భక్త పురందరదాసు


పండరిపురంలో కృష్ణయ్య అనే చిల్లర వ్యాపారి ఉండేవాడు. అతడు పరమలోభి. వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవటం తప్ప పిల్లికి బిచ్చం వేసేవాడు కాడని అందరికీ తెలుసు. అందువల్ల ఊళ్ళో ఎవరూ ఎంత అవసరమున్నా అతని దగ్గరికి సహాయం కోసం వెళ్ళేవారు కాదు. కృష్ణయ్య దుకాణం ముందు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారం రోజులుగా పడిగాపులు కాస్తుండడం గమనించాడు. అయినా పట్టించుకోలేదు. ఆ వృద్ధుడు కూడా పట్టు వదలక దుకాణం తెరిచేవేళకు వచ్చి మూసివెళ్ళిపోయేవరకు ఉంటూనే ఉన్నాడు. కృష్ణయ్యకు విసుగనిపించి బ్రాహ్మణుని దగ్గరికి పిలిచి 'ఎందుకలా నా దుకాణం ముందు కాపలా కాస్తున్నావు. ఏం కావాలో చెప్పి తగలడు' అన్నాడు. దానికా వృద్దుడు నా కుమారుడికి ఉపనయనం చెయ్యాలనుకుంటున్నాను. మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు. ఓహో! యాచకమా? ఇప్పుడే దుకాణం తీశాను. సాయంత్రం యా ద్దాం అని పంపేశాడు. ఉదయం వస్తే సాయంత్రం రమ్మని, సాయంత్రం వస్తే రేపు రమ్మని, రేపు, మాపని తిప్పించుకోసాగాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఆశతో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాడు. చివరికి బ్రాహ్మణుడు 'మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాను. నామీద కోప్పడుతున్నారు. నన్ను పట్టించుకోవడం లేదు' అన్నాడు. కృష్ణయ్యకు పట్టరాని కోపం వచ్చింది. 'నీ సొమ్మేదో నా దగ్గర దాచిపెట్టినట్టు ప్రాణాలు తీస్తున్నావే... రేపు రా' అని పంపేశాడు. , కృష్ణయ్య భార్య సరస్వతి పాండురంగని భక్తురాలు. భర్త నాస్తికుడు, లోభి అయినా ఆమె దైవం మీద విశ్వాసంతో విఠల నామాన్ని స్మరిస్తూ ఉండేది. వృద్ధుడు ఆమె దగ్గరికి వెళ్ళి కృష్ణయ్య తనను తిప్పుకుంటున్న విషయం చెప్పాడు. 'కలిగిందాంట్లో ఆయనకేదైనా సాయం చెయ్యండి. దైవం మెచ్చుకుంటాడు. లేకపోతే చెయ్యనని చెప్పేయండి. పెద్దాయన నలా వృధాగా తిప్పుకోవడం తప్పు కదా' అంది ఒకరోజు భోజనానికి వచ్చిన భర్తతో. 'నేనెందుకు నా నోటితో చెప్పాలి? రెండ్రోజులు తిరిగి అతనే మానుకుంటాడు' అన్నాడు కృష్ణయ్య. 'ఊళ్ళో కృష్ణయ్య స్వభావం తెలిసిన వారెవ్వరూ అతన్ని సాయం కోరరు. ఈ బ్రాహ్మణుడు ఎవరో మరి పట్టు వదలక ఆయన చుట్టూ


తిరుగుతున్నాడేమిటో' అనుకుంది సరస్వతి. మరునాడు ఉదయం యథావిధిగా బ్రాహ్మణుడు కృష్ణయ్య దుకాణానికి వచ్చాడు. కృష్ణయ్య ఏమనుకున్నాడో, గల్లా పెట్టి తీసి కొంత చిల్లర ఇస్తూ 'ఇదుగో దీనితో నీ కొడుక్కి యజ్ఞోపవీతం వేయించుకో' అన్నాడు ఉదారంగా. వృద్దుడు మౌనంగా దాన్ని తీసుకుని కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. 'దుకాణంలో డబ్బేదైనా ఇచ్చారా నా భర్త' అంది. ఏం చెప్పమంటావు తల్లీ! వారం రోజులుగా తిరిగి తిరిగి అలసిపోయాను. కృష్ణయ్యగారీ రోజు ఈ రెండు కాసులు ఇచ్చారు. దీనితో ఏం చెయ్యగలను. ఒక రెండు రోజుల్లోనే ఉపనయనం ముహూర్తం. . దైవభక్తి, పాపభీతి మెండుగా గల సరస్వతి భర్త పద్ధతికి బాధపడింది. వృద్ధుడు, సద్భాహ్మణుడు. ఈయన మనసుకి కష్టం కలిగితే అది తమకు మంచిది కాదని భయపడింది. భర్త గతి ఏమవుతుందోనని తను నమ్మిన విఠలునికి నమస్కరించి తన వజ్రపు ముక్కుపుడకను తీసి 'అయ్యా ఇది జాతి వజ్రం. దీన్ని విక్రయించుకుని మీ అబ్బాయికి ఉపనయనం జరిపించుకోండి' అంది. వృద్దుడు సంతోషంతో ఆమెను దీవించి వెళ్ళిపోయాడు. ఊర్లో మరో పెద్ద దుకాణం లేనందువల్ల పెద్దాయన ముక్కుపుడను కృష్ణయ్య అంగడికే తెచ్చి 'అయ్యా భగవద్భక్తులు నాకిచ్చారు. దీని వెల కట్టి ఇవ్వండి' అన్నాడు. 'ఇది మామూలు రాయి. ఇంతే వస్తుంది. తీసుకోండి' అని కొంత డబ్బిచ్చి పంపేశాడు. కృష్ణయ్యకి మనసులో భయం మొదలైంది. 'తనాయన్ని మోసం చేశాడని ఎవరికన్నా చెప్తాడేమో. తన పరువు పోతుంది. అందరూ మోసగాడంటారు. కృష్ణయ్య అంగడిలో పనిచేసే కుర్రాణ్ణి ఆయన వెంట పంపి ఎటు వెడుతున్నాడో తెలుసుకురమ్మన్నాడు. కొంతసేపటికి కుర్రాడు తిరిగి . వచ్చాడు. ముసలాయన పండరినాథుని దేవాలయంలోకి వెళ్ళాడు. మళ్ళీ కనిపించలేదు అన్నాడు. కృష్ణయ్య పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పుడూ స్తే భార్య ముక్కున పుడక లేదు. ఏమైంది నీ ముక్కుపుడక అన్నాడు అనుమానంగా. ఆ యాచకుడికి ఇచ్చేసిందని రూఢి చేసుకున్నాడు. తీసి దాచానంది సరస్వతి. వెంటనే తీసుకురా, చూ పించు' అని గద్దించాడు కృష్ణయ్య. భగవంతుడి మీద భారం వేసి 'విఠలా పాండురంగా భర్తకి . చెప్పకుండా దానం చేశాను. ఇప్పుడు అబద్దం కూడా చెప్పాను. నువ్వే నన్ను రక్షించాలి అని పరి పరి విధాల ప్రార్థిస్తూ తన ఆభరణాల పెట్టె తెరిచింది. 'తన చేత్తో తను దానమిచ్చేసింది. ఇంకెక్కడుంటుంది' అనుకుంది. కాని అద్భుతం జరిగింది.


ఆభరణాల పెట్టెలో ముక్కుపుడక మెరుస్తూ కనిపించింది. 'ఇదేం విచిత్రం, ఎలా వచ్చింది. ముక్కుపుడక దీన్లోకి. పరంథామా అంతా నీ లీల. భక్తుల్ని ఆపదల నుంచి కాపాడటానికి ఎటువంటి చిత్ర విచిత్ర మహిమల్ని చేస్తావు కదా! ఆ పండరిపుర నాథుడే నన్ను కరుణించాడు' అని స్తుతించుకుని ముక్కెర భర్తకి అందించింది సరస్వతి. అతను మరింత అయోమయంలో పడిపోయాడు. దుకాణానికి వెళ్ళు స్తే పెట్టేలో తను భద్రపరచిన ముక్కుపుడక మాయమైంది. ఆశ్చర్యంతో ఇంటికి వచ్చి సరస్వతిని జరిగింది చెప్పమని గద్దించాడు. ఆమె జరిగింది చెప్పింది. 'నేను వృద్దుడికి ఇచ్చింది నిజం. ఆయన మీకు కుదువ పెట్టింది నిజం. అది నా ఆభరణాల పెట్టెలోకి మళ్ళీ రావటం మరీ చిత్రమైన నిజం. ఇదంతా ఆ విఠల ప్రభువూ పిన లీల. నన్ను రక్షించటానికి నా నమ్మిన దైవం ఈ లీల చేశాడు. ఆ వృద్ధుడికి కావలసిన ధనం ఇప్పించాడు. అంతా ఆయన మహత్వం' అంది. 'నిజమే డబ్బు తీసుకుని ఆయన పండరినాథుని ఆలయంలోకి వెళ్ళాడని కొట్లో కుర్రాడు చెప్పాడు. అదే నిజమైతే ఆ పండరినాథుడే ముదుసలి రూపంతో ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చాడు. మూరుణ్ణి. గుర్తించలేకపోయాను. దైవం మానుష రూపేణా అంటారు. భగవంతుడు మిమ్మల్ని కరుణించటానికి ఆ రూపంలో వచ్చాడు అంది సరస్వతి ఆనంద బాష్పాలు రాలుస్తూ. అవును సరస్వతీ ఆయనే ఈ చమత్కారం చేశాడు. సాక్షాత్తూ ఆయనే మానవ రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించాడు అన్నాడు కృష్ణయ్య. ఈ సంఘటన కృష్ణయ్యను పూర్తిగా మార్చివేసింది. తన ఐశ్వర్యాన్నంతా పాండురంగని చరణాలకు సమర్పించాడు. జయ పాండురంగ ప్రభో విఠలా అని విఠలనామ సంకీర్తన చేసుకుంటూ ఊంఛ వృత్తితో జీవించాడు. ఆయన పాడిన విఠల భక్తి గీతాలన్నీ కర్నాటక భక్తి సంగీతంగా ప్రసిద్ధికెక్కాయి. పురందరదాసు కీర్తనలన్నీ 'పురందర విఠల' నామాంకితాలై వుంటాయి. కీర్తనలలోని విషయాలను బట్టి హరి గురు స్మరణ స్తుతి, అంతరంగ నివేదన, కృష్ణ లీలలు, సమాజ విమర్శ, సమాజ శోభ అని అయిదు వర్గాలుగా విభజించారు. నరహరి తీరుడు నెలకొల్పిన దాస సంప్రదాయంలో పురందరదాసు 3వ వాడు. పురందరదాసు మొత్తం 4,75,000 కీర్తనలు రచించాడనీ, అయితే సుమారు ఒక వెయ్యి మాత్రమే లభ్యమవుతున్నాయని తెలుస్తోంది. త్యాగరాజస్వామి, అన్నమాచార్యుల కీర్తనలలాగే కన్నడ భక్తకవి పురందరదాసు కీర్తనలు కూడా విరివిగా ప్రచారంలో ఉన్నాయి. భక్త పురందరదాసుగా శాశ్వత కీర్తిని, వాగ్గేయకారుడిగా గొప్ప ప్రతిష్ఠను పొందాడు.