శ్రీవేంకటేశ్వర ఉత్సవ వైభవమ్


అంజనాద్రి, నీలాద్రి, వృషాద్రి, వృషభాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వరాహాద్రి, శ్రీనివాసాద్రి, తీర్థాద్రి, కనకాద్రి, పుష్కరాద్రి, సుమేరు శిఖరాద్రి, వేదాద్రి, జ్ఞానాద్రి, ఆనన్దాద్రి ఇత్యాద్యనేక సార్థక నామములతో పురాణ ప్రఖ్యాతి గాంచిన వేంకటాద్రి (తిరుమల) యందు ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగాన్తము నందలి ఈ కలియుగమునందు విష్ణ్వర్చావతారముగా నవతరించినట్లు ఈ క్రింది ఋగ్వేద మంత్రముచే తెలియుచున్నది. “ప్రవః పాన మమసో థియాయతే | మహే శూరాయ విష్ణవేర్చత" || (ఋ 10 మండలం 155 సూక్తము 1వ మంత్రము) అర్చావతార వైభవమ్ : అర్చావతార స్సర్వేషాం బాంధవో భక్తవత్సల స్వత్మ మాత్మని సంజాతం సామిత్వం బ్రహ్మణి స్థితమ్ భక్తుడు తన ఇష్టానుసారముగా తన శక్తి ననుసరించి స్వర్ణము, రజితము, దారువు, సుధలతో భగవంతుని ప్రతిమను నిర్మించి అర్చించ వీలుగాను. దేశ, కాల, అధికార, నియమములు లేక దేవాలయములందును గృహములందును వేంచేపు చేసుకోను వీలుండును. సాధారణముగా స్వయం వ్యక్త మూర్తి దుర్లభము. కావున భగవంతుని మూర్తిని ప్రతిష్ఠించి ఆరాధింపవలయునని పద్మపురాణము తెలుపుచున్నది. అర్చావతారమున భగవంతుడు భక్తపరాధీనుడై ప్రీతిని కొలుపుతూ, మంగళకరుడై సమస్తులకు సులభముగా ఆశ్రయింప, అనుభవింప తగిన సంపూర్ణుడుగా నుండును. సురూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్న వదవేక్షణమ్ | కృత్వాత్మానః ప్రీతికరం సువర్ణ రజితాదిభిః తామర్చయేత్ తాం ప్రణయేత్ తాంనయేత్ తాంవిచిన యేత్ విగతం దోషస్తు తామేవ బ్రహ్మరూపిణీమ్ || ఉపాసకునకు ఎప్పుడు ఎచ్చట శ్రద్ధ కలిగినప్పుడు అప్పుడు అచ్చటచ్చట అర్చామూర్తులకు అర్చన చేసి తరింపవచ్చునని పురాణ ప్రబోధము. “మదర్యాం సంప్రతిష్టాప్య మందిరం కారయేద్ధృధమ్| పుష్పోద్యానాని రమ్యాణి పూజా యాత్రోత్సవాశ్రితాన్ || అని శ్రీభాగవతము నందు గూడ ప్రతిమా వైశిష్ట్యము తెలుపబడి ఉన్నది. అర్చామూర్తిని నిర్మించి, ప్రతిష్ఠించి దృఢమైన మందిరమును, , సుందర నందన వనమున నిర్మించి పూజలు, ఉత్సవాలు, యాత్రలు అవిచ్చిన్నముగా జరిపించి పర్వదినములలో గో, భూ, ధన, కనక, వస్తు వాహనములను దానము చేసినచో అష్టప్టెశ్వర్యములను పెంచుటయే గాక బ్రహ్మలోకమును పొందవచ్చుని శ్లోకసారము. - భగవంతుడు అనగా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అను ఆరు గుణములను పూర్తిగా కలవాడని అర్థము. ఆ షడ్గుణములు మంత్రములందును, భగవంతుని ప్రతిమలందును కూడ ఉండును. కావున అర్చావతార మూర్తులను కేవలం ప్రతిమలుగా భావించి అర్చించరాదు. శ్రీవేంకటేశ్వరస్వామి వారు దక్షిణ మస్తముతో తన పాదాబ్దములను శరణవరణ స్థానముగా చూపుతూ -


కటిహస్తముతో తన్ను శరణు జొచ్చిన వారికి సంసార సాగరము కటి దఘ్నమగునని కటిలోతు చూపుతూ, ఉభయ పార్శ్వముల శంఖ చక్ర ధారియై స్వయంభూ అర్చావతారమూర్తియై దర్శనమిచ్చుచున్నారు. నిత్యారాధన వైభవమ్ : శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రతినిత్యము జరుగు ఆరాధనమే ఒక వైభవము. బ్రహ్మ ముహూర్తమునకు పూర్వముగానే మహర్షి కులతిలకుడు విశ్వామిత్ర మహాముని త్రేతాయుగమునందు శ్రీరాముని మేలుకొలుపునకు గావించిన "కౌసల్యా సుప్రజారామ! పూర్వాసంధ్యా ప్రవర్తతే...” అను సుప్రభాత గీతను ప్రారంభించి ప్రతివాది భయంకర అణ్ణన్ గారు రచించిన శ్రీవేంకటేశ్వర సుప్రభాతమ్ లోని 70 శ్లోకములు (సుప్రభాతమ్-29 శ్రీవేంకటేశ్వర స్తోత్రమ్ - 11 ప్రపత్తి - 16


మంగళా శాసనమ్ - 14) పూర్తిగా మధురముగాను, మృదులముగాను, బంగారు వాకిలి వద్ద పఠింపబడుతుంది. భక్తులకు దర్శనం కల్పించిన తదుపరి ఆలయ శుద్ధి జరిగి తోమాలసేవ ప్రారంభమగును. శ్రీ జియ్యంగార్ స్వామి, అధ్యాపకులు శ్రీ ఆండాళ్ రచించిన తిరుప్పావై లోని 28 పాశురములను పఠించుచుండగా అర్చకస్వాములు జియ్యంగార్ అందించు పుష్పమాలలను, శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకాది ఉపచారములు సమర్పించిన తరువాత, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి (అలంకారప్రియావిష్ణు) కంఠమాలలు, హృదయపర్యన్త మాలలు, నాభిపర్యన్త మాలలు, కటిపర్యన్త మాలలు, జానుపర్యన్త మాలలు, పాదపర్యన్త మాలలు, కఠారిమాలలు, శంఖచక్ర మాలలు, శిరోమాలలు, శిఖరమాలలు సమర్పించు వైభవమును చూచి తరించవలసిందే గాని వర్ణింప నలవికాదు. సేవాంత్యమున మంత్రపుష్పము పఠించిన తదుపరి నక్షత్ర హారతి కర్పూర హారతి జరుగును. భక్తులకు దర్శనం కల్పించిన అనంతరం కొలువు (దర్బారు). కొలువు శ్రీనివాసమూర్తిని బంగారు వాకిలికి సమీపమున ఏర్పరచిన సింహాసనమున సువర్ణ ఛత్రము, వింజామరలు మొదలగు మహారాజ మర్యాదలతో వేంచేపు చేసి ఆరాధనోపచారములు జరిపించి ఆ దిన, పరదినమున గల తిథి వార నక్షత్ర యోగ కరణములను హుండీ ఆదాయ వివరములను ఉత్సవాది విశేషములను వినిపింపబడుతుంది. తరువాత స్వామి విగ్రహము గర్భాలయంలోకి కొనిపోబడిన తరువాత సహస్ర నామార్చన జరుగుతుంది. బ్రహ్మాణ పురాణాంతర్గతమగు శ్రీవేంకటేశ్వరస్వామి వారి సహస్రనామములు మధురాతి మధురముగా అతిశ్రావ్యంగా ఆద్యన్తములందు ప్రణవ నమస్సంపుటీ (ఓం...నమః) కరణము చేసి పఠింపబడుతుంది. వరాహ పురాణోక్తములగు లక్ష్మీ నామములతో శ్రీ భూదేవేరులకు అర్చన జరుగును.


ప్రాతర్నివేదనము బలి శాత్తుమొర జరిగిన అనంతరము సర్వదర్శనము భక్తులకు తీర్థము, శఠారి ప్రసాదములు ఇవ్వబడుతుంది. స్వామివారు, భక్తుల కష్టసుఖాలను ప్రార్ధనలను మన్నించునట్లు గోచరిస్తారు. ఇదియే సర్వదర్శన వైభవము. మాధ్యాహ్నికారాధనముగా వరాహ పురాణాన్తర్గతములగు అష్టోత్తర శతనామములు పఠింపబడతాయి. సాయంకాలారాధన క్రమంలో గూడ తోమాలసేవ, అష్టోత్తర శతనామార్చన జరిగి సర్వదర్శనము తరువాత ఏకాంతసేవ జరపడం కూడా ఒక వైభవమే. వెండి గొలుసులతో బంగారు మంచం అందులో పట్టుపరుపులు, దిండ్లు, శాటీలు ఏర్పరచి కౌతుకమూర్తి యగు శ్రీభోగ శ్రీనివాసమూర్తిని (ధనుర్మాసములో శ్రీకృష్ణుని) శయనాసనమున వేంచేపు చేసి ఫలములు, ద్రాక్ష, శర్కర, కలకండ, బాదాం పప్పు, జీడిపప్పు క్షీరములు నివేదింపబడగ, తాళ్ళపాక అన్నమాచార్య వంశస్థుల అన్నమయ్య కీర్తనలను తంబూర నాదముతో గానము చేసి స్వామివారిని నిదుర పుచ్చుదురు. తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి చివరి హారతిగా ఇవ్వబడుతుంది. - ఇలా శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రతిరోజు నిత్యకళ్యాణం పచ్చతోరణమే.


బ్రహ్మోత్సవ వైభవమ్ : ఉత్సవమనగా ఉత్సూతే హర్షం ఇతి ఉత్సవః అను వ్యుత్పత్తిచే ఆనందమును అధికముగ కనునది అని అర్ధము. శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రతి సంవత్సరం కన్యామాసంలో శుక్లపక్షమున శ్రవణా నక్షత్రం రోజు చక్రస్నాన మహత్సవాన్ని నిర్దేశించి తొమ్మిది రోజులు ముందుగా ధ్వజారోహణము, అంతకుముందు దినము అంకురార్పణ జరుపబడుతుంది. ధ్వజారోహణమాధాయ సాంకురార్పణ మేవచ అని ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఆ పరబ్రహ్మ యగు శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మ కన్యామాసంలో శుక్లపక్షమున శ్రవణా నక్షత్రం రోజున అవభృథమును సంకల్పించి బ్రహ్మ సంఖ్యాకమగు తొమ్మిది రోజులు జరిపించిన ఉత్సవమే బ్రహ్మోత్సవము. పరబ్రహ్మయగు సర్వేశ్వరుని ఉత్సవమగుట చేత బ్రహ్మోత్సవమని అంటారు. కావున ఇది సర్వకామ ప్రదమగును. ఇది వరాహపురాణంలో చెప్పబడింది. సాధారణముగా కన్యామాసము ఆశ్వయుజమాసమైనప్పుడు ఈ ఉత్సవము విజయదశమి వరకు తొమ్మిది రోజులు జరుగును. ఒకప్పుడు కన్యామాసము భాద్రపదమాసమైనప్పుడు భాద్రపదమునందును, ఆశ్వయుజము నందును కూడా జరుగును. మొదటి ఉత్సవము మామూలు బ్రహ్మోత్సవము రెండవ ఉత్సవమును నవరాత్రి ఉత్సవమందురు. ఇందులో ధ్వజారోహణము, రథము, ధ్వజావరోహణము ఉండవు. వారు రథమునకు బదులు రజిత లేక స్వర్ణ రథోత్సవము జరుపబడుతుంది. ప్రతిదినము పగలు, రాత్రి రంగమండపంలో శ్రీమలయప్పస్వామి వారిని పెద్దశేషవాహనంపై ఉభయ దేవేరులకు వేంచేపు జరిపి ఆస్థానం జరిపిస్తారు. భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మదేవుడు శ్రీ స్వామివారికి గావించిన బ్రహ్మోత్సవ వాహన క్రమము ఉత్సవ క్రమము 14వ అధ్యాయమునందిట్లు వర్ణింపబడి ఉన్నది. "తస్మిన్ మహోత్సవే విష్ణోః ధ్వజారోహణ వాసరే ప్రథమే ప్రథమం యానం మనుష్యాస్ట్రోళికాభవత్ ||


బ్రహ్మెత్సవంలో ధ్వజస్తంభ స్థాపన గ్రామాలంకరణ, ఆచార్య ఋత్విక్కుల నియమాలు, అంకురార్పణ, ధ్వజారోహణ, నవకుంభారోహణ, హేమం, వీధి ఉత్సవాలు చక్రస్నానం (అవభృథ స్నానం) ధ్వజావరోహణ అను క్రియలు ఉండును (ఈ బ్రహ్మోత్సవము 10 రోజులపాటు జరుగుతుంది). మొదటి రోజు అంకురార్పణం చేస్తారు. ఆరోజు సాయంకాలం సేనాధిపతియైన విష్వక్సేనులవారు వేదమంత్రాలతో ఆహ్వానింపబడి అంకురార్పణమునకు అవసరమగు మృత్సంగ్రహణము తీసుకొని జరుగబోవు శ్రీవారి బ్రహ్మోత్సవమును తిలకించడానికి సకల దేవతలను ఆహ్వానిస్తారు. ఊరేగింపు అనంతరం విష్వక్సేనుల వారు అనంత గరుడ సుదర్శనులతో యజ్ఞశాల యందు వేంచేసి యుందురు. జాలి, బీహి, యవ, ముద్ద మాష ప్రియంగు సర్షప గోధుమ అను ధాన్యములను పుట్టమట్టి పోసిన పాలికల యందుంచి ప్రతిదినము అర్చించెదరు. రాత్రి కాలము చంద్రునిది. చంద్రుడు ఓషధులకు అధిపతి. కావున రాత్రి చంద్రుని సాక్షిగా అంకురార్పణ చేయవలయునన్నది ఆగమశాస్త్ర ప్రమాణము. ఇది అన్ని వైదిక క్రియలకు అత్యావశక్యము. లేకున్న అన్ని కార్యములు వ్యర్థమే.


మరునాడు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీవిష్ణు పతాకం కొని గరుత్మంతునికి (గరుడ ధ్వజాన్ని) పూజలు జరిపించి ధ్వజస్తంభపు చివరకు ఆరోపిస్తారు. జగన్నాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై సర్వాభరణ భూషితుడై దివ్య నవ్య వికసిత పుష్పమాలాధరుడై తిరువీథుల ఊరేగి తిరుమలరాయ మండపం వేంచేసి యుండిన ప్రధానార్చకులు వేద ఘోషలతోను నాదస్వరాది మంగళ వాద్యములు మ్రోగుచుండ నిర్ణీత శు భముహూర్తమున ఆగమోక్తరీతిగా ధ్వజారోహణ జరుపుతారు. - వివిధ వాహనములకు ముందు అలంకరింపబడిన చిన్నరథం త్రిప్పుతుంటారు. ఇదే బ్రహ్మరథం. అంటే ఈ బ్రహ్మోత్సవాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఈ రథంలో ఉండి జరిపించుచున్నారని ఐతిహ్యము. మొదటి రోజు అనగా ధ్వజారోహణం రోజు రాత్రి సప్తశిరములతో బహుమనోహరమైన పెద్దశేష వాహనముపై శ్రీ మలయప్పస్వామి వారు శ్రీ భూ దేవేరులతో కలిసి ఊరేగుతారు. రెండవరోజు చిన్నశేష వాహనంపై శ్రీనివాసుని మాత్రమే అలంకరించి ఊరేగిస్తారు. రాత్రి పురాణ ప్రసిద్ధమైన హంసవాహనంపై ఊరేగింపు. హంసవాహనారూఢుడైన స్వామివారిని దర్శించిన వారికి సకల బాధలు తొలుగునని భక్తుల నమ్మకం. మూడవరోజు ప్రొద్దున సింహవాహనంపై శ్రీనివాసమూర్తికే ఉత్సవం జరుగుతుంది. రాత్రి ముత్యపు పందిరి వాహనంలో శ్రీ భూ దేవేరులతో ఊరేగుతారు. - నాల్గవరోజు కల్పవృక్ష వాహనారూఢుడై దేవేరులతో తిరువీథులలో ఊరేగుతూ, తన భక్తులకు ఇహ పర సుఖములను ప్రసాదిస్తారు. రాత్రి కూడా దేవేరులతో సర్వభూపాల వాహనంలో సేవ చేయిస్తారు. బ్రహ్మోత్సవంలో ఐదవరోజు చాలా ముఖ్యమైనది. ప్రొద్దున మలయప్పస్వామి వారు దంతపు పల్లకిలో మోహినీ అవతారంలో ఊరేగుతారు. వరదహస్తం ఆరోజు అభయహస్తంగా ఉంచి భక్తులను ఆదరించునట్లుగా దర్శనమిస్తారు. రాత్రి గరుడోత్సవం. శ్రీవేంకటేశ్వరస్వామివారి (మూలవిరాట్టు) అలంకారాభరణములైన లక్ష్మీహారము, మకరకంటి మొదలగు అమూల్య ఆభరణములు గరుడవాహనంలో మలయప్పస్వామి వారికి అలంకరిస్తారు. ఈనాటి రెండు వాహనసేవలను వర్ణింప నలవికాదు. తనివితీర దర్శించి తీరవలసిందే. ఆరవనాడు ఉదయం హనుమద్వాహనసేవ మధ్యాహ్నం వసంతోత్సవం సందర్భంగా జరుగు సువర్ణరథం రాత్రికి జరిగే గజవాహన సేవలలో స్వామివారు సర్వ రాజలాంఛనాలతో వైభవంగా దర్శనమిస్తారు. ఈ ఇక ఆరునొకటవ రోజు తాను సూర్య చంద్ర గోళములలోను, నివసించి “భీషోదేతి సూర్యః' అనియు పూష్ణాము చౌషధీస్యరాః, పోమో భూత్వా రసాత్మకః” అనునట్లు దర్శనమిస్తారు. శ్రీ స్వామివారు. ఎనిమిదవ రోజు ప్రొద్దున శ్రీమలయప్పస్వామి దేవేరులతో నిర్ణయిత ముహూర్తమున తిరువీథుల రథంపై ఊరేగుతారు. “రథస్తం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అన్నది పెద్దల ఉవాచ. అందుకే ఈ రోజు తిరుమల జనసందోహంతో ఉంటుంది. రాత్రి శ్రీస్వామివారు అశ్వంపై ఊరేగుతూ  అని ప్రబోధిస్తున్నట్లు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవం జయప్రదంగా జరిగిందని సూచింప తొమ్మిదవ రోజు స్వామి పుష్కరిణిలో సుదర్శన చక్రానికి అభిషేకం జరుపబడుతుంది. ఆరోజు స్వామి పుష్కరిణిలో అవభృథస్నానం చేసిన వారికి సకల పాపాలు నశిస్తాయని వారికి శాశ్వతానందం చేకూరుతుందని శ్రీవేంకటేశ్వరుడు ఈ కలియుగారంభంలో భూమండలమున అవతరించిన రోజు బ్రహ్మ సనత్కుమార సనక సనందాదులకు ఉపదేశించారని పురాణములు తెలుపుచున్నవి. సాయంకాలము ధ్వజావరోహణమునకు గాను తిరువీథి ఉత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాన్ని వర్ణింప వేయి నోళ్ళున్న ఆదిశేషునికే తరమా అన్న సంశయం ఉన్నది. కావున అందరు ప్రత్యక్షంగా శ్రీ స్వామివారి ఉత్సవాన్ని దర్శించి తరించవలసిందే. శ్రీవారి మహోత్సవమునకు ముందుగా అతి మనోహరా లంకారములతో భాసిల్లు ఊర్ధ్వ పుండ్రములను ధరించిన ఐరావతములవంటి మత్తగజములు, వినూత్నాలంకా రములతో ప్రకాశించు ఉచ్చెశ్శవముల వంటి అశ్వములు, మనోహర ఆకృతుల చేతను, అలంకారముల చేతను భాసించు వృషభములు, వైష్ణవ స్వరూపధారులై ప్రకాశించు పరివార జనములు విచిత్రగతుల ముందుగా గమనము చేయుచుందురు. ద్వాదశోర్ధ్వపుండ్ర ధారులై పవిత్ర పదాక్ష మాలా ద్యలంకృతులై శ్రీవైష్ణవులు పంక్తులు తీరి నాలాయిర దివ్య ప్రబంధములను మధుర కళారవముతో గానము చేయుచుండ - నానాదేశాగత నానా భాషా భాషణతత్పరులగు యాత్రిక భక్త సమూహములు “వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని, ఆపద మ్రొక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్యాలవాడే దురిత దూరుడే, పుట్టు గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడేవాడు” అని పరవశంతో పాడుతూ, భగవదుత్సవ సందర్శనముచే అమందానంద మందాకినీ వీచికల తారసలాడుచుండ, నాగస్వరం వాద్యవిద్వాంసులు తమ గానవాదన వైశద్య వైచిత్ర్య మాధుర్య నైపుణ్యములతో భక్తులను మైమరపించి ఆనంద డోలికలలో ఊగించుచూ, అధికారులు, అనధికారులు, వర్తకులు, నర్తకులు శ్రీపతులు, భూపతులు ఉత్సవమునందు పాల్గొనుచుందురు. పామర భక్తజనులు స్వామివారిని కీర్తింప పదములు తెలియక గోవిందా | గోవిందా! అనుచుందురు.


శ్రీవారి వెనుక వైదిక సార్వభౌములైన చతుర్వేద పారాయణ ప్రవీణులు వేదపఠన మాచరించుచుండ ఈ బ్రహ్మోత్సవ వైభవం వైభవమే.


సేవా ఫలమ్ : ప్రతి సంవత్సరం కన్యామాసంలో ఉత్సవము (ఆర్జిత బ్రహ్మోత్సవము) చేసి దేవతలు, యోగులు, మునులు, మనుజులు భూలోకమున సర్వకామములను అనుభవించి బ్రహ్మలోక ప్రాప్తి చెందుదురనియు బ్రహ్మోత్సవ సమయమును చలివేంద్రములను ఏర్పరచిన వారి హృదయము శీతలమగుననియు, అన్నదానము గావించిన వారికి (ఏడు తరాల వరకు - సప్త పురుషాంతరముల వరకు) అన్న సమృద్ధి కలుగుననియు, శాస్తోదితములైన దానము చేసినవారికి ఐహిక సుఖములు కలుగుననియు, ఇంతయేల? దర్శనార్ధమై తిరుమలకు రావడానికి ప్రయత్నించినవారికి కూడ వైకుంఠప్రాప్తి కలుగునని బ్రహ్మ గావించిన ఉత్సవమునకు సంతసించిన శ్రీనివాసుడు స్వయంగా చెప్పాడు. *** -