మహాభారతంలోని మహాపాఖ్యానాలు - గరుడోపాఖ్యానం


గత సంచిక తరువాయి మహాబలశాలి అయిన గరుత్మంతుడు స్వర్గలోకానికి వెళ్ళాలనే తలంపుతో రెక్కలను గట్టిగా విదిలించాడు. రెక్కల నుండి పుట్టిన గాలికి చెదిరిన పూలన్నీ విజయ సూచకంగా గరుడుడి పైన పుష్పవర్షం కురుస్తోందా అన్నట్లు పడ్డాయి. అమృతాన్ని తేవడానికి గరుడుడు ఎప్పుడైతే ఎగిరాడో అక్కడ ఇంద్రలోకంలో మహోత్పాతాలు పుట్టాయి. “సురవతి సభ చూడంజూడ నంగార వృష్ణుల్ కురిసె, కులిశధారల్ కుంఠితంబయ్యె, దిక్కుం జరమదము లడంగెన్ సర్వదిక్పాల కాంతః కరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్" - 81 ప - ద్వి.ఆ. - ఆదిపర్వము దేవేంద్రుని సభలో నిప్పుకణాలు వర్షంలాగా కురిశాయి. వజ్రాయుధం యొక్క అంచులు పదును కోల్పోయాయి. దిక్కులను మోసే గజాల మదాలు అణగిపోయాయి. సభలో ఉన్న దిక్పాలకులందరి మనస్సులు భయోద్వేగానికి గురయినాయి. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఇన్ని అపశకునాలకు కారణమేమిటని ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని అడిగితే - దివ్యదృష్టితో కారణం తెలుసుకొన్నాడు బృహస్పతి. -


• “దేవేంద్రా! గరుత్మంతుని రాకతో ఇన్ని ఉత్పాతాలు చెలరేగాయి. గరుడుడు ఎవరనుకొంటున్నావు? బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన కశ్యప ప్రజాపతి పుత్రుడు. పుణ్యశీల అయిన వినతకు పుట్టిన పాపరహితుడు. వాలఖిల్య మహర్షుల వర ప్రభావం వల్ల పక్షికులానికి ఇంద్రుడైన మహాతేజోమూర్తి. సముద్రంలోని ఘోరభయంకరులైన లక్షలాది నిషాదులను కడుపార మ్రింగిన వీరాధివీరుడు. గజకచ్చపాలు రెంటినీ తన రెక్కలలో ఇరికించుకుని వాయువేగంతో ఆకాశయానం చేసిన బలశాలి. రోహిణి శాఖను క్రింద పడవేయకుండా మహర్షులతో పాటు పైకెగిరి తండ్రిని చేరిన ధీయుతుడు”.


“నూరు యజ్ఞాలు చేసి ఇంద్రపదవి నలంకరించిన సురపతీ! ఒక్కమాట చెబుతాను విను. తన తల్లి అయిన వినత యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృతాన్ని తీసుకుపోదామనే ఉద్దేశంతో గరుడుడు మన లోకానికి వస్తున్నాడు. అందుకే ఈ అపశకునాలన్నీ. అతనిని జయించటం నీకు సాధ్యం కాదు. గరుడుడు కామరూపుడు. కామగమనుడు. మహావీరుడు. సకల సద్గుణ శోభితుడు. మహర్షి వరప్రభావితుడు. అజేయుడు. గరుడుని మాహాత్మ్యం నీకు కూడా తెలుసు మహేంద్రా! పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రులు కావాలని కోరి పుత్రకామేష్టి చేశాడు. నీకు గుర్తుందా? ఆ యజ్ఞానికి కావలసిన కట్టెల (సమిధల) ను తేవడానికి నిన్ను, తక్కిన దేవతలను, ప్రముఖులైన వాలఖిల్యాది మహామునులను సహాయపడవలసిందని కోరాడు. అప్పుడు నీవు నీ శక్తికి తగినట్లుగా కట్టెల మోపులను ఎన్నిటినో మోసికొని వస్తుండగా వాలఖిల్యాదులు ఎదురుపడ్డారు. తక్కువ కట్టెల మోపులను మోస్తూ, ఆ బరువును మోయలేక గడగడ వణుకుతున్న వారిని నీవు ఆశ్చర్యంగా చూశావు. గొప్పబలం లేకుండా, బొటన వేలంత శరీరం గలవారిని, నిత్యోపవాసాల చేత కృశించిపోయిన వారిని చూసి నీవు నవ్వావు. నీవు నవ్వేసరికి ఆ మహర్షులు సిగ్గుపడి, తక్షణం కోపించారు.


“రణ విజయుడనలతేజుం డణిమాది గుణాఢ్యుడు దితుడయ్యెడు వీరా గ్రణి శతమఖుకంటెను శత గుణ వీర్యుండైన పుత్రకుండజితుండై" - 85 ప - ద్వి.ఆ - ఆదిపర్వము


సకల మంత్రశాస్త్ర వేత్తలయిన వాలఖిల్యాది మునులు వెంటనే అగ్నిలో సమం చేస్తూ మహావీర్యవంతాలైన మంత్రాలతో వ్రేల్చసాగారు. అలా చేస్తూ ఇంద్రుడి గర్వాన్ని అణగదొక్కాలని “మరో ఇంద్రుడు జన్మించుగాక” అని అన్నారు గదా. అప్పుడు వారింకేమన్నారో కూడా మర్చిపోయావా ఇంద్రా! యుద్ధంలో విజయసాధకుడు, అగ్నితేజుడు, అణిమాది గుణాఢ్యుడు, వీరాధివీరుడు, ఇంద్రునికన్న శతాధిక సద్గుణ సంపన్నుడు, అత్యధిక బలాన్వితుడు అయిన పుత్రుడు, సర్వులకు అజేయుడై జన్మించుగాక. ఆ సుగుణశీలి రెండవ ఇంద్రుడై సకల సన్మంగళాలను పొందుగాక అని తమ తపోబలాన్ని జోడించి వ్రేల్చారు గదా. అది విన్న నీవు భయాందోళనలతో మీ తండ్రిని శరణు కోరావు. నీకాబాలుడు ఎక్కడ సమ ఉజ్జీగా వస్తాడో అని భీతి చెంది, రెండవ ఇంద్రుడు జన్మించకుండా చేయమని కశ్యపమహర్షిని ప్రార్థించావు. వాలఖిల్యులు అఖండ తేజోమూర్తులని, వారి మాటకు తిరుగుండదని తెలిసిన కశ్యప బ్రహ్మ వారిని కరుణించమని కోరాడు. “బ్రహ్మదేవుడు త్రిలోకాధిపత్యాన్ని ఒక్క శతమఖుడికే ప్రసాదించాడని, రెండో ఇంద్రుడుండటం బ్రహ్మవాక్కును అతిక్రమించటమే అవుతుందని” వాలఖిల్యులకు తెలియజెప్పాడు. “కాని బ్రహ్మరులైన మీ వాక్కు వృధా కారాదు కనుక పుత్రకామేష్టి వల్ల నాకు కలగబోయే పుత్రుడు పక్షీంద్రుడౌ గాక, దానికి మీరు సమ్మతించాలి” అని కశ్యపుడు వారిని దానికి అంగీకరింపచేశాడు. అందుచేతనే ఇంద్రపదవి నీ ఒక్కడికే దక్కింది. ఆ విధంగా పక్షులకు రాజైన గరుత్మంతుడు - అమృతం తీసుకుపోవడానికి స్వర్గ లోకానికి రావటం చేత, నీ సభలో ఇన్ని అపశకునాలు కలిగాయి. అంతటి మహా బల సంపన్నుడైన గరుడుని గెలవటం నీవల్ల కానిపని” అని దేవగురువు ఉత్పాతాలకు కల కారణాలు వివరించి చెప్పడంతో మహేంద్రుడు తనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనుకున్నాడు. వెంటనే అమృతభాండాన్ని రక్షిస్తున్న సురవీరులందరినీ పిలిపించి, వారిని తగు జాగ్రత్తతో, అప్రమత్తతతో మెలగమని, అమృత రక్షణ అత్యంత ఆవశ్యకమని, తన్నిమిత్తం పరాక్రమవంతులు కండని ఆజ్ఞాపించి పంపివేశాడు. అమృతం ఉన్నచోటుకు వెళ్ళాలనే సంకల్పంతో రెక్కలు విదిల్చి ఎగిరిన గరుడుని సంరంభం చూసి దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు అమితాశ్చర్యంతో తలమున్కలయ్యారు.


“వితతోల్కాశనివుంజ మొక్కొయనగా విన్వీధి విక్షిప్త ప క్షతివాతాహతి తూలి తూలశకలాకారంబులై వారి ద ప్రతతుల్ సాల్పడి నల్గడం బెదరగా పాటెన్ మనోవేగుడై పతగేంద్రుండమృతాంతికంబునకు తత్పాలుర్ భయంబందగన్" - ప 91 - ద్వి. ఆ - ఆదిపర్వము


పక్షిరాజైన గరుత్మంతుడు అమృతభాండాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో మనోవేగంతో ఒక్క ఉదుటున పరుగెత్తాడు. గరుడుడు ఆవిధంగా వెళుతున్నప్పుడు ఆ మహాబలశాలి రెక్కల నుండి పుట్టిన ఉధృతమైన గాలి తాకిడికి మబ్బులన్నీ దూదిపింజల ఆకారాన్ని ధరించి నాలుగు దిక్కులకు చెదిరిపోయాయి. ఆ దృశ్యానికి అమృత రక్షకులు భయపడిపోయారు. ఎక్కడ ఆ పక్షిరాజు తమ మీద వచ్చిపడతాడో అని వణికిపోయారు. కాని ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం గరుడుని ఎదుర్కొని తీరాలి. అగ్నిజ్వాలలా అన్నట్లున్న భయంకరమైన పెద్ద రెక్కలు గల మహాశౌర్యవంతుని, గరుత్మంతుని చూసి, అమృత హరణార్థం వచ్చినందుకు క్రోధోన్మత్తులై ఆ పంద్రుని ఎదుర్కొన్నారు. అనేక శస్త్రాస్తాలతో ఆ రక్షకులు గరుత్మంతునితో ఆతనిని పడవేస్తూ, నెట్టివేస్తూ, పొడుస్తూ తమ పరాక్రమాన్ని వెల్లివిరియజేస్తూ యుద్ధం జేశారు. తనను ఎదుర్కొన్న దేవతల దృష్టిని గరుడుడు రెక్కలు విదిల్చి,


నీ బలానికి, శౌర్యా నికి, వేగానికి, లోలత్వం లేనితనానికి, - అన్నిటినీ మించి నీ సద్భావానికి మెచ్చాను గరుడా! నీకు వరమిద్దామని అనుకొని నీ వద్దకు వచ్చాను. నీకు ఏ వరం కావాలో అది కోరుకో. ఇస్తాను. రాక్షస సంహారా! నారాయణా! అమృతం సేవించకపోయినా, నాకు అమరత్వం ప్రసాదించు ప్రభూ! సమస్త లోకాలకు అధినాథుడైన నీ ముందు సర్వవేళలా అత్యంత భక్తితో నిన్ను కొలిచే వరం కోరుకుంటున్నాను. ఈ రెండు వరాలు, కరుణాత్ముడవై నాకనుగ్రహించు. అంతకన్న నాకింక ఏం కావాలి దేవదేవా? నేను అడగక పోయినా, తపమొనర్చకపోయినా, దయాళువవై నాకు నీ దర్శనాన్ని ప్రసాదించావు. నా జన్మ ధన్యమైంది.


దుమారం లేపి, ఆ దుమ్ము పరంపరతో కప్పివేశాడు. ఆ దుమ్ము వర్షంతో స్వర్గలోకమంతా అంధకార బంధురమై పోయింది. అది విన్న ఇంద్రుడు వాయుదేవుని దుమ్ము చెదిరిపోయేటట్లు చేయమని ఆజ్ఞాపించాడు. వాయుదేవుడు దుమ్ము వర్షాన్ని చెదరగొట్టి ఇంద్రుని సంతృప్తి పటిచాడు. భౌమనుడనే వీరుడు రకరకాల ఆయుధాలతో గరుత్మంతుని ఎదుర్కొని అగ్నిలో దగ్గమయ్యే మిడతవలె పక్షీంద్రుని చేతిలో హతమైనాడు. దేవతా వీరులెవ్వరూ గరుడుని ముందు నిలవలేకపోయారు. రెక్కలతో, ముక్కుతో, గోళ్ళతో వైనతేయుడా సురలనందరినీ నెత్తుటి ధారలకు గురిచేయగా, ఆ మహావీరుని చేతిలో పరాజితులై, అశక్తులై ఇంద్రుని వెనక నక్కారు. వివిధ దేవతా జాతులవారు గరుత్మంతుని అసాధారణమైన పరాక్రమం చూసి నిశ్చేష్టులై కింకర్తవ్యతా విమూఢులైనారు. సాధ్యులు గర్వాన్ని విడనాడి తూర్పుదిక్కుగా పారిపోయారు. వసువులు, రుద్రులు ధనహీనులైన విప్రుల మాదిరి దక్షిణను ఆశ్రయిస్తున్నారా అన్నట్లు దక్షిణ దిశగా భీతితో పరుగులెత్తారు. ద్వాదశాదిత్యులు పడమటి దిగంతం చేరుకొంటే అశ్వినీదేవతలు ఉత్తరదిక్కునాశ్రయించారు. ఇక అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, యమధర్మరాజు, నైరృతి అనే దిక్పాలకులు శక్తిహీనులై దిక్కుతోచక కాందిశీకులైనారు. అమృత భాండానికి రక్షకులైన రేణువు, పదనఖుడు మొదలైన వారినందరినీ గరుడుడు తన వాడిగోళ్ళతో చీల్చి చిందర వందర చేశాడు. దేవతా శ్రేష్ఠులనందరినీ తన అమేయబలం చేత ఓడించి అమృతం ఉన్న స్థానాన్ని చేరుకొన్నాడు. అమృతం చుట్టూ ఉన్న అగ్ని జ్వాలలను చూసి వాటిని చల్లార్చటానికి సమస్త నదులలోని నీటినంతటిని తన పుక్కిటబట్టి తెచ్చి అగ్నిలో పోశాడు. అగ్ని పరిధి లోపల యంత్ర రూపంలో ఉన్న చక్రాన్ని చూశాడు. వెంటనే సూక్ష్మదేహం కలవాడై యంత్రచక్రం ఆకుల మధ్యకు చేరాడు. అంతటితో గరుడుడి ప్రయత్నం సరిపోలేదు. ఆ చక్రం క్రింద విషనాగులను చూశాడు.


“ఆ నాగశ్రేష్ఠుల ముఖాలు కోపంతో వికారంగా ఉన్నాయి. అగ్నివలె ఎఱ్ఱగా, భయంకరంగా ఉన్న నేత్రాలతో చూస్తున్నాయి తమ మీదకు ఎవరు వస్తున్నారా అని ఆ సర్పరాజాలు. తమ చూపుల నుండి విషమనే అగ్నిజ్వాలలను ప్రసరింప చేస్తూ ఎవరినీ అమృతం దగ్గరకు రానివ్వకుండా అమృతభాండం చుట్టూ కాపలా కాస్తున్నాయి. మహాభయంకరంగా ఉన్న ఆ రెండు సర్పాలను చూశాడు గరుడుడు. తక్షణం ఉద్దీప్త శౌర్యంతో, తన రెక్కలను విదిల్చి, తద్వారా వచ్చిన దుమ్ముచేత వాటిని గ్రుడ్డివాటిగా చేశాడు. ఆ సర్పశ్రేష్ఠుల శిరస్సులు తొక్కి, వాటిని నిర్వీర్యం చేసి అమృత భాండాన్ని గ్రహించి ఆకాశంలోకి ఎగిరాడు పక్షీంద్రుడు. ఆకాశానికెగిరిన గరుడుడు తన చేతిలో అమృతం ఉన్నా కూడా, దాని మహిమ తెలిసి కూడా ఒక్క చుక్కయినా త్రాగలేదు. కనీసం అమృతం ఎలా ఉంటుందనైనా రుచి చూడలేదు. అటువంటి సుగుణశీలి అయిన వినతాపుత్రుని చూసి సంతోషించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ మహావీరుని ప్రశంసించడం ఆయన అలౌల్యాన్ని, ధీరత్వాన్ని, సద్గుణ సంపత్తిని దశదిశలా చాటుతోంది.


గరుత్మంతుడు ఎవరి గురించి తపస్సు చేయలేదు. కనీసం మనసులోనైనా ఏ దేవునీ ఏ వరమూ కోరలేదు. ఆయనకసలే కోరికా లేదు. మాతృదాస్య విమోచన మొక్కటే ఆయన ధ్యేయం. అది నెరవేర్చుకోవటానికే బయలుదేరాడు. నిర్విఘ్నంగా పని పూర్తి చేసుకొన్నాడు. శౌర్య ప్రతాపాలతో వీరులందరినీ అపజయంపాలు చేశాడు. విజయుడై నిల్చి, ఉత్సాహంతో నాగుల దగ్గరకు పరుగెత్తుతున్నాడు. అదంతా గమనించాడు - జగన్నాథుడైన జనార్దనుడు. గరుడుడి ముందు నిలిచాడు. “నీ బలానికి, శౌర్యానికి, వేగానికి, లోలత్వం లేనితనానికి, - అన్నిటినీ మించి నీ సద్భావానికి మెచ్చాను గరుడా! నీకు వరమిద్దామని అనుకొని నీ వద్దకు వచ్చాను. నీకు ఏ వరం కావాలో అది కోరుకో. ఇస్తాను” అని అనటం విష్ణుమూర్తి వాత్సల్యానికి, ఔదార్యానికి నిదర్శనం. అనూహ్యమైన ఈ సంఘటనకు గరుడుడు ఉప్పొంగిపోయి, విష్ణుమూర్తి పాదపద్మాలకు ప్రణమిల్లాడు. విష్ణుమూర్తి అంతటి స్థితికారుడు వచ్చి నీకు వరమిస్తానని అంటే గరుడుడిలో అనంతమైన భక్తి పెల్లుబికింది. పరమాత్ముని వైపు చూశాడు - వినయ వినమితోత్తమాంగుడైనాడు. పరమాత్ముని కరుణా దృష్టి తనమీద పడడం తన భాగ్యమనుకొన్నాడు. దేవదేవుని చూసి తన కోరిక వెల్లడించాడు.


“రాక్షస సంహారా! నారాయణా! అమృతం సేవించకపోయినా, నాకు అమరత్వం ప్రసాదించు ప్రభూ! సమస్త లోకాలకు అధినాథుడైన నీ ముందు సర్వవేళలా అత్యంత భక్తితో నిన్ను కొలిచే వరం కోరుకుంటున్నాను. ఈ రెండు వరాలు, కరుణాత్ముడవై నాకనుగ్రహించు. అంతకన్న నాకింక ఏం కావాలి దేవదేవా? నేను అడగక పోయినా, తపమొనర్చకపోయినా, దయాళువవై నాకు నీ దర్శనాన్ని ప్రసాదించావు. నా జన్మ ధన్యమైంది” అన్న గరుత్మంతుని వాత్సల్య దృష్టితో చూస్తూ రెండు వరాలూ ప్రసాదించాడు శ్రీమహావిష్ణువు. "పాపరహితుడవైన గరుడా! నీకు మరో రెండు వరాలు కూడా ఇస్తాను. నీ నిజాయితీ, నీ దీక్ష నాకు బాగా నచ్చాయి. ఇకనుంచి నాకు వాహనంగా, పతాకంగా వర్ధిల్లుదువు గాక!” అని లక్ష్మీనాథుడు పలకగానే గరుడుడు "మహాప్రసాదమని” వైకుంఠవాసుడికి మరల మరల మ్రొక్కి తన పయనాన్ని కొనసాగించాడు. విష్ణువూ అంతర్జానం చెందాడు. అప్పటికి గరుడుడి దగ్గరకు వచ్చిన మహేంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసి పక్షీంద్రుడి పైకి విసిరాడు. వజ్రాయుధం నిప్పురవ్వలను ఆకాశమంతటా వెదజల్లుతూ గరుడుని రెక్కలను హరించటానికి, సమీపానికి వచ్చేసరికి ఆ ఆయుధాన్ని చూసేటప్పటికి మహాబలవంతుడైన గరుడుడికి నవ్వు కలిగింది - "అదెంత? దాని బలమెంత?” అని. “వజ్రాయుధమా! నీవు పెట్టగలిగిన బాధ నన్నేం చేయలేదు సుమా! నీవు మహాముని త్యాగధని అయిన దధీచి వెన్నెముక నుండి ఏర్పడిన దానివి కావటం వల్ల నిన్ను నేను ఏమీ చేయను. అంతేగాక త్రిలోకనాథుడైన దేవేంద్రుని ఆయుధం కావటం వల్ల కూడా నిన్నవమాన పరచటం నా అభిమతం కాదు. అందుచేత నా రెక్కలోని ఒక ఈకను మాత్రము ఛేదించి మరలిపొమ్ము. నామీద నీకున్న శక్తి అంతే సుమా” అని గరుత్మంతుడనగానే సకల లోకవాసులు అతని రెక్కల బలాన్ని ప్రశంసించి ముగ్గులైనారు. గరుడుని "సుపర్లు”డని పిలిచి ఎంతగానో అభినందించారు. దేవేంద్రుడు సహితం ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. గరుడుని స్తుతించకుండా ఉండలేకపోయాడు - అతడు తమ్ముడయినప్పటికీ. ఇద్దరి తండ్రీ కశ్యప బ్రహ్మే కదా!


“నిరుపమాన శౌర్య! నీతోడ చెలిమిసే యంగ నాకభీష్టమైన యదియు నిట్టి విక్రమంబు, నిట్టి సామర్థ్యంబు కలదె! యొరుల కిజ్జగంబునందు" - 108 ప - ద్వి. ఆ - ఆదిపర్వము


“మహాపరాక్రమశాలీ! గరుడా! నీ శౌర్యంతో సాటి రాగలవారెవరైనా ఉన్నారా? నీకున్న పరాక్రమంగాని, శక్తి సామర్థ్యాలు గాని ఈ జగత్తులో వేరెవరికైనా ఉన్నాయా? లేవే! అటువంటి మహా బలశాలివైన నీతో స్నేహం చేయాలని ఉంది. మనం సోదరులమే కదా! నీకందుకంగీకారమేనా? మరొకమాట -


“అమరుడ వజరుడ వజితుడ వమేయుడవు; నీకునమృత మదియేల? ఖగో త్తమ! దీని నొరుల కిచ్చిన నమరులకును వారసాధ్యులగుదురు పోరన్" - 109 ప - ద్వి. ఆ - ఆదిపర్వము


“నీవు మరణం లేనివాడివి. వృద్ధాప్యం ఏర్పడని వాడివి. ఇతరుల చేత జయింపబడనివాడివి. సాటిలేని బలపరాక్రమాలతో శోభిల్లేవాడివి. పక్షినాథా! నీకెందుకయ్యా అమృతం? నీవే కావాలని కోరితే అమృతం లభించదా? అసలు నేనివ్వనా? మహా మహిమాన్వితమై, క్షీరసాగరం నుంచి ఉద్భవించిన దానిని, ఈ అమృతాన్ని వేరెవరికైనా ఇస్తే ఇంకేమైనా ఉందా? అమృతపానం చేసినవారు యుద్ధంలో దేవతల వల్ల పరాజితులు కారు. మాకు అసాధ్యులే అవుతారనుకో. అమృతాన్ని గ్రహించి నీవు తీసుకుపోతున్నది - నీకు కాదని నాకు తెలుసు. కనుక అన్యులకు తీసుకుపోతున్న అమృతాన్ని దయచేసి వారికి ఇవ్వవద్దు. తిరిగి నాకమృతాన్ని ఇస్తే నీకిష్టమైన విధంగా నేను చేస్తాను” అని ఇంద్రుడు తన మనసులోని మాట చెప్పగానే గరుడుడు సంతోషించి తానెందుకు అమృతాన్ని తీసుకుపోతున్నాడో ఇంద్రుడికి తెలియజెబుతాడు.


“మహేంద్రా! నా మాతృమూర్తికి కలిగిన దాస్యం నుంచి ఆమెను, ఆమెతో పాటు నన్ను విముక్తులను చేయటానికే ఈ అమృతాన్ని తీసుకుపోతున్నాను. అమృతం ఎందుకంటావేమో? విను. కద్రువకు, ఆమె పుత్రులయిన నాగులకు అమృతం తెచ్చి ఇస్తే గాని, వారు మా దాస్యాన్ని పోగొట్టమని చెప్పారు. అందుకని, ఈ అమృతాన్ని సర్పరాజులకిచ్చి నా తల్లి అయిన వినతాదేవి దాస్యాన్ని వదిలించి, ఆమెను సంతృప్తి పరచాలని, నీ రక్షణలో ఉన్న అమృతాన్ని తీసుకుపోతున్నానే గాని, మరెందుకూ కాదు. అయితే ఒక విషయం చెబుతాను విను. నీవనినట్లు అమృతాన్ని వేరెవరికిచ్చినా వారు అమరులై మీకసాధ్యులౌతారు. కనుక ఆ సర్పరాజులకమృతాన్నిచ్చి నేను, నా తల్లిని తీసుకొని వెళ్ళిపోతాను. వారా అమృతాన్ని త్రాగకముందు నీవాభాండాన్ని తీసుకొని వెళ్ళిపో” అని చెప్పగానే గరుడుని మహానుభావిత్వాన్ని ఇంద్రుడు మెచ్చుకొని, ఇంకా వినాలనే కుతూహలంతో 'నీ బలపరాక్రమాల గురించి చెప్పు పక్షినాథా!' అని అడుగుతాడు. దేవేంద్రా!


“పరనిందయు, నాత్మగుడో త్కర పరికీర్తనము చేయగా నుచితమె స త్పురుషుల? కైనను నీక చ్చెరువుగ నా కలతెఱంగు చెప్పెద ప్రీతిన్" - 112 ప - ద్వి. ఆ - ఆదిపర్వము “ఇతరులను నిందించటం అనేది, తన గుణాలను తాను పొగడుకోవటమనేది సత్పురుషులు చేయదగిన పనేనా? కాదుగదా! అయినప్పటికీ నీవు అడిగినందుకు నీకాశ్చర్యం కలిగేటట్లుగా, సంతోషంగా, నా గురించి ఉన్న విషయం నీకు చెబుతాను”.


“స్థావర జంగమప్రవితతంబగు భూవలయంబు నెల్ల నా లావున పూనితాలు, నవిలంఘ్య పయోధి జలంబులెల్ల ర త్నావళితోన చల్లుదు బృహన్నిజ పక్ష సమీరణంబునన్ దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తు త్రివిష్టపంబులన్" -113 ప - ద్వి.ఆ - ఆదిపర్వము -


“ప్రాణవంతములైన సమస్త జీవరాశులతో, అచరాలైన సకల వస్తుజాలంతో నిండి ఉన్న భూవలయాన్నంతటినీ నా బలంతో మోస్తాను. అంతేకాదు, నా యొక్క రెక్కలను వీచటం వల్ల కలిగే మహా వాయు ప్రసరణంతో, చాట చేతగాని సముద్రంలోని జలాన్నంతటినీ అట్టడుగున ఉన్న రత్నాలతో సహా వెదజల్లుతాను. ఈ క్షణంలో మూడు లోకాలు తిరిగి నీవద్దకు టెప్పపాటు కాలంలో తిరిగివస్తాను” అని ఇంద్రుడి వైపు చూశాడు గరుత్మంతుడు. ఇంద్రుడి ఆశ్చర్యానికి అవధుల్లేవు. “అంతబలశాలా గరుడుడు” అని అనుకొన్నాడు. గరుడుని శక్తి సామర్థ్యాలకు, మనో వాయువేగాలకు ఎంతగానో మెచ్చుకొన్నాడు. "వైనతేయా! నీవు నాతో ఎప్పుడూ మిక్కిలి సఖ్యంతో మెలగాలి. నేను కోరిన విధంగా నాకిష్టమైన పని చేస్తానని చెప్పావు. నాగులు అమృతం సేవించకముందే నేను వెళ్ళి అమృతం తెచ్చుకుంటాను. అదిసరే. నీకిష్టమైనది చెప్పు. నేను చేస్తాను” అన్న ఇంద్రుని పలుకులకు సంతోషించిన గరుత్మంతుడు తన అభీష్టాన్ని తెలియజేయాలనుకొన్నాడు. “సురేశ్వరా! మాకింత అన్యాయం చేసిన మదోన్మత్తులయిన ఆ కద్రువ పుత్రులు నాకు ఆహారమయ్యేటట్లు చూడు.


“భవదభిరక్ష్యములగు నీ భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్ దివిజాధిప! నీకెటిగిం పవలసి; నీ యాజ్ఞ నాకు పడయగ వలసెన్" - 116 ప - ద్వి.ఆ - ఆదిపర్వము


ఆ మాట నిన్నే ఎందుకడుగుతున్నానంటే దానికో కారణముంది. అదేమిటంటే - నీ పాలనలో, నీ రక్షణలో ఉన్న ముల్లోకాలలో పాములు సంచరిస్తుంటాయి గదా! నాగజాతే నాకు శత్రుకూటమి అనుకో. వాటిని భక్షించటానికి నీ ఆజ్ఞ కావాలి. నీ అనుమతితో పాములను ఆహారంగా పొందుతానని నీకు తెలియజేస్తున్నాను. ఇదే నాకిష్టమైన విషయం . నీవు చెప్పమన్నావు గదా అని చెబుతున్నాను” అని గరుడుడనటంతో సంతుష్టుడైన గరుడుడు అమృతభాండంతో కద్రువ గృహన్ముఖుడు కాగా, ఇంద్రుడదృశ్య రూపంలో పక్షినాథుని అనుసరించి నాగులున్న చోటికి వెళ్ళాడు. నాగమాత అయిన కద్రువను, ఆమె సుతులను చూసి అమృతభాండాన్ని ఆకుపచ్చని దర్భలపైన ఉంచి ప్రీతితో చూస్తున్న పెదతల్లిని చూశాడు. తన మనసులో పేరుకుపోయిన బాధను మనసులోనే ఇముడ్చుకొని, తల్లి దాస్య విముక్తి ఒక్కటే తన లక్ష్యమని భావిస్తూ, తన ప్రతిజ్ఞా నిర్వహణను కద్రువ ముందు వెల్లడించాడు గరుడుడు.


“జననీ నీవమృతంబు తెమ్మనిన, యాసత్యోక్తి పాటించియేx జని నానావిధ కర్మ కర్మరుడవై సాధించి, వేతెచ్చితిన్ విను, నా నీ యెడబాటు సెల్లె జనులన్ విన్పించితిన్ దెల్లగా వినతం దోడ్కొని పోయెదన్ మనమునన్ విభ్రాంతి లేకుండుమీ!" - 263 ప - ప్ర.ఆ - ఆనుశాసనిక పర్వము


“అమ్మా! నీవన్న మాట ప్రకారం , మాట మీద నిలబడి, వెనువెంటనే మీకు అమృతం తెచ్చాను. ఇదిగో అమృతభాండం. ఈ అమృతాన్ని ఎంత కష్టపడి సాధించానో మీకు తెలియదు. వీడమృతం తేగలడా? తెచ్చాడా అని భ్రాంతి చెందకు. తెచ్చి చూపించాను గదా! నీ, నా మధ్య ఉన్న ఒప్పందం చెల్లిపోయింది. నా తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేయటానికే ఈ పని చేశానని, జనులందరికీ తేటతెల్లంగా చెప్పాను. ఒప్పందం తీరిపోయింది కనుక ఇక మా అమ్మను తీసుకొని నేను వెళ్ళిపోతాను” అని చెప్పి నాగులను చూసి పవిత్రమైన అమృతాన్ని ఏవిధంగా ఆస్వాదించాలో విడమరచి చెబుతాడు గరుడుడు. "సోదరులారా! నాగశ్రేష్ఠులారా! మీరు ముందుగా స్నానం చేసి, ఆ తరవాత అలంకరించుకొని, పవిత్రాత్ములై అప్పుడు అమృతాన్ని త్రాగండి” అని వినతాపుత్రుడు చెప్పడంతో కాద్రవేయులందరూ సంతోషంతో ఒకరినొకరు అతిక్రమిస్తూ స్నానం చేసి రావటానికి పయనమయినారు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ అదృశ్య రూపంలో ఉన్న దేవేంద్రుడు ఎవరికీ కనబడకుండా అమృతభాండాన్ని తీసుకొని వెళ్ళి యథాస్థానంలో ఉంచి మరింత రక్షణ కల్పించాడు. స్నానాలంకృతులై వచ్చిన నాగశ్రేష్ఠులకు అమృతభాండం కనిపించలేదు. ఎటు చూసినా అమృతం కనబడలేదు. గరుడుడూ కనబడలేదు. తామున్నప్పుడే వినతాసహితుడై గరుడుడు వెళ్ళిపోయాడు గదా అని అనుకొని ఒక నిట్టూర్పు పుచ్చారు. అమృతభాండం పెట్టిన చోట పడి ఉన్న అమృత బిందువులను నాకుదామనుకొని, కొంతైనా అమృతం దక్కుతుంది, అని దర్భలఅఉ నాకారు. దర్భల అంచులు మిక్కిలి పదునుగా ఉండడంతో నాగుల నాలుకలు రెండుగా చీలిన కారణం వల్ల వారప్పటినుంచి ద్విజిహ్వులుగా పేర్కొనబడ్డారు. దర్భలపైన అమృతం చిలకడంతో అతి పవిత్రమైనవిగా అవి స్వీకరింపబడుతుండేవి.