శ్రీవేంకటాచలపతి విగ్రహం ధ్రువబేరం వర్ణన


గత సంచిక తరువాయి


చిత్తూరు జిల్లాలో రేణిగుంటకు 7 మైళ్ళ దూరంలో గుడిమల్లం అనే గ్రామం ఒకటి ఉన్నది. క్రీ.పూ 1వ శతాబ్దానికి చెందిన శ్రీ పరశురామేశ్వర శివలింగం ఒకటి ఇక్కడ ఉన్నది. ఈ శివలింగం ఎఱ్ఱటి అగ్ని సంబంధమైన ఎఱ్ఱటి రాతితో చేయబడి సుమారు 5 అడుగుల పొడవు (ఎత్తు) కల్గి ఉంది. ఈ శివలింగానికి ముందుభాగంలో శివుడి సానక అర్చావతారమూర్తి చెక్కబడి ఉన్నది. రెండు భుజాలున్న ఈ మూర్తికి ఒక హస్తమందు మృగము, మరొక హస్తమందు కమండలము ఉన్నాయి. శిరస్సు మీద జటాజూటములతో కిరీటంలా వెంట్రుకలు ముడివేయబడ్డాయి. శివుని ప్రతిమ దిశమొలగా ఉన్నది. మహేశ్వరుడు అపస్మార పురుషుడనే రాక్షసుడి మీద నిల్చున్నట్లు చూపబడింది. ఈ లింగము శాతవాహనుని కాలమునాటిదై ఉండవచ్చునని అనిపిస్తుంది. ఈ పరశురామేశ్వరుని లింగం ఏ శిలతో చేయబడినదో అదే శిలాజాతికి తిరుమల మీద ఉన్న శ్రీ స్వామివారి ప్రతిమ చెంది ఉంటుందని అనుకోవడానికి కొంత వీలున్నది. రెండు ప్రతిమలు కూడ ఒకేవిధమైన నునుపు కల్గి అద్దాలలా మెరుస్తూ ఉంటాయి. ఈ గుడి మల్లపు ప్రతిమ ఎఱ్ఱటి శిలాజాతికి చెందినదనిపిస్తుంది. ఎల్లటి శిల కూడా తిరుమల ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది. దీన్నిబట్టి స్వామివారి ప్రతిమ అగ్ని సంబంధమైన ఎఱ్ఱటి శిల రకమునకు చెదిందని మనం ఊహించవచ్చు. శ్రీ స్వామివారి అభిషేక కాలపు విశ్వరూప దర్శనాన్ని గురించి ఇంతవరకు మనము చర్చించుకున్నాము. ఈ అభిషేకము ప్రతి శుక్రవారం జరుగుతుంది. శుక్రవారపు అభిషేక సమయంలో స్వామివారు తనకు ఎలా కన్పించారో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వర్ణించారు.


శ్రీ స్వామివారి ధ్రువబేరం ఏ ఆభరణాలతో సాధారణంగా అలంకరింపబడి ఉంటుందో తెలుసుకుందాం. శ్రీ స్వామివారు రత్నమకుట ధారిగా, రత్నమయ శంఖ, చక్రములను ధరించినట్లు మనకు కన్పిస్తారు. ఈ రత్నకిరీటమునందు మేరుపచ్చ అనే పచ్చరాయి ఉంది. ఇది ప్రపంచంలోని పచ్చరాళ్ళకెల్ల పెద్దదట. శ్రీ స్వామివారికి ఇదేవిధంగా రత్నాలు తొడిగిన బంగారు తొడుగులు అనేకం ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఈ బంగారు రత్నాల తొడుగులతో శ్రీ స్వామివారి సహజ సౌందర్య దర్శనం మనకు లభించకుండా చేస్తున్నారేమో దేవాలయ అధినేతలు. వెనుకవైపు ఉండే హస్తములకు శంఖ చక్రములు, వజ్రఖచితమైన బంగారు తొడుగులు ఉన్నాయి. ముందువైపు ఉన్న భుజముల మీద నాగాభరణములమరుస్తారు. కంఠమున అలంకరింపబడే ఆభరణాలలో పులిగోళ్ళతో బంగారుతో చేయబడిన కంటె ఒకటి ఉంది. కంఠంలో శ్రీ పద్మావతి ప్రతిమ ఉన్న బంగారు హారం ఉన్నది. దీనిని శ్రీ రామానుజులవారు ఇచ్చినట్లు శ్రీవేంకటాచల ఇతిహాసమాల మనకు తెల్పుతుంది. ఈ హారం స్వామివారి మెడలో ఎప్పుడూ ఉంటుంది. ఇంతేగాక చక్కగా దశావతారాలను ప్రదర్శించే బంగారు ఉదరబంధ మొకటి ఉన్నది. దీనినుండే అతి ప్రాచీనమైన సూర్యకటారి వ్రేలాడుతూ ఉంటుంది. ఈ కటారిని సూర్యభగవానుడు శ్రీ స్వామివారికి సమర్పించారట. మోకాళ్ళ వద్ద బంగారు వంకీలు కూడా ఉన్నాయి. దానిక్రింద బంగారు నూపురములు ఉన్నాయి. పై భుజముల నుండి అలంకరింపబడిన బంగారు హారములెన్నో ఉన్నవి. వీటిలో 108 లక్ష్మీ ప్రతిమలు గల లక్ష్మీహారం (వైజయంతీమాల), తులసీహారం, బంగారు సాలగ్రామాల హారం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. సాలగ్రామ హారంలోని ప్రతి సాలగ్రామం మీద ఉన్న బంగారు తొడుగు మీద శ్రీవేంకటేశ్వరస్వామి వారి సహస్ర నామములు చెక్కబడి ఉన్నవి.


 


శ్రీ స్వామివారు ధరించే కిరీటం ఆయనకు ఆకాశరాజు ఇచ్చినదట. అందుకే దీనిని ఆకాశరాజు కిరీటం అంటారు. శ్రీ స్వామి వారికి వక్షస్థలము క్రింద నడుముకు దగ్గరగా పెద్ద నాగాభరణం కూడా ఒకటున్నది. శ్రీ స్వామివారి వరద, కటిహస్తాలకు, పాదాలకు కూడా బంగారు తొడుగులు ఉన్నాయి. వరద హస్తపు తొడుగు వజ్రాలమయంగా ఉంటుంది. శ్రీ స్వామివారి విగ్రహానికి కళ్ళమీద నుండి పైకి పచ్చకర్పూరముతో చేయబడిన తిరునామాలు ఉంటాయి. ఇంతేగాక శ్రీ స్వామివారి గడ్డము మీద పచ్చకర్పూరము కొంత పెట్టబడి ఉంటుంది. వీటిని గూర్చి వివరాలు వేరే అధ్యాయంలో తెలిసికొందాం. శ్రీ స్వామివారిని గులాబి ఇత్యాది పూలతో అలంకరించినప్పుడు నిజంగా కన్నుల పండువగా ఉంటుంది. అందుకే శ్రీవేంకటేశ్వరస్వామి అతి సుందర మోహనాంగుడయ్యాడు. అందుకే స్వామి పురుషోత్తముడు కూడాను. శ్రీ స్వామివారు ఆగమ శాస్త్రాల నిబంధనలకు అతీతుడని తెలుస్తోంది. అంటే ఆగమ శాస్త్రాలు రచింపబడక పూర్వమే ఈ మూర్తి వెలసి ఉండాలి. శ్రీ స్వామివారు శిల్పశాస్త్ర ఆగమ శాస్త్రాలకు అతీతుడైనాడు. ఆయన విగ్రహాన్ని శిల్ప వాస్తు లక్షణాలతో కూడా పూర్తిగా పోల్చి సమన్వయ పరచి చెప్పలేము. ఈ విషయం గమనార్హం.


ఓ దేవా! శ్రీమన్నారాయణా! ఇందు మాత్రలలో, అక్షరములలో, పదములలో నేదేని స్టాలిత్యమున్నచో దానినెల్ల క్షమింపుము. నీకిదే నా ప్రణామము. -