతో సమానమైనదే అని వీరి భావన. భగవానుని “ఉపాయము” అని తలచి ప్రపత్తి చేయువారు “ఉపాయనిషులు”. అట్లే భగవానుని “ఉపేయము” అని తలచి ప్రపత్తి చేయువారు “ఉపేయనిష్టులు”. ఉపాయనిష్టులు ఏదో ఒక ప్రయోజనమును కాంక్షించి ప్రపత్తి చేయుదురు. సీతాదేవి, ద్రౌపది, తిరుక్కణ్ణమంగైయాండాన్ ఇట్టివారు ఉపేయనిష్ఠులు. వేరొక ప్రయోజనము కోరక విశ్వేశ్వరుని కైంకర్యమునే కోరువారు లక్ష్మణస్వామి, జటాయువు, పిళ్ళె తిరున? యూరైయరు, చింతయతి – ఇట్టివారు. ప్రపత్తి చేయువారికి (శరణాగతి చేయువారికి) తన రక్షణము నందు తన ప్రయత్నము మాని యుండుట ప్రధాన లక్షణము. సీతాదేవి తనను తాను రక్షించుకొనుటకు శక్తి కలది.


అయినను, తనను తాను రక్షించుకొనరాదు అను నిశ్చయముతో శ్రీ రామునే రక్షకుడని నమ్మియున్నది. హనుమ తాను సీతాదేవిని తీసికొని వెళ్ళుదునని చెప్పినను, “తత్తస్యసదృశంభవేత్” – అని రాముడే వచ్చి, శత్రు సంహారము చేసి, తనను తీసికొని వెళ్ళుట శ్రీ రామునకు తగినది అనినది. తన "శక్తి"ని వదలుకొనినది. ద్రౌపది తనను తాను రక్షించుకొన శక్తి లేనిది. ఆమెకు కౌరవసభలో పరాభవము జరుగుచున్నప్పుడు ఎవరునూ రక్షించుటకు సిద్ధపడలేదు. ఆమె సిగ్గుచే తన చీరెను వదలక పట్టుకుని ఉండెను. తుదకు ఆ చీరెను కూడ వదలి "గోవింద! రక్షమామ్ రక్షమామ్” అనినది. వెంటనే ఆమెకు వస్త్రములు వచ్చినవి. ద్రౌపదికి తనను తాను రక్షించుకొనుటకు శక్తి లేదు. అందుచేత “లజ్జ”ను వదలి శరణు వేడినది. వీరిద్దరి శరణాగతిలో భేదమిదియే. ఒకరు శక్తిని వదలినారు. మరొకరు లజ్జను అనగా సిగ్గును వదలినారు. తిరుక్కణ్ణమంగైయాండాన్ తన ప్రయత్నమునే మానుకొనినాడు. ఆయన ఒకనాడు ఒక సేవకుని కుక్కను చూ చినాడు. మరొక సేవకుడు వచ్చి ఆ కుక్కను కొట్టినాడు. కుక్కను కొట్టినందుకు కుక్క యజమాని రెండవ సేవకునితో తగవులాడి రెండవ సేవకునిచేత దెబ్బలు తిని తన ప్రాణములనే విడచినాడు. తనను విశ్వాసముతో కొలుచుచున్నందుననే ఆ కుక్క కొరకు యజమాని తన ప్రాణము విడిచినాడు. — “ఒక సామాన్య మానవుడే తనను విశ్వాసముతో సేవించుచున్న ఒక కుక్క కొరకు తన ప్రాణమును వదులుకున్నాడే, మనము పరమ పురుషుడైన సర్వేశ్వరుని విశ్వాసమునమ్మియున్నచోమనకొరకు ఆయన ఎట్టి శ్రమను అయినను పడి రక్షించి తీరును” – అని నిశ్చయించుకొనినాడు. ఒకమారు “ఆండాన్” ఒక దివ్యదేశములో "పత్తరావి” అను భగవానుని ఆలయములో ఒక రాత్రి పండుకొనుట తటస్థించినది. అప్పుడు ఆలయములోని మూర్తికి నిప్పు అంటుకొని ఆలయము కాలిపోవుట ప్రారంభమైనది. అదే ఆలయములో పడుకొనియున్న “ఆండాన్” భగవానుని యెడ పరిపూర్ణ విశ్వాసముతో శరణాగతి చేసినవాడు కనుక తనను తాను రక్షించుకొనుటకు ఎట్టి ప్రయత్నమును చేయలేదు. అక్కడే ఉండి చనిపోయినాడు. ఈ ప్రసంగములచే శరణాగతి చేయువారు సంపూర్ణ విశ్వాసముతో ఉండవలయునని మనము గ్రహింపవలెను. సంపూర్ణముగ శరణాగతి చేసిన ఈ ముగ్గురు ఒకరు శక్తిని, మరొకరు సిగ్గును, వేరొకరు ప్రయత్నమును విడచినారు. వీరు ఉపాయనిష్టులు.


శ్రీ మన్నారాయణుడే “ఉపేయము” (పొందగలిగినవాడు) అని విశ్వసించిన వారు “ఉపేయనిష్టులు”. “ఉపేయము” అనగా తనచే పొందవలసినది భగవత్ కైంకర్యమే అని నమ్మి ఇతరములను వదలినవారు. లక్ష్మణస్వామి, జటాయువు, పిళ్ళెతిరునరైయూరైయార్, చింతయంతి అనువారు అట్టివారు. అడవికి వెళ్ళునప్పుడశ్రీ రామచంద్రునితో లక్ష్మణుడు “నిన్ను వదలినచో నేను బ్రతుకజాలను. నేను మీకు అన్ని విధముల కైంకర్యములను చేయుచుండవలెను” అనినాడు. అయోధ్యలో ఉన్నప్పుడు అనేకులు శ్రీ రాముని కైంకర్యము చేయువారు ఉందురు. కాని అరణ్యములో అన్ని కైంకర్యములను తానే చేయవచ్చునని లక్ష్మణుడు సంతోషించినాడు. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు జటాయువు (పెరియ ఉడైయార్) రావణునితో యుద్ధము చేసి అతని చేతిలో మరణించినాడు. భగవద్విషయములో శరణాగతి చేసినవారు తమ ప్రాణములనైనను లెక్క చేయరు అని జటాయువు నిరూపించినాడు. అట్లే “తిరునరైయూరైయార్” అనువారు కుటుంబముతో సహా తిరునారాయణ పురమునకు వెళ్ళునపుడు అచ్చట కొందరు అన్యమతస్తులు ఆలయమునకు నిప్పు పెట్టినారు.ఆలయములోని అందరు స్వామిని విడిచి పారిపోయినారు. “నేను మాత్రము స్వామిని వదలి వెళ్ళజాలను” అని “యూరైయార్” అక్కడే ఉండి కుటుంబముతో సహా అగ్నికి ఆహుతి అయినాడు. . "చింతయంతి" ఒక గోపిక.శ్రీ కృష్ణుని వేణునాదము విని, గోపికలు అందరు కృష్ణుని సన్నిధికి వెళ్ళుచుండగా తాను గూడ పోదలచెను. కాని ఆమెను ఇంటిలోని పెద్దలు, భర్త ఒక గదిలో పడవైచినారు. ఆమె ఆ గదిలో ఉండియే కృష్ణుని ధ్యానించుచుండెను. ఆమెకు అం తయు కృష్ణమయముగ తోచెను. సదా కృష్ణునే స్మరించుచుండుటచే, ఆమె పూర్వజన్మములో ఆర్జించిన పుణ్యము వలన ప్రత్యక్ష సమానముగ కృష్ణ దర్శనమైనది. ఆమె ఆత్మ శరీరమును వీడి కృష్ణ సాయుజ్యము నొందినది. ఉపేయనిష్టులు ఇట్లుందురని వీరి వలన తెలియుచున్నది. ప్రపన్నులు పుణ్యదేశములలో నివసించుచు, భగవానునికి పూజాదికములను చేయుచుందురు. ఇది ఉపాయమని వారు తలచరు. సర్వేశ్వరునక్షత్రీ తిపాత్రమైన కైంకర్యమే తమకు ప్రాప్యమని వారు చేయుదురు.


ప్రపన్నులకు ప్రధానమైన లక్షణములు మూడు. 1. అనన్యోపాయత్వము 2.అనన్యోపేయత్వము 3. అనన్యదైవత్వము అనునవి. ఈ మూడును శరణాగతి చేయువారికి దొరుకును. “అనన్యోపాయత్వము” అనగా వేరొక ఉపాయము లేనివారై ఉండుట. “అనన్యోపాయత్వము” అనగా సర్వేశ్వరుని వదలి వేరొకదానిని పొందవలెనని కోరకుండుట. “అనన్య దైవత్వము” అనగా సర్వేశ్వరుని తప్ప వేరొక దైవమును ఆశ్రయింపకుండుట. ఈ మూడును ప్రపన్నులకు ఉండవలసినవి. సర్వేశ్వరుడే ఉపాయమని నిశ్చయించుకొనియున్న ప్రపన్నులకు తాము ఏమి చేసినను సర్వేశ్వరునకు గొప్పతనమును పెంచుటకే కాని తమ ఆనందము కొరకు కాదు అను భావన ఉండవలయును. ఇట్లు సర్వేశ్వరుడే ఉపాయమని స్వీకరించినవారికి తాము దేనిని పొందవలెనని అనుకొనుచున్నారో అది “ఉపేయము” అగుచున్నది. కనుక “ఉపాయము” కూడ “ఉపేయము”తో సమానమైనదే. ఆ సర్వేశ్వరుడే ఉపాయమైననాడు సాధ్యమే కదా తనకు సాధనము అని ప్రపన్నులు నిశ్చయముతో ఉందురు. -


ఒక్కొక్కసారి శరణాగతి చేసిన కొందరు మపరవశులై, స్వామిని పొందవలయునని కోరుచుందురు. ఆ మపారవశ్యము చేత తమస్వామిని తాము పొందునట్లు చేయుడని ఇతర దేవతలను ఆశ్రయింతురు. ఇట్లు వారు చేయుట వారికి దోషము కాదు. వారి స్వరూపమునకు హాని కాదు. స్వామిపై మ అధికమై మాత్రమే వారు అట్లు చేసినారు కాబట్టి అది దోషము కాదు. ప్రపన్నులకు ఆదర్శమైన ఆండాళ్ తల్లి కామదేవుని ఆరాధన చేసి, తనను తన స్వామితో చేర్చుమని ప్రార్థించినది. ఇది అనన్య దైవత్వమునకు విరుద్ధమని అనిపించును. కాని సర్వేశ్వరుని కైంకర్యము నందు ఉండు అశక్తతయే ఆమె అట్లు కామదేవుని ఆరాధించుటకు కారణమైనది. జ్ఞానము అతిశయించుటచేత కలిగిన మ వలన కలిగిన అజ్ఞానముచే చేసినవన్నియు దోషరహితములే. "జ్ఞానము” అనగా భగవానునితో మనకు గల “శేష శేషి” సంబంధమును ఎరుగుట. అది దృఢముగ కలిగిననాడు జ్ఞానము యొక్క పరిపక్వ స్థితియైన భక్తి కలుగును. కర్మ కారణముగ కలిగిన అజ్ఞానము నిరైసించ తగినదే. కాని మాధిక్యముచే కలిగిన అజ్ఞానము ఆదరింపదగినది. ఆండాళ్ తల్లి కామదేవుని ఆశ్రయించుట; “ఆళ్వార్ నాయిక” (నాయికా భావముతో ఆశ్రయించినవి నమ్మాళ్వారులు) “మడలెత్తుట"; (పిచ్చిదానివలె వీధులలో ఎగురుతూ తిరుగుట); వారు తమ తమ స్వామిని పొందుటకు చేసిన ప్రవర్తనలే కాని అన్యము కాదు. - “సిద్ధాపాయ స్వీకారము” (భగవానుడే తప్ప వేరొక ఉపాయము లేదని దృఢముగా స్వీకరించుట)ను స్వీకరించినవారికి సర్వేశ్వరుడే విలంబమును, ఓర్వలేని శక్తిని, త్వరను కలిగించును. శ్రీ శఠకోపుల" వారికి స్వామి ఇట్టి జ్ఞానమునే (అజ్ఞానము లేని భక్తిరూపమగు జ్ఞానమును) - “మయర్వ మతినలం అరుళినం” - అనుగ్రహించినాడు. సర్వేశ్వరుడే మను కలిగించువాడును, పెంచువాడును అయియుండును అని ఆళ్వారులు సాయించినారు. “మడలెత్తుట” మొదలైనవి సిద్ధపాయముతో సమానములే!


సాధ్యప్రావణ్యము, విలంబ అసహనము అనునవి రెండే సిద్ధ సాధనమును స్వీకరించుటకు కారణములు. ఇవి వేగముగ భగవత్ కైంకర్యము లభించుటకు ఉపకరించును. కాని ప్రతిబంధకములు కావు. "ప్రావణ్యము” అనగా భగవత్ ప్రాప్తియందు అధికమైన ఆసక్తియే. ఇది ఆత్మ గుణములన్నటికి ప్రధానమైన కారణము. ఇట్టి ఆసక్తి కలుగుటచే శమదమాది ఆత్మగుణములన్నియు కలుగును. “శమము” అనగా అంతఃకరణము లౌకిక విషయములపై ప్రసరింపకుండుట. “దమము” అనగా బాహ్యేంద్రియములు లౌకిక విషయానుభవములందు ప్రసరింపకుండుట. అనగా అంతఃకరణ నియమనము “శమము”. బాహ్యకరణ నియమనము “దమము”. ఈ శమదమములు రెండును ఉన్నచో “ఆచార్యుడు” లభించును. ఆచార్యుడు లభింపగానే “తిరుమంత్రము” లభించును. తిరుమంత్రము లభింపగనే శరణాగతుడైన జీవునకు (ప్రపన్నునకు) సర్వేశ్వరుడు వశమగును. సర్వేశ్వరుడు వశము కాగానే శ్రీ వైకుంఠము” అనెడి మహానగరము హస్తగతమగును. ఇదే “పరమపదము”. మనకు ప్రాప్యమను అగు సర్వేశ్వరుని అనుగ్రహము కలుగును. ఇవన్నియు ఆత్మగుణములైన శమదమముల చేతనే సిద్ధించును. ఇవి కలిగి యుండుటయే ప్రపన్నుని లక్షణము. ప్రపన్నులు మూడు విధములుగ ఉందురు. 1. భక్తిపరవశులు 2. జ్ఞానులు 3. అజ్ఞానులు. వీరికి భగవానుడు తప్ప వేరొక ఉపాయము ఉండదు. ముగ్గురికినీ “నివృత్తి మార్గమే” ఏర్పడును. ముగ్గురికి మూడు విధములుగా నివృత్తి మార్గమేర్పడును. ఇతర విషయముల నుండి మనసు మరలుటయే “నివృత్తి మార్గము”. ప్రపన్నులకు ఈ నివృత్తి మార్గమే ఆవశ్యకము. 1. భక్తి పరవశులు” : వీరు భగవానుని దివ్యమంగళ విగ్రహమును దర్శించి, పారవశ్యము పొందెదరు. ఆ మూర్తి దర్శనమున వేరొకటి అనుభవింపతగినది లేదు అనెడి జ్ఞానము కలుగును. స్వామి యొక్క సౌందర్యము చేత వీరికి నివృత్తి మారము కలిగినది. 2. "జ్ఞానాధికులు” : వీరు తాము పరతంత్రులమని భగవానుడే తమకు ఉపాయమై ఆయన తన కృప చేత తమను తన వద్దకు చేర్చుకొనును అను జ్ఞానము కలవారై యుందురు. ఇట్లు వీరికి భగవానుని కృప చేత నివృత్తి మార్గము కలుగును. 3. "అజ్ఞానులు” : వీరు జ్ఞానము లేనివారు. వీరు తమ పెద్దల ఆచారములచూ చి, వాటినే అనుసరించుచు, తాము అనుసరింపరాని ఆచారములను వదలి సదాచారములను స్వీకరింతురు. వీరికి పెద్దల ఆచారములను గమనించుటచే నివృత్తి మార్గము కలుగును.


ఇట్లు ఈ మూడు విధముల ప్రపన్నులకును నివృత్తి మార్గము ఏర్పడును. ఈ విధముగ “ప్రపన్నులు” అనగా ఎట్టివారో, వారి లక్షణములు ఎట్టివో, వారి ఆచరణము ఎట్టిదో, వారు ఏ మార్గమున భగవానుని ఆరాధింతురో తెలుసుకొనినాము. వీరి ఆరాధనలో అనగా ప్రపత్తిలో ఇతరోపాయములలో వలె దోషములు ఏమియూ లేవు. ఇది స్వరూపోచితము. సుకరము. మనసులో భగవానుడే ఉపాయమని స్వీకరించుట చాలును. ఏమియు చేయనక్కరలేదు. . భగవంతుని పొందవలెనని ఏవేవో చేయుట కూడ భగవత్సపత్తికి విరుద్దమే. తాను ఏమి చేయుచున్నను దానిని భగవానుడే తనను పొందించుకొనుటకు తానే చేయించుకొనుచున్నాడు అని భావింపవలెను. ఇది ఆత్మస్వరూపమునకు తగినది. స్వప్రయత్నమును మాని ఉండవలయును. నీవే దిక్కు అనుటయే కర్తవ్యము. ఈ విధముగా ప్రవర్తించుటయే ప్రపన్నుల లక్షణము.