పంచమ స్కంధము - ప్రియవ్రతుని చరిత్ర

పంచమ స్కంధము - ప్రియవ్రతుని చరిత్ర


భగవత్కథ అనేదానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబంధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినబడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే. స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమైన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడు బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారద మహర్షి గురుత్వం లభించింది. నారద మహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది, ఇంత భక్తిని పొంది, ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. “నాయనా! నీకు పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నీ తోడబుట్టినవాడికి, ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. అందుకని నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు అన్నాడు. ఇలా మాట్లాడటం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. అపుడు ప్రియవ్రతుడు నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరము లోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు, కామ క్రోధముల యందు, అరిషడ్వర్గముల యందు కూరుకుపోవడానికి కాదు. పైగా ఒకసారి నేను రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారూ నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు. ఈ ఈ మాట వినగానే చతుర్ముఖ బ్రహ్మ గబగబా కదిలి వచ్చాడు. ఎందుకని వచ్చాడు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్యపరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మ సృష్టించాడు. ఇపుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. అపుడు బ్రహ్మ ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమము నందు ప్రవేశించడమనేది అత్యంత ప్రమాదకరమైన చర్య కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్ర చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలాడు బ్రహ్మ. నాయనా ప్రియవ్రతా, సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు, సమస్త లోకపాలురకు, బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణమేమైనా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి ఉంటుంది. ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి.