గాయక శిఖామణి - యర్రమిల్లి విజయలక్ష్మి


సూరదాసు పుట్టుకతో గుడ్డివాడు. శుద్ద అద్వైత మత ప్రవక్త వల్లభాచార్యుని శిష్యుడు సూరదాసు. సూరదాసుని కృష్ణదాసు అనేవారు. కృష్ణభక్తులలో ప్రముఖుడని భక్తిభావంతో సేవారు. సూరదాసు ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉ ండేవాడు. భౌతిక ప్రపంచపు ఆసక్తి ఉండేది కాదు. చేతిలో తంబూర, చిడతలు ధరించి కృష్ణ నామాన్ని గానం చేస్తూ తీర్థయాత్రలు చేస్తుండేవాడు.శ్రీ కృష్ణుడు, రాధాదేవి అతని మనస్సులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దృష్టి లేనందువల్ల బాహ్యానికి రాధాకృష్ణులు ఎలా ఉంటారో తెలియక పోయినా ఆయన హృదయం భక్తిభావంతో నిండి ఉండేది. సూరదాసు ఒకసారి తీర్థయాత్రకు బయలుదేరాడు. అంధుడైనందు వల్ల నడుస్తూ దారిలో ఉన్న పెద్ద దిగుడు బావిలో పడిపోయాడు. అందులోంచి బయటపడే మార్గం తెలియక "కృష్ణా... అనాథరక్షకా.. ఆపద్బాంధవా... భక్తవత్సలా గోవిందా... నువ్వే దిక్కు. నీవే రక్ష....” అని కృష్ణుని ప్రార్థించుకుంటూ ఆ బావిలోనే పది రోజులు పడివున్నాడు. అకస్మాత్తుగా ఎవరో రెండు చేతుల్తో తనను బావిలోంచి బయటకు తెచ్చి రక్షించారని గ్రహించాడు. తన ఆరాధ్యదైవం... ఆ కృష్ణపరమాత్మే తనని కాపాడాడని, తను ఆయన దర్శనాన్ని పొందలేకపోతున్నానని మనసులో వేదన చెందాడు. హఠాత్తుగా తన సమీపంలో రాధాకృష్ణుల సంభాషణ వినపడింది. కృష్ణుడు అంటున్నాడు “రాధా! నువ్వు సూరదాసు దగ్గరికి వెళ్ళకు. అతడు కాని నిన్ను పట్టుకున్నాడో మరి వదలడు ఎప్పటికీ” అన్నాడు. రాధాదేవి కృష్ణుని మాటలు వినకుండా “నేను వెళ్ళి తీరుతాను” అంటోంది. ఈ మాటలు వింటున్నాడు సూరదాసు. తనకంత సమీపంలో ఉన్నా తన దైవాన్ని అంధత్వం వల్ల దర్శించుకోలేకపోతున్నాను కదా అని పరితపిస్తున్నాడు. రాధాదేవి భక్తుడి దగ్గరగా వచ్చింది. "సూరదాసూ! నా పాదాలు మీరు పట్టుకుంటారా ఏమిటి... పట్టుకుంటే మరి వదలరంటున్నాడు పరమాత్మ” అంది దయగా. సూరదాసా మాటలకు తడబడిపోయాడు. “అదెలా సాధ్యపడుతుంది తల్లీ. నేను గుడ్డివాణ్ణి కదమ్మా!” అన్నాడు. రాధాదేవి ఆయన వెనుకగా వెళ్ళి తన పాదాలతో ఆయన్ని తాకింది. “ రాధా! అటు వెళ్ళకు. ఆయన తన వెనకకు చేతులు చాపి నిన్ను పట్టేసుకోగలడు జాగ్రత్త” అన్న ఆ చిలిపి మాటల ఆంతర్యం సూరదాసుకి అర్థమైంది. అదా సంగతి. అయితే రాధమ్మ నా వెనకే ఉందన్నమాట అనుకున్న వెంటనే సూరదాసు వెనక్కి తిరిగి రాధాదేవి పాదాలను పట్టుకున్నాడు. రాధ చప్పున తప్పించుకుంది. కాని ఆమె కాలి అందెలు సూరదాసు చేతికి చిక్కాయి. రాధాదేవినా కాలిగజ్జెలునాకిచ్చెయ్యి. నేను గోపికలతో నాట్యం చెయ్యాలి అన్నది. సూరదాసు తన్మయత్వంతో గజ్జలు భక్తిగా కళ్ళకద్దుకుని “అమ్మా ఈ గజ్జెలు మీవా. అయితే నేను అంధుణ్ణి కదా తల్లీ. నాకెలా తెలుస్తుంది. నేను మిమ్మల్ని చూ డగల్గినప్పుడే ఇవి మీవి అని చెప్పటం సాధ్యపడుతుంది" అన్నాడు. మరుక్షణమే సూరదాసు అంధత్వం పోయి దృష్టి వచ్చింది. తన ఎదుట తన ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ రాధా సమేతుడై నిలిచి ఉండటచూ చి పరమానందభరితుడయ్యాడు. “నా జన్మ ధన్యమైంది. కరుణించి దర్శనమిచ్చావా కృష్ణా” అని పరిపరి విధాల భక్తి పారవశ్యంతో స్తుతించాడు.


సూరదాసు భక్తికి మెచ్చి ఏదన్నా వరం కోరుకోమన్నాడశ్రీ కృష్ణుడు. “వద్దు స్వామీ! మీరు ఇవ్వలేరు” అన్నాడు సూరదాసు. “భగవంతుడు ప్రత్యక్షమయ్యాడంటే తన భక్తుడికి ఏదో ఒక వరాన్ని ఇచ్చే తీరతాడు. ఇవ్వలేనిదంటూ ఏమీలేదు నాకు. నువ్వు ఏది కోరినా తప్పక నెరవేరుస్తానని మాట ఇస్తున్నా”నన్నాడుశ్రీ కృష్ణుడు. దానికి సూరదాసు వినమ్రంగా భక్తిభావంతో “స్వామీ ఇన్నాళ్ళకు నాకు మీ దర్శనభాగ్యం లభించింది. మీ దివ్యమంగళ రూపాలను దర్శించిన ఈ నేత్రాలతో ఇక ప్రపంచంలోని మరే దృశ్యాన్ని డలేను. కాబట్టి నన్ను తిరిగి అంధుడుగా చేయండి” అని కోరాడు. సూరదాసు భక్తి తీవ్రతకు కృష్ణుడు చలించిపోయాడు. రాధాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. అతని కోరిక తీర్చి వారు అదృశ్యమైపోయారు. సూరదాసు మళ్ళీ అంధుడైపోయాడు. ఇప్పుడతనికి బాహ్యంలోనూ అంతరంగంలోనూ రాధాకృష్ణుల దివ్యదర్శనమే. ఆయన ప్రపంచమంతా కేవలం రాధాకృష్ణ మయమైపోయింది. క్రమంగా ఆ భక్త శిఖామణి ప్రపంచానికి పరిచయమయ్యాడు. మధురకి సమీపంలోని గోగలో నివసిస్తూ ప్రజ భాష (హిందీ మాండలికంలో) ఆయన ఆశువుగా ఆలపించే కృష్ణ మధుర భక్తి గీతాలకు ఆకర్షితులై ఎందరెందరో ఆయనను దర్శించుకోవాలని వచ్చేవారు. దేశమంతా తీర్థయాత్రలు చేస్తూ మధురభక్తి మార్గాన్ని ప్రబోధిస్తూ నిరంతరం భక్తితత్పరుడై జీవిస్తున్న సూరదాసుకి క్రమంగా అనేకమంది భక్తశిష్యులు ఏర్పడ్డారు. చివరకు గోపాలపురంలోని శ్రీ నాథ దేవాలయంలో ఆలయ గాయకుడుగా జీవయాత్ర సాగించాడు. వేల సంఖ్యలో సూరదాసు ఆలపించిన భక్తి గీతాలు ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. కరుణ, భక్తి, వీరం, శాంతం, శృంగార రసాలతో కూడిన కీర్తనలు వేల సంఖ్యలో ఉన్న గ్రంథం 'సూరసాగర్'గా ప్రసిద్ధికెక్కింది. ఈ గీత రచనకు సూరదాసు 79 రాగాలను ప్రయోగించి ద్రుపద బాణీ అనే శైలితో సమకూర్చాడు. సూరదాస్ కీర్తనలు భక్తులు పాడుకుంటూ ఉంటారు. సుప్రసిద్ధ కృష్ణ భక్తుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన భక్త గాయక శిఖామణి సూరదాసు 1568లోశ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందాడు.