యోగినీ ఏకాదశి


ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు - ఓ జనార్ధనా! జ్యేష్ఠ బహుళ ఏకాదశి కథను, వ్రతవిధానం గురించి తెలుపగలరు అని ప్రార్థించాడు. అందులకు శ్రీకృష్ణ భగవానుడు “ధర్మరాజా! జ్యేష్ఠ బహుళ ఏకాదశికి 'యోగినీ ఏకాదశి' అని పేరు. ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి. ఈ లోకంలో భోగములను ప్రసాదించి, పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుందీ వ్రతం. యోగినీ ఏకాదశి ముల్లోకాల్లోనూ ప్రసిద్ధమైంది. దీని మహత్తు గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి. ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను.


వ్రత కథ స్వర్గ ధామమైన అలకాపురి నగరంలో కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తుండేవాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివుణ్ణి అత్యంత భక్తిపూర్వకంగా పూజించేవాడు. అతనికి హేమమాలి అనే ఒక తోటమాలి పూజకోసం పుష్పాలను తెచ్చి


ఇస్తూ ఉండేవాడు. ఆ మాలికి అత్యంత సౌందర్యవతియైన భార్య ఉండేది. పేరు విశాలాక్షి. ఒకరోజున అతడు మానస సరోవరం నుండి పూవులు తీసుకుని ఇంటికి వచ్చాడు. వాటిని యక్షపతి పూజా మందిరానికి తీసుకు వెళ్ళాలి. మాలి తన భార్య తీరును చూసి కామాసక్తుడయ్యాడు. ఆ ఇద్దరూ సరస సల్లాపాల్లో మునిగిపోయారు. దాంతో యక్షపతి పూజా సమయానికి పూలను తీసుకువెళ్ళాలనే సంగతిని మాలి మరచిపోయాడు. సమయం మధ్యాహ్నమైనా పుష్పాలు అందకపోవడంతో యక్షపతి కుబేరుడు హేమమాలి కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరకు కుబేరుడు దూతలైన యక్షులను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సకాలంలో పూజకు పుష్పాలు ఎందుకు తేలేదో, దానికి గల కారణాలేమిటో తెలుసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. యక్షులు హేమమాలి ఇంటికి వెళ్ళారు. అక్కడ మాలి దంపతులు సరస సల్లాపాల్లో మునిగిపోవడం చూశారు. తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి తాము చూసింది చెప్పారు. మహారాజ! మాలి మహాపాపి. అతి కాముకుడు. కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కలాపాలు సాగిస్తున్నాడు అని యక్షులు చెప్పిన సమాచారం విని కుబేరుడు క్రుద్దుడై వెంటనే తన సైనికులను పంపి, మాలిని రాజమందిరానికి పిలిపించాడు. హేమమాలి భయంతో వణుకుతూ యక్షపతి ముందు నిల్చున్నాడు. అతణ్ణి చూసి కుబేరుడు హద్దుల్లేని కోపానికి లోనై శపించాడు. ఓరీ పాపీ! నీచుడా! కాముకుడా! నీవు పరమ పూజనీయుడైన శివభగవానుణ్ణి తిరస్కరించావు. ఈరోజు నా పూజకు పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు. పూల గొప్పదనం నీకు తెలియదు. ఇదొక మహా అపరాధం. ఈ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించు గాక! మర్త్య లోకానికి వెళ్ళి కుష్ఠువ్యాధితో అష్టకష్టాలు అనుభవిస్తావు అని శపించాడు. కుబేరుని శాప ఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు. శ్వేత కుష్టు పీడితుడయ్యాడు. కష్టాలతో కాలం వెళ్ళదీస్తున్నాడు. మాలి భార్య కూడా భూతలానికి వచ్చి దుఃఖసాగరంలో మునిగింది. భయంకరమైన అడవిలో అన్నపానాదులు మాని నిద్రలేక తిరుగుతోంది. వ్యాధి తీవ్రమై మాలి శరీరం దుర్గంధమైపోయింది. ఒక రోజున చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు. అయితే మాలి అంతఃకరణం శుద్ధమైనది. గొప్ప రాజభక్తుడు. దైవభక్తుడు. బుద్ధిమంతుడు. అందువల్ల పూర్వజన్మ స్మృతి జ్ఞానం ఉంది.


తప్పును తెలుసుకున్నాడు. శాపవిముక్తికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే తపనతో మాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు. ఎక్కణ్ణించో తేనెటీగలు వచ్చి ముట్టడించాయి. అవి అతడిని విడిచిపెట్టలేదు. చివరకు పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకుని దేవప్రయాగకు వెళుతూ యమునోత్రి తీరానికి చేరాడు. అక్కడ ఉన్న చిరంజీవి మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు. మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమయ్యాయి. తాను చేసిన అపరాధం గురించి మాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు. స్వామీ! దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు. మార్కండేయ మహర్షి అనుగ్రహించాడు. నీవు ఏదీ దాచకుండా జరిగింది చెప్పావు. కనుక ఈ శాపం నుండి నీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెబుతాను. జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే 'యోగినీ ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి. శాపం తొలగిపోతుంది. నీకు మళ్ళీ పూర్వరూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు. ఈ మాటను విన్న హేమమాలి కృతజ్ఞతతో మార్కండేయునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి, యోగినీ ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు. మహర్షి ఆదేశాన్ని అనుసరించి హేమమాలి యోగినీ ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించాడు. వ్రత ప్రభావంతో మాలి శాపవిముక్తుడై తన దివ్యస్వరూపాన్ని పొందాడు. అడవుల్లో తిరుగుతున్న అతని భార్య సమీపించింది. దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు. ధర్మరాజా! యోగినీ ఏకాదశీ వ్రతం అనేకానేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది. 88 వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలంతో సమానమైంది. ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించడం వల్ల ఎటువంటి చర్మవ్యాధులు కూడా నివారింపబడతాయి. ముఖ్యంగా కుష్టువ్యాధి నివారణ అయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు.


వ్రత విధానం


ఏకాదశి ఆచరణలో ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఏకాదశి ముందు రోజే అనగా దశమి నాటి రాత్రి నుండి దశమి ఉదయం వరకు ఉపవాసవ్రతం పాటించాలి. ఏకాదశమి రోజు ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. శౌచాది నిత్యకృత్యాలు చేసుకోవాలి. సన్నటి మట్టితో గాని, నూనె గాని స్నానానికి ముందు పూసుకుని స్నానం చేయడం శ్రేష్ఠం. ఒక పీఠంపై శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని గాని, చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించుకోవాలి. పసుపు అక్షతలు, తామర పువ్వులు, తులసీదళాలు పూజకు వినియోగించవలెను. జాజిపూల మాలతో భగవంతుని అలంకరించవలెను. రెండు ఎర్రటి ప్రమిదలలో ఐదేసి తామర వత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లు నైవేద్యం పెట్టవలెను. విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామము, నారాయణ కవచము పఠించవలెను. తులసీ మాలతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తూర్పు దిక్కుకు తిరిగి పంచామృతంతో అభిషేకించాలి. ఈ వ్రతం మహా పుణ్యప్రదమైంది. దీనిని చదివిననూ, వినిననూ సమస్త పాపములు తొలగిపోతాయి.