శ్రీ వేంకటాచల మాహాత్మ్యం


గత సంచిక తరువాయి


శ్రీ పద్మావతీ శ్రీనివాస కళ్యాణం 1. ఆకాశరాజ జననం : శ్రీ పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వృత్తాంతాన్ని వరాహస్వామి, భూదేవికిలా వివరించాడు - వసుంధరా!  నాలుగు యుగాలతో కూడిన మహాకాలం గడువగా ఇరవై ఎనిమిదవ మహాయుగంలో, ద్వాపర యుగాంతంలో మహాభారత యుద్ధం జరిగిన తరువాత విక్రమార్కుడు మొదలగు రాజులు, శకులు, శూద్రాదులు నన్నెరుగకుండా స్వర్గలోకానికి వెళతారు. ఆ తరువాత చంద్రవంశంలో జన్మించిన మహారథుడైన రాజు మిత్రవర్మ తుండీర మండలంలోని నారాయణపురంలో నివసిస్తాడు. అతడు రాజై ధర్మంగా భూమిని పరిపాలిస్తుండగా అతని భాగ్యోదయం వలన భూమి దున్నకనే అన్నివిధాలా పంటలతో అలంకరించబడేది. ప్రజలంతా ఈతిబాధలు లేక ధర్మనిరతులై ఉండేవారు. అతనికి పాండ్యరాజు పుత్రిక మనోరమతో వివాహం జరిగింది. అతనికి కులభూషణుడైన ఆకాశరాజనే పుత్రుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడు కాగా అతనికి శకవంశంలో పుట్టిన 'ధరణి' అనే రాజకుమార్తెతో వివాహమైంది. కుమారునియందు రాజ్యభారముంచి మిత్రవర్మ వేంకటాద్రి సమీపంలో ఉన్న పుణ్య తపోవనానికి వెళ్ళాడు. 2. వద్మావతి ఆవిర్భావం : సార్వభౌముడైన ఆకాశరాజు ఏకపత్నీవ్రతుడై రాజ్యపాలన యందు ఆసక్తి కలవాడై ఆరణి నదీతీరంలో యజ్ఞం కొరకు భూమిని బంగారు నాగలితో దున్నుతున్నాడు. ఆ యజ్ఞభూమిలో ధాన్యపు గింజలను చల్లుతుండగా ఆ భూమినుండి పద్మశయ్యపై పరుండిన అందమైన సర్వలక్షణ సంపన్నమైన ఆడశిశువు బయటపడింది. మేలిమి బంగారు బొమ్మవలె విరాజిల్లుతున్న ఆ పాపను ఆ మహారాజు ఆశ్చర్యంగా వికసించిన నేత్రాలతో చూశాడు. 'ఈమె నా బిడ్డయే' అని ఆమెను ఎత్తుకొని మంత్రులతో కూడ ఆనందించాడు. అప్పుడు అశరీరవాణి రాజుతో 'ఈమె నిజంగా నీ బిడ్డయే. ఈ సులోచనను చక్కగా పెంచుకో' అని చెప్పింది. అంతట సంతుష్టుడైన రాజు బిడ్డతో పాటు తన పట్టణానికి వెళ్ళాడు. తన రాణి ధరణీదేవితో 'భగవంతుడు ప్రసాదించిన, భూమినుండి ఆవిర్భవించిన ఈ బిడ్డను చూడు. సంతానంలేని మనకు ఈమెయే పుత్రిక' అని పలికి ఆకాశరాజు సంతోషంతో ఆ బిడ్డని ధరణీదేవి చేతికిచ్చాడు. 3. వసుదానుని జననం : ఆ బాలిక గృహంలో ప్రవేశించిన శు భముహూర్తబలం వలన ధరణీదేవి గర్భం ధరించింది. ఆకాశరాజు సంతుష్టుడై స్నేహదృష్టి కల ఆమెను చూసి 'సుందరీ! నా సంతానలత ఫలించింది కదా!” అన్నాడు. అంత ఆ ధరణీదేవి సకాలంలో ప్రశస్తమైన ముహూర్తంలో ఐదు గ్రహాలు తమ తమ ఉచ్చస్థానాలలో ఉండగా, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించగా పుత్రుని కనింది. అప్పుడు దేవదుందుభులు మ్రోగాయి. ఆ సౌధంపై పుష్పవృష్టి కురిసింది. ఆ సుపుత్రుడు ఉదయించిన రోజున వాయువు చల్లగా వీచింది. కుమారుడు కలిగిన వార్తను చెప్పిన వారికి ఆకాశరాజు పరమప్రీతుడై ఛత్రచామరాలు తప్ప సర్వస్వాన్ని దానం చేశాడు. కోటి కపిల గోవులను, వందలకొలది వృషభాలను దానం చేశాడు. పన్నెండవ రోజున జాతక కర్మాది క్రియలు నిర్వర్తించి అతనికి 'వసుదాను'డనే నామకరణం చేశాడు. ఆకాశరాజు పుత్రుడైన వసుదానుడు మనోరంజకుడై శు క్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి చెందాడు. వేదవిదులైన గురువులచే అతనికి ఉపనయనం కావించారు. అతను వినయశీలుడు. తండ్రి నుంచి అస్త్ర శస్త్రాలను మంత్రసహితంగా నేర్చుకొన్నాడు. నాలుగు పాదాలతో కూడిన ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకొన్నాడు. ఆ బలశాలియైన పుత్రుని సహాయంతో తండ్రి శత్రువులను ఎదిరించుటకు సాధ్యం కానివాడయ్యాడు. ఆకాశం వలె నిష్కళంకుడై గ్రీష్మంలో వైశాఖమాసంలో మధ్యాహ్నకాల సూర్యునివలె ఆకాశరాజు శత్రువులకు సహింపరానివాడు, చూడశక్యంకాని వాడయ్యాడు. 4. నారదుని ఆగమనం : భూదేవి వరాహస్వామితో "స్వామీ! ఆకాశరాజు పుత్రుని పేరు చెప్పారు. కాని అయోనిజ అయిన ఆ పుత్రికకు ఏమి నామకరణం చేశారో తెలుపవలసింది” అని కోరగా జగత్ర్పభువైన వరాహస్వామి "భూదేవీ! బుద్ధిశాలియైన ఆకాశరాజు కమలంలో శయనించిన ఆ భూపుత్రికకు “పద్మిని” అని నామకరణం చేశాడు. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానురాలై యౌవనవంతురాలయింది. ఆమె ఒకనాడు సఖులతో కూడి చిలుకలు, కోకిలల కూజితాలతో ప్రతిధ్వనిస్తున్న ఉద్యానవనంలో విహరించటానికి వెళ్ళింది. తలవని తలంపుగా అక్కడికి వచ్చిన నారదమహర్షి ఆ పూదోటలో వనలక్ష్మివలె ఉన్న పద్మావతిని చూసి ఆశ్చర్యంతో “బాలా! నీవెవరి బిడ్డవు? నీ చేతిని నాకు చూపించు” అని అడుగగా ఆ సుందరాంగి నారద మహర్షితో “పూజ్యుడా! నేను ఆకాశరాజు కుమార్తెను” అని తన హస్తమును ఆయనకు చూపించి సాముద్రిక లక్షణాలను, వాటి ఫలితాలను చెప్పమని కోరింది.


5. పద్మావతి సాముద్రికం : అప్పుడు నారద మహర్షి పద్మావతిని చూసి ఆమెతో "ఓ చారువదనా! సుభూ! నీ లక్షణాలను చెబుతాను విను. నీ పాదాలు ఎల్ల తామరరేకులచే చిహ్నితాలైనాయి. పాదాల వేళ్ళు సమంగా ఎఱ్ఱగా ఉన్నాయి. నీ భుజాలు పూలమాలలవలె పొడవుగా కోమలంగా ఉన్నాయి. వీపు విశాలంగా ఉంది. నడుము సన్నగా ఉంది. కంఠం పొడవుగా ఎఱ్ఱగా ఉంది. భుజాలు కొంచెం వంగి మంగళకరాలై ఉన్నాయి. ముఖం ప్రసన్నమై కళంకంలేని చంద్రునివలె ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళు బంగారు అద్దాలవలె ఉండి కుండలాల కాంతితో ప్రకాశిస్తున్నాయి. నాసిక నువ్వు పువ్వువలె నున్నది. లలాటం నల్లని ముంగురులతో శోభిస్తూ కళంకరహితమైన అష్టమినాటి చంద్రుని వలె అతి మనోహరంగా ఉంది. నీ శిరస్సు నున్నని


అంతట పద్మావతీదేవి చెలికత్తెలు పద్మావతితో “వసంతకాలం వచ్చింది. కావున మనం అందమైన ఈ పూదోటలో పూలు కోద్దాం” అని చెప్పి పద్మావతితో కూడ ఆ వనంలో పూలు కోస్తూ అటు ఇటు విహరిస్తున్నారు. అంతలో వాళ్ళు తెల్లని రెండు దంతాలు గల, కపోల పార్శ్వాల్లో మదధారలను స్రవిస్తున్న ఒక మత్తగజాన్ని చూశారు. అది చాలా ఎత్తుగా ఉంది. అది ఏనుగు గుంపుతో కూడి ఉంది. ఒంటినిండా దుమ్ము నింపుకొని ఉంది. తొండంతో నీటిని పూత్కరిస్తున్నది. ఆ మదగజాన్ని చూసి భయపడిన వాళ్ళు ఒక చెట్టుచాటుకు చేరారు. 6. శ్రీనివాసుని రాక : ఇంతలో వారు కళంకరహితమైన చంద్రబింబం వలె తెల్లనిది, బంగారు ఆభరణాలచే అలంకరించబడిన ఒక హయరాజాన్ని (గుజ్రాన్ని) చూశారు. ప్రకాశించే మెరుపుతీగెతో కూడిన శరత్కాల మేఘం వలె మిక్కిలి ఎత్తైన గుట్టాన్ని మన్మథాకార తేజస్సు కలిగిన నీలవర్ణుడైన పురుషుడొకడు అధిరోహించి ఉన్నాడు. అతడు పుండరీకదళాల వంటి విశాల నేత్రాలు కలిగి ఉన్నాడు. నల్లని వెంట్రుకలను పలుచని దారంతో చుట్టాడు. చెవులకు పద్మరాగమణుల కాంతితో ప్రకాశిస్తున్న కుండలాలు, ఒక చేతిలో సువర్ణఖచితమైన శారజ్ఞమనే దివ్యధనుస్సును, మరొక చేతిలో బంగారు బాణాన్ని కలిగి ఉన్నాడు. నడుముకు పచ్చని పీతాంబరాన్ని కట్టుకున్నాడు. ఇంకను రత్నఖచితమైన కంకణాలు, భుజకీర్తులు, మొలత్రాడును ధరించాడు. విశాలమైన వక్షస్థలంలో శ్రీవత్సం కలిగి ఉన్నాడు. భుజంపై బంగారు యజోపవీతాన్ని ధరించాడు. అటువంటి ఒక దివ్యపురుషుడు ఈహా మృగాన్ని వెంబడిస్తూ అక్కడికి వచ్చాడు.


మనోహరుడైన ఆయనను చూసి ఆ స్త్రీలు ఆశ్చర్యచకితులై అక్కడే నిలబడిపోయారు. అశ్వారూఢుడైన అతనిని చూసి ఆ గజరాజు తలవంచి తొండాన్ని పైకెత్తి గర్జిస్తూ వనానికి వెళ్ళింది. ఆ ఏనుగు వెళ్ళగా ఈహామృగాన్ని వెదుకుతూ ఆ గుఱ్ఱం పైనున్న వ్యక్తి పూదోట సమీపానికి వచ్చాడు.


7. వరస్పర సంభాషణ : ఆ అశ్వంపై నున్న వ్యక్తి ఆ కన్యలను సమీపించి "ఇక్కడకు ఈహామృగం వచ్చిందా? మీరెవరైనా చూశారా? లేదా? చెప్పండి” అని అడిగాడు. అప్పుడా కన్యకలు అతనితో “మేమెటువంటి మృగాన్ని చూడలేదు. నీవు శ్రేష్ఠమైన ఈ ధనుస్సును ధరించి మా ఈ వనానికి ఏల వచ్చావు? ఓ నిషాదాధిపా! ఇక్కడ మృగాలను చంపరాదు. ఆకాశరాజు కుమార్తె పోషణలో ఉన్న ఈ పూతోటనుంచి వెంటనే వెళ్ళు” అన్నారు. వారి మాటలు విన్న అతడు గుఱ్ఱం దిగి “మీరెవరు? బంగారు పద్మంవలె ఉన్న ఈ సుందరాంగి ఎవరో నాకు చెప్పండి. అది విన్న తరువాత నేను నా స్వస్థానమైన పర్వతానికి వెళతాను” అన్నాడు. అది విని భూపుత్రి చెప్పగా చెలికత్తె పర్వత నివాసియైన ఆ నిషాదునితో “ఈమె ఆకాశరాజు తనయ. భూమినుండి ఆవిర్భవించింది. మాకు నాయకురాలు. ఈమె పేరు పద్మావతి. ఓ సుందరుడా! నీ పేరేమి? నీవెవరి కుమారుడవు? నీ జాతి ఏమిటి? నీవెక్కడ ఉంటావు? నీవిక్కడికెందుకు వచ్చావు? చెప్పు? అని అడుగగా అతడు మందస్మిత వదనారవిందుడై వారితో - “మాది సూర్యవంశమని పెద్దలు చెబుతారు. ఎవరి నామాలైతే అనంతాలో, వాటిని స్మరించినంత మాత్రాన్నే మానవుల పాపాలను పోగొడతాయో, అట్టి నన్ను పేరును బట్టి, రంగును బట్టి కూడా "కృష్ణు”డని తపోధనులంటారు. బ్రహ్మద్వేషులకు, దైవద్వేషులకు ఎవరి చక్రం భయాన్ని కలిగిస్తుందో, ఎవరి శంఖధ్వనిని విన్న మాత్రం చేతనే శత్రువులు మోహితులవుతారో, దేవతల్లో కూడా ఎవరి ధనుస్సుకు సమానమైన మరొక ధనుస్సు లేదో అట్టి నన్ను “వీరపతి” అంటారు. నేను శ్రీవేంకటాచలంపై ఉంటాను. ఆ పర్వతం నుండి నేను కిరాత మిత్రులతో కూడి వేటాడుతూ గుఱ్ఱంపై ఎక్కి మీ వనానికి 63 లిలి వచ్చాను. నేనొక మృగాన్ని వెంబడిస్తూ వచ్చాను. కాని, అది వాయువేగంతో పరిగెత్తింది. దానిని వెదుకుతూ వచ్చిన నాకు ఈ వనంలో ఈమె కనబడింది. ఈమె నాకు లభిస్తుందా?” అనగా అతని మాటలు విన్న సఖులు కోపంతో “ఆకాశరాజు నిన్ను చూసి చేతికి సంకెళ్ళు వేసి తీసుకొని వెళ్ళకముందే నీవు వెంటనే నీ నివాసానికి వెళ్ళు” అని భయపెట్టగా అతడు శీఘ్రంగా వెళ్ళే తన గుజ్జాన్నెక్కి తన మిత్రులతో కూడి వెంటనే పర్వతానికి వెళ్ళాడు. 8. శ్రీనివాసుని మోహం : శ్రీనివాసుడు తన నివాసానికి వెళ్ళి గుఱ్ఱం దిగి కిరాతరూపంలో తన చుట్టూ ఉన్న దేవతలందరినీ విశ్రమించండి అని చెప్పి పంపించి, తాను మణిమండపాన్ని ప్రవేశించి, మణిమయ సోపానమెక్కి ఐదు ద్వారాలు దాటి, ముత్యాల గృహానికి వెళ్ళి అక్కడ అందమైన నవరత్న ఖచితమైన తల్పం పైన వివశుడై విశ్రమించాడు. మాటిమాటికి తామరపూవు వంటి కాంతి, విశాలమైన నేత్రాలు, సన్నని నడుము, మందస్మిత వదనారవిందం కల, పద్మం నుండి పుట్టిన పద్మావతిని సాలకడలి నుండి పుట్టిన సాక్షాత్తు లక్ష్మిగా భావిస్తూ ఆమెయందు లగ్నచిత్తుడై శ్రీనివాసుడు మోహాన్ని చెందాడు.


ఆ తరువాత మధ్యాహ్న సమయంలో వకుళమాలిక తన సఖులైన పద్మావతి, పద్మపత్ర, చిత్రరేఖలతో కూడి మంచి వ్యంజనాలతో సుగంధ పరిమళాలతో కూడిన దేవయోగ్యమైన దివ్యమైన శుద్దాన్నాన్ని, క్షీరాన్నాన్ని, బెల్లపు పొంగలిని, ఐదు రకాల పిండివంటలను, పూరీలను, వడలను, అప్పములను తయారు చేసి తీసుకొని శ్రీనివాసుని వద్దకు వచ్చింది. ఆ సఖులను ద్వారం వద్దనే ఉంచి వకుళమాలిక శ్రీనివాసుని సమీపించి భక్తితో నమస్కరించింది. ఈ రత్నాలంకృతమైన పర్యంకంపై మోహంతో పరవశుడై ఉన్న శ్రీనివాసుని చూచి పాదాలనొత్తి నిమీలిత నేత్రుడై పరధ్యానంగా ఉన్న అతనిని మందస్మితంతో - "దేవాదిదేవా! పురుషోత్తమా! లెమ్ము! పవళించి ఉన్నావేమి? మాధవా! పరమాన్నాన్ని సిద్ధం చేశాను. భుజించుటకు రమ్ము. నీవు రోగివలె శయనించడానికి కారణమేమిటి? లోకంలోని వారందరి ఆర్తిని పోగొట్టే దేవదేవా! వేటకై అడవిలో తిరుగుతున్న నీవు ఏమి చూశావు? విశాలాక్షా! నీ అవస్థ చూస్తే కాముకుని అవస్థ వలె ఉంది. దేవకన్యనేమైనా చూశావా? లేక మానవకాంతను గాని నాగకన్యకను గాని చూశావా? నీ మనస్సును దోచిన ఆ కన్యక ఎవరో చెప్పు” అని అడిగింది. ఆమె మాటలు విని శ్రీనివాసుడు గట్టిగా నిట్టూర్చాడు. ఆ విధంగా నిట్టూరుస్తున్న శ్రీనివాసుని చూసి వకుళమాలిక మరల “ఓ పురుషోత్తమా! నీకు కూడా మనోహారిణి అయిన ఆమె ఎవరు?” అని అడుగగా శ్రీనివాసుడు "యథార్థ విషయాన్ని చెబుతాను విను” అని ఇలా చెప్పాడు. (సశేషం)