వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః || విష్ణు స్వరూపుడైన వ్యాస మహర్షిచే మహాభారతము పద్దెనిమిది పర్వాలుగా విరచించబడింది. ఆయన సృష్టించిన పాత్రలు మహోన్నతములై మంచితనము, సత్యము, అహింస, దర్మము, జ్ఞానకణికలుగా మానవాళికి దార్శనికత్వమును కల్గించుచున్నాయి. కురువంశమునందు జనించి, సకలవిద్యలు నేర్చి, విలువిద్యలో మేటియై, రాకుమారునిగా, తండ్రి ఆజ్ఞను పాలించిన కుమారుడిగా, రాజ్యనిర్వహణ బాధ్యతను తలకెత్తుకుని జనరంజక పాలనను అందించిన యువరాజుగా, వంశము కష్టాల కడలిలో పడి మునిగిపోవునపుడు తన అకుంఠిత మేధాశక్తిని, పరాక్రమమును, ధీరత్వమును ప్రదర్శించి కౌరవ సామ్రాజ్యమును సుశిక్షిత సామ్రాజ్యముగా మార్చిన రాజకీయ దురంధరుడిగా శత్రువులు, దుర్మార్గులు, కుటిలురు కన్నెత్తి చూడనట్లుగా రక్షణ దుర్గముగా నిల్పి అగ్రసామ్రాజ్య పీఠంపై నిలబెట్టిన నిర్మాతగా, అవివాహితుడై, తన సవతి సోదరులను కాపాడుతూ, వారి వివాహాది శుభకార్యాలను స్వయం పర్యవేక్షణతో అంగరంగ వైభవంగా జేసిన కుటుంబ పెద్దగా, పినతండ్రిగా, తాతగా, పండితుడిగా, విష్ణుభక్తునిగా మహాభారత సంగ్రామమునందు తొలి సర్వసైన్యాధ్యక్షుడిగా నిలిచినవాడు భీష్ముడు. మహానుభావుడైన భీష్ముడి అసలుపేరు దేవవ్రతుడు. తండ్రి శంతనమహారాజు. తల్లి గంగాదేవి. గత జన్మలో అష్టవసువులలో ఆఖరివాడగు "ద్యౌ” అనువాడు. వసిష్ఠ మహర్షి విధించిన శాపం కారణంగా భువిపై గంగాదేవి గర్భసంభూతుడై కురువంశమునందు జన్మించెను. - భీష్ముని జీవిత చరిత్రలో ఎన్నో అనూహ్యమగు మలుపులు తిరుగును. భారతమున ఆయన పాత్ర చిరస్మరణీయం. హాయిగా రాజభోగాలు, పట్టుపాన్పులు దాసజనులతో సేవలందుకొని బంగారు, రంగారు పట్టు వస్త్రాలు, నానావిధ ఆభరణాలతో భోగాలు అనుభవించాల్సిన దశలో ఆశ్రమ జీవితంతో మొదలుపెట్టెను.
శంతనుడు గంగాదేవిని వివాహమాడెను. ఇది షరతులపైన జరిగిన వివాహము. ఆమె అందచందాలకు ముగ్ధుడై తన వివాహానికి స్త్రీ బెట్టిన ఆంక్షలు అంగీకరించెను. సంసార జీవితంలో పుట్టిన తొలినాటి సంతానమును పుట్టిన వెంటనే నదీజలాల పాలు చేయటం మహారాజుగా ఉన్న అతనికి పట్టరాని మనోవేదన మిగిల్చెను. ఎనిమిది మంది మగ సంతానములో ఏడుగురిని నీటిపాలు చేసెను గంగ. ఆఖరికి అమె చేసే దుషృత్యమును ఎదిరించెను. ఆమె చేసే పనిని నిలువరించెను. ఫలితంగా అత్యంత గోప్యంగా ఉంచిన దేవరహస్యము ప్రకారం ఎనిమిదవ బిడ్డను నీటిపాలు చేయక, గంగాదేవి సంసార జీవితము త్యజించి, పుట్టిన బిడ్డను తన వెంట తీసుకొనిపోయెను. 7,8 సంవత్సరముల వయస్సు వచ్చేవరకు తండ్రి ప్రేమకు దూరమై, సకల సుఖాలు విడిచిపెట్టి ఆశ్రమ జీవితం గడిపెను. పరశురామునిచే విలువిద్యలు నేర్పించెను. పరాక్రమవంతుణ్ణి చేసి తండ్రికి తనయుణ్ణి అప్పగించి దేవలోకానికి వెళ్ళిపోయెను. భీష్ముని బాల్యంలో తల్లితండ్రులిరువురు కలిసియున్నా ప్రేమ ఫలాలు పొందలేదు.
పెరిగి యుక్తవయస్సు వస్తుండగా వివాహమాడి సంతాన సుఖములు కల్గటానికి తండ్రి కోరిక రూపాన అడ్డుపడెను. భీష్ముని జీవితమంతా నిరంతరం పోరాటంలో ఎదురీదుటకు సరిపోయిందనిపిస్తుంది. అప్టైశ్వర్యాలు ఎదురుగా ఉన్నా, సేవకాజనము అందుబాటులో ఉన్నా తండ్రి కొచ్చిన మాట కొరకై ఆ జన్మ బ్రహ్మచారిగానే నిలిచిపోయెను. వేదనలో నుండి తనను తాను నిగ్రహించుకోగల ఆధ్యాత్మిక చింతనను ఆశ్రయించెను. సకల శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు అధ్యయనం చేసెను. సకల చరాచర సృష్టికి ఆధారభూతుడగు శ్రీమహావిష్ణువును ధ్యానించెను. విష్ణుభక్తిగ, నీతిసారమంతుడిగ, పరిపాలనలో కష్టనష్టాలు ఎదుర్కొను ధీమంతుడిగా నిల్చెను. పినతల్లి గర్భమున జనించిన విచిత్రవీర్యుడు, చిత్రాంగద అకాల మరణం చెందిరి. వారి భార్యలు కాశీదేశ రాజకుమార్తెలు అంబిక, అంబాలికలు నిస్సాంతులైరి. తల్లి సత్యవతి కురుసామ్రాజ్య దేవేరి అయినా నిర్వంశమై, బిడ్డలు లేక సింహాసనముపై ఎక్కి వారసులు కరువై కురువంశం నిరాశా నిస్పృహల చీకటిలో కొట్టుమిట్టులాడెను. - సత్యవతి భీష్ముని పిలిచి నాయనా! నీవన్నా వివాహమాడి, ఈ కౌరవవంశము ప్రతిష్ఠ నిల్పుమని అర్థించెను. తల్లీ! సత్యవాక్పరిపాలన చేయలేని ప్రభువు బ్రతికినా చచ్చినవానితో సమానం. కాని నా తండ్రికిచ్చిన మాట. స్వర్గంలో ఉన్న అతడు, అతని పితృదేవతలు పరిహసరించరా! ఇది నాకు తగనిపని. మీరే మరొక ఉపాయం ఆలోచించగలరు అన్నాడు. మొండివాడుగా ఉన్నా భీష్ముని నియమ నిష్ఠలకు సంతసించి భవిష్యత్ రచనకై తన ఆత్మజుడగు వేదవ్యాసుని తలంచెను. కర్తవ్య నిర్వహణకు ఉపాయము తెలుపమనెను. మహర్షి వేదవ్యాసుడు తల్లిని ఊరడించి, నీ వంశం నిర్వంశం కాదు. శతాధిక పుత్రులు, మనుమలు, మనుమరాండ్రు, వారి బిడ్డలతో మరింత సకల సంపదలతో ప్రభాసితమగును అని వివరించెను. అంబిక ద్వారా ధృతరాష్ట్రుడు, అంబాలిక వలన పాండురాజును సద్యోగర్భమున జనించిరి. గండం గడిచి గట్టెక్కెను. ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. పాండురాజు రోగగ్రస్థుడు. పాలనావ్యవస్థ సమస్య మళ్ళీ మొదటికే వచ్చెను. సంతానరహితులైరి. కుటుంబ పెద్దయగు భీష్ముడు వారి బాగోగుల కొరకై మళ్ళీ వ్యాస భగవానుని ఆశ్రయించెను. ధృతరాష్ట్రునికి గాంధారదేశ రాజకుమార్తె గాంధారిని, పాండురాజునకు మద్రదేశాధిపతి, యాదవ కులశ్రేష్ఠుడు అగువారి అమ్మాయిలగు మాద్రి, కుంతీదేవులతో వివాహం జరిపించెను. ఆనాటి సైన్స్ శాస్త్రీయతను జోడించి టెస్ట్యూబ్ బేబీలు, గర్భం దానం చేసే ప్రక్రియను నిర్వహించిరి. ఫలితంగా గాంధారికి నూర్గురు కుమారులు, కుంతి, మాద్రికి ఐదుగురు కుమారులు జన్మించిరి.
అంతవరకు బాగానే ఉందనుకొనేలోగా అంబ భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవటానికి పరశురాముని ఆశ్రయించటం, పరశురాముడు తన ప్రియశిష్యుడు భీష్మునిపై వత్తిడిని తీసుకురావటం, గుర్వాజ్జను తన నియమ నిబంధనను అనుసరించి ధిక్కరించటం వలన గురుశిష్యుల నడుమ యుద్ధం జరిగినంత భీష్ముడే విజేతగ నిల్చెను. ప్రతీకారేచ్చ పెరిగిన అంబ మహాశివుడి గురించి తపస్సు చేసి వరాలు పొందెను. ప్రస్తుతం ఈ జన్మలో నీవల్ల కాదు. భీష్ముడు అజేయ పరాక్రమశాలి. ధర్మానువర్తనుడు. సత్యసంధుడు. సత్ప్రవర్తన కలిగినవాడు. యువకుడు, యోధుడు. కావున నీ పనిని వాయిదా వేసుకొని రాబోవు మహాప్రళయ సంగ్రామమున అతనికి వ్యతిరేక దిశలో వైరి పక్షాన నిలిచినప్పుడు నీ కోరిక తీరునని పార్వతీ వల్లభుడు అదేశించెను. అంబ తపోగ్నితో దేహం చాలించి ద్రుపదుడింట శిఖండిగా జన్మించెను. అర్జునునికి ఆయుధమై నిలిచెను. భీష్ముని అంత్యకాలమునకు శ్రీకారము, ఆకారమైపోయెను. - అంబ పాత్ర అటు ప్రేమించిన ప్రియుడగు సాళ్వయువరాజుకు దూరమై, కుటుంబ మర్యాదకు భంగంగా భావించిన తల్లితండ్రుల తిరస్కరణకు గురియై, అవివాహితయై, బంధుమిత్ర జనుల వద్ద అప్రతిష్ఠపాలై, బ్రతుకు దుర్భరమై, భీష్మునిపై ద్వేషమును పెంచుకొని అతనిని నేరుగా సాధింపలేక మరొక జన్మను ఆశ్రయించెను. ఆడపిల్ల జీవితంలో గల్గిన చిత్ర విచిత్ర బాధలకు చక్కని సోదాహరణం. భీష్ముడు ఆ రోజులలో బలవంతుడైన రాచరికము కల్గినవాడు. కాశీరాజు ప్రకటించిన స్వయంవరానికి తాను వివాహమాడుటకు గాక తన తమ్ముల కొరకు వెళ్ళి పోరాటం చేసి ముగ్గురు కన్యలగు అంబ, అంబిక, అంబాలికలను హస్తినకు తోడ్కొనిపోయెను. క్షత్రియ వివాహ పద్ధతుల్లో గాంధర్వం, రాక్షసం, స్వయంవరాలు, తల్లితండ్రుల నిర్ణయంతో జరిగే వివాహాలు, ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవటం వంటి పద్ధతుల్లో నొకటియగు రాక్షసాన్ని ప్రదర్శించెను. పరాక్రమం చూపి కన్యను తీసుకెళ్ళి తాను వివాహమాడలేదు. వారి మనోభావము తెలపటానికి ఆస్కారం ఇవ్వలేదు. మిగిలిన ఇద్దరు కన్నెలకు కురు యువరాజులగు చిత్రాంగుడు, విచిత్రసేనులకిచ్చి వివాహము చేసెను. వారు పరిస్థితులకు తలవంచి రాణివాసంలో నిలిచిపోయిరి. అంబ ప్రేమ విఫలమై అర్జునునికి ఆధరువుగా మరుజన్మలో శిఖండిగా ఉపయోగపడెను. ఇంతకంటే స్త్రీ జీవితానికి పరాకాష్ఠ ఏముంటుంది? గండాలు గడిచి కౌరవ వంశస్థులు నూరుగురు, పాండవులు ఐదుగురు బిడ్డలు తాతచాటున పెరిగి పెద్దయ్యారు. భీష్ముడు మనుమల విద్య, శాస్త్ర విద్య, రాచరికపు అలవాట్లు, క్రమశిక్షణ పెరుగుదలపై వారినందరినీ కంటికి రెప్పలా కాపాడెను. దుర్భేద్యమగు రక్షణ వలయం సృష్టించెను. బాహ్య శత్రువులు హస్తినాపుర రాచరిక వ్యవస్థపై తిరుగుబాటు చేయ సాహసం లేనట్లుగా నిర్మించెను. కాని అంతర్గత శత్రువులు కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలను జయించలేకపోయెను. వ్యక్తిగతంగా దృఢమగు శీలమును కల్లెను. మనుమలలో దుర్యోధన, దుశ్శాసనుల రూపంలో అనివార్యమగు భేదభావాలు పుట్టి, పెరిగి విశృంఖలత్వము ప్రకటించాయి. ఫలితంగా అన్నదమ్ముల సంతానమునందు అసూయాద్వేషాలు, కక్ష కార్పణ్యాలు, హింస, పగ సాధించాలనే తపన మొదలయ్యెను. తండ్రి లేని బిడ్డలు, తాత చాటు మనుమలగు పాండుపుత్రులు తల్లి అదుపాజ్ఞలలో, పితామహుని కరుణా కటాక్షములతో, తమ ఇంటిలోనే పరాయివారుగా, దాయాదుల మాత్సర్యముతో పెరగవలసి వచ్చెను. అణిగిమణిగి యున్నప్పటికీ గుడ్డిరాజు యగు ధృతరాష్ట్రుని ప్రీతిచేష్టలు దుర్యోధనునిలో మరింత క్రౌర్యము, కాపట్యమును పెంచి పోషించెను. అగ్నికి వాయువు తోడైనట్లు వారికి కర్ణుడు, శకునిలు మరింత వినాశనానికి కారకులైరి. బాల్యంలో తాతగారు వారిని క్రమశిక్షణకు గురిచేసినను, కృపాచార్యుడు, ద్రోణాచార్యుల వంటి మంచి గురువులను నియమించి విద్యలను నేర్పించినను పాముకు పాలు పోసినట్లుగ పసివాళ్ళలో తారతమ్యాలు, వర్గభేదాలు పెరిగి పెద్దవయ్యా యి. ఆది, సభా, అరణ్య పర్వాలు, అజ్ఞాత పర్వాలలో కౌరవులు పాండవులను పలురకాలుగా అవమానించారు. కులసతి యగు ద్రౌపదిని నిండుసభలో పదుగురు చూచుచుండగా వలువలూడ్చి విలువలకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లచేసిరి. అరణ్యవాసంలో పలు కష్టాలకు గురి అయ్యారు. అజ్ఞాతవాసంలో పాండవులు మారువేషధారులై కుంజర యూధము దోమకుత్తుక జొచ్చినట్లు, విరటుని కొల్వులో గడిపిరి. వారి అజ్ఞాత కాలవాస నియమాన్ని కూడా భంగం చేయుటకు దుష్ట చతుష్టయం వేసిన ఎత్తుగడ పారక అవమానాల పాలైరి కౌరవులు. - ధర్మజ్ఞులు కనుక శ్రీకృష్ణపరమాత్ముని తమకు రావలసిన ఆస్తి పంపకాలకు రాయబారము చేసిరి. అది విఫలమై యుద్ధానికి కాలు దువ్విరి. పద్దెనిమిది అక్షౌహిణులు, పద్దెనిమిది రోజులు, పద్దెనిమిది పర్వాలతో మహాభారతం నడిచెను. అంతవరకు భీష్మునికి గల పెద్దరికము మసకబారి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చెను. వయోవృద్ధుడు, అందరికీ కావలసినవాడు చెప్పినా వినని ధృతరాష్ట్రుడు అతని సంతానము - పాండవుల ప్రతీకారేచ్ఛ యుద్ధానికి దారి తీసెను. - భీష్ముని సర్వసైన్యాధ్యక్షుడిగా దుర్యోధనుడు అభిషిక్తుడ్ని చేసెను. ఎన్ని యుద్ధాలు చేసి, పరాజయము ఎరుగని ధీరుడగు గాంగేయుడు నాటి పరిస్థితులకు తలవంచి, అధర్మపక్షమని తెలిసి కూడా పాండవుల మేలుకోరు వానిగా దూరంగా ఉండి కౌరవసేనా వాహినికి నేరుగా అధ్యక్షత వహించి కొనసాగెను.
ఇది భీష్ముని అంతరంగానికి పెట్టిన పెద్ద సంక్షోభము. ఇన్ని సంవత్సరాలుగా ఈ కౌరవ వంశ పరిరక్షకునిగా, శత్రు దుర్భేద్య పరిపాలకుడుగా, రాజనీతిజ్ఞుడిగా, ధర్మాధర్మాలు తెలిసిన నీతిమంతుడుగా పేరు ప్రతిష్ఠలున్నా వ్యతిరేకవర్గంలో తన ఆయుధమును పట్టెను. పద్దెనిమిది దినాలలో అత్యధిక దినాలు - అందు పదిరోజులు సేనా నాయకత్వం వహించి, తక్కువ సేనావాహిని యగు ఎనిమిది అక్షౌహిణీ సేనలపై యుద్ధం చేసెను. దుర్యోధనుడు అడుగడుగునా తాతగారిని కించపరుస్తూ, యుద్ధంపై కినుక, క్రోధమును పెంపు చేసెను. ఆయుద్ధం పట్టనన్న శ్రీకృష్ణుడికి సైతం భీష్ముడి పరాక్రమము క్రోధం తెప్పించెను. - పార్థుని రథసారథ్యము వహిస్తున్న కన్నయ్య తన చక్రాయుధంతో శంతనుడి పైకి ఉరికెను.
“కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొన ఉరికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున గరల జక్రంబు చేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జాళ నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ"
భాగవతమున పోతన మహాశయుడు అద్భుతంగా ప్రథమస్కంధమున విరచించెను. ఎందరో వీరులను అంతం చేసెను. వృద్దుడైనప్పటికీ తన ప్రతాపానికి అర్జునుడు సైతము తల్లడిల్లెను. తన తదుపరి కార్యమునకు దారితెన్నులు తెలియక నిర్వీర్యుడయ్యెను. - ఆ మరునాడు జరగబోవు యుద్ధానికి పరిష్కారము చెప్పమని శ్రీకృష్ణుని కోరగా దానికి దారిచూపువాడు భీష్ముడేనని సూచించెను. ఆనాటి రాత్రి పితామహాది సోదరులతో దర్శించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించెను. అంతట తన మరణ రహస్యమును అర్జునునికి వివరించెను. - ఇందు మరొక ప్రతిపాదన గూడా కలదు. భీష్ముడు అర్జునునికి మరణ రహస్యం ప్రత్యేకంగా చెప్పింది లేదని పండితుల ఉవాచ. భారతదేశంలో యుద్ధనీతిలో రాత్రిపూట స్కంధావారాలపై దాడి చేయకూడదు. యుద్ధానికి ముందే ఎవరికి ఇష్టమైనవారి పక్షంలో వారు చేరవచ్చు. శరణు గోరినవారిని, స్త్రీలను, పసివారలను, వృద్ధులను, అంగవిహీనులపై దండయాత్ర చేయరాదు. శ్వేత పతాకం ఎగురవేస్తే యుద్ధం చేయరాదు. పారిపోయేవారిపై దాడి చేయరాదు. రథాలు, అశ్వాలు, గజారూఢులైనవారు, వాహన విహీనులైన వారిపై కత్తి ఎత్తరాదు. శిఖండులపై విల్లునెత్త రాదు. ఇవన్నీ యుద్ధవిద్యలు నేర్చేవారందరికీ నేర్పే విద్య. ధర్మజుడు తాను ధరించిన కవచమును విడిచి, ధనుర్బాణము వీడి, రథం దిగి, పాదచారియై భీమసేనాదులను, శ్రీకృష్ణుని తోడ్కొని భీష్ముని రథం వద్దకు వెళ్ళి శిరస్సు వంచి అనుమతి పొందిరి.
అని పాదములు పట్టి కోరిరి. అంతట భీష్ముడు సంతసించుచు ధర్మజా! నీవిట్లు రాకుంటివేని అనగా ఈ పక్షమున నేనుండుటకు గల కారణము గ్రహించక నీవు నీ పక్షానే ఉండి శత్రువగనే భావించి రాకున్నట్లయిన నీకు చేటు కల్గునని శపించియుందును. కాని నీ వినయ విధేయతలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. వరం కోరుకో అనెను. నాయనా నా దేహము కౌరవుల అర్ధముచే పోషింపబడినది. కౌరవ వంశబద్దుడను. నేను పక్షం మారుట వీలకాదు. కాని సాయం చేయగలను. . అంతడు ధర్మజుడు తాతగారూ మీరు అజేయులు. మిమ్ములను జయించుటెట్లు అనెను. అప్పుడు భీష్మునిపై ఇది ఒక అపవాదేనని, అరణ్యపర్వంలో ద్రుపదకుమారుడు, అర్జునుని బావమరిది యగు ధృష్టద్యుమ్నుడు వివరించెను. ఉద్యోగపర్వములలో ఛాయలు గలవు. నేను ద్రోణుని చంపెదను. శిఖండి భీష్ముని చంపును. భీముడు దుర్యోధనుని; కర్ణుని అర్జునుడు వంతులుగా చెప్పుకొనిరి. భీష్మ శ్శాంతననో రాజన్ భాగ్య క్లుప్తః శిఖండినః (ఉద్యోగ పర్వం - 476) సంజయుడితో అర్జునుడు రాయబార సందర్భమున చెప్పెను. ఉలూక రాయబారమున - శిఖండి నేరుగా చెప్పినట్లు విశదమగుతోంది.
సంజయుడితో అర్జునుడు రాయబార సందర్భమున చెప్పెను. ఉలూక రాయబారమున - శిఖండి నేరుగా చెప్పినట్లు విశదమగుతోంది. అహం భీష్మవధాం సృష్టో - (ఉద్యోగపర్వం - 1వ ఆశ్వాసం - 2 వ అధ్యాయం) ఈవిధంగా అందరికీ తెలిసినదే భీష్ముడి మరణ విషయం . అదిగాక భీష్మునికి స్వచ్చంద మరణం వరం గలదు. ఆయనకే ఈ లోకంపై విరక్తి కలిగింది. నా మరణ సంకల్పము పరిపూర్తవ్వగానే నా జీవన యాత్ర ముగియగలదు అని చెప్పెను. భీష్ముని నాయకత్వంపై గూడా పలు సంశయాలు గలవు. పాండవులది ధర్మపక్షమని తెలిసి కూడా భీష్ముడు కౌరవ పక్షమున నెందుకు యుద్ధము చేసెను? 1. భీష్ముడు సత్యవతి తండ్రియగు దాశరాజుకు నీ పుత్ర పౌత్రులకు సంరక్షునిగా ఉండటానికి మాటనిచ్చియుండెను. 2. పాండవులు మనుమలు - కుమారుని వరుసయగు ధృతరాష్ట్రుడు ఇంకా జీవించియే యుండెను. పాండురాజు స్వర్గస్థుడగుట, పుత్రస్థానం కాపాడుట నిర్మాత పని. 3. ధర్మాత్ములు పాండుసుతులు గెలుపు వారిదేననే నిర్ధారణ కొచ్చినవాడు. 4. శిఖండి పాండవ పక్షమున గలడు. పాండవులకు భయం లేదు. నేను గూడా పాండవులతో చేరిన కురువంశం అత్యంత త్వరగా వినాశమగును. - 5. భీష్మ ద్రోణాది వీరులు, దేవాంశ సంభూతులు, అష్టవసువుల్లో చివరివాడు భీష్ముడు. దేహయాత్ర చాలించక తప్పదని నిర్ధారణకొచ్చెను. 6. కర్ణుడి వీరత్వముపై దుర్యోధనుడి గుడ్డి నమ్మకము పుట్టి ముంచునని భవిష్యతను ఊహించినవాడగుట. 7. కర్ణుడివన్నీ అపజయాలే. చాటుదెబ్బలే.
భీష్ముడి పరాజయం - అంపశయ్య పై పవళింపు
క్షత్రియులకిది ఆచరణ అయితే ఉత్తరాయణం వచ్చు వరకు వేచియుండుటమే. భారత యుద్ధం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ప్రారంభమయ్యెను. మార్గశిర బహుళ సప్తమినాడు భీష్ముడి పతనం జరిగెను. 46 రోజులు అంపశయ్యపై నుండెను. హేమంతం చలి ఎక్కువ. ఎముకలు కొరికే శీతలం. ఆరు బయట బతకటం ఎంతో కష్టం. అంపశయ్యపై ఉండటమంటే నేటి ప్రకారం వెంటిలేటర్లపై ఉండటమే. బతికినా చచ్చినట్లు మరణం అంచులో ఉన్నట్లు - దక్షిణాయనం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోయిన సద్గతులు పొందెదరు. మహాజ్ఞాని, దేహాభిమానం లేనివాడు, మహాయోగి, మహాభక్తుడు కర్మసిద్ధాంతం పరిపూర్తిగా అనుభవించినవాడు - ఉత్తరాయణ ప్రాశస్త్యమును లోకానికి తెలియజేయుటకై మహా విష్ణు భక్తుడు చేసిన వ్రతమది.
మాఘమాసి ఫితాష్టమ్యాం సలిలం భీష్మ తర్పణం శ్రాద్ధంచ యే నరాః కుర్యుతే స్యు సంతతి భాగినః మాఘమాస శుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహత్యాగం చేయ సంకల్పించెను. సంకల్పమాత్రుడు - సిద్దుడు. స్వచ్చంద మరణ వరప్రసాది. తండ్రి జీవించినవారు తర్పణం విడువరాదు (పద్మపురాణం). భీష్మునికి తర్పణం విడిచినవారికి సంవత్సర కాలమంతా చేసిన పాపము ఆ క్షణమందే నశించునని మహాభారతమున చెప్పబడింది. మరణశయ్యపై ఉండి కూడా ధర్మజుని అనేక రాజనీతి విషయాలు వివరించి చెప్పెను. విష్ణు సహస్ర నామావళి లోకానికి అందించిన మహనీయుడు భీష్ముడు.