శ్రీ రామాయణ  రత్నాకరం


బాలకాండ అనగనగా అదొక ఆశ్రమం. సమయం ప్రాతఃకాలం. దేవర్షి నారదుని రాక చూశాడు వాల్మీకి. లేచి ఎదురేగాడు. స్వాగతం పలికాడు. అర్ఘ్యం ఇచ్చాడు. పాద్యం ఇచ్చాడు. పూజించాడు. సుఖాశీ నుణ్ణి చేశాడు. జిజ్ఞాసతో ప్రశ్నించాడిలా. ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాది, దృఢవ్రతుడు, సదాచార సంపన్నుడు, సర్వప్రాణి హితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ధైర్యశాలి, జితక్రోధుడు, తేజస్వి, అసూయ రహితుడు, కోపోద్రేకంతో దేవతలను సైతం భయకంపితులను చేసేవాడున్నాడా? ఉంటే ఆ పురుషోత్తముణ్ణి తెల్సుకోవాలని ఉంది. మహర్షి మీరు సర్వజ్ఞులు. ఆ నరోత్తముణ్ణి గూర్చి చెప్పండి. విన్నాడు నారదుడు. చూశాడు వాల్మీకిని. ఆ చూపులో సంతోషం. బహవో దుర్లభాశ్చైవ యేత్వయా కీర్తితా గుణాః నీవు చెప్పిన గుణాలు ఒక్కడిలో ఉండడం దుర్లభం. అయినా ఒకడు ఉన్నాడు. ఆ నరుడెవరో చెబుతాను విను. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. అతడే రాముడు. జగత్ ప్రసిద్ధుడు. వాల్మీకి చెప్పిన పదహారు గుణాలకు ఇంకా కొన్ని కళ్యాణ గుణాలు చేర్చాడు. రాముని కథ సంగ్రహంగా చెప్పాడు నారదుడు. అదే సంక్షిప్త రామాయణం. అందులో 100 శ్లోకాలున్నాయి. సంగ్రహ రామాయణం, బాల రామాయణం అని కూడా పిలుస్తారు. కొందరు దాన్ని నిత్య పారాయణం చేస్తూ ఉంటారు. మళ్ళీ పూజలందుకున్నాడు నారదుడు. ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. స్నానం చేయాలని లేచాడు వాల్మీకి. శిష్యుడు భరద్వాజుడు అనుసరించాడు ఆయన్ని, అది గంగానదికి ఉపనది. పేరు తమసా నది. నదీతీరం చేరారు గురుశిష్యులు. నదీజలాల్ని చూసి అంటున్నాడు వాల్మీకి. భరద్వాజా చూశావా ఈ రేవులోని నీళ్ళు, సత్పురుషుని మనసులా నిర్మలంగా ఉన్నాయి. బురద లేదు. ఈ తీర్థం ఎంతో రమణీయంగా ఉంది.


మాధ్యమిక సంధ్యావందనానికి ఇంకా సమయం ఉంది. వనశోభను తిలకిస్తున్నాడు వాల్మీకి. అదొక చెట్టు. కొమ్మ మీద క్రౌంచపక్షుల జంట మిథున క్రీడలో ఉన్నాడు. అటుకేసి చూశాడు మహర్షి. రివ్వున ఒక బాణం వచ్చి మగపక్షికి తాకింది. ఆ దెబ్బకి నేలమీద పడి రక్తంతో తడిసిపోయింది. రతి పారవశ్యంలో ఉన్న ఆడపక్షి చూసింది. తన భర్త తల నెత్తురోడుతోంది. విలవిల్లాడుతోంది. దుఃఖంతో తట్టుకోలేకపోయింది. మగపక్షి చుట్టూ తిరిగింది. ఏడుస్తోంది దీనంగా.. బాణం వచ్చిన దిక్కుకి చూశాడు వాల్మీకి. ఓ కిరాతుడు కనిపించాడు. పాపకార్యాలు చేయటంలో పట్టుదల కలవాడు (పాపనిశ్చయుడు). నిష్కారణంగా శత్రుత్వంతో చంపే స్వభావం కలవాడు (వైరనిలయుడు). ఆ బోయవాడు వేసిన బాణం తనకు గుచ్చుకున్నట్లు బాధపడ్డాడు మహర్షి. ఆ ధర్మాత్ముని మనస్సు ద్రవించింది. కరుణ పొంగి పొర్లింది. వెంటనే శపించాడు కోపంతో. ఓ కిరాతుడా! కామపరవశమైన క్రౌంచ మిథునంలో మగ కొంగని చంపావు. ఇక ఎక్కువ కాలం బతకవు. ఉత్తర క్షణంలో కోపం పోయిందాయనలో. ఆలోచనలో పడ్డాడు. పక్షి విషయంగా నాలో శ్లోకం పుట్టింది. బోయవాడితో నేను పలికిన మాటలేమిటి? - ఆలోచనకు తెర దించాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. భరద్వాజుణ్ణి చూశాడు. - నా నోటినుంచి వచ్చిన పలుకులు సమాన అక్షరాలు. ఒక్కోపాదంలో ఎనిమిది అక్షరాలు. అలా నాలుగు పాదాలు. రాగ తాళ లయ బద్దంగా ఉన్నాయి. వీణ మీద మీటుతూ పాడవచ్చు. ఇదొక శ్లోకం. ఆ శ్లోకాన్ని మరోసారి ఉచ్చరించాడు. శోకం శ్లోకరూపమైంది. అదొక శాపమైంది. ఆశ్చర్యపోయాడు వాల్మీకి. శ్లోకభావాన్ని తలపోశాడు. నారదుడు చెప్పిన రామకథ స్మృతిపథంలో మెదిలింది. రావణుడు కామమోహితుడు. సీతను అపహరించాడు. లక్ష్మీనివాసుడైన నారాయణా, నీవు ఆ రావణుణ్ణి చంపుతావు. చిరకీర్తి పొందుతావు. అలా రామాయణ పరంగా అన్వయం కుదిరింది. విస్మితుడైనాడు. ఒక శ్లోకం అటు శాపంగా ఇటు మంగళా శాసనంగా ద్వంద్వార్థమయం. అటు ఆశ్చర్యం ఇటు ఆనందం. ఇంకోసారి శ్లోకం పలికాడు. భరద్వాజుడు దాన్ని కంఠస్థం చేశాడు. ఇద్దరూ స్నానాలు ముగించారు. కమండలంలో నీరు నింపాడు భరద్వాజుడు. శ్లోకాన్ని స్మరిస్తూ నడుస్తున్నాడు వాల్మీకి. అతడివెంట వెడుతున్నాడు శిష్యుడు. ఆశ్రమం చేరారు. సంధ్యావందనం అయింది. ఇష్టదేవతారాధన పూజాది ధర్మకార్యాలు ముగిశాయి. శ్లోకం మనసులో మెదులుతున్నా భగవత్ కథా ప్రసంగాలు సాగిస్తున్నాడు వాల్మీకి.


నిషాదుని జీవనోపాధి వేట. మగ కొంగని కొట్టాడు. పక్షుల్ని చంపుతాడు. తింటాడు లేదా అమ్ముతాడు. అది బోయవాని వృత్తి. ఆ విషయం వాల్మీకికి తెల్సు. వృత్తి ధర్మాన్ని పాటించాడు కిరాతుడు. వాణ్ణి శపించవచ్చా? అంటే వేటలో కొన్ని నియమాలున్నాయి. మచ్చుకి రెండు. నిదురిస్తున్న వాటిని చంపరాదు. రతీక్రీడలో ఉన్నవాటిని చంపరాదు. ఇక్కడ కొంగలు రతిక్రీడలో ఉన్నాయి. అదీ బోయవాడు చేసిన నేరం. కొంగల్ని అమ్మినా ఎవరూ కొనరు. ఎవ్వరూ వాటి మాంసం తినరు. అది ఆనాటి ఆహార నియమాల్లో ఒకటి. పాప నిశ్చయుడు. వైరి నలియుడు. రెండు విశేషణాలు. నిషాదునికి వాడబడ్డాయి. అందుకే వాల్మీకికి కోపం వచ్చింది.


బ్రహ్మదేవుని రాక


అది భగవత్ కాలక్షేపం సాగుతున్న సమయం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యానందాలు పొందాడు వాల్మీకి. అర్ఘ్య పాద్యాదులు అర్పించాడు. పూజించాడు. ఎంత చేస్తున్నా వాల్మీకి మనసు మనసులో లేదు. రక్తపు మడుగులోని కొంగ - కిరాతుడు మెదులుతున్నారు. మహర్షి మనసు చదివాడు బ్రహ్మ. చిరునవ్వు చిందించాడు. అంటున్నాడు, 'వాగ్గేవి సరస్వతికి అనుజ్ఞ ఇచ్చాను. నీ వాక్కుగా అవతరించింది. అవే నీవు పలికిన మాటలు. అదే ఒక శ్లోకమైంది. అది ఛందోబద్దమైంది. ఋషిసత్తమా! రామచరితం పూర్తిగా ఈ ఛందస్సులో రచించు. రాముడు ధర్మాత్ముడు. సద్గుణ సంపన్నుడు. ధీమంతుడు. మేరునగ ధీరుడు. లోకప్రఖ్యాతుడు. ఆ రామ కథ నారదుడు చెప్పాడు నీకు. సీతారామ లక్ష్మణులు భరతాధుల గాథలు రావణాది రాక్షసుల కథలు వారి వారి ప్రవర్తనలు ఆలోచనలు రహస్యాలు అన్నీ సుస్పష్టంగా నీకు స్ఫురిస్తాయి. నీ రచనలో ఒక్క అసత్యం ఉండదు. పదంలో వాక్యంలో అర్థంలో దోషాలుండవు. రామకథ పాపహరం. పుణ్యప్రదం. యావత్ స్థాప్యంతి గిరియః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి భూమి మీద పర్వతాలు నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామకథ ప్రచారంలో ఉంటుంది. ఎంతకాలం రామకథ కీర్తింపబడుతుందో అంతకాలం నీవు ఊర్ధ్వలోకాల్లో సంచరిస్తావు. తర్వాత నా లోకం చేరుతావు. ఆ తర్వాత ముక్తి పందుతావు అని చెప్పాడు బ్రహ్మ. అంతర్థానమయ్యాడు.


కావ్య రచన రామకథ నారదుడు చెప్పాడు. ఇంకా విశేషాలున్నాయా అనుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఆచమనం చేశాడు. తూర్పువైపు కొసలున్న దర్భాసనం పరిచాడు. కూర్చున్నాడు వాల్మీకి. భగవంతునికి నమస్కరించి ధ్యాన నిమగ్నుడైనాడు. దశరథుడు అతని భార్యలు రాజ్యప్రజలు వారి మధుర భాషణలు సీతారామ లక్ష్మణులు వనవాస గమనం దండకంలోని సన్నివేశాలు రావణ సంహారం వరకు యోగశక్తితో దర్శించాడు మహర్షి. సముద్రంలో విలువైన రత్నాలు లభిస్తాయి. ధర్మార్థ కామ గుణ విశేషాలు రామాయణ రత్నాకరంలో దొరుకుతాయి. అవి వీనులకు విందుగా ఉంటాయి. మనస్సుకి ఆనందిస్తాయి. అలా రామాయణ కావ్యం వేదసార సంగ్రహంగా వివరించాడు వాల్మీకి. దాన్ని చదివినా పాటగా పాడినా ఆనందానుభూతి కల్గుతుంది. రామాయణ కావ్యం మహిమగల సీతాచరితం పౌలస్త్య వధ - అవి వాల్మీకి పెట్టిన పేర్లు. శ్రీమద్రామాయణం శ్రీరామాయణం అనే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. శ్రీమత్ - శ్రీ శబ్దాలకు శోభ కీర్తి సంపద లక్ష్మి ఇలా ఎన్నో అర్థాలున్నాయి. అవి రామునికి సీతకు అన్వయించుకోవచ్చు. . లక్ష్మీనారాయణ లక్ష్మీవేంకటరమణ లక్ష్మీ నారసింహ సీతారామ రాధాకృష్ణ - అలా ఉభయులకు సమ ప్రాధాన్యం ఉంది. దేవాలయానికి వెళ్ళినపుడు అమ్మవారి ద్వారా స్వామివారిని దర్శించాలి. అది ఒక సత్సంప్రదాయం. ఇద్దరిలో ఏ ఒక్కరిని దరి చేరినా సేవించినా ఫలితం శూన్యం. ఫలం విపరీతం అన్నారు పెద్దలు.


సీతమ్మను కాదని రాముణ్ణి కోరి శూర్పణఖ భంగపడింది. రాముణ్ణి విస్మరించి సీతాదేవిని కోరి సబాంధవంగా హతమైనాడు రావణుడు. ఆ విశేషం మనకు తెలియచెబుతున్నాడు వాల్మీకి మహర్షి. ఆరు కాండలు, అయిదు వందల సర్గలు, ఇరవైనాల్గు వేల శ్లోకాలు ఉన్నాయి శ్రీరామాయణంలో. తర్వాత ఉత్తరకాండ ఉంది. ధ్రుత మధ్య విలంబితాలు అనే మూడు ప్రమాణాలతో సప్తస్వరాలతో శ్రీరామాయణం అలరారుతోంది. వీణ మీద మీటినా - వేణువుతో ఊదినా - తాళమృదంగాలతో పాడినా - చెవులకు ఇంపుగా ఉంటుంది. అతని మహోన్నతమైన దాన్ని ఎవరితో పాడించాలని ఆలోచనలో పడ్డాడు మహర్షి. అదే సమయంలో వచ్చారు కుశలవులు. మునివేష ధారులు. ముద్దులొలికే చిన్నారులు. వాల్మీకికి పాదాభివందనం చేశారు. ఆ ఇద్దరికీ నేర్పించాడు మహర్షి. వాళ్ళు ఆశ్రమ వాసులే కుశలవులు. వేదాధ్యయన పరులు. మేధావులు. సంగీత శాస్త్ర రహస్య కోవిదులు. ఆటలో పాటలో గంధర్వ సమానులు. - అది వాల్మీకి ఆశ్రమం. మహర్షులు బ్రాహ్మణోత్తములు సాధువులు సభ తీరి ఉన్నారు. కుశలవులు గానం చేశారు. సదస్యులు విస్మితులైనారు. ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ బాలకులకు ఎన్నో ప్రశంసలు ఎన్నో బహుమతులు. అలా ఎన్నో సభల్లో పాడారు. అది రామునికి తెల్సింది. పిలిపించాడు. నిండు కొలువులో గానం చేశారు. ఆనందభరితుడైనాడు రాముడు.


అయోధ్య ఈ భూమండలాన్ని మొదట వైవస్వత మనువు పాలించాడు. తర్వాత జయశీలురైన రాజుల్లో సగరుడు సుప్రసిద్ధుడు. అతనికి అరవై వేల మంది పుత్రులు. యజ్ఞం చేశాడాయన. ఇంద్రుడు యాగాశ్వం అపహరించాడు. సగర పుత్రులు నేల బద్దలుకొట్టి అన్వేషించారు. వాళ్ళు తవ్విన చోట సముద్రం ఏర్పడింది. వారి పేరిట అది సాగరమైంది. సగరుని తర్వాత రాజుల్లో ఇక్ష్వాకుడు ప్రసిద్ధుడైనాడు. ఆ ఇక్ష్వాకు వంశస్థుడే రాముడు. అతని చరితమే శ్రీరామాయణం. అది సరయూ నది. దాని తీరప్రాంతంలో ఒక రాజ్యం . పేరు కోసల. దాని ముఖ్య పట్టణం అయోధ్య. ఆ నగరం పన్నెండు యోజనాల పొడవు, మూడు యోజనాల వెడల్పు (యోజనం అంటే నాలుగు క్రోసులు. క్రోసు అంటే రెండు మైళ్ళు. అలా లెక్కిస్తే పొడవు దాదాపు 154 కి.మీ. ఇక వెడల్పు సుమారు 39 కి.మీ). ఆ నగరం అష్టదళ పద్మాకారంలా ఉంది. నగరం మధ్యలో రాజభవనం. దానిచుట్టూ నాలుగు దిక్కులా నాలుగు వీధులు. అన్నీ విశాలంగా ఉన్నాయి. నిత్యం నీటితో తడుపబడే దారులు. ఆ దారులకి ఇరువైపులా చెట్లు - వాటినుంచి రాలిన పూలతో బాటలన్నీ దివ్యశోభతో విరాజిల్లుతున్నాయి. ఆ నగరానికి వడ్డాణంలా చుట్టూ అందమైన విశాలమైన ప్రాకారాలు, వాటికి ఎత్తైన ప్రవేశ ద్వారాలు. తోరణాలు ద్వారబంధాలు కోట బురుజులు ధ్వజాలు శతఘ్నులు వివిధ ఆయుధాలు లోతైన అగడ్తలతో శత్రు దుర్బేధ్యమైన కోట. రాజ భవనానికి ఒకవైపు అంగళ్ళు. ఒకవైపు సకల కళా నైపుణ్యం గల శిల్పులు, వందిమాగధులు. రథాలు నడిపే సూతుల ఇళ్ళు. నిత్యమూ ఏదో ఒక ఉత్సవం. ఒక వేడుక. దుందుభి ధ్వనులు మృదంగ శబ్దాలు వీణానాదాలు మారుమ్రోగుతూ ఉంటాయి. వచ్చేపోయే సామంత రాజులతో వివిధ దేశ వ్యాపారులతో అయోధ్యా నగరం కిటకిట లాడుతూ ఉంటుంది. ఈ రత్నాలు పొదిగిన రాజప్రాసాదాలు క్రీడా పర్వతాలు సిద్ధపురుషుల తపఃఫలంగా లభించిన దివ్యలోకంలా విద్వాంసులతో నిండిన భవనాలు బారులు తీరి ఉంటాయి. ఒక్కమాటలో దేవేంద్రుని అమరావతిలా అయోధ్యా నగరం తేజరిల్లుతోంది. (సశేషం)