గత సంచిక తరువాయి
ప్రజలు ఆ నగరంలో బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులు. దైవీగుణ సంపన్నులు. వేదవేదాంగ పారంగతులు. స్వకర్మ నిరతులు. జితేంద్రియులు. మహర్షి సమానులు. సుఖశాంతులతో జీవించే ధర్మాత్ములు. సత్యవాదులు. సంపాదించిన దానితో తృప్తి పడేవారు. ఏమాత్రం లోభగుణం లేనివారు. అన్ని కులాలవారు సాధుస్వభావులు. ఏ ఇంటిలోచూ సినా పదిమందికి తక్కువ కాని కుటుంబాలు. ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నవారే. నగరవాసులందరూ సంపన్నులే. చదువురానివారు కాని, నాస్తికుడు కాని, అసత్యవాది కాని ఎంత వెదికినా కానరారు. స్త్రీ పురుషులు ఇద్దరూ ధర్మశీలురు. సదాచారులు. నిర్మల హృదయులు. అందరూ ఆభరణాలు, తలపాగాలు ధరిస్తారు. అభ్యంగనస్నానం చేయనివాడు, చందనాది మైపూతలు పూసుకోనివాడు, నుదుట బొట్టు లేనివాడు ఒక్కడు కనిపించడు. అడిగినవానికి లేదనకుండా దానాలు చేస్తారు. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉంటారు.
అందరూ సౌభాగ్యవంతులు. సౌందర్యవంతులు. ఒక్క కాముకుడు కాని ఒక్క లోభి కాని కనిపించరు. అగ్నికార్యం చేయనివాడు, యజ్ఞం చేయనివాడు, క్షుద్రుడు, దొంగ ఒక్కడూ కనపడరు. అశక్తులు, అసూయాపరులు, వ్రతాచారణ హీనులు, రోగపీడితులు ఒక్కరూ ఉండరు. అందరూ వర్ణాశ్రమధర్మనిరతులు. బ్రాహ్మణులనుంచి శూద్రుల దాకా అందరూ దేవతల్ని అతిథుల్ని పూజించేవాళ్ళే. కృతజ్ఞులు, వదాన్యులు, శూరులు, పరాక్రమవంతులు, సత్యధర్మ పరాయణులు, దీర్ఘాయుష్మంతులు. కళత్ర పుత్ర పౌత్రాదులతో వర్థిల్లేవారు. వర్ణసంకరం అన్న ప్రసక్తి అయోధ్యలో కానరాదు. అక్కడి క్షత్రియులందరూ మహాయోధులు. శస్తాస విద్యా కోవిదులు. శబ్దభేది విద్యానిపుణులు. పరాక్రమంలో అగ్నిలాంటి వారు, అడవిలో సింహాల్ని, పులుల్ని, పందుల్ని వేటాడుతూ ఉంటారు. ఒంటరిగా ఉన్నవారిని, వెచ్నూ పి పారిపోయేవారిని చంపరు. వేలాది మహాయోధులతో, మహారథులతో అయోధ్యానగరం శోభిల్లుతోంది. ఈ అయోధ్యలో వివిధ దేశాల్లోని గొప్ప గుర్రాలున్నాయి. ఏ గుర్రాఘా సినా ఉచ్ఛెశ్రవంలా కనిపించేది. వింధ్య పర్వత ప్రాంతాల్లో పుట్టిన మదపుటేనుగులూ, హిమాలయాల్లోని ఏనుగులూ ఐరావత జాతి ఏనుగులు తండోపతండాలుగా ఉన్నాయి. ఏనుగులు, గుర్రాలే కాదు ఒంటెలు, ఎద్దులు, కంచరగాడిదలు మందల కొద్దీ ఉన్నాయి. మహారాజు దశరథుడు వేదార్థాలు బాగా తెల్సినవాడు. పురజనులకు, గ్రామవాసులకు ప్రియమైనవాడు. ఇంద్రునితో, కుబేరునితో సమానుడు. ఇక్ష్వాకు వంశంలో అతిరథునిగా ప్రసిద్ది పొందినవాడు. ఇతరులకు జయింపశక్యం కాని సార్థక నామధేయంకల అయోధ్యను పాలిస్తున్నాడు. ఆ మహాతేజశ్శాలి రాజశిరోమణి చుక్కల్లో చంద్రునిలా దేవేంద్రునితో సమానుడై విరాజిల్లుతున్నాడు. ఆ ఆ మహారాజుకు ఇద్దరు పురోహితులు. ఎనిమిదిమంది మంత్రులు. రాజ్య (పుర) హితం కాంక్షించేవారు పురోహితులు. రాబోయే పరిణామాలను ముందుగా ఊహిస్తారు. దానికి తగిన చర్యలు తీసుకునే మేధావంతులు. ఆ పురోహితుల్లో ప్రధానుడు వసిష్ఠుడు. అతడు కులగురువు కూడా. రెండో పురోహితుడు వామదేవుడు. మంత్రులందరూ నిస్వార్థపరులు. నీతికి నిజాయితీకి పెట్టింది పేరు. పక్షపాత రహితులు. రాజనీతిజ్ఞులు. కోశాగారం నింపటానికి యోగ్యులను నియమించేవారు. అపరాధులను శిక్షించటంలో నీ నా భేదం పాటించరు. గూఢచారి వ్యవస్థని సక్రమంగా నిర్వర్తించేవారు. మంత్రాలోచనలు రహస్యంగా జరుపుతారు. తీర్మానాలన్నీ ఏకగ్రీవంగా ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే మంత్రులందరూ సౌశీల్యవంతులు. సౌజన్యవంతులు. సద్గుణవంతులు. ప్రభుభక్తి పరాయణులు. కార్యదీక్షాదక్షులు.ఆ ఎనిమిది మంది మంత్రులలో సుమంత్రుడు సుప్రసిద్ధుడు. అతడు అమాత్యుడే కాదు దశరథునికి రథసారథి కూడా.
సంకల్పం
ఎంతటి ప్రతిభావంతుడు, ధర్మాత్ముడు అయినా దశరథునిలో తీరని లోటు. వంశోద్దారకుడు లేడని పరితాపం. ఒకరోజు ఉన్నట్టుండి ఒక తలంపు. సంతాన ప్రాప్తికి అశ్వమేధ యాగం చేయవచ్చు. ఆ ఆలోచనకి రూపం కల్పించాడు. సుమంత్రుణ్ణి పిలిచాడు. మంత్రులు, బ్రాహ్మణులు, పురోహితులు రావాలి. సభ ఏర్పాటు చెయ్యి అని ఆదేశించాడు. అందరూ వచ్చారు. విషయం తెల్సుకున్నారు. యాగానికి అంగీకారముద్ర వేశారు. యజ్ఞసామగ్రి తెప్పించండి. యాగాశ్వం విడిచిపెట్టండి. యజ్ఞం చేయించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. అది బ్రాహ్మణ ఆశీర్వాదం. అవి అతనికి అమృత వాక్కులు అనిపించాయి. యజ్ఞద్రవ్యాలు సేకరించండని సచివులను ఆజ్ఞాపించాడు మహారాజు. తన అంతఃపురం చేరాడు. కౌసల్యాదులను పిలిచాడు. పుత్రప్రాప్తికి యజ్ఞం తలపెట్టానన్నాడు. మంచు తొలగిన తర్వాత పద్మాలు వికసిస్తాయి. అలా ఆ రాణుల ముఖాలు సంతోషంతో కమలాల్లా శోభిల్లాయి.
రోమపాదుడు
అది దశరథుని ఏకాంతమందిరం. వెళ్ళాడు సుమంత్రుడు. ఋష్యశృంగునితో యాగం చేయించు. అతడు అంగరాజు రోమపాదుని ఇంట ఉన్నాడు అని సలహా ఇచ్చాడు. సమ్మతించాడు మహారాజు. అంగరాజ్యాధిపతి రోమపాదుడు. ఒకనాడు అతను ధర్మాన్ని తప్పాడు. తీవ్ర అనావృష్టి కరువు ఏర్పడింది. ప్రజల అగచాట్లకు అంతులేదు. ఈ గడ్డుపరిస్థితి ఎలా దాటాలి - పరిష్కారం సూచించాలని వేదపండితులను ప్రార్థించాడు రోమపాదుడు. విభాండక మహర్షి పుత్రుడు ఋష్యశృంగుడు. బ్రహ్మచారి. ఆ ముని కుమారుడు అడుగిడిన నేల మీద వర్షం పడుతుంది. దాంతో పంటలు పండుతాయి. దేశం సుభిక్షమవుతుంది. ప్రజలకు శాంతి సుఖాలు లభిస్తాయి. కనుక ఆ బ్రహ్మచారిని రప్పించండి - అది బ్రాహ్మణుల ఉపదేశం. విన్నాడు రోమపాదుడు. కులగురువుతో ఆలోచించాడు. అమాత్యుల అభిప్రాయం అడిగాడు. “విభాండకుడు మహా తపశ్శాలి. అతని పుత్రుడు ఇక్కడకు రావాలి. అది ఆ మహర్షికి తెలియరాదు. తెలిసినా శపించరాదు. అందుకు గణికలను పంపితే చాలు. ఏదో ఉపాయం పన్నుతారు. ముని కుమారుణ్ణి తీసుకురాగలరు” - అది మంత్రుల సూచన. నచ్చింది రాజుకి. వెంటనే వేశ్యలు పంపబడ్డారు. ఆశ్రమానికి కొద్ది దూరంలో వాళ్ళు మకాం వేశారు. ఋష్యశృంగుడు తండ్రి చాటు బిడ్డడు. అతనికి వేదాలు తెల్సు. వేదాంగాలు తెల్సు. యజ్ఞయాగాది కార్యాచరణ తెల్సు. అగ్నికార్యం తెల్సు. అడవిలో రకరకాల పూలు తెల్సు. పండ్లు తెల్సు. అడవి వెలుపల ఏముందో తెలియదు. గ్రామాలు నగరాడు డలేదు. స్త్రీలు ఎలా ఉంటారు. డలేదు. ఆశ్రమం పూలు చెట్లు అగ్నికార్యం అతని సర్వస్వం. .
ఆ బ్రహ్మచర్య వ్రతనిష్ఠుని ఎలా కలవాలా అని గణికల ఆలోచన. రోజులు గడుస్తున్నాయి. ఆరోజు దైవవశాత్తు మునిపుత్రుడు ఆశ్రమం దాటి వచ్చాడమూ శాడు వాళ్ళని. చక్కని చుక్కలు. చిత్రవిచిత్ర వేషాల్లో ఉన్నారు. వాళ్ళంతా తనలాంటి పురుషులని భావించాడు. అతనిని దగ్గరకి తీసుకున్నారు వారు. కమ్మగా పాడారు. చక్కగా ఆడారు. తియ్యగా పలికారు. వాళ్ళని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అర్ఘ్య పాద్యాదులర్పించాడు. కందమూలాలు పండ్లు ఇచ్చాడు. తిన్నారు వారు. కౌగలించుకున్నారు. ఆనందింపచేశారు. తమ దగ్గరున్నమూట విప్పారు. తినుబండారాలు రూ పించారు. విభాండక మహరి వస్తాడేమోనని భయపడ్డారు. వెళ్ళిపోయారు. ఋష్యశృంగునిలో ఏదో దిగులు. వ్యాకులపాటు. తెలియని ఆరాటం. ఆ రాత్రి ఎలాగో గడిచింది. తెల్లవారింది. వారాంగనలున్న చోటికి వెళ్ళాడు. మా ఆశ్రమానికి వెడదాం పదా అన్నారు. మంత్రముగ్ధుడయ్యాడు. అనుసరించాడువారిని. అంగరాజ్యం పొలిమేరల్లోకి ప్రవేశించారు. ఆ బ్రహ్మచారి పాదస్పర్శతో వర్షం కురిసింది. స్వాగతం పలికాడురోమపాదుడు.అర్ఘ్యపాద్యాలర్పించాడు. అంతఃపురానికి తీసుకెళ్ళాడు. సత్కరించాడు. కొద్దిరోజులు గడిచాయి. దేశంలో దుర్భిక్షం పోయింది. ఈతిబాధలు తొలిగాయి. ప్రజలు హాయిగా సంతోషంగా ఉన్నారు. ఒక శు భముహూర్తాన రోమపాదుడు తన కూతురు శాంతనిచ్చి ఋష్యశృంగునికి వివాహం జరిపించాడు. కౌసల్యా దశరథుల కుమార్తె శాంత. రోమపాదుడు దత్తత తీసుకున్నాడామెని.
అయోధ్యకు రాక
కులగురువు వసిష్ఠుని అనుమతి తీసుకున్నాడు దశరథుడు. అంగరాజ్యానికి మంత్రులతో పరివారంతో బయల్దేరాడు. వనాలు నదులు దాటాడు. అంగదేశం చేరాడు. రోమపాదుడు సంతోషించాడు. స్వాగతం పలికాడు దశరథునికి. హెూమకుండంలో జ్వలించే అగ్నిహెత్రునిలా ఉ న్నాడు ఋష్యశృంగుడు. అతణ్ణి దశరథునికి పరిచయం చేశాడు. అతడు మహారాజుని సత్కరించాడు. ఏడు రోజులు గడిచాయి. దశరథుడు తన మనసులోని మాట చెప్పాడు. నీ కూతురిని అల్లుణ్ణి నాతో పంపించు. నా మనోరథం నెరవేరేటట్లూ డు అన్నాడు రోమపాదునితో. అతడు అంగీకరించాడు. శాంతా ఋష్యశృంగులతో బయల్దేరాడు దశరథుడు. అయోధ్యావాసులు స్వాగతం పలికారు. శంఖ దుందుభులు మ్రోగుతున్నాయి. శాస్త్ర పద్దతిలో ఋష్యశృంగుణ్ణి సమ్మానించాడు మహారాజు. అది వసంత ఋతువు. ఋష్యశృంగుని సమీపించాడు దశరథుడు. మహాత్మా రఘువంశం పుత్ర పౌత్రులతో వర్ధిల్లాలి. అందుకు నాచేత అశ్వమేధ యాగం చేయించాలి. ప్రధాన ఋత్విక్కుగా తమరే ఉండాలి. అది మహారాజు ప్రార్థన. అంగీకారం తెల్పాడు ఋష్యశృంగుడు. యాగాశ్వం వదలబడింది. సరయూనది ఉత్తర తీరంలో యాగభూమి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాజుల కోసం భవనాలు, వేదవేత్తలకు గృహాలు - పురజనులకు, జానపదులకు వసతి సౌకర్యాలు - వివిధ దేశాధీశులు సామంతులు ఆహ్వానింపబడ్డారు. యాగశాలలో వస్తుసామగ్రి చేర్చబడింది. గిర్రున సంవత్సరం తిరిగింది. యాగాశ్వం వచ్చేసింది.
యాగం
యూపస్తంభాలు మొత్తం ఇరవై ఒక్కటి. వాటిని పాతారు. చక్కగా అలంకరించారు. దశరథుడు కూర్చున్న అగ్నివేది గరుడపక్షి ఆకారంలో నిర్మించారు. పశువులు పాములు పక్షులు జలచరాలు మొత్తం మూడు వందలు యూపస్తంభాలకు కట్టారు. యాగాశ్వం కూడా ఒక స్తంభానికి కట్టివేయబడింది. దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చారు. యాగాశ్వానికి ప్రదక్షిణలు చేశారు. కౌసల్య చేతికి మూడు బంగారు సూదులు ఇచ్చారు. వాటిని తీసుకుందామె. గుర్రానికి మూడు చోట్ల గుచ్చింది. ఆ రాత్రి ఆమె అక్కడే గడిపింది. మరుసటి రోజు జితేంద్రియుడైన ఋత్విక్కు వచ్చాడు. గుర్రం కడుపులోని 'వప'ను తీశాడు. అగ్నిహోత్రంలో వేశాడు. బాగా కాల్చాడు. కాలుతున్నప్పుడు వచ్చే పొగను వాసనచూ శాడు దశరథుడు. తక్కిన గుర్రం అవయవాలను సమం చేశారు. సోమలతను తెచ్చారు. కల్వంలో వేశారు. దంచారు. రసం తీశారు. పదారుమంది ఋత్విక్కులు హోమద్రవ్యాల్ని తెచ్చారు. ప్రబ్బలి ఆకులపై ఉంచారు. సోమరసం పోశారు. అన్నీ కలిపి అగ్నిలో వేల్చారు. యూపస్తంభాలకు కట్టినవన్నీ అగ్నికుండంలో మంత్రయుక్తంగా వేశారు. అలా అశ్వమేధయాగం మూడు రోజులు జరిగింది. నాలుగు దిక్కుల్లోని తన రాజ్యాన్ని నలుగురు ఋత్విక్కులకు దశరథుడు దానమిచ్చాడు. “రాజా! మాకు రాజ్యమెందుకు? వేదాధ్యయనపరులం అన్నారు. మంత్రపూర్వకంగా మరల ఆ రాజ్యాన్ని మహారాజుకి ఇచ్చేశారు. అందుకు బదులుగా వేదపారంగతులకు పదిలక్షల ఆవులిచ్చాడు. నూరుకోట్ల బంగారం ఇచ్చాడు. నాలుగు వందల కోట్ల వెండి సమర్పించాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు కోటి బంగారం ఇచ్చాడు. ఒక పేద బ్రాహ్మణుడు వచ్చేసరికి దశరథుడి దగ్గర ఏమీలేదు. అపుడా బ్రాహ్మణునికి తన ముంచేతి కడియం ఇచ్చాడు. అలాగే వివిధ దేశాల రాజులను సామంతులను సత్కరించాడు. అక్కడితో అశ్వమేధ యాగం ముగిసింది.
యాగం జరుగుతున్న రోజుల్లో అన్నదానానికి కొరత లేదు. అందరికీ మృష్టాన్నభోజనమే. ఆకలితో బాధపడ్డవాడు ఒక్కడు లేడు. తాపసులు సన్యాసులు వృద్దులు రోగులు స్త్రీలు బాల బాలికలు అన్ని వర్ణాలవారు వస్తున్నారు. కడుపారా తింటున్నారు. సంతోషంతో వెడుతున్నారు. ఒకవైపు అన్నదానం మరోవైపు వస్త్రదానం విరామం లేకుండా సాగుతూనే ఉంది. అది సామాన్యులెవ్వరూ చేయలేని యాగం. అది దుష్కరం. అసాధ్యం. దశరథుడు ఒక్కడే ఆచరించాడు. పుత్రప్రాప్తికి ప్రతిబంధకం తొలగిపోయింది. కొడుకు పుట్టాలన్న కోరిక తెలియచెప్పాడు ఋష్యశృంగునికి. ఒక్కడు కాదు నలుగురు కొడుకులు పుడతారు - అది ఆతని ఆశీర్వాదం.
పుత్రకామేష్టి ,
ఇష్టి ప్రారంభమైంది. వేదమంత్రాలు పఠింపబడుతున్నాయి. అగ్నికి ఆహుతులు సమర్పింపబడుతున్నాయి. బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్పులు వచ్చారు. తమ తమ హవిర్భాగాలు స్వీకరించాలి. అందుకు ఇంకా సమయం ఉంది. అపుడు దేవతలు బ్రహ్మదేవునితో అంటున్నారు. ఇలా. దేవా రావణునికి వరాలు ఇచ్చావు. ఆ వరగర్వంతో వాడు ముల్లోకాలు బాధిస్తున్నాడు. దిక్పాలకుల్ని హింసిస్తున్నాడు. ఇంద్రుణ్ణి పదవీభ్రష్ఠుణ్ణి చేయాలనిచూ స్తున్నాడు. వాణ్ణి ఎదిరించటం మాకు అశక్యం. ఋషుల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తున్నాడు. రావణునికి భయపడి సూర్యుడు తన వేడిని తగ్గించుకుంటున్నాడు. వాయువూ అంతే. తీవ్రంగా వీచటం లేదు. సముద్రుడూ అంతే. అలలతో చలించటం లేదు. వాడికి మేం గడగడలాడిపోతున్నాం. ఆ భయంకరుణ్ణి హతమార్చే ఉపాయం చెప్పండి. విన్నాడు బ్రహ్మదేవుడు. ఆలోచించాడు. గంధర్వ, యక్ష, దేవ, దానవ రాక్షసులతో చావు లేకుండా కోరాడు. అలాగే అన్నాను నేను. మానవులంటే చులకన. లెక్కలేదు వాడికి. కనుక మానవుడి చేతిలోనే మరణం. ఆ మాటతో సంతోషించారు. దేవతలు. అంతలో ఏతస్మిన్ అంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖ చక్ర గదాపాణిః పీతవాసా జగత్పతి: శంఖ చక్ర గదాధారి, పీతాంబరధారి విష్ణువు, జగన్నాథుడు దివ్యతేజస్సుతో వచ్చాడు. విశేషం ఏమిటంటే పిలవకపోయినా తనకు తానుగా రావటం. వెంటనే స్తుతించారు దేవతలు. ప్రభూ రావణుణ్ణి చంపండి. మా బాధలు తీర్చండి. మా కన్నీళ్ళు తుడవండి. శరణాగతులం. నీవే మా దిక్కు. నీవే మాకు రక్ష - అది దేవతల ప్రార్థన. తమరు నరజన్మ ఎత్తాలన్నారు - అది కొసమెరుపు.
విన్నాడు నారాయణుడు.
మానవుడిగా పుడతాను. సబాంధవంగా రావణుని సంహరిస్తాను - అది ఆ స్వామి అభయం. నాలుగు రూపాల్లో దశరథునికి పుత్రులుగా జన్మించాలని సంకల్పించాడు. . అంతర్థానమయ్యాడు. హోమద్రవ్యాలు అగ్నిదేవునికి సమర్పిస్తున్నాడు ఋష్యశృంగుడు. పుత్రకామేష్టి పూర్తి కావచ్చింది. అది యజ్ఞకుండం. అందులోనుంచి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు అమిత తేజోవంతుడు. మహావీర్యవంతుడు. మహాబలవంతుడు. నల్లని రూపం, ఎర్రటి ముఖం. ఎర్రటి వస్త్రాలు ధరించాడు. ఒంటినిండా రోమాలు. పెద్ద పెద్ద మీసాలు, సింహళూ లులా మెత్తని వెంట్రుకలు, దివ్యాభరణ భూషితుడు. కొండంత ఎత్తున్నాడు. మధ్యాహ్నపు సూర్యునిలా ప్రజ్వరిల్లుతున్నాడు. బంగారు పాత్ర దానికొక వెండిమూత - ప్రియభార్యని కౌగలించుకున్నట్లు ఆ పాత్రని రెండు చేతులతో పట్టుకున్నాడు. 'రాజా' పిలిచాడు దశరథుణ్ణి. ఆ కంఠస్వరం దుందుభిలా శబ్దించింది. దేవతలు నీ యజ్ఞాలు మెచ్చారు. ఇదో పాయసం. ఇది దివ్యం. సంపత్కరం. ఆరోగ్య వర్ధనం. సంతానప్రదాయిని - నీ ప్రియపత్నులకి ఇవ్వు. పుత్రులు పుడతారు. ఈ మహారాజు అందుకున్నాడు ఆ పాత్రని. పరమానంద భరితుడైనాడు. ఆ తేజశ్శాలికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించాడు. వెంటనే ఆతడు అంతర్థానమైనాడు. నిర్జనుడికి ఒక నిధి దొరికినంతగా సంతోషించాడు దశరథుడు. శరత్కాలంలో చంద్రకిరణాలతో ప్రకాశించే ఆకారంలా ఉన్నాయి అంతఃపురాంగనల ముఖాలు. దశరథుడు అంతఃపురం చేరాడు. పాయసంలో సగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో సగం సుమిత్రకి ఇచ్చాడు. మిగిలిన భాగంలో సగం కైకేయికి ఇచ్చాడు. ఇంకా మిగిలిన దాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. వారి వారి భాగాలు వారు స్వీకరించారు. తాగారు. అగ్నిలా సూర్యునిలా తేజోమూర్తులైనారు. అచిర కాలంలో గర్భవతులైనారు. ఇంద్రాది దేవతలతో సిద్దులతో ఋషిగణాలతో పూజింపబడే విష్ణువులా విరాజిల్లుతున్నాడు దశరథుడు.
(సశేషం)