తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి | కైంకర్యాలు


తిరుమల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీవేంకటేశ్వరస్వామివారు కలియుగానికి అధిపతిగా (కలౌ వేంకటనాయకః), సమస్త మానవాళికి అభయప్రదాతగా, ఆర్తిగా ప్రార్థించే భక్తులందరినీ అనుగ్రహిస్తూ, వేంకటాద్రి శిఖరం మీద కొలువై ఉన్నాడు. శ్రీవారి దివ్యమైన సన్నిధి, అనేక విలువైన సంపదలతో, వెలకట్టలేని అపురూపమైన ఆభరణాలతోను, అనంతమైన ధనసంపత్తి కలిగి, సమస్త పుణ్యక్షేత్రాలకు తలమానికంగా నిలిచి ఉన్నది. తిరుమల ఆలయం, సంవత్సరం పొడవునా జరిగే అనేక విశేషమైన ఉత్సవాలకు ప్రసిద్ధి గాంచినది.


శ్రీవారి ఆలయంలో అనాదికాలం నుండి, శ్రీమహావిష్ణువు అంశతో అవతరించిన భగవాన్ విఖానస మహర్షి ప్రవచించిన శ్రీవైఖానస భగవచ్ఛాస్త్ర విధిగా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవములన్నీ అంగరంగ వైభవంగా జరుపబడుతూ ఉన్నవి. శ్రీ శ్రీనివాసస్వామి వారికి మొట్ట మొదటిసారిగా కైంకర్యములు నిర్వహించిన మహనీయుడైన యోగిపుంగవుడు శ్రీవైఖానస అర్చకుడైన శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు. శ్రీవారి మూలవిరాట్ అర్చారూపాన్ని స్వామి పుష్కరిణీ తీరంలో, చింతచెట్టు క్రింది చీమలపుట్టలలో శ్రీ దీక్షితుల వారిచే కనుగొనబడి ప్రస్తుతమున్న చోటనే ప్రతిష్ఠించబడింది. శ్రీ వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణం (4, 19-21),


ఈ చీమల పుట్ట, చింతచెట్టు, స్వామి పుష్కరిణి మరియు తిరుమల కొండను గురించిన నిగూఢమైన విషయాన్ని అద్భుతంగా వివరించింది. వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోకథ తింత్రిణీ | బలభద్రః శేషశైలో మధురాభూదధిత్యకా || స్వామిపుష్కరిణీ తత్ర యమునా చ వ్యరాజత | యాదవశ్చ మృగాః సర్వే ఖగా వై గోపికాదయః | ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడతే వేంకటాచలే || - ద్వాపరయుగంలోని శ్రీకృష్ణ పరమాత్మే తిరిగి తిరుమల కొండమీద శ్రీనివాసుడిగా అవతరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ తల్లి దేవకి చీమలపుట్టగానూ, తండ్రియైన వసుదేవుడు చింతచెట్టు రూపంలో అవతరించి, శ్రీవారిని పుత్రవాత్సల్యంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అన్నగారైన బలరాముడు (ఆదిశేషుని అవతారం) శేషాద్రి శిఖరరూపంలోను, యమునానది స్వామిపుష్కరిణి గాను మరియు వీటిని ఆవరించియున్న భూమి మధురానగరంగాను వర్ణించబడింది. బాలకృషునితో ఆటలాడే గోపబాలురు, తిరుమల కొండమీద మృగాల రూపంలోను మరియు పక్షులన్నీ గోపబాలికలుగా, శ్రీకృష్ణునితో తమ సాన్నిహిత్యాన్ని తిరిగి కొనసాగిస్తూ, భక్తిపారవశ్యంతో స్వామిసేవలో తరిస్తున్నారు. ఎంత చక్కటి వర్ణనో చూడండి.


శ్రీవారి కైంకర్యపరులు - సంప్రదాయాలు, శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు : శ్రీవారి ఆలయానికి ప్రథమ అర్చకులు శ్రీమాన్ గోపీనాథ దీక్షితులవారు. వీరు వైఖానస తపస్సంపన్నులు. నేటికీ శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారి వంశీయులే శ్రీవారికి వైఖానసాగమాక్తంగా సమస్త పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రస్తుతం వీరి వంశంలో 39వ తరం వారు శ్రీవారికి వైభవంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి స్వయంవ్యక్త సాలగ్రామ అర్చామూర్తి, మూలవర్లను తాకి కైంకర్యాలను నిర్వహించే మహద్భాగ్యం, శ్రీ వైఖానస అర్చకులకు మాత్రమే శ్రీవారు అనుగ్రహించి యున్నారు. వీరి వంశంలో మరొక మహనీయుడు 10వ శతాబ్దానికి చెందిన శ్రీమాన్ శ్రీనివాస దీక్షితులవారు. వీరు చేసే కైంకర్యాలను సాక్షాత్తు శ్రీవారే స్వయంగా, ప్రత్యక్షంగా స్వీకరించేవారని, అర్చక వంశీయుల చరిత్ర ద్వారా తెలుస్తున్నది. భగవద్రామానుజులవారు శ్రీవారి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన, గొప్ప శ్రీవైష్ణవ ఆచార్యులు, శ్రీ రామానుజాచార్యులవారిచే ఏర్పాటు చేయబడిన ఏకాంగి వ్యవస్థ నేడు పెద్ద జియ్యంగార్ స్వామి, చిన్న జియ్యంగార్ స్వామి, ఏకాంగి వ్యవస్థగా నిర్వహించబడుతున్నది.


నేటికీ ఆలయం సంప్రదాయం మేరకు ప్రతి పూజా కైంకర్యాలలోను వీరు వైఖానస అర్చకుల చేతికందించే పుష్పమాలికలు, తులసీ, అభిషేక ద్రవ్యాలు, కర్పూర హారతులు మొదలైనవి శ్రీవారికి భక్తిగా సమర్పించబడుతూ ఉన్నాయి. బంగారు బావి - పూల బావి శ్రీవారి మూలవర్లకు ప్రతి శుక్రవారం నిర్వహించే శుక్రవార అభిషేక కైంకర్యాలలలో ఆలయ సంప్రదాయం ప్రకారం ఆకాశగంగా తీర్థం మరియు శ్రీ తీర్థంగా పిలువబడే బంగారు బావి జలాలను నేటికీ అభిషేక, ఆరాధనాదులకు ఉపయోగిస్తున్నారు. శ్రీవారి మూలవర్లకు ప్రతినిత్యం రెండుమార్లు సమర్పించే పూలమాలలను సళ్ళింపు చేసిన తరువాత, సంపంగి ప్రాకారంలో, ఆలయానికి ఈశాన్య దిక్కున ఉన్న భూ తీర్థంగా పిలువబడే పూలబావిలో సమర్పించే సంప్రదాయం ఉంది.


శ్రీ తిరుమలనంబి - తిర్గ కెంకర్యం


శ్రీవేంకటేశ్వరస్వామి వారి నిత్య ఆరాధనకు ఉపయోగించే జలాన్ని, ఆకాశగంగ తీర్థం నుండి సేకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రథమాచార్య పురుషులుగా ప్రసిద్ది చెందిన శ్రీ తిరుమలనంబి (9-10 వ శతాబ్దం ) వారి వంశీయులచే, నేటికీ ఈ సేవ తీర్థకైంకర్యం రూపంలో జరుపబడుతోంది. శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ననుసరించి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు (తోమాలసేవకు ముందుగా) తిరుమల నంబి వంశీయులు, శ్రీవారి ఆలయానికి 5 కి.మీ దూరంలో ఉన్న ఆకాశగంగ తీర్థం నుండి మూడు బిందెలో పవిత్ర జలాలను నింపి, ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయానికి చేరుస్తారు. ఈ విధముగా ఆరాధనకు తీర్థం సేకరించాలని శ్రీవైఖానస సంహితలలో కూడా చెప్పబడినది. (దుహతాం దివమితి ఘటమాదాయ - నదీ తటాక కూపానామలాభే పూర్వస్యోత్తర ముపతిత - శ్రీ వైఖానస భగవదర్చా ప్రకరణమ్). ఈ 3 బిందెలలో ఒక బిందెను శ్రీ భోగ శ్రీనివాసమూర్తివారి నిత్య అభిషేకమునకు, మిగతా రెండు బిందెలను శ్రీవారి ప్రాతఃకాల ఆరాధనకు వినియోగించే సంప్రదాయం ఉంది.


శ్రీ అనంతాళ్వారు - గడ్డం బొట్టు తిరుమల శ్రీవారికి మాత్రమే ప్రత్యేకమైన అలంకరణ, శ్రీవారి ముఖమండలంలో, గడ్డమునకు అద్దే పచ్చకర్పూరపు చుక్క. ఇది శ్రీవారి ఆలయ ద్వితీయ ఆచార్యపురుషులు శ్రీరామానుజులవారి శిష్యుడైన శ్రీ అనంతాళ్వారు (11-12 వ శతాబ్దం) వారితో శ్రీవారు జరిపిన లీలలకు గుర్తుగా అలంకరించే సంప్రదాయం అమలులో ఉంది. ఈ పచ్చకర్పూరం చుక్కకే గడ్డం బొట్టు అని పేరు. అనంతాళ్వారు విసిరిన గడ్డపార శ్రీవారి గడ్డమునకు తగిలి గాయం కాగా, ఓషధీ గుణాలు కలిగిన పచ్చకర్పూరంతో గడ్డానికి అద్దగా, రక్తస్రావం నిలిచిపోయింది. ఈ ఘట్టానికి గుర్తుగా నేటికీ ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారికి గడ్డంబొట్టుని అలంకరిస్తారు. రాత్రి కైంకర్యంలో తీసివేసి, మరల ఏకాంత సేవకు ముందు గడ్డంబొట్టు పెడతారు. ప్రతి శుక్రవారం అభిషేకం అయిన తర్వాత మాత్రం గడ్డంబొట్టు అలంకరించరు. అన్నమయ్య మెలుకొలుపు - లాలపాటలు 15వ శతాబ్దమునకు చెందిన శ్రీవారి పరమభక్తుడు, సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులవారు, శ్రీవారి వైభవం మీద, మొత్తం 32 వేల సంకీర్తనలు వ్రాసి, గానం చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శ్రీవారితో - అన్నమయ్య అనుబంధానికి గుర్తుగా నేటికీ ప్రతినిత్యం సుప్రభాత సేవా సమయంలో శ్రీవేంకటేశ సుప్రభాతంతో పాటుగా, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి వంశీయులచే మేలుకొలుపు పాటలు పాడుతూ, శ్రీవారిని మేల్కొలిపే సంప్రదాయం ఉంది. రాత్రి ఏకాంతసేవ సమయంలో శ్రీవారిని నిద్రబుచ్చటానికి అన్నమయ్య వంశీయులు లాలిపాటలు, జోలపాటలు పాడి సంకీర్తనా కైంకర్యాన్ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. తరిగొండవారి హారతి శ్రీవారికి ప్రతినిత్యం రాత్రి జరుపబడే చివరిసేవ, పవళింపు సేవ. శ్రీవారికి పరమభక్తురాలైన కవయిత్రి, మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ వారితో జరిగిన శ్రీవారి లీలలకు గుర్తుగా నేటికీ ఆమె వంశీయులచే శ్రీవారికి చివరి హారతిగా ముత్యాల హారతి అనే కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది.


అన్నమయ్య మెలుకొలుపు - లాలపాటలు 15వ శతాబ్దమునకు చెందిన శ్రీవారి పరమభక్తుడు, సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులవారు, శ్రీవారి వైభవం మీద, మొత్తం 32 వేల సంకీర్తనలు వ్రాసి, గానం చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శ్రీవారితో - అన్నమయ్య అనుబంధానికి గుర్తుగా నేటికీ ప్రతినిత్యం సుప్రభాత సేవా సమయంలో శ్రీవేంకటేశ సుప్రభాతంతో పాటుగా, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి వంశీయులచే మేలుకొలుపు పాటలు పాడుతూ, శ్రీవారిని మేల్కొలిపే సంప్రదాయం ఉంది. రాత్రి ఏకాంతసేవ సమయంలో శ్రీవారిని నిద్రబుచ్చటానికి అన్నమయ్య వంశీయులు లాలిపాటలు, జోలపాటలు పాడి సంకీర్తనా కైంకర్యాన్ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. తరిగొండవారి హారతి శ్రీవారికి ప్రతినిత్యం రాత్రి జరుపబడే చివరిసేవ, పవళింపు సేవ. శ్రీవారికి పరమభక్తురాలైన కవయిత్రి, మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ వారితో జరిగిన శ్రీవారి లీలలకు గుర్తుగా నేటికీ ఆమె వంశీయులచే శ్రీవారికి చివరి హారతిగా ముత్యాల హారతి అనే కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది.


పంచమూర్తుల ఆరాధన ప్రాచీన కాలంలో మొదటగా శ్రీవారి ఆలయంలో స్వయంవ్యక్త సాలగ్రామ దివ్య అర్చారూపంలో వేంచేసి యున్న శ్రీ శ్రీనివాస భగవానుడి మూలవర్లకు మాత్రమే పూజలు, జరిపేవారు. కనుక మొదట్లో ఇది ఏకబేర ఆలయంగా శ్రీ వైఖానస ఆగమంలో ప్రసిద్ధి చెందినది. బేరము అనగా విగ్రహము అని అర్థం. క్రమేపీ క్రీ.శ 614 వ సంవత్సరంలో, శ్రీ వెఖానస భగవచ్చాసంలో చెప్పబడిన విధంగా, కౌతుక బేరంగా, వెండి విగ్రహమైన శ్రీ భోగశ్రీనివాసమూర్తి వారి ప్రతిష్ఠ చేయబడింది. అనంతరం క్రీ.శ. 1339 సంవత్సరంలో శ్రీవారి ఉత్సవ బేరమైన శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ప్రతిష్ఠ జరిగినది. అంతకు పూర్వం ఉత్సవమూర్తిగా వ్యవహరింపబడిన శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి వారు, ఉగ్ర స్వభావం కారణంగ నేడు స్నపన బేరంగా పూజలందుకుంటున్నాడు. ఇక ఐదవ మూర్తిగా


మూలబేరమైన శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ విధంగా శ్రీవారి ఆలయంలో, శ్రీ వైఖానస భగవచ్చాస్త్రంలో చెప్పబడిన విశిష్టమైన పంచబేర ఆరాధన అమలులో ఉంది. శ్రీవారి గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి పంచమూర్తులతో పాటు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారికి, శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రమునకు మరియు అనేక సాలగ్రామములకు నిత్య కైంకర్యాలలో భాగంగా పూజలు జరుగుతాయి. అర్చారూప సౌలభ్యం మానవాళిని మోక్షమార్గం వైపు నడిపించటానికి అతి సులువైన మార్గమే శ్రీమన్నారాయణుని అర్చావతార రూపం. శ్రీమన్నారాయణుడు భక్తులను అనుగ్రహించుటకై పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపములలో కొలువై ఉంటాడు. వైకుండే తు పరే లోకే శ్రియా సార్థం జగత్పతిః | ఆస్తే విష్ణురచిన్యాత్మా భక్తి ర్భాగవతైస్సహ ||


అర్చారూప సౌలభ్యం మానవాళిని మోక్షమార్గం వైపు నడిపించటానికి అతి సులువైన మార్గమే శ్రీమన్నారాయణుని అర్చావతార రూపం. శ్రీమన్నారాయణుడు భక్తులను అనుగ్రహించుటకై పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపములలో కొలువై ఉంటాడు. వైకుండే తు పరే లోకే శ్రియా సార్థం జగత్పతిః | ఆస్తే విష్ణురచిన్యాత్మా భక్తి ర్భాగవతైస్సహ || జగత్పతి, తండ్రియైన శ్రీమన్నారాయణుడు వైకుంఠ స్థానమున భక్తులతో, భాగవతులతో సహా, లక్ష్మిని విడువక పరస్వరూపమున విరాజిల్లును. ఇదియే పరమపదము. ఇది అనేక ఆవరణములతోను, అండములతో నిండి ఉంటుంది. ఇక్కడ రాత్రింబవళ్ళు ఉండవు. భూమ్యాకాశములు లేవు. చీకటి వెలుగులు, పంచభూతములు లేవు. ఇంద్రియముల కందని ప్రధాన పురుషుడొక్కడే ఉంటాడు. జగన్మాతయగు శ్రీదేవి విష్ణువునకు అనపాయినిగా నిత్యము విడువక యుండును. నిత్య సూరులైన అనంత, గరుడ, విష్వక్సేనులు ఎల్లప్పుడూ పరమపదంలో స్వామిని సేవిస్తే ఉంటారు. ఇక్కడ ఎల్లప్పుడూ స్వామివారికిష్టమైన సామగానమే వినబడును. ఇది భూమినుండి అనంతమైన దూరంలో ఉంటుంది కనుక ఇక్కడి నారాయణున్ని దర్శించటం మానవులకు దుస్సాధ్యమైంది. ఈ స్థూల శరీరంతో పరమపదంలోని స్వామివారిని సేవించడం అత్యంత దుర్లభం. ముక్తి పొందిన జీవాత్మ సూక్ష్మరూపంలో మాత్రమే ఇక్కడకు చేరిన స్వామి వారిని సేవించడానికి వీలవుతుంది. ఇక రెండవదైన వ్యూహరూపం, క్షీరసాగరం మధ్యలో శేషతల్పంపై శయనించి ఉన్న మహావిషువు దేవతలకు, ఋషులకు క్షీరాబ్దినాథుడిగా దర్శనమిస్తాడు. కనుక ఇది కూడా స్థూల శరీర రూపంలో సేవించడానికి దుర్లభమైన రూపం. మూడవది విభవ అవతార రూపము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లు, ధర్మస్థాపన కోసం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయుటకై ఆయా యుగాలలో శ్రీమన్నారాయణుడు అవతరించుటయే విభవరూపములు. ఇవి దశావతారములు. మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహెథ వామనః | రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కీతి తే దశ || - ఇది గడచిన చరిత్ర కనుక ఈ రూపములో భగవానుని సేవించటం మానవులకు అసాధ్యం. ఇది గత సంవత్సరం నదులలోని నీరు, నది ఎండిన తర్వాత ఏ విధంగా అయితే మన దాహం తీర్చలేనిదో, అదేవిధంగా దర్శింపశక్యం కానిది. నాలుగవది అంతర్యామి స్వరూపం. అంగుష్ఠమాత్ర రూపంలో పరమాత్ముడు జీవులందరి హృదయమునందు నివసించును. జఠరాగ్నియందు వైశ్వానరుని రూపమున ప్రాణుల శరీరములో ఉండి, ప్రాణాపానాది వాయువులతో కలిసి, మానవులు భుజించే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాదులచే నుండు నాలుగు రకముల అన్నమును పచనం చేసే తత్వమే అంతర్యామిత్వం. ఇది యోగులు మాత్రమే దర్శింపగలరు. జ్ఞాన యోగ సాధన చేస్తూ కఠోర దీక్షతో ఉన్నవారికే అంతర్యామిని దర్శింప శక్యమవును. ఇక ఐదవది అర్చారూపం అతి ముఖ్యమైనది. శ్రీమన్నారాయణున్ని స్థూలశరీరంతో, మాంస చక్షువులతో అనుభవం పొంది సులభంగా దర్శించగలిగినది అర్చారూపం. అనేక పుణ్యక్షేత్రములలో స్వయంవ్యక్తం, దివ్యం, సైద్ధం, పౌరాణిక, మానుష విభజనతో అర్చారూపంలో భక్తులందరి పూజలు స్వయంగా స్వీకరిస్తూ అత్యంత సులభమైన మార్గంలో మోక్షసాధన కలిగించే రూపం ఇది.


భగవాన్ విఖనస మహర్షి భగవాన్ విఖనస మహర్షి విష్ణు మానస పుత్రుడుగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆదికాలంలో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని రచించిన విఖనసుడు స్వయంగా బ్రహ్మ అని మరీచి ఆనంద సంహిత తెలియజేస్తోంది. విఖనస మహర్షి వంశీయులే లోకంలో వైఖానసులుగా ప్రసిద్ధి చెందినారు. విఖనుడే విష్ణువు. ఆయన వంశస్థులు వైఖానసులు. విష్ణు వంశజుడైన విఖనసుడు మునులలో ప్రథముడు. ఆయన ఉపదేశించిన సూత్రం, సూత్రములన్నింటిలోకి ఉత్తమమైనది. భగవంతుడైన మహావిష్ణువు భూలోకమందు అర్చావతార రూపంలో అవతరించ దలచినాడు. విష్ణువును ఆరాధించుటకు ఒక సమగ్రమైన ఆరాధన విధానం అవసరమైంది. అందువల్ల మహావిష్ణువు బ్రహ్మను సృష్టించి, తన ఆరాధనకై ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించమని ఆదేశించినాడు. కాని బ్రహ్మదేవుడు తన అశక్తతను తెలియజేయగా అప్పుడు శ్రీమహావిష్ణువు తన మనస్సులో సమస్త వేదరాశి మీద దృష్టి నిలిపి ధ్యానించాడు. తత్పలితంగా భగవాన్ విఖనస మహర్షి విష్ణువు మనస్సు నుండి ఉద్భవించాడు. సలక్షణంగా, దివ్యమైన తేజస్సుతో విష్ణు చిహ్నాలైన చతుర్భుజములు, శంఖ, చక్రములతో, అభయ వరద హస్తములతో, ద్వాదశ ఊర్ధ్వపుండ్ర ధారియై, కమండలం


మరియు త్రిదండం చేతబూని తులసి, పద్మమాలలు, కిరీట కర్ణకుండలములతో వెలుగొందుతున్న విఖనసుడు భగవంతునికి నమస్కరించి ఆజ్ఞాపించమని అడుగగా, విష్ణువు తన ఆరాధనకై శాస్త్రమును రూపొందించుమని ఆదేశించినాడు. విఖనసుడు వేదరాశి మీద ధ్యానించి మహత్తరమైన శ్రీ వైఖానస కల్పసూత్రాన్ని రూపొందించాడు. ఇదే తర్వాతి కాలంలో విఖనసుడి శిష్యాదులచే విస్తరింపబడి, శ్రీ వైఖానస భగవచ్చాస్త్రం అను పేరుతో ప్రసిద్ది చెందినది.


వైఖానసాగము ముఖ్యస్థానం - ఆరుమల తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచంలోని శ్రీ వైఖానస మతానుయాయులందరికీ ప్రధానమైన స్థానంగా ప్రఖ్యాతి గాంచింది. వైఖానస అర్చకుల గురించి క్లుప్తంగా : 2 దేవాలయ ఆరాధనకు అంకితమైన భారతీయ అర్చక సమాజములలో శ్రీ వైఖానసులకు ప్రముఖ స్థానం ఉంది. అత్యంత ప్రాచీనమైన శ్రీ వైఖానస అర్చక సమాజం, ఈ రోజుకీ తమ కులవృత్తికే కట్టుబడి ఉన్నారు. వైఖానసుల గురించి వేదములలో, ఇతిహాసాలైన భారత, రామాయణాలలో, పురాణాలైన భాగవతంలో ప్రస్తావన ఉన్నది. వైఖానసుల గురించి తొలి ఉదాహరణలు ఇలా ఉన్నాయి. వీరు అరణ్యములందలి ఆశ్రమాలలో నివసించే గృహస్తులుగా, బ్రాహ్మణములలో విధించిన విధంగా నిష్ఠతో యజ్ఞాదులను నిర్వహించేవారుగా వర్ణిస్తున్నది. వైఖానసులు ఇంద్రునకు (విష్ణువునకు) ప్రీతి పాత్రులైన ఋషులుగా తాండ్య మహా బ్రాహ్మణము పేర్కొన్నది (14-4-7). క్రీ.శ. 1059 సంవత్సరములో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చక కైంకర్యములు నిర్వహించిన అర్చకవరేణ్యులు శ్రీ శ్రీనివాస దీక్షితులవారు బ్రహ్మసూత్రాలకు, వైఖానస తత్త్వచింతనతో కూడిన ఒక వ్యాఖ్యానం రచించారు. దీనిపేరు "శ్రీలక్ష్మీ విశిష్టాద్వైతం”. ఇది రామానుజులవారి శ్రీభాష్యం లోని ప్రవచనాల కంటే పూర్తిగా భిన్నమైనవి. ఈ కలియుగంలో విగ్రహారాధన సర్వోతృష్టమైనదిగా మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియజేశారు. కృతయుగంలో భగవంతుని ధ్యానరూపంలో దర్శించేవారు. త్రేతాయుగంలో యజ్ఞక్రియల ద్వారా ఆ శ్రియఃపతిని కొలిచేవారు. ద్వాపరయుగంలో ప్రతిమార్చనం మరియు కలియుగంలో భగవంతుని స్మరణ చేయటం వలన ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అయినప్పటికీ ప్రస్తుత యుగంలో అన్ని యుగాలలోని ఉత్తమ మార్గముల కలయికగా ఏర్పడినదే విగ్రహారాధన. అదియే సులభమైన రీతిలో ఫలితాల నివ్వగలదిగా చెప్పబడినది. దీనిని దృష్టిలో ఉంచుకునే వేదవేద్యుడైన శ్రీనివాస ప్రభువును వేంకట - పరబ్రహ్మణే - నమః అని కీర్తించారు. (సశేషం)