“స్వామీ! నువ్వే నాకు దిక్కు. అన్యథా శరణం నాస్తి... నాస్తి. నేను నీకు పరమ భక్తుణ్ణి. నేను చేసిన మహాపాపాన్ని నాశనం చెయ్యి. పాహిమాం పరంధామ... వేంకటనాయక!” అని దీనంగా ప్రార్థించాడు తొండమాన్ చక్రవర్తి.
“తొండమానూ! నువ్వు క్షమించరాని మహాపాతకాన్ని... బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నావు. నన్ను నమ్ముకున్న భక్తుల్ని కాపాడటం నా ధర్మం. శరణాగత రక్షణ నా కర్తవ్యం. నామీద నీకు ఉన్న అపారమైన భక్తినీ... గతంలో నువ్వు నాకు చేసిన సేవనీ దృష్టిలో పెట్టుకుని నిన్ను నేను తప్పకుండా కాపాడతాను. మహాపాపం చేసి నిన్ను కాపాడటం వల్ల నాకు అపకీర్తి వస్తుంది. అయినా సరే... చనిపోయిన బ్రాహ్మణుని భార్యాబిడ్డల్ని తప్పకుండా ఇప్పుడే బతికిస్తాను! ఇంకెప్పుడూ ఇలాంటి పాపకృత్యాలు చెయ్యకు.” అన్నాడు శ్రీనివాసుడు. తొండమానుడు తల వంచుకుని వినయంగా దణ్ణం పెడుతూ నిలబడ్డాడు. “తొండమానూ!” "స్వామీ!” “వెంటనే నీ కుమారుని పంపి చనిపోయిన ఆ ముగ్గురి అస్తికల్ని తెప్పించు!” అని శ్రీనివాసుడు తొండమానుని ఆదేశించాడు. తొండమానుడు తన కుమారుని పంపాడు. అతను ఆగమేఘాల మీద వెళ్ళి చనిపోయిన వారి అస్తికల్ని మూటగట్టి తెచ్చాడు. ఆ మూటని శ్రీనివాసునికి సమర్పించాడు తొండమానుడు. ఆ మూటని తీసుకుని శ్రీనివాసుడు ఆనందనిలయానికి అతి సమీపంలోనే ఈశాన్యమూలలో ఉన్న పాండవ తీర్థానికి వెళ్ళాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న దేవఖాతానికి చేరుకుని దాని ఒడ్డున ఒక బండమీద వస్త్రంలో కట్టిన అస్తికల మూటని ఉంచాడు. తర్వాత నీళ్ళలోకి దిగాడు. కంఠం లోతు వరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకున్నాడు. కొంత సేపు అలా ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. ఒడ్డుకి వచ్చి బండమీద ఉంచిన అస్తికల మూటని విప్పాడు. అందులోని అస్తికల మీద దేవఖాతంలోని నీళ్ళని చల్లాడు... శ్రీనివాసుడు. వెనువెంటనే ఆ అస్తికలకి ప్రాణం వచ్చింది. బ్రాహ్మణుని భార్య... కుమారుడు... కుమార్తె శ్రీనివాసునికి నమస్కరించారు. ఒడ్డునే నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన తొండమానుడు ఆనందపరవశుడయ్యాడు. నింగినుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఆ నాటినుండి ఆ తీర్ధానికి అస్తితీర్థం అనే పేరు కలిగింది. శ్రీనివాసుడు తీర్థంలోంచి పైకి వచ్చి బ్రాహ్మణుని భార్యని, కుమారుని కుమార్తెనూ తొండమాన్ చక్రవర్తికి అప్పగించాడు. “తొండమానూ! ఈ తీర్థం లోని జలాలు స్నానం చేసినవారి పాపాల్ని పోగొడతాయి... ఇవి పుణ్యజలాలు... స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది...” చెప్పాడు శ్రీనివాసుడు. _ 'రక్ష... రక్ష... మాం... శ్రీనివాస!” అంటూ భక్తితో నమస్కరించాడు తొండమానుడు. - అతనిని చూస్తూ మందహాసం చేశాడు శ్రీనివాసుడు. నవ్వులోని అంతరార్థం తెలియక తొండమానుడు స్వామి మొహంలోకి చూస్తూ మిన్నకుండిపోయాడు. . స్వామి మొలక నవ్వులో దాగిన పరమార్గాన్ని వెదకాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. ఆ నవ్వుల వెన్నెల్లో తడిసి ముద్దయిపోవటమే పరమానందం... బ్రహ్మానందం... ఆ నవ్వే ఆయన అస్త్రం... ఆయుధం... ఆ నవ్వే మోహనం... ఆ నవ్వే మధురం... మృదు మధురం... మధుర మందహాసంలో ఎన్నో ఉపదేశాలు... ఎన్నెన్నో సంకేతాలు! - “స్వామీ!” ఉద్వేగంతో అన్నాడు తొండమానుడు. మళ్ళీ నవ్వాడు శ్రీనివాసుడు. తొండమానుని కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. “తొండమానూ! నీ సోదరుడైన ఆకాశరాజు నాకు మావగారు... ఆత్మీయుడయిన భక్తుడు... అత్యంత ఆప్తుడు. అలాగే నా పరమభక్తుడివి నువ్వు. నాకు ఎన్నో సేవలు చేశావు. అవ్యాజంగా సేవలు చేశావు... నిష్కామంగా సేవలు చేశావు. వాటికి నూరు రెట్లు ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించాను. నువ్వు చేసిన మహాపాన్ని నేనే స్వీకరించాను. మరణించిన బ్రాహ్మణుని కుటుంబ సభ్యుల్ని తిరిగి బతికించాలంటే మరొక ముగ్గురు వ్యక్తులు మరణించాలి. లేదా ఆ పాపాన్ని ఎవరైనా స్వీకరించాలి. అందుకే పాపాన్ని నేను స్వీకరించాను. ఈ విషయాన్ని గ్రహించు!” వివరంగా చెప్పాడు శ్రీనివాసుడు. "...........” మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు తొండమానుడు. “తొండమానూ! ఒక పరమ రహస్యం చెబుతాను... విను!” అన్నాడు శ్రీనివాసుడు.
“చెప్పండి స్వామీ!” అన్నాడు తొండమానుడు. "తొండమానూ! నేనిలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటం వల్ల నేను కాపాడతాను అనే ధైర్యంతో నీవంటి భక్తులు పాపాలు చేస్తారు. ఈనాటినుంచి నేను ప్రత్యక్షంగా మానవ రూపంలో కనిపించను!” అన్నాడు శ్రీనివాసుడు. తొండమానుడు బిగ్గరగా రోదించసాగాడు. “తొండమానూ! ” పిలిచాడు శ్రీనివాసుడు. ఆయన స్వరం మంద్రంగా ఉంది... ఆప్యాయంగా ఉంది.... ఆత్మీయంగా ఉంది. "స్వామీ!” అన్నాడు తొండమానుడు. “ఈ క్షణం నుంచీ...” “.............” “నేను....” “మౌనంగా ఉంటాను!”
మన్నించు తండ్రీ!” “పరమ భక్తులతో తప్ప... అరుదుగా... ఎవరితోనూ మాట్లాడను...” "స్వామీ! నీ మౌనాన్ని నేను భరించలేను. నన్ను కరుణించు కమలాకాంతా!” “ఊరడిల్లు... ఊరడిల్లు... తొండమానూ! ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు... పాపాల్ని చెయ్యకు!” అని ఆదేశించాడు శ్రీనివాసుడు. “అలాగే!” అన్నాడు తొండమానుడు. “భక్తులందరూ నన్ను వేంకటేశుడు... పాపాల్ని పోగొట్టేవాడు... అని కీర్తిస్తారు” అంటూ సాలగ్రామశిలగా అర్చామూర్తిగా పద్మపీఠం మీద అవతరించాడు శ్రీనివాసుడు. "అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా! శ్రీవేంకటేశా! నీ ప్రత్యక్ష దర్శనం లేకుండా నేను జీవించలేను... నన్ను మన్నించు... కారుణ్యరససింధూ!” అంటూ ఏడుస్తూ ఆర్తితో స్వామి పాదపీఠానికి తలని మోదుకుంటున్నాడు తొండమాన్ చక్రవర్తి. బ్రాహ్మణుని భార్యాబిడ్డలు నిశ్చేష్టులై తొండమానుని చూస్తూ నిలబడ్డారు. వాళ్ళ కళ్ళనిండా నీళ్ళు... వాళ్ళ గుండెల నిండా వేదన. తొండమానుని నుదురు చితికిపోయింది. రక్తం ధారగా కారుతోంది. అయినా తొండమానుడు తలని మోదుకుంటూనే ఉన్నాడు. స్వామి పాదపీఠమంతా రక్తంతో తడిసిపోతోంది. మానవ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. కిందికి వంగి తొండమానుని లేవనెత్తి రక్తం కారుతున్న నుదుటి మీద తన మృదువైన చేతితో మెల్లగా నిమిరాడు. అంతే... క్షణంలో గాయం మాయమైంది. స్వామి పాదాలకి నమస్కరించాడు తొండమానుడు. “అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! నా కోరిక తీర్చవా?” దీనంగా అడిగాడు తొండమానుడు. “తొండమానూ! నీ కోరిక తప్పక తీరుతుంది. నీ భక్తి అనన్యమయింది. నువ్వు నన్ను ప్రార్ధించిన మరుక్షణంలో నా ప్రత్యక్ష దర్శన భాగ్యం నీకు లభిస్తుంది!” అని తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు శ్రీవేంకటేశ్వరుడు. "ధన్యుణ్ణి స్వామీ!” అంటూ బ్రాహ్మణుని భార్యాబిడ్డల్ని వెంటబెట్టుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. శ్రీవేంకటేశ్వరుడు అర్చారూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఓం నమో వేంకటేశాయ మంత్రాక్షరాలతో సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి! కూర్మనాథునికి అతని భార్యాబిడ్డల్ని అప్పగించి జరిగిన సంగతంతా వివరించాడు తొండమానుడు. ప్రత్యక్ష దైవదర్శనం చేసుకున్న వాళ్ళ అదృష్టానికి పొంగిపోయాడు ఆ బ్రాహ్మణుడు... అలాగే తన దురదృష్టానికి కుంగిపోతూ వాళ్ళని వెంటబెట్టుకుని స్వస్థలానికి వెళ్ళిపోయాడు.