(16-07-2020) కామికా ఏకాదశి - డా|| మరుదాడు అహల్యాదేవి


“హే భగవానుడా! కమలనాభా! శ్రావణమాసంలోని కృష్ణపక్ష ఏకాదశికి ఏమని పేరు? ఆ రోజు ఏ దేవతని పూజించాలి? దానివల్ల కలిగే పుణ్యమేమిటి?" బ్రహ్మనారదునితో ఇలా చెప్పాడు. , "నారదా! లోక హితాన్నాశించి నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను. శ్రావణమాసం కృష్ణపక్షంలోని ఏకాదశికి 'కామికా ఏకాదశి' అని పేరు. దానిని స్మరించినంతనే వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. ఆరోజశ్రీ ధర, హరి, విష్ణు, మాధవ, మధుసూదనుడు మొదలైన నామాలతో విష్ణువును పూజించాలి. ఆరోజు చేసిన శ్రీ కృష్ణుని పూజా ఫలితం గంగా, కాశీ, నైమిశారణ్యం, పుష్కర క్షేత్రాల్లో లభించే పుణ్యంతో సమానమైంది. సింహరాశిలో బృహస్పతి ఉండగా వ్యతీపాత, దండ యోగాలలో గోదావరీ నదీ స్నానం చేసిన పుణ్యం విష్ణుపూజ చేయడం వల్ల వస్తుంది. సముద్రం, వనంతో కూడిన భూమిని దానం చేసినవారూ, కామికా ఏకాదశి వ్రతం చేసినవారూ, వీరిద్దరూ సమానమైన ఫలానికి భాగస్వాములుగా భావించడం జరిగింది. ఎవరైతే ఆవుతో పాటుగా అనన్యమైన వస్తువుల్ని దానం చేస్తారో, వారికి ఏ పుణ్యం లభిస్తుందో, అదే పుణ్యం ఈ వ్రతం చేసినవారికి ప్రాప్తిస్తుంది. శ్రావణమాసంలో విష్ణుపూజ చేస్తే ఆ పూజ గంధర్వులు, నాగసహిత సమస్త దేవతలను పూజించినట్లవుతుంది. ఆధ్యాత్మ విద్యా పరాయణులైన పురుషులు ఎటువంటి ఫలాన్ని పొందుతారో దానికన్నా అధిక ఫలం ఈ వ్రతం వల్ల కలుగుతుంది. ఈ రోజు జాగారం చేస్తే యమదూతల దర్శనం జరగదు. అంతేకాదు, వారెప్పుడూ అధోగతి పాలవరు. కెంపులు, ముత్యం, వైఢూర్యం, పగడాలు మొదలైన వాటితో పూజిస్తే భగవానుడు తులసీదళంతో పూజించిన దానికన్నా ఎక్కువగా సంతోషపడతాడు. ఎవరు తులసీదళాలతో విష్ణువును పూజిస్తారో వారికి జన్మ జన్మల పాపం నశిస్తుంది. ఎవరైతే ఏకాదశి రోజు దీపదానం చేస్తారో వారి పుణ్యాన్ని చిత్రగుప్తుడు కూడా లెక్కపెట్టలేడు. ఎవరు ఏకాదశి రోజు శ్రీ కృష్ణుని ముందు దీపం వెలిగిస్తారో వాని పితరులు స్వర్గలోకంలో ఉండి అమృతపానంతో తృప్తి చెందుతారు. నెయ్యి, నువ్వుల నూనెతో భగవంతుని ముందర దీపం వెలిగించినవారు కోట్ల దీపాలతో స్వర్గలోకానికి చేరతారు. శ్రీ కృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఇంకా ఈ విధంగా చెప్పాడు. యుధిష్ఠిరా! నేను కామికా ఏకాదశి వర్ణన చేశాను. ఇది అన్ని పాపాలను పోగొట్టి స్వర్గలోకం ప్రాప్తింపచేస్తుంది. కనుక తప్పక ఈ వ్రతం చేయాలి. ఈ వ్రత మాహాత్మ్యాన్ని చదివినా, విన్నా, పాపాలు తొలగిపోయి విష్ణులోకాన్ని చేరుకుంటారు అని కామికా ఏకాదశి గురించి బోధించాడు కృష్ణుడు.