సంపాదకీయం - శ్రీ శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీ వేంకటేశం


                     శ్రీవేంకటేశం పాఠకులకు శ్రీ శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రొత్త సంవత్సరములో మీరు, మీ కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ మన ప్రభు, సృషి, సితి, లయ కర్తయైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని సంపూర్ణ కరుణా, కటాక్షములతో మనమందరము ఆయురారోగ్య, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, శ్రీవేంకటేశ్వరుని పట్ల భక్తిభావము మరింత వృద్ధి చెంది, ఆయనకు సన్నిహితులము కావాలని ఆశిస్తున్నాము. శ్రీవేంకటేశం మాసపత్రికను ప్రారంభించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాదితో 15వ సంవత్సరంలోకి అడుగిడనున్నది. నిజానికి 2007 సంవత్సరం ఏప్రిల్ నెలలోని ఉగాది నుండి “నమో వేంకటేశాయ” అనే పేరుతో ప్రారంభమై, 2008 సంవత్సరం జనవరి నుండి “శ్రీవేంకటేశం" అనే పేరుతో ప్రచురింపబడుచున్నది. ఈ సంవత్సరము ఉగాది మార్చి నెలలో రావడం వలన తెలుగు సంవత్సరం ప్రకారం ఈ ఉగాదికి 15వ సంవత్సరం లోనికి అడుగుడుచున్నది.


మా ప్రభు తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆజ్ఞ ప్రకారము మేము ఈ పత్రికను ప్రారంభించి నడుపుచున్నాము. ఆయనకు, ఆయన భక్తులకు సేవ చేసే భాగ్యమును ప్రసాదించమనే మా కోరికను మన్నించి స్వామివారు ప్రసాదించిన సేవ ఇది. పైగా ఈ సేవను ఈ జన్మలో మేము తృప్తి చెందేవరకు కొనసాగించమని కూడా కోరడం జరిగింది. ఈ కోరిక ప్రకారమే గత 15 సంవత్సరాల నుండి ఒక్క నెల కూడా ప్రచురణకు ఇబ్బంది కలుగకుండా ఆయన కృప వలన నిరాటంకముగా సాగుచున్నది. 2002 సంవత్సరములో తిరుమల శ్రీవేంకటేశ్వరునికి 16 సంవత్సరముల వరకు, 2018 వరకు ప్రతి సంవత్సరము 7 కోట్ల జప సమర్పణ అనే కార్యక్రమమును ప్రారంభించాము. కాని ఇందులో ప్రతిరోజు పని ఉండేది కాదు. కాబట్టి ప్రతిరోజు, ప్రతినెల తమకు సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించమనే మా నూతన కోరిక ననుసరించి ఈ పత్రికను ప్రచురించమనే ఆజ్ఞను పొంది ఉన్నాము. తెలుగు అంతగా చదవలేని నేను ఎలా ప్రారంభించాలా అని, నాకు శక్తి లేదని 2 సంవత్సరాలు వెనకడుగు వేశాను. కాని చివరికి 2007 ఉగాది (ఏప్రిల్) నుండి ప్రారంభించి, ఆయన కృప వలన, నిరాటంకంగా, భక్తులు సంతృప్తిపడే విధంగా గత 14 సంవత్సరములుగా ప్రచురించి, 15వ సంవత్సరములోనికి అడుగిడుచున్నందుకు సంతోషంగా ఉన్నది. కాని నేను కేవలం ఒక సాధారణ భకుణి, అల్యుణ్ణి. ఆయనకున్న భక్త బృందములో చివరివాణ్ణి కాబట్టి, మాచే ఎన్నో తప్పులు జరిగి ఉండవచ్చు. కావున చేసిన ప్రతి తప్పుకు స్వామివారి భక్తులను, స్వామివారిని క్షమించమని సవినయముగా కోరుచున్నాము. మరియు ఈ పత్రిక మరింత బలోపేతము చేయుటకు తగిన సూచనలను, సలహాలను భక్తుల నుండి, రచయితల నుండి కోరుచున్నాము. శ్రీ వేంకటేశ్వరుని నుండి కూడా తగిన శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము. .


కలియుగములో మానవుడు తరించాలంటే కేవలము హరినామ స్మరణ ఒక్కటే ఏకైక మార్గము. మనము ఈ ఆధునిక యుగములో జీవనోపాధి కోసం చేసే పనుల వలన భగవంతుణ్ణి అర్చించుటకు సమయము దొరుకుట లేని కారణంగా మానవ జీవితం నిష్ఫలం కాకుండా ఉండాలంటే కేవలం క్షణకాలమైనా శ్రీవేంకటేశ్వరుని స్మరించినచో జీవితము ధన్యము కాగలదు కాబట్టి సదా శ్రీవేంకటేశ్వరుని స్మరిస్తూ, సేవిస్తూ, దర్శిస్తూ ఆయనకు, ఆయన భక్తులకు సేవ చేయుచూ జీవిద్దాం. చివరగా ఈ సేవాభాగ్యాన్ని ప్రసాదించిన మా ప్రభు శ్రీవేంకటేశ్వరునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.