గత సంచిక తరువాయి దశమ అధ్యాయము శ్రీ పరాశరుడు చెబుతున్నాడు - నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆరుగురు పుత్రులు. వారు బల పరాక్రమవంతులు. యతి రాజ్యం వద్దన్నాడు. యయాతి రాజైనాడు. శు క్రాచార్యుని కూతురైన దేవయానిని, వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను. వివాహమాడాడు. ఇక్కడ వంశకీర్తనము ఉంది. దేవయానికి యదువు, దుర్వసుడు అని ఇద్దరు కుమారులు. శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అని ముగ్గురు కుమారులు. శుక్రుని శాపం వలన కొద్దికాలంలోనే యయాతి , ముసలితనాన్ని పొందినాడు. తిరిగి శు క్రుడు అనుగ్రహించినందువలన యయాతి తన ముసలితనాన్ని తీసుకోవటానికి పెద్ద కుమారుడైన యదును అడిగాడు. ఓ వత్సా! మీ తాతగారి (తల్లి తండ్రి) శాపం వల్ల ఈ ముసలితనం అకాలంలో (ముసలితనం రావలసిన కాలానికన్నా ముందే) నాకు సంక్రమించింది. ఆ ముసలితనాన్ని నేను, ఆతని దయ వల్లనే నీకు వచ్చేట్టు చేస్తాను. ఒక వేయి సంవత్సరాలు అట్లా ఉంటాను. విషయ సుఖాలతో ఇంకా తృప్తి నందలేదు. అందువల్ల నీ వయస్సుతో నేను విషయ సుఖాన్ని అనుభవింపదలచాను. దీన్ని నీవు కాదనవద్దు. అని అనగా ఆ యదువు తండ్రి ముసలితనాన్ని తీసుకోవటానికి ఒప్పుకోలేదు. అతనిని తండ్రి శపించాడు. నీ సంతానానికి రాజ్యార్హత లేదు అని. పిదప దుర్వసుని, ద్రుహ్యుని, అనుని కూడా యయాతి ముసలితనాన్ని తీసుకొమ్మని, తనకు వారి యవ్వనాన్ని ఇమ్మని ప్రార్థించాడు. వారిలో ఒక్కరు కూడ అంగీకరించనందువలన వారిని శపించాడు. చివర శర్మిష్ఠ కుమారుడైన అందరికన్నా చిన్నవాడైన పూరువును అట్లాగే అడిగాడు. అతడు చాలా వినయంతో, గౌరవపూర్వకంగా తండ్రికి నమస్కరించి, ఇది నాకు మీరు చూపిన గొప్ప దయ అని పలికి తండ్రి ముసలితనాన్ని తీసుకున్నాడు. తన యవ్వనాన్ని తన తండ్రికిచ్చాడు. అతడు పురు యవ్వనాన్ని పొంది, ధర్మానికి , . విరుద్ధం కాకుండా కోరిక కల్గిన రీతి, . కాలానికి తగ్గట్టుగా చేకూరిన, ఉత్సాహాన్ననుసరించి, విషయములందు సంచరించాడు (విషయ సుఖం అనుభవించాడు). చక్కగా రాజ్యపాలన చేశాడు. విశ్వాచితో (అప్సరస) దేవయానితో కూడా సుఖాన్ని అనుభవించి కామములకు అంతం చూస్తానని ప్రతిరోజు ఆ విషయాలే ఆలోచించాడు. ప్రతిరోజు సుఖానుభవం వల్ల కామములు చాలా అనుభవించదగినవి అని అనుకున్నాడు. పిదప ఇట్లా చెప్పాడు. కామమనేది కామములను అనుభవించుట వల్ల ఎన్నడూ శాంతించదు. అగ్నినేమితో వర్ధిల్లినట్లు అనుభవంతో కామం పెరుగుతుంది. భూమి మీదున్న జొహి (ధాన్యము), యవలు, బంగారము, పశు వులు, స్త్రీలు ఏ ఒక్కనికీ సరిపోవు (భూమి మీదున్న ఇవన్నీ ఏ ఒక్కనికిచ్చినా వాడు సరిపోలేదంటాడు. వాటి మీద ఆశ మనిషికి అంత ఉంటుంది). కనుక అత్యాశను వదలాలి. మనిషి ఎప్పుడైతే సర్వప్రాణుల యందు రాగ ద్వేషాది భావాన్ని పొందకుండా సమదృష్టిగా ఉంటాడో (సుఖ దుఃఖాలను, రాగద్వేషాలను రెంటిని ఒకేరీతిగా అనుభవించాలి) అప్పుడు ప్రపంచమంతా పురుషునకు సుఖమయంగా కనిపిస్తుంది. దుర్మతులకు విడువడానికి సాధ్యంకాని శరీరం క్షీణిస్తున్నా క్షీణించనట్టి తృష్ణను బుద్ధిమంతుడు వదిలిపెట్టాలి. సుఖంతోనే ఉంటాడప్పుడు. శరీరం క్షీణిస్తుంటే వెంట్రుకలు తెల్లబడుతాయి, రాలిపోతాయి. పండ్లు నోటిలోని ఊసిపోతాయి. కాని ధనం మీది ఆశ, బ్రతుకు మీది (బ్రతకాలనే) ఆశ మాత్రం
(సశేషం)