శ్రీ జగన్నాథుడి లీల


 


క్రీ.పూ 1వ శతాబ్దంలో ఖారవేలుడు అనే రాజు కళింగ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ధర్మపరుడు. ప్రజల క్షేమమే తన క్షేమంగా భావించి ప్రజారంజకంగా పాలిస్తూ అందరి మన్ననలు పొందాడు. ఖారవేలుడు శ్రీహరికి పరమభక్తుడు కూడా. అప్పట్లో జగన్నాథుని నీలమాధవుడన్న పేరుతో కొందరు సవర వంశీయులు పూజించేవారు. స్వామి మందిరం కాలక్రమంలో పూర్తిగా శిథిలమైంది. నీలమాధవుని విగ్రహాన్ని మహాపద్మనందుడనే మగథ రాజు అపహరించుకుపోయాడు. ఖారవేల రాజు పరమాత్మ ప్రేరణతో జగన్నాథ స్వామికి గొప్ప ఆలయాన్ని నిర్మించ సంకల్పించాడు. ఆయన 12 సంవత్సరాలు సేకరించిన రాష్ట్ర ఆదాయాన్ని వెచ్చించి ఆగమ శాస్త్ర నియమానుసారం మందిరాన్ని సర్వాంగ సుందరంగా నిర్మింపచేశాడు. ఇక జగన్నాథ స్వామి వారి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించడమే జరగవలసిన కార్యం. సకల దైవిక లక్షణాలతో విరాజిల్లే అద్భుతమూర్తిని తయారు చేయించాలని నిశ్చయించుకున్నాడు మహారాజు. మహారాజుచే నిర్మించబడిన జగన్నాథ ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం చెక్కటానికి రాజుగారు శిల్పులను ఆహ్వానిస్తున్నారు. దైవత్వం ఉట్టిపడే దివ్యమంగళ విగ్రహాన్ని చెక్కిన శిల్పికి 10 వేల బంగారు కాసులు పారితోషికంగా ఇవ్వబడుతుంది. అయితే శిల్పులు ఒక విషయాన్ని గమనించాలి. వారు చెక్కిన విగ్రహం మహారాజుగారికి సంతృప్తికరంగా లేకపోతే ఆ శిల్పికి శిరచ్చేదం విధించబడుతుంది అని దండోరా వేయించాడు రాజు. రాజ్యంలో ఉన్న శిల్పకళాకారులందరికీ ఈ ప్రకటన చేరింది. 10 వేల బంగారుకాసులు బహుమతి ఇస్తారన్నమాట వారందరినీ ఉత్సాహపరిచింది. వెనువెంటనే రాజుగారు పెట్టిన షరతు భయపెట్టసాగింది. పారితోషికం మాట దేవుడెరుగు. తలలు పోగొట్టుకునే సాహసం ఎవ్వరూ చెయ్యలేకపోయారు. కాలం గడిచిపోతోంది. జగన్నాథుని విగ్రహం నేను చేస్తానంటూ ఒక్క శిల్పి కూడా రావటం లేదు. ఉండి ఉండి దండోరా మాత్రం వేస్తూనే ఉన్నారు. రాజుకి క్రమంగా ఆందోళన మొదలైంది. దేవుడి విగ్రహం తయారు చెయ్యటమంటే ఏదో పిల్లలాడుకునే బొమ్మలు చెయ్యటం కాదు. పరమ భక్తితో, నిష్ఠతో, ఆరాధనా భావంతో పరమ పవిత్రంగా దైవత్వాన్ని అనుభూతి చెందుతూ తయారు చెయ్యాలి. సాక్షాత్తూ ఆ వైకుంఠ నాథుడే తన ఆలయంలో కొలువున్నాడనే భావం భక్తులకు కలిగించగలగాలి. అటువంటి ఉత్తమమైన మూర్తి తయారు చెయ్యాలంటే ఆ శిల్పిలో భక్తిభావంతో పాటు భయం కూడా ఉండాలి. అటువంటి శ్రద్ధ, భయభక్తులతో పని చేసినప్పుడే ఆ దేవదేవుడి మూర్తిని పరమ పవిత్రంగా సజీవంగా ఆవిష్కరించగలరు. ఆ భావంతోనే సహజంగా సాధు స్వభావుడైన రాజు షరతు విధించాడు. ఎవరూ ముందుకు రావటం లేదు. ఆలయమైతే సర్వాంగ సుందరంగా నిర్మించగలిగాడు కాని దేవుడు లేని ఆలయానికి విలువేముంది. వట్టి కట్టడమే కదా. ఇక తాను చేయగలిగిందేమీ లేక భగవంతునిపై భారం వేసి స్వామీ! జగన్నాథా! ఇక నీదే భారం. నీ విగ్రహాన్ని నువ్వే చెక్కించుకోవాలి అని ప్రార్ధించసాగాడు. రాజుకి అర్థమైంది. తన దేశం కళాకారులకు పుట్టిల్లు. దేవతల విగ్రహాలు చెక్కడంలో గొప్ప నైపుణ్యం గల శిల్పులెందరో ఉన్నారు. కానీ ఇదేదో పరీక్షగా ఉంది. ఏం చెయ్యదలచుకున్నాడో అని సమర్థుడైన శిల్పి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరికొంత కాలం గడిచింది. ఒకరోజు రాజభటులు ఒక వృద్ధశిల్పిని రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు. విగ్రహం తయారీ గురించి ప్రకటన చేసిన ఇంతకాలానికి దేవుడి విగ్రహం నేను తయారు చేస్తాను రాజా! అంటూ వచ్చిన ఆ వృద్ధశిల్పి రాక రాజుగారికి ఆనందాన్నిచ్చింది. ప్రకటన సరిగ్గా విన్నావా, మా షరతును అంగీకరించే వచ్చావా? చిత్తం మహారాజా, తెలిసే వచ్చాను. ఆ స్వామియే సజీవంగా మీ కళ్ళముందు నిల్చి ఉన్నట్లు సర్వాంగ సుందరంగా దివ్యతేజస్సు ఉట్టిపడే విధంగా స్వామివారి శిలను చెక్కించి ఇవ్వగలను కాని ఒక షరతు. మీరంగీకరిస్తే... రాజు వృద్దుడి మాటలకు వింత పడుతూ అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఏమిటది? అన్నాడు. అదా! విగ్రహం చెక్కటానికి ఒక మాసం - ముప్పెరోజులు సమయం పడుతుంది. అయితే నా నిబంధనను కూడా వినండి. ముప్పెరోజులు దేవాలయ ద్వారాలు బంధించి పని చేస్తాను. గడువు ముగిసేవరకు మీరు గాని, మీ అనుచరులు గాని ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయ ద్వారం తెరిచి లోపలకు రారాదు అన్నాడు.


షరతు చిత్రంగానే ఉంది. సరే అలాగే వాగ్దానం చేస్తున్నాను. ముప్పెరోజులు ఎవ్వరూ దేవాలయం తలుపులు తీసుకుని లోపలకు పోరాదు. విగ్రహం నాకు నచ్చకపోతే మాత్రం నీ తల తెగిపోతుంది. అది గుర్తుంచుకో. ఇక నీ పని ప్రారంభించు. శిల్పి తన పని ప్రారంభించాడు. రాజాజ్ఞ ప్రకారం దేవాలయ ద్వారాలు బంధించబడ్డాయి. పని ప్రారంభమైనట్లు పెద్ద పెద్ద శబ్దాలు వినపడసాగాయి. వృద్ధశిల్పి ఒక్కడే దేవాలయంలో ద్వారాలు బంధించుకుని పని చేస్తున్నాడు. అయితే ఈ ధ్వనులు మాత్రం ఏన్నో వేల మంది ఆలయ విధ్వంసానికి పాల్పడుతున్నారా అన్నట్లు నగరాన్నంతా కదిలించి వేస్తున్నాయి. ముప్పెరోజుల గడువు - అప్పటికి పది రోజులు మాత్రమే గడిచాయి. ఇంకో పది రోజులు గడిచాయి. రాత్రిళ్ళు కూడా భయంకరమైన పిడుగుపాటు ధ్వనులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. మంత్రి రాజును కలిసి మహారాజా! దేవాలయంలో శిల్పి విగ్రహం చెక్కటం లేదనిపిస్తోంది. దేవాలయాన్ని సర్వనాశనం చేస్తున్నట్లుంది. ఇదంతా మన శత్రురాజు పన్నాగమనిపిస్తోంది అన్నాడు. కాని రాజు శిల్పికి ఇచ్చిన మాట ప్రకారం ఓర్పు వహించాలనుకున్నాడు. ఆ రాత్రి అంతఃపురం కూడా దేవాలయం నుండి వస్తున్న పిడుగులాంటి ధ్వనులతో కంపించిపోసాగింది. రాజు ఆందోళనతో మంత్రిని పిలిపించి దేవాలయంలో దీపం వెలుగు కనిపిస్తోందేమో చూసి రమ్మన్నాడు. రాజా ఆ విషయం ముందే గమనించాను. లోపల వెలుగనేదే లేదు. చిమ్మ చీకటిగా ఉంది. కానీ శబ్దాలు మాత్రం భయంకరంగా ఆగకుండానే వస్తున్నాయి అన్నాడు. రాజుకి కూడా ఆందోళన పట్టుకుంది. 21 రోజులు మాత్రమే పూర్తయ్యాయి. షరతు ప్రకారం ముప్పై రోజుల తరువాతే దేవాలయ తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాలి. మంత్రీ మనం కొంచెం ఓర్పు వహించాలి. గడువు తీరేవరకు ద్వారాలు తెరిచి లోపలికి ప్రవేశించం అని శిల్పికి మాట ఇచ్చి ఉన్నాం అన్నాడే కాని విరామం లేకుండా విధ్వంసక ధ్వనులు రాజమందిరాన్నే ప్రతిధ్వనింపచేస్తుంటే రాజు మనస్సులో కూడా భయం ప్రవేశించింది. గడువు పూర్తవటానికి ఇంకా 10 రోజుల సమయముంది. కాని రాజుకి చాలా భయంగాను, ఆందోళనగాను ఉంది. తెల్లవారి ద్వారాలు బద్దలుకొట్టి లోపలకు వెళ్ళి ఏం జరుగుతోందో చూడాలని నిశ్చయించుకున్నాడు. ఈ


మరుసటి రోజు సైన్య సమేతంగా జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళాడు. స్వామీ అంతా నీ దయ. ఏమి సంకల్పించావో అని నమస్కరించుకుని దేవాలయ మహాద్వారా పగలగొట్టించి సాయుధ సైన్యంతో లోపలకు ప్రవేశించాడు. అక్కడ ఆయన భయపడినట్లు ఆలయ విధ్వంసమేమీ జరగటం లేదు. వృద్ధశిల్పి మాత్రం తదేక దీక్షతో శిలను చెక్కుతూ కనిపించాడు. దివ్యతేజోమూర్తికి బదులుగా వికారంగా చూడటానికి భయం కలిగించే ఒక కురూప వికారి అయినటువంటి ప్రతిమను చెక్కుతున్నాడు అతను. ఆ మూర్తిని చూడగానే రాజుకు పట్టరాని ఆగ్రహం కలిగింది. మూర్ఖుడా ఇదా నువ్వు చెక్కుతున్న అందమైన దేవతా విగ్రహం అని ఒరలోంచి కత్తి తీసి గర్జించాడు. వృద్ధశిల్పి శాంతంగా ఆగండి మహారాజా! మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. ముప్పెరోజులు ముగిసేంత వరకు లోపలికి అడుగు పెట్టరాదన్న షరతును మీరు పాటించలేదు. ఆ జగన్నాథుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించటానికి కేవలం ముప్పెరోజులు కూడా మీరు ఓపిక పట్టలేకపోయారు అన్నాడు. అందుకు రాజు నిజమే కాని ఇక్కడినుండి పిడుగుపాటు ధ్వనులకు ఏం జరుగుతోందోనన్న భయం కలిగింది. అందుకే అన్నాడు. భక్తుడికి సహనం, శ్రద్ధ చాలా అవసరం. భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఓరిమితో కూడిన ప్రతీక్ష భక్తుడికి చాలా అవసరం. నిన్ను పరీక్షించడానికే ఆ ధ్వనులు సృష్టించాను. భగవంతుడు సుందరమైన విగ్రహాల్లో ఏవిధంగా నెలకొని ఉంటాడో, సర్వాంతర్యామి అదేవిధంగా అందవిహీనమైన విగ్రహాలలో కూడా ఉంటాడు. ఇక ఈ విగ్రహం ఇంతే. ఈ విగ్రహమే జగన్నాథుడిగా ఈ ఆలయంలో నెలకొని వుండుగాక. సర్వే సర్వత్రా స్థితి చెంది ఉన్న ఆ పరంధాముడు అందవిహీనుల్లో కూడా చైతన్యరూపుడై విరాజిల్లుతున్నాడన్న సత్యం ఈ అద్భుత ఆలయాన్ని దర్శించేవారందరూ గ్రహించెదరు గాక! మాట్లాడుతూనే వృద్ధశిల్పి అంతర్థానమై, సాక్షాత్తు జగన్నాథస్వామిగా అక్కడ ఉన్నవారందరికీ దర్శనమిచ్చాడు. ప్రభూ! స్వామీ జగన్నాథా! అజ్ఞానంతో భగవంతుడి విగ్రహాన్ని నేను చేయిస్తున్నానని భ్రమించాను. ప్రపంచమే నీ దివ్య స్వరూపమని ఇప్పటికి గ్రహించగలిగాను స్వామీ. ఈ అల్పు మన్నించు తండ్రీ అని భక్తిపరవశంతో పరి పరి విధాల స్వామిని కీర్తించి ధన్యుడయ్యాడు. -