భక్త సుదర్శనుడు
ఆకాశం ఎత్తుకు ఎదిగిన పచ్చని చెట్లు చల్లగాలిని వీస్తూ ఉన్నాయి. చెట్ల మీద చిలుకలు, కోయిలలు, గోరువంకలు మొదలైన పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. నీటిలో ఈదులాడుతున్న బాతులు, హంసలు, నీరుకోళ్ళు సరోవరంలోని తెల్లకలువలతో పాటు అవి కూడా కలువలేనేమో అనిపించేటట్లు ఉన్నాయి. ఆశ్రమానికి అల్లంత దూరాన సుదర్శనుడు చెలికాళ్ళతో కలిసి విలువిద్యా ప్రదర్శన చేస్తూ వినోదిస్తూ ఉన్నాడు.
“ఊ చెప్పండి. ఇప్పుడు ఎక్కడ కొట్టమంటారో!” అన్నాడు బాణం గురి పెడుతూ. "అదిగో! ఆ మామిడిచెట్టు చిటారు కొమ్మన ఉన్న మామిడిపండుకు కొట్టు” అన్నాడు ఒకడు. ఇంతలో ఆశ్రమ ప్రాంతంలోని మునికాంతలు ఖాళీ కడవలతో పరిగెత్తుకుంటూ “రక్షించండి, రక్షించండి” అని ఆర్తనాదాలు చేస్తూ వచ్చారు. సుదర్శనుడు ఉలిక్కిపడి ఏమిటి అని అడిగేంతలోనే వారిని తరుముకుంటూ ఒక పెద్దపులి రావటం కనిపించింది. సుదర్శనుడు ఎక్కుపెట్టిన బాణం పులివైపు తిప్పి వదిలాడు. అది సూటిగా వెళ్ళి పులివీపుకు గుచ్చుకుంది. వెంటనే అది రెచ్చిపోయినట్లు ఆడవాళ్ళను వదిలి సుదర్శనుడి మీదకు దూకింది. అతని చేతిలోని విల్లు పట్టుతప్పి దూరంగా పడిపోయింది. వెంటనే మొలలోని పిడిబాకును తీసుకుని పులి మీదకు లంఘించాడు. మునిపత్నులు, సావాసగాళ్ళు అందరూ భయంగా దూరంగా నిలబడి ఆ పోరాటాన్ని చూడసాగారు. సుదర్శనుడు, బెబ్బులి ఒకరినొకరు చంపుకోవాలి అన్నట్లు భీకరంగా పోరాడుతున్నారు. పులి విసిరే పంజా దెబ్బలు ఒడుపుగా తప్పించుకుంటూ చేతిలోని పిడిబాకుతో అందిన చోటల్లా పొడవసాగాడు. అతడి దెబ్బలు వృధా కావటం లేదు. శరీరమంతా రక్తసిక్తమై చివరకు పులి వగరుస్తూ నేలమీద వాలిపోయి కన్ను మూసింది. సుదర్శనుడు పిడిబాకుకి అంటిన రక్తాన్ని అడవి ఆకులతో తుడుస్తూ వచ్చాడు. “నాయనా! ఎంత అడవుల్లో ఉన్నా రాచపౌరుషం ఎక్కడికి పోతుంది? నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది”
దీవిస్తూ అన్నారు మునిపత్నులు. - 'ఆ ఏమిటమ్మా మీరనేది? నేను రాచబిడ్డనా?” నిశ్చేష్టుడవుతూ అన్నాడు సుదర్శనుడు. “ఏమీలేదు నాయనా! ఏమీ లేదు.....” తడబాటు పడుతూ వడివడిగా వెళ్ళిపోయారు. సుదర్శనుడు ఆశ్రమానికి వచ్చాడు. మనోరమ అప్పుడే దేవీ పూజ ముగించి దేవి విగ్రహం ముందు మోకరిల్లి నమస్కరిస్తూ ఉంది. “అమ్మా!” అన్నాడు చిన్నగా. మనోరమ కళు నా తెరిచి దేవీ విగ్రహం వంక చూసింది. చిన్నగా చూపులు మరల్చి లేచి నిలబడింది. "ఏం నాయనా!” అన్నది. తల్లి ప్రశాంత వదనం చూసిన తర్వాత సుదర్శనుడి ఆవేశం చప్పున చల్లారిపోయింది. “అమ్మా! నేను రాచబిడ్డనా! నా తండ్రి ఎవరమ్మా! మనం రాజ్యం విడిచి ఈ అడవులలో ఎందుకున్నాం?” అన్నాడు. మనోరమ వచ్చి అక్కడ వెదురుతో చేసిన ఆసనం మీద కూర్చుంది. సుదర్శనుడు తల్లి పక్కనే నేలమీద కూర్చున్నాడు. “అవును నాయనా! మనం క్షత్రియులం. ఈ విషయం కా సమయం రాలేదు. ఆ క్షణం ఇప్పుడు వచ్చింది. చెబుతాను విను. ఒకప్పుడు హరిశ్చంద్రుడు, శ్రీరాముడు పరిపాలించిన అయోధ్యా నగరం మనది. మీ తండ్రిగారి పేరు ధ్రువసంధి. వారి పట్టమహిషిని నేను. నేను కాకుండా వారికి లీలావతి అనే మరో భార్య ఉన్నది. ఆమె కుమారుడి పేరు శత్రుజిత్తు. ఒకసారి మీ తండ్రిగారు వేటకు వెళ్ళి సింహం వాతపడి మరణించారు. తండ్రి తర్వాత పెద్ద కుమారుడివైన నిన్ను రాజుని చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఆ సంగతి లీలావతి తండ్రి యుధాజిత్తుకి తెలిసింది. ఎలాగైనా తన మనవడికే పట్టం కట్టాలనే దుర్బుద్ధితో యుధాజిత్తు మంత్రుల మీదకు యుద్ధానికి వెళ్ళారు. ధర్మాత్ములైన మంత్రులకి అండగా మా తండ్రిగారు కూడా యుద్ధానికి వచ్చారు. కానీ దైవం మనకి అనుకూలించలేదు. ఆ యుద్ధంలో మీ తాతగారు మరణించారు. దిక్కు తోచని స్థితిలో అసహాయనై పసివాడవైన నిన్ను తీసుకుని అడవులబట్టి పోతూ ఉంటే దయామయుడైన భారద్వాజముని నన్ను ఆదరించారు. కానీ అసూయాపరుడైన యుధాజిత్తు అడవులకు వచ్చి మహర్షి ఆశ్రమంలో ఉన్న నన్ను అప్పగించమని లేదా ప్రాణాలు దక్కవని అతిశయంతో పలికాడు. ఆ ఆ మాటలతో మహర్షికి ఆగ్రహం వచ్చింది. “నమ్మి ఆశ్రయించి వచ్చిన స్త్రీని ఆదరించక పోవటం అధర్మం. నా ఆశ్రయంలో ఉన్న మనోరమను తీసుకువెళ్ళటం నీకు సాధ్యం కాదు. పూర్వం వసిష్ఠ మహర్షి కామధేనువుని అపహరించబోయి విశ్వామిత్రుడు పొందిన పరాభవం విన్నావుగా. చేసిన పాపం చాలు. మనోరమను, బాలుడిని వదిలివెళ్ళు. లేదా నా అగ్రహానికి గురవుతావు” అని హెచ్చరించారు.
మహర్షి చెప్పినట్లు తిరిగి వెళ్ళిపోవటమే క్షేమమని యుధాజిత్తు మంత్రులు కూడా నచ్చచెప్పారు. దానితో యుధాజిత్తు వెళ్ళిపోయాడు. అప్పటినుంచీ మనం ఈ ఆశ్రమంలోనే భారద్వాజముని రక్షణలో ఉన్నాం. భూత భవిష్యద్వర్తమానాల నెరిగిన మహర్షి నీకు క్షత్రియోచిత విద్యలన్నీ నేర్పించారు. ఇదీ కథ” అన్నది మనోరమ. "ఆ యుధాజిత్తు నీచుడు, జిత్తులమారి. వాడిని ఇప్పుడే అంతమొందించి మన రాజ్యాన్ని మళ్ళీ మనం స్వాధీనం చేస్తానమ్మా! అనుజ్ఞ ఇవ్వు!” ఆగ్రహంగా అన్నాడు సుదర్శనుడు. “శాంతించు బాబూ! ఆ సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు మహర్షులే నిన్ను ఆజ్ఞాపిస్తారు. అంతవరకు ఓరిమి వహించటమే నీ కర్తవ్యం” అన్నది మనోరమ. “ఇలాంటి మేరు సమానధీరుడైన కుమారుడుండగా నీ కెందుకు తల్లీ విచారం?” అంటూ లోపలికి వచ్చాడు భారద్వాజ మహర్షి. మనోరమ, సుదర్శనుడు లేచి ఆయనకు నమస్కరించారు. “కుమారా! సృష్టి స్థితి లయ కారకులైన హరిహర బ్రహ్మలను నడిపించేది ఆ ఆదిపరాశక్తి అనుగ్రహమే. ఆమె యొసగే రాజసశక్తి వలన బ్రహ్మ, సాత్త్యికశక్తి వలన విష్ణువు, తామసశక్తి వలన శివుడు ఆయా విధులు నిర్వహిస్తున్నారు. నీవు కూడా ఆ తల్లిని ఉపాసించు. అది అనంత విజయాన్ని చేకూర్చిపెడుతుంది” అన్నాడు మహర్షి.
"ఆ జగజ్జననిని ఉపాసించే విధానం కూడా దయచేసి సెలవివ్వండి గురుదేవా!” అన్నాడు. “జగదంబిక కరుణామయి. ఆనాడు నిరక్షరాస్యుడైన కాలుడు నోటికి వచ్చిన "హై” అనే ఒకే ఒక అక్షరాన్ని మనసులో నిలుపుకుని ధ్యానిస్తే అదే బీజాక్షరమై ఆమె అనుగ్రహ పాత్రుడిని చేసి మహాకవిగా చేసింది. అలాగే ఒక్క అక్షరాన్ని పరిశు ద్ధాంతరంగంతో జపిస్తే జగజ్జనని నిన్ను కూడా అనుగ్రహిస్తుంది. శ్రీదేవి కటాక్ష సిద్దిరస్తు” దీవించాడు. సుదర్శనుడు తలవంచి ఆయనకు అభివాదం చేశాడు. మహర్షి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో మునికుమారుడు ఒకడు " బా! ఏం చేస్తున్నావు? మన సావాసగాళ్ళు అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు” అని చెప్పాడు. వెంటనే సుదర్శనుడికి ఆ పిలుపులో బీజాక్షరం స్పురించింది. సుదర్శనుడు సుస్నానం చేసి, శుభ్రవస్త్రాలు ధరించి దేవీ విగ్రహం ముందు పద్మాసనం వేసుకుని "క్లీం... క్లీం... క్లీం” అంటూ జపించసాగాడు. కుమారుడి ఏకాగ్రత, భక్తి, ధ్యాన నిమగ్నత చూసి మనోరమ కూడా ఆశ్చర్య చకిత అయింది. సుదర్శనుడు ఇలా ఆహార పానీయాలు విస్మరించి ఏకాగ్రచిత్తుడై ధ్యానం చేస్తూ ఉండగా కొన్నాళ్ళకు జగదంబికకు అతనిపై అపార దయ కలిగి దర్శనమిచ్చింది.
ఎర్రని చీర ధరించి, నుదుట ఎర్రని కుంకుమతో, పది చేతులలో శంఖం, చక్రం, దండం, ఖడ్గం వంటి ఆయుధాలు ధరించి అమితమైన తేజస్సుతో సింహవాహనం మీద దర్శనమిచ్చిన ఆ విశ్వజననిని చూసి సుదర్శనుడు పులకించిపోయి అనేక విధాల స్తోత్రం చేశాడు. మనోరమ కూడా ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఈ 'కుమారా! నీ భక్తి ప్రపత్తులకు ఎంతో సంతోషించాను. ఈ కవచాన్ని, విల్లంబులు, తూణీరాలు నీకు ఇస్తున్నాను. ఇవి నీ చేతనున్నంత వరకు నీకు అపజయం రాదు గ్రహించు” అన్నది. "ధన్యుణ్ణి మాతా!" అని అందుకుని కళ్ళకు అద్దుకున్నాడు సుదర్శనుడు. వెంటనే ఆమె అంతర్థానమైంది. సుదర్శనుడు అవి తల్లికి కూడా చూపించి, పాదాలకు నమస్కరించాడు. “విజయుడవై వర్ధిల్లు నాయనా!” సంతోషంతో ఆశీర్వదించింది మనోరమ. కాశీరాజు పుత్రిక శశికళ. అద్భుత సౌందర్యరాశి. ఆమె మాటలు చిలుకలకు పలుకులు నేర్పుతున్నట్లు ఉంటాయి. ఆమె నడకలు రాయంచకు కులుకులు నేర్పుతున్నట్లు ఉంటాయి. ఆమెని ఒకక్షణం చూసే అవకాశం వస్తే చాలు జన్మ తరిస్తుంది అనుకుంటూ ఉంటారు కాశీనగరంలోని యువకులు. అంతటి అపురూప లావణ్యవతిని వివాహం చేసుకునే అదృష్టవంతుడు ఎవరో అని నిట్టూరుస్తూ ఉంటారు. ఆరోజు సాయంత్రం పరిచారికలు శశికళను సుగంధ ద్రవ్యాలు కలిపిన పన్నీటిలో స్నానం చేయించి, పట్టు వస్త్రాలు ధరింపజేసి, చెక్కిట అగరుచుక్క పెట్టి అలంకరించారు. చెలికత్తెలు ఆమెను వెన్నెలలో వేసిన మెత్తని తల్పం దగ్గరకు నడిపించుకుని వచ్చి “హాయిగా నిదురింపవమ్మా! సుఖ స్వప్నాలు కలిగేనులే!” అని వేళాకోళాలు ఆడి, పరుండజేసి వెళ్ళిపోయారు. పక్కనే ఉన్న ఉద్యానవనంలో నుండి పూలపరిమళాలను మోసుకుని వస్తూ పిల్లగాలులు మెల్లమెల్లగా వీస్తున్నాయి. శశికళ కనురెప్పలు మూసుకుంది. ఆ రాత్రి ఆమె కలలో రక్తాంబర ధారిణియై ఆదిపరాశక్తి సింహవాహనం మీద దర్శనమిచ్చింది. "కుమారీ! అయోధ్యా నగర రాకుమారుడు నీకు భర్త అవుతాడు. అతనినే వరించు. మీరిద్దరూ అన్యోన్య దంపతులై చిరకాలం వర్దిల్లండి” అని చెప్పింది. వెనువెంటనే సుదర్శనుడి రూపం ముందు నిలచినట్లైంది. అతడు చిలిపిగా చూస్తూ ఆమె చెక్కిలికి గంధం పూసి మాయమయ్యాడు. మెలకువ వచ్చిన తర్వాత తనకి వచ్చిన కలను తలచుకుని పరమానంద భరితురాలైంది శశికళ. చెలికత్తెలు వచ్చి ఆమె ముఖంలోని వింతశోభను చూసి “ఏమిటి చెలీ! ఈవేళ చాలా సంతోషంతో కనిపిస్తున్నావు. కాబోయే వరుడు కలలో కనిపించాడేమిటి?” అని అడిగారు చిలిపిగా. శశికళ సిగ్గుతో రెండు చేతులలో మొహం దాచుకుంది. అవునన్నట్లు సిగ్గుగా తలూపింది. సిగ్గుతో కనురెప్పలు వాలిపోతూ ఉండగా స్వప్ప వృత్తాంతం అంతా చెప్పింది.
- “జగజ్జనని వరం ఇచ్చిందంటే జరిగిపోయినట్లే! నువ్వు అదృష్టవంతురాలివి” ప్రశంసించారు చెలికత్తెలు. కొన్ని రోజులు గడిచిపోయాయి. అక్కడ భారద్వాజ మహర్షికి జరగబోయేది తెలుసు. అందుకు సూచనగా సుదర్శనుడితో ఇలా అన్నాడు. “నాయనా! రోజూ క్రమం తప్పకుండా జగదంబిక ధ్యానం చేసుకో. సకల జీవకోటికి శక్తినీ, బుద్ధినీ, కీర్తినీ, ధనాన్నీ ఇచ్చేది ఆ భగవతి ధ్యానమే. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దిక్పాలకులూ, ఋషులూ అందరూ ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించుకుంటూ ఉంటారు. జ్ఞానహీనులూ, మూర్ఖులూ ఈ విషయం తెలుసుకోలేక ఐహికమైన వాటిని అశించి వ్యధలు పొందుతూ ఉంటారు” అని చెప్పాడు. - “మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను గురుదేవా!” తలవంచి నమస్కరించాడు. మహర్షితో పాటు మనోరమ కూడా కుమారుడిని ఆశీర్వదించింది. ఈ అక్కడ శశికళ తండ్రి సుబాహుడు కుమార్తె స్వయంవరం కోసం సన్నాహాలు చేయసాగాడు. శశికళ ఇష్టసఖిని చూసి “చెలీ! తండ్రి గారు నాకు స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారట. నా మనోహరుడు సుదర్శనుడు. అతనిని తప్ప అన్యుల వంక కన్నెత్తి చూస్తానా” అన్నది కన్నీటితో. . “విచారించకండమ్మా! ఈ విషయం అమ్మగారికి నేను తెలియజేస్తాను” అని ఓదార్చి శశికళ తల్లితో ఈ విషయం చెప్పింది చెలికత్తె.. తల్లి ఆ విషయం భర్తతో చెప్పింది. సుబాహుడు హేళనగా నవ్వి “వెర్రి కుదిరింది. రోకలి తలకి చుట్టమన్నట్లుంది. ఆ సుదర్శనుడు గర్భదరిద్రుడు. యుధాజిత్తు వాడి తాతను చంపి, మనుమడికి రాజ్యం కట్టబెట్టాడు. ఎందరో రాజపుత్రులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని అయినా చేపట్టి సుఖంగా జీవించమని చెప్పు వెళ్ళు” అన్నాడు. ఈ మాటల్ని శశికళ వింటూ ఉన్నది. తండ్రి ముందుకు వచ్చి "నాన్నా! సుదర్శనుడు దరిద్రుడు కానీ, ధనికుడు కానీ, అడవిలో ఉండనీ, అయోధ్యలో ఉండనీ అతనినే నేను వరించాను. శర్యాతి కుమార్తె సుకన్య చ్యవన మహర్షిని చేపట్టలేదా! సావిత్రి అడవులలో ఉన్న సత్యవంతుడిని వరించలేదా! నేనూ అంతే! పైగా జగన్మాత నాకు కలలో కనిపించి వరం ఇచ్చింది. నేను వేరొకరిని కన్నెత్తి చూసేదిలేదు” అన్నది.
అయినా సుబాహు కూతురి మాటలు పెడచెవిని పెట్టి స్వయంవర ఏర్పాట్లు చేశాడు. శశికళ ఒక బ్రాహ్మణుని పిలిపించి, సుదర్శనుడి దగ్గరకు వెళ్ళి తన మాటగా ఇలా చెప్పమంది. “భవానీమాత నా కలలో కనిపించి నీవే నా భర్త అని చెప్పింది. నా తండ్రి స్వయంవరం ప్రకటించాడు. నీవు కాకపోతే అగ్నిలోనైనా దూకుతాను కానీ, వేరొకరిని వరించను. కాబట్టి నీవు వచ్చి నన్ను దక్కించుకో!” సుదర్శనుడు శశికళ సందేశం విన్నాడు. తల్లికీ, భారద్వాజునికి చెప్పాడు. “నాయనా! దుర్గమ మార్గాల్లో దుర్గాదేవి, కలహ సమయాల్లో కాళీ, స్వయంవర మంటపంలో మాతంగీ, శత్రు సమూహాల యందు భైరవీదేవి నిన్ను కాపాడెదరు గా! విజయుడవై తిరిగిరా!” అంటూ ఆశీర్వదించాడు భారద్వాజుడు. మహర్షి ఆశీర్వాదం తీసుకుని స్వయంవరానికి బయలుదేరాడు సుదర్శనుడు. మనోరమ మాత్రం కొడుకుని ఒంటరిగా పంపటానికి భయపడింది. "ఆ యుధాజిత్తు పగబట్టిన త్రాచులాంటివాడు. నీకేదైనా కీడు తలపెడితే, నీవు లేకుండా నేను బ్రతకలేను. నేనూ నీతోపాటు వస్తాను” అన్నది. సరేనని తల్లితో కలిసి బయలుదేరాడు. స్వయంవర ముహూర్తం దగ్గరకు వచ్చింది. రాజకుమారుల ముందుకు రావటానికి శశికళ ససేమిరా ఇష్టపడలేదు. “పూలమాల పట్టుకుని పదిమంది ముందుకు వచ్చి ఒక్కొక్కరిని చూసుకోవటం నా వల్ల కాదు. అటువంటి స్వయంవరం నాకు వద్దు. నువ్వు నా క్షేమం, నా సుఖం కోరి ఉంటే సుదర్శనుడికి ఇచ్చి వివాహం చేయి. లేదా అగ్నిలో దూకి మరణిస్తాను” అని తండ్రితో ఖచ్చితంగా చెప్పింది శశికళ. ,
సుబాహుడు చేసేది లేక స్వయంవర మంటపానికి వచ్చి “రాకుమారులారా! మీరంతా నన్ను క్షమించండి. నా కుమార్తె సుదర్శనుడిని వరించింది. స్వయంవరానికి రానని పట్టుబట్టింది. మీరంతా నామీద దయ తలచండి. కళ్యాణ మంటపాన్ని కదనరంగంగా మార్చకండి. వధూవరులను ఆశీర్వదించండి” అని చేతులు జోడించి ప్రార్థించాడు. “పిలిచి మమ్మల్ని ఇంత అవమానం చేస్తావా!” అన్నారు అగ్రహంతో. విడిది ఇళ్ళలో రాకుమారులందరూ కలుసుకుని “ఇప్పుడు గొడవ చేసి, నలుగురిలో చెడు అనిపించుకోవటం దేనికి? పెళ్ళి జరగనీయండి. సుదర్శనుడు తిరిగి వెళ్ళేటప్పుడు అతడిని మట్టుపెడదాం” అనుకున్నారు. సుబాహు సుదర్శనుడిని పిలిచి పెండ్లి కుమారుడిగా అలంకరింపచేశాడు. చెలికత్తెలు శశికళను కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ వాద్యాలు మ్రోగాయి. పురోహితులు అగ్నిని రగిలించారు. హోమములు చేశారు. వేదమంత్రాలతో, పండిత, పురోహితుల, మంత్రుల మధ్య ఆహ్వానించగా వచ్చిన రాకుమారులు, ప్రజల మధ్య శశికళా సుదర్శనుల వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు సుబాహుడు. అల్లుడికి రెండు వందల రథాలూ, వంద ఏనుగులూ, దాసీలనూ, ఆభరణాలను, ఆయుధాలనూ ఇచ్చాడు. సకల సుగుణాలతో ఉన్న కోడలిని చూసి మనోరమ ఆనందించింది.
సుబాహు సుదర్శనుడిని పిలిచి పెండ్లి కుమారుడిగా అలంకరింపచేశాడు. చెలికత్తెలు శశికళను కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ వాద్యాలు మ్రోగాయి. పురోహితులు అగ్నిని రగిలించారు. హోమములు చేశారు. వేదమంత్రాలతో, పండిత, పురోహితుల, మంత్రుల మధ్య ఆహ్వానించగా వచ్చిన రాకుమారులు, ప్రజల మధ్య శశికళా సుదర్శనుల వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు సుబాహుడు. అల్లుడికి రెండు వందల రథాలూ, వంద ఏనుగులూ, దాసీలనూ, ఆభరణాలను, ఆయుధాలనూ ఇచ్చాడు. సకల సుగుణాలతో ఉన్న కోడలిని చూసి మనోరమ ఆనందించింది. ఆరు రోజుల పాటు అక్కడ ఉండి, నూతన వరుడైన సుదర్శనుడు అత్తమామల అనుమతిని పొంది భార్యను తీసుకుని భారద్వాజుని ఆశ్రమానికి బయలుదేరాడు. కొంతదూరం రాగానే స్వయంవరానికి వచ్చిన రాకుమారులందరూ యుద్ధానికి వచ్చారు. భేరీలు మ్రోగాయి. శత్రుజిత్తు, యుధాజిత్తు శత్రువులను కూడగట్టుకుని సమర సన్నద్ధులై ఉన్నారు. బాణాలు వదిలారు. ప్రతిగా సుదర్శనుడు కూడా బాణాలు వేశాడు. ఈటెలు విసిరారు. రెండు వైపులా సైన్యాలు తలపడ్డాయి. సమరం హోరాహోరీగా జరిగింది.
అంతలో ఆకాశంలో మహా మెరుపు మెరిసింది. ఆ మెరుపులో సింహవాహనారూఢురాలై, దివ్యమాలలు ధరించి, పదిచేతులలోనూ పది ఆయుధాలు ధరించి, జగదంబ ప్రత్యక్షమైంది. సింహం గర్జించింది. ఆ గర్జనకే ఏనుగులన్నీ మతి తప్పినట్లు వారి సైన్యాన్నే తొక్కుకుంటూ పరుగులు తీశాయి. “భయపడకండి. ఒక్కడ ఆడదాన్ని చూసి ఇంతమంది వీరులు పారిపోవడమా! పోరాడండి” అని యుధాజిత్తు తన సేనలను ఉత్సాహపరిచాడు. దుర్గాదేవి ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ, అందరినీ శరవర్షంలో ముంచెత్తింది. ఆమె ధాటికి సైన్యం అంతా శలభాల్లా మాడిపోగా, మిగిలినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలాయన మంత్రం పఠించారు.
సుదర్శనుడు ఆ తల్లిని చూసి చేతులు మోడ్చి నమస్కరించాడు. "తల్లీ! నీ భక్తులకు విపత్తు సంభవించినప్పుడు అధర్మము రాజ్యమేలుతున్నప్పుడు నీవు అవతరించి దుష్ట సంహారం చేస్తావు. నీ శక్తి లేనిదే అణువు కూడా కదలలేదు. నీ శక్తి చైతన్యమే జగత్తు అంతా ఆవరించి ఉన్నది. నీటిలో చల్లదనాన్ని, అగ్నిలో వేడినీ, సూర్యునిలో తేజస్సునూ ఇచ్చే మహాశక్తివి నీవు” అంటూ పరిపరి విధాల స్తోత్రం చేశాడు. . "ఈ శశికళా సుదర్శనులు నా భక్తులు. నా భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను. ఎవరైతే పంచాక్షరీ మంత్రాన్ని భక్తితో సాధన చేస్తారో వారిని కటాక్షిస్తాను. సుబాహూ! ఈ కాశీపురిలో నేను అవతరిస్తాను. ఇది పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. సుదర్శనా! నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యం పాలించుకో! శశికళా! నీవు, నీ భర్త ఈ లోకంలో సమస్త సౌఖ్యాలు అనుభవించిన తర్వాత అంత్యమున నన్ను చేరుదురు గాక!” అని దీవించి అంతర్థానమైంది. జగజ్జనని. అందరూ చేతులు జోడించి ఆ తల్లికి నమస్కరించారు.