పురుషకార వైభవము


వేదము అపౌరుషేయము. నిర్దుష్టము, నిత్యము, స్వతః ప్రమాణము అనుట మనందరికిని తెలిసినదే. అట్టి వేదము యొక్క అర్థమును ఎరుగవలెననిన, ఋషులు దర్శించి ప్రవచించిన ఇతిహాస పురాణములు సహాయపడును. అందుచేతనే వాటిని "ఉపబృంహణములు” అందురు. ఇతిహాస పురాణములు రెండింటిలో ఇతిహాసములకే ఎక్కువ ప్రాముఖ్యము కలదనెడి ఉద్దేశము వలననే శ్రీ పిళ్ళై లోకాచార్యులవారు తమ గ్రంథమైన "శ్రీ వచన భూషణము”లో “ఇతిహాస పురాణంగళావే” అని పురాణముల కంటె ఇతిహాసములను ముందు పేర్కొనినారు. ఇతిహాసములు రెండు. శ్రీమద్రామాయణము, శ్రీ మహాభారతము అనునవి. ఈ రెండింటిలో గూడ శ్రీమద్రామాయణము శ్రేష్ఠమైనదని పెద్దలు చెప్పుదురు. ఈ ఇతిహాసము రావణుని చెరలో (బంధములో) ఉన్న సీతాదేవి యొక్క గొప్పతనమును చెప్పినది. శ్రీమహాభారతము పాండవదూతగా వెళ్ళిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనమును చెప్పినది. పురుషకార వైభవము సీతాదేవిని "పురుషకారము" అందురు. అనగా ఆమె “పురుషకార రూపిణి”. రావణుని చెరలో ఉన్న స్త్రీల కొరకు తాను చెరలో పడి, శ్రీరాముని రప్పించి, తనను విడిపించుటకు వచ్చిన రామునిచే రావణుని చంపించి, అంతకుముందే చెరలో ఉన్న అనగా బంధములో ఉన్న స్త్రీలను విడిపించుటకు, అనగా


బంధములో నున్న జీవులకు భగవానుని అనుగ్రహము కలుగుటకు సీతమ్మ ఎట్లు శ్రమించినదో శ్రీమద్రామాయణములో తెలుపబడినది. సీతాదేవి మధ్యవర్తినిగా ఉండి చెరలో నున్న స్త్రీలకు రాముని అనుగ్రహము లభించుటకు సాయపడినది. కావున ఆమెను పురుషకారము, పురుషకార రూపిణి అందురు. సర్వలోకేశ్వరుడై సర్వనియామకుడైన భగవానుడే శ్రీకృష్ణుడై అవతరించి పాండవుల కొరకు, కౌరవసభకు దూతగా వెళ్ళినాడు. ద్రౌపదికి వారు చేసిన పరాభవమును గమనించినాడు. ఆమె చేసిన శరణాగతిని గుర్తించినాడు. తాను ఎట్లైనను వారిని రక్షింపవలెనని చేసిన ప్రయత్నము శ్రీ మహాభారతములో కనిపించును. పాండవుల రాజ్యప్రాప్తికిని, విరోధి నిరసనమునకును ఉపాయము అయినాడు స్వామి. . ఈ విధములుగ ఈ రెండు ఇతిహాసముల చేతను పురుషకార వైభవము, ఉపాయ వైభవము విశదీకరించబడినది. పురుషకార వైభవము ఏ విధముగా శ్రీమద్రామాయణములో ప్రతిపాదింపబడి, వ్యక్తీకరింపబడినదో మొదట తెలుసుకొందము. శ్రీమద్రామాయణము పురుషకారముగ మధ్యవర్తినిగా ఉండే శ్రీమహాలక్ష్మి వైభవమును తెలుపుతుంది. అయితే ఆచార్యులు, భాగవతులు, భూ నీలాదేవులు కూడ భగవానుని మనసులో కలిగిన ఆగ్రహమును తొలగించి, కర్మవశమున దూరమైన జీవులను రక్షింపచేయుదురు. కావున వీరిని కూడ పురుషకారము అని అందురు. కాని పురుషకారము అని ప్రధానముగ లక్ష్మీదేవికే పేరు. మిగిలినవారు ఆమెతో చేరియుందురు కనుక వారికి గూడ ఆ లక్షణములు వచ్చినవి. ఆమె సంబంధము చేతనే వీరిని కూడ పురుషకారము అందురు. లక్ష్మీదేవి పురుషకారముగ ఉండినప్పుడు ఆమెకు “కృప”యును, "పరతంత్రత"యును “అనన్యార శేషత్వము”ను ఉండవలయును. జీవుని పరమాత్మతో చేర్చెడి మధ్యవర్తిని అగు లక్ష్మీదేవికి తప్పక ఈ గుణములు ఉండవలయును. 1. పరుల దుఃఖమును చూచి సహించలేని గుణము "కృప” అనబడును. 2. జీవుని పరమాత్మతో చేర్చవలయును కనుక ఆమె పరమాత్ముని అధీనములో ఉండునట్టి కావలయును. ఈ గుణమునే “పరతంత్రత” అందురు. 3. సర్వేశ్వరునికే తప్ప ఇతరులెవ్వరికిని ఉపయోగపడనిదై ఉండవలయును. ఇదే “అనన్యార్హత్వము” అను గుణము. . ఈ మూడు గుణములు లక్ష్మీదేవిలో ఉన్నవి అను విషయమును ఆమెకుగల “శ్రీ” అను నామమే తెలియజేయుచున్నది. “శ్రీ” అను శబ్దము “శ్రీ” అను ధాతువు నుండి ఏర్పడినది. ఈ ధాతువునకు 'ఆశ్రయించి ఉండుట' అని అర్థము. “సేవించుట” అని భావము. ఎల్లప్పుడూ ఆమె ఒకరిని సేవించుచుండును. అట్లే ఒకరిచే సేవింపబడుచుండును. భగవానుని ఆమె ఎల్లప్పుడు సేవించుచుండును. జీవులచే సేవింపబడుచుండును. . “శ్రీమతే” ఇతి శ్రీః అను వ్యుత్పత్తిని అనుసరించి "ఆశ్రయించి ఉండునది” అను అర్థము కాగా ఆమె సర్వేశ్వరునికే పరాధీనమై యుండునని భావము. దీనివలన ఆమె యొక్క “పరతంత్రత” - “అనన్యారత్వము” స్పష్టమగుచున్నది. ఈ ఈ విధముగ జీవాత్మ పరమాత్మలను కలుపుటకు అవసరమైన ఈ మూడు గుణములు లక్ష్మీదేవి యందు ఉన్నవని తెలియుచున్నది. దేవి యొక్క ఈ గుణములు భగవానునితో కలసి యున్నప్పుడును విడివడి యున్నప్పుడును ప్రదర్శింపబడుచున్నవి. 1. భగవానుని కలసి యున్నప్పుడు: - (అ) శ్రీరామచంద్రుడు వనవాసమునకు వెళ్ళు సందర్భము : సీతారాములు వనవాసమునకు బయలుదేరినారు. లక్ష్మణుడు తనను కూడ తమవెంట తీసుకొని వెళ్ళమని ప్రార్థించినాడు. శ్లో || “స బ్రతుశ్చరణ్ గాడం నిపీడ్య రఘునందనః, సీతామువాచాతియశాః రాఘవం చ మహావ్రతమ్” శ్రీరాముని పాదములు పట్టుకొని తానుకూడ వనవాసమునకు వత్తునని మొదట సీతమ్మతోనే అనినాడు లక్ష్మణుడు. తరువాత రాముని కూడ అడిగినాడు. (“రాఘవం చ”) సీతమ్మ మధ్యవర్తిని అయి రాముని చేత లక్ష్మణుని విన్నపమును అంగీకరింపచేసినది. (ఆ) ఇక రెండవ సన్నివేశము : - పంచవటి నిర్మాణ సందర్భము శ్రీరాముడు లక్ష్మణునితో పంచవటిని నిర్మించుమనినాడు. స్వతంత్రించి ఆ పనికి పూనుకొనుట స్వరూపహాని అని లక్ష్మణుడు తలచి "నేను తమకు పనిముట్టు వంటివాడిని. మీకు నచ్చిన ప్రదేశములో నాతో కుటీరమును నిర్మించుకొనండి” అనినాడు. సీతమ్మ కూడ లక్ష్మణుని వాక్యములనే బలపరచినది. రాముడు అంగీకరించినాడు. పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించినాడు. లక్ష్మణుడు శరణాగతుడు కాగా సీతమ్మ పురుషకారమువలననే రాముడు లక్ష్మణుని ప్రార్థనను అంగీకరించినాడు.


(ఇ) ఇక మూడవ సన్నివేశము : ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాకి రూపముతో వచ్చి సీతమ్మ వక్షస్థలమును గాయపరచుటచే శ్రీరాముడు దర్భను బ్రహ్మాస్త్రముతో మంత్రించి వదలినాడు. ఆ కాకమును ముల్లోకములలో ఎవరునూ రక్షించలేదు. తుదకు “శరణు శరణు” అనుకుంటూ అతడు రాముని పాదముల చెంత వ్రాలినాడు. అయితే ఇంకనూ అహంకారము నశింపక శ్రీరాముని పాదముల వైపు తలలేకుండా పడినాడు జయంతుడు. కాని రాముడు ఆలోచించుచున్నాడు. అప్పుడు సీతమ్మ ఆ కాకము యొక్క తలను శ్రీరాముని పాదముల వైపు త్రిప్పినది. రాముడు ఆ కాకమును రక్షించినాడు (పద్మపురాణాంతర్గత విశేషము). కన్ను మాత్రము పోవునట్లు చేసి జయంతుని రక్షించినాడు. ఈ విధముగా భగవానునితో కలిసియున్నప్పుడు శ్రీదేవి (సీతమ్మ) తన పురుషకార గుణమును చాటినది. - 2.ఇక సీతమ్మ రామునితో విడివడి యున్నప్పటి సన్నివేశములు: సీతాదేవి శ్రీరామునితో మూడు పర్యాయములు విడివడి యున్నది. మొదట విడివడి యున్నప్పుడు తన “కృప”ను ప్రకటించింది. రెండవసారి “పరతంత్రత"ను ప్రదర్శించినది. మూడవమారు “అనన్యార్హత"ను ప్రదర్శించినది. ఆమె తన పురుషకార గుణములను ప్రదర్శించుటకే ఆ విధముగా స్వామినుండి విడివడి యున్నది. పురుషకారముగా ఉండి జీవులను పరమాత్మతో చేర్చెడి లక్ష్మీదేవియే రామావతారములో సీతాదేవిగా అవతరించినది. శ్రీమహావిష్ణువు ఏవిధమైన దేహములను తాల్చునో ఆ దేహమునకు తగినట్లు తన శరీరమును ఏర్పరచుకొని లక్ష్మీదేవి కూడ ఉండును.


తాను మధ్యవర్తినిగా ఉండుట తన స్వరూపమని మనకు తెలియజేయుటకు సీతాదేవి మూడుసార్లు స్వామిని వీడి యున్నదని తెలుసుకున్నాము. ఆ సన్నివేశములు ఏవో తెలుసుకొందము.


(అ) దండకారణ్యములోని సన్నివేశము : శ్రీరాముడు, లక్ష్మణుడు ఇద్దరు కుటీరములో లేనప్పుడు రావణుడు సీతను రాముని నుండి విడదీసి లంకకు తీసుకొని వెళ్ళినాడు. ఇది మనకు కనిపించునది. కాని ఇది ఒక “మిష” మాత్రమే. సీతాదేవియే అట్లు కావలయుననియే శ్రీరాముని వీడి లంకకు చేరినది. అంతకు పూర్వమే రావణునిచే బంధింపబడియున్న ఎందరో స్త్రీలను విడిపించుటకే ఆమె లంకకు చేరినది. ఆమె తన “దయాగుణము”ను ప్రకాశింపజేయుటకే అట్లు చేరినది. ఈ విధముగా సీతాదేవియే స్వయముగా లంకకు చేరినదనుటకు ఉదాహరణములలో మొదటిది 'త్రిజట” తన స్వప్న వృత్తాంతమును వివరించిన సన్నివేశము. త్రిజట తన స్వప్న వృత్తాంతమును వివరించగా దానిని విని సీతాదేవి చుట్టునూ ఉన్న రాక్షస స్త్రీలు భయపడినారు. అప్పుడు సీతాదేవి వారితో “మీకు బాధ కలిగిననాడు మిమ్ములను కాపాడుటకు నేనున్నాను” అని చెప్పినది. ఇది ఆమె దయాగుణ ప్రకాశకము. ఇక రెండవది రావణ వధానంతరము ఆ శుభవార్తను చెప్పుటకు హనుమంతుడు సీతాదేవి వద్దకు వచ్చినాడు. “ఇంతవరకు నిన్ను బాధించిన ఈ రాక్షస స్త్రీలను హతమార్చుతాను” అనినాడు. కాని సీతాదేవి హనుమతో “హనుమా! వారు తమ రాజు యొక్క ఆజ్ఞను పాలించుటకు నన్ను హింసించినారు. అంతేకాని పగ చేత కాదు” అని వారిని హతమార్చకుండా హనుమంతుని వారించినది. ఇది కూడ సీతాదేవి యొక్క దయాగుణ ప్రకాశకమే. చేరినదనుటకు (ఆ) శ్రీరామచంద్రుని పట్టాభిషేకానంతర సంఘటన : a రావణ వధానంతరము శ్రీరామచంద్రుడు అయోధ్యకు మరలివచ్చి పట్టాభిషిక్తుడైనాడు. సీతమ్మ గర్భవతి అయినది. శ్రీరాముడు సంతసించినాడు. సీతమ్మ కోరికను తీర్చుటకు ఉత్సాహపడినాడు. “నీ కోరిక ఏమిటి” అని అడిగినాడు. “గంగా తీరమందలి తపశ్శాలురగు ఋషుల ఆశ్రమములను సేవించి అక్కడ ఒక్క రాత్రి యైనను ఉండవలయునని కోరుచున్నాను” అనినది. ఇంతలో ఎవరో లోకులు అనరాని మాటలు అనుట జరిగినది. లోకాపవాదమును పరిహరించుటకు సీతమ్మను పరిత్యజించినాడు శ్రీరామచంద్రుడు. ఇది రెండవమారు ఆమెకు స్వామినుండి కలిగిన ఎడబాటు. రాముడు కోరినట్లే తాను ఎడబాసి తన "పరతంత్రత"ను ప్రకాశింపచేసినది. సీతకూడ శ్రీరాముని మనసును అనుసరించి ఉండుటయే తన కర్తవ్యమని నిర్ణయించుకొనినది. (ఇ) ఇక మూడవది అవతార సమాప్తి సన్నివేశము: ఇక మూడవసారి వాల్మీకి ఆశ్రమమునుండి తిరిగి వచ్చి సీతమ్మ భూమిలోనికి వెడలిపోవుట. ఇది అవతార సమాప్తి సన్నివేశము. శ్రీరాముడు అశ్వమేధ యాగము చేయుచున్నాడు. లవకుశు లు అచటికి వచ్చి రామాయణ గానము చేసినారు. రాముడు వారిని సీతాదేవి కుమారులే అని గుర్తించినాడు. సీత ఇక్కడికి వచ్చి తన పరిశుద్దిని ఈ సమాజమునకు నిరూపించవలెనన్నాడు. లోకము కొరకు ఒక నిదర్శనము చూపవలెనన్నాడు. అప్పుడు సీతమ్మ కాషాయమును దాల్చి, చేతులు జోడించి నేలవైపు చూపుచు, “నేను శ్రీరాముని తప్ప వేరొక పురుషుని మనసులో కూడ తలచి ఎరుగను అనునది సత్యమైనచో భూదేవి తనలో నేను చేరుటకు నాకు అవకాశమును ఇచ్చుగాక” అని మూడుసార్లు అనినది. అట్లు అమె ప్రతిజ్ఞ చేయగానే భూమి బ్రద్దలు అయి, లోనుండి ఒక దివ్య సింహాసనము వచ్చినది. దానిపై భూదేవి సర్వరత్నభూషిత అయి దివ్యకాంతితో ప్రకాశించుచు కూర్చుని యున్నది. ఆమె దిగి వచ్చి సీతమ్మను తన చేతులలో పొదివి పట్టుకొని “అమ్మా రమ్ము” అని స్వాగతము చెప్పి సింహాసనమున కూర్చుండబెట్టుకుని తీసుకొనిపోయినది. పుష్పవర్షము కురిసినది. ఈ ఇటు అవతార సమాపి చేసి సీతాదేవి తనంత తానే వైకుంఠము చేరినది. ఆమె ప్రతిజ్ఞ సత్యమని ఋజువైనది. ఆమె రాముని తప్ప వేరొకరిని పొందునది కాదు అని స్పష్టమైనది. ఇదే "అనన్యారత్వము”. అమె “భాస్కరేణ ప్రభా యథా” కదా!. ఇట్లు తన పురుషకారత్వ గుణములను లోకమునకు ఎరిగించుటకే సీతమ్మతల్లి తనంతతానే మూడు మారులు రామునితో విడివడినది. అందువలననే శ్రీమద్రామాయణము "పురుషకార” వైభవమును ప్రకాశింపజేయు ఉత్తమ ఇతిహాసమని పెద్దలు అందురు.


పురుషకార స్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మి స్వామితో కలసియున్న స్థితిలో సర్వేశ్వరుని మనసు యొక్క స్పూర్తిని జీవునివైపు అభిముఖము చేయును. ఆమె నిత్యానపాయినియే. కాని జీవుని భగవానుని వైపు అభిముఖుని చేయుటకు తాను స్వామినుండి విడివడి జీవుని దిద్దుబాటు చేయును. "న కశ్చిన్నాపరాధ్యతి” - “తప్పు చేయని వారెవరుందురు స్వామీ!” అని నచ్చచెప్పి స్వామిని జీవునివైపు అభిముఖుని చేయును. “నీవు భయపడకు. నీ అపరాధ సహస్రములను స్వామి క్షమించి నిన్ను రక్షించును. అట్టి క్షమాగుణ సంపన్నుడు స్వామి. నీవు సర్వాత్మనా శరణాగతి చేయుము” అని చెప్పి జీవుని భగవానునివైపు అభిముఖుని చేయును. ఈ విధముగా లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణి అయి అనగా జీవాత్మ పరమాత్మలకు మధ్యవర్తిని అయి జీవుని సర్వేశ్వరునితో చేర్చును. అట్టి ఆమె యొక్క వైభవమే "పురుషకార వైభవము”.