మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని మానవులకు నలుగురు ప్రత్యక్ష దైవాలని వేదాలు బోధిస్తున్నాయి. ఇందులో నాలుగవది అతిథి దేవోభవ అత్యంత ప్రాధాన్యమైనదని పెద్దల మాట. అతిథులను ఆదరించినవారికి మోక్షప్రాప్తి లభిస్తుందని తెలియజేసే ఉదంతాలెన్నో మన పురాణాలలో కనిపిస్తాయి. అవి మనకు మార్గదర్శకాలై మంచి మార్గాలలో నడిపించుటకు ఉపకరిస్తాయనుటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అతిథులను ఆదరించి వారికి అన్నదానం చేసినట్లయితే వారికి సేవ చేసినా అది ఆ అంతర్యామికి చేసినట్లేనని భారతం పేర్కొంది. అట్టి ఉదాహరణను గమనించండి.
కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు జ్ఞాతులను అనగా తన బంధువులను, గురువులను చంపిన పాపము పోవుటకై అశ్వమేధ యాగము చేసెను. ఆ యాగము ముగిసిన తరువాత బంధువులు, మిత్రులు, బ్రాహ్మణులు కొలువ ధర్మరాజు సభ తీర్చియున్నాడు. అందులో కొందరు భూలోకంలో ఇటువంటి యజ్ఞమెవరు చేయలేదని, ఇటువంటి మహారాజు, ఇటువంటి మహా ధర్మదాత లేరని మరికొందరు ధర్మరాజును స్తోత్రము చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. అప్పుడొక ముంగిస బిలములో నుండి బయటకు వచ్చి సభ ఎదుట నిలిచి ఇట్లనెను.
ఓ మహానుభావులారా! మీరందరూ ఈ ధర్మరాజును ఈ విధముగా స్తోత్రము చేయుచున్నారు. ఈ యజ్ఞము సక్తుప్రస్తుని ధర్మముతో ఎంతమాత్రము సరితూగదు. అనవసరమైన, అనర్హమైన పొగడ్తలు పొగడక యూరకుండుడు అని పలుకగా అప్పుడు ఆ సభలోని వారందరూ ఓ ముంగిసా! నీవిట్లనుచున్నావు. మంత్రప్రయోగము, తంత్రగరిమ, దానధర్మములు నిరుపమానములు. లక్షల కొలది బ్రాహ్మణులు సంతుష్టిగా భుజించిరి. మనుషులు, దేవతలు, బ్రాహ్మణులు సంతసించిరి. ఇట్టి యజ్ఞమందు లోపమేమి? నీవు చెప్పే సక్తుప్రస్తుడెవ్వరు? అతని యెడల గల విశేషధర్మమేమి? అని పలికిరి. ఆ మాటలు విని ముంగిస ఇలా జవాబిచ్చింది.
అయ్యా! వినుడు. ధర్మక్షేత్రమని చెప్పగల కురుక్షేత్రమనే పుణ్యభూమిలో సక్తుప్రస్తుడను ఒక బ్రాహ్మణుడు, అతని భార్య, ఒక కుమారుడు, అతని భార్య (కోడలు) సేవింప తపస్సు చేసుకొనుచు ఉంఛవృత్తితో ఉదరపోషణ చేసుకొనుచు కాలక్షేపము చేయుచుండెను. అది అట్లుండగా వర్షాలు లేక అనావృష్టి ఏర్పడి పంటలు లేక జీవనము జరుగుట కష్టమయ్యెను. కుటుంబంలో గల నలుగురూ తెల్లవారు ఝామునే లేచి ఒకనాడు పొలములవైపు వెళ్ళి నేలరాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకొని వేయించి పేలాలు చేసుకుని పిండిగా విసరుకొనగా ఆ పేలాలు కుంచెడు పిండియయ్యెను. చెరి మానెడు చొప్పున నలుగురు పంచుకుని తినుటకు సిద్ధపడగా అంతలో ఒక బ్రాహ్మణుడు పేరాకలితో శోషిల్లి అమ్మా! ఆకలి యనుచు వారింటికి వచ్చెను. ఆ కేకలు విని బ్రాహ్మణుడు, భార్య, కొడుకు, కోడలు మిక్కిలి భక్తి శ్రద్ధలతో అతిథి కెదురేగి యర్ఘ పాద్యములిచ్చి స్వాగత మర్యాదలను ఆచరించి అతనిని ఇంటిలోనికి తీసుకొని వచ్చారు. సక్తుప్రస్థుడు తనవంతుకు వచ్చిన పేలపిండి అతిథికిచ్చి భుజింపుమని ప్రార్థించెను. పేరాకలిచే బాధపడుతున్న ఆ అతిథి మానెడు పేలపిండిని నాలుగు ముద్దలుగా చేసి గుటుక్కున మింగివైచెను. కాని అతని ఆకలి తీరినట్లు కనపడలేదు. సక్తుప్రస్తుడు వాని యవస్థ చూసి అయ్యో! పాపమీ బ్రాహ్మణుని ఆకలి తీరలేదు కదా. ఏమి చేయుదును కటకటా! ఆకలిగొన్న యతిథులను సంతుష్టుల చేయుటకై నావద్ద రవ్వంత యేనియు ద్రవ్యము లేకపోయె గదా యని విచారించుచుండ, మహాపతివ్రత యైన యాతని భార్య తన మగని విచారాన్ని గమనించి అతనితో ఇట్లనియె. -
ఓ దేవా! ఈ మహాత్మునకు ఆకలి తీరినట్లు లేదు. నా వంతు గల మానెడు పిండి కూడా ఈతనికి పెట్టుము. సగమాకలి తీర్చుట ఉచితము కాదు అని భార్య పలుకగా, ఆమె ఔదార్యానికి సంతసించిన ఆ భర్త, ఓ సాధ్వీ! నేను సంపాదించి నీకు బెట్టుట లేదు సరికదా! తెల్లవారు జామున లేచి ఎండలో బడి నీవు ఏరి తెచ్చిన వేయించుకొని సిద్ధము చేసికొన్న పిండి ఇది. నీ నోటిముందరి నుండి అపహరించి, నేను ఇతరులకు పెట్టగలనా? భార్యను పోషింపనివాడు ఈలోకము నందైనను, పరలోకము నందైనను నరకము ననుభవించును. నీ నోటి ముందరి యన్నమును తీసుకొనజాల అని పలుకగా, ఆ ఇల్లాలు మగనితో ఇట్లనియె. స్వామీ! భార్యకు మగడే చుట్టము, దైవము. మగడే తల్లి. మగడే తండ్రి. మగడే మిత్రుడు. మగనికంటె ఆప్తులెవరును లేరు. మగని యభీష్టము బట్టి నడుచుట మగువకు ధర్మము. అదియును గామ మీ ఆహారము అతిథికి బెట్టి మీరు ఆకలిచే బాధపడుచుండ నేను తిని సుఖముగా నుందునా? భర్త యుపవాసము చేసిన భార్య కూడా ఉపవాసము చేయవలయును. భర్త భుజించిన భార్య భుజింపవలయును. ఇదియే ఉత్తమ భార్య ధర్మము. కావున నేనీ పిండిని భుజింపనొల్ల. ఇది కూడా అతిథికి సమర్పించండి అని పలుకగా సక్తుప్రస్తుడామె పతిభక్తికి సంతసించి ఆమె వంతు పిండిని గొనిపోయి భుజింపుమని అతిథికి సమర్పించెను. అప్పుడు అతిథి ఆ పిండిని గూడ నాలుగు ముద్దలు చేసి మింగెను. అయినా వాని ఆకలి తీరలేదు. అతని యవస్థ చూసి సక్తుప్రసుడు కటకటా! ఈ బ్రాహ్మణుని ఆకలి ఇంకనూ తీరలేదే. ఏమి సేయుదు? ఈతడెట్లు తృప్తుడగునని విచారించుచుండ అతని కుమారుడు తండ్రి అభిమతమెరిగి అతనితో ఇట్లనియె. తండ్రీ! ఈ అతిథి ఆకలి చల్లారలేదు. పేరాకలితో ఇంటికి వచ్చిన అతిథికి అర్థాన్నము పెట్టి పంపుట ధర్మము కాదు. కావున నా వంతు పిండి వీరికిచ్చి సంతుష్టుని జేయుము అని పలికిన కొడుకుని జూచి తండ్రి కాస్త బాధపడి అయ్యో! కొడుకా! నీవు బాలుడవు. రెండు మూడు నాళ్ళనుండి అన్నము లేక మాడిపోవుచుంటివి. చాలా కష్టము మీద లభించిన ఈ ఆహారము తినవలదని ఎట్లు చెప్పగలను అని జాలిపడుచుండ తనయుడు తండ్రి నుద్దేశించి ఇట్లనియె. ఓ తండ్రీ! అతిథి పూజకంటే పరమ ధర్మము లేదు. తపము చేతను మిక్కిలి కృశించినవాడవు. నీవే నీ యన్నమును అతిథులకిచ్చునప్పుడు, పడుచువాడను నేను ఇవ్వకూడదా? కావున నా మనవి విని నా వంతు పిండి కూడ అతిథికిమ్ము అని పలికిన కుమారుని మాటలకు తండ్రి సక్తుప్రస్తుడు సంతసించి అతని కోరిక ప్రకారము అతని వంతు పిండిని కూడ అతిథికిచ్చెను. దానిని కూడా మింగిన అతిథి ఆకలి చల్లారలేదు. అంతలో అతని కోడలు మామ కడకు పోయి తనవంతు పిండిని కూడా అతిథికి అర్పించమని ప్రార్థించెను. ఆ మాటలకు అచ్చెరువు నొందిన సక్తుప్రసుడు ఇట్లనెను. అమ్మా నీవు చిన్నపిల్లవు. అన్నవస్త్రములు కలిగి సుఖపడుటకు మా ఇంటికి వచ్చితివి. ఆకలితో లేవలేక మాటాడలేక బాధపడుతూ ఉన్నదానవు. అట్టి అవస్థలో నున్న నిన్ను భుజింప వలదని చెప్పి నీ ఆహారమును ఇతరులకెట్లు పెట్టుదును అని పలికెను. అట్టి మామ మాటలకు కోడలిట్లు బదులిచ్చెను.
ఓ మహాత్మా! మహనీయులైన మీరునూ, మా యత్తగారునూ, నా పాలిట పరదైవమైన నా భర్తయు తమ కడుపులు కట్టిపెట్టుకుని అతిథి పూజలు చేయుచుండ నేను నా ప్రాణమును రక్షించుకొందునా? ఉన్నప్పుడు నలుగురము తిందము. లేనప్పుడు కడుపులో కాళ్ళు పెట్టుకుని నలుగురము పడుకొందము. ఆకలిగొన్న అతిథిని విడిచిపెట్టి భుజించుటజంతువుల ధర్మము, కాని మనుష్యుల ధర్మము కాదు. కావున నా వంతు ఆహారము కూడా అతిథికి పెట్టి వారి ఆకలిని తీర్చమని ప్రార్థించెను. అప్పుడా మామ కోడలు త్యాగనిరతికి సంతసించి ఆమె వంతు పిండిని కూడ అతిథికి పెట్టెను. కోడలివంతు పిండిని కూడా భుజించి అతిథి సంతుష్టుడై ముఖమున సంతోషమచ్చుపడగ సక్తుప్రస్థుని చూచి ఇట్లు ప్రశంసించెను.
ఓ సద్భాహ్మణుడా! నేనెవరో ఎరుగుదువా? నేను యమధర్మరాజును. నీ ఇష్టమెట్టిదో, నీ శీలమెట్టిదో పరీక్షింపవలయునని వచ్చినాడను. నీ గుణసంపత్తికి మెచ్చినాను. భక్తి, వినయము, శ్రద్ధ, శాంతము, కరుణ నీయందు సుస్థిరత్వము నొందెను. అతిథులకు, అభ్యాగతులకు నీవు సద్భక్తితో చేసిన చందంబున నుపకారము మరెవ్వరు చేయజాలరు. నీవేగాదు నీ భార్యయు నీ యట్టిదే. సకల ధర్మములు నేర్చి పురుషుడు పుణ్యశీలుడు కావచ్చు. కాని స్త్రీయైన ఆమె కూడా అట్టిదే యగుట చాలా అరుదు. అతిథుల పట్ల తల్లితండ్రుల కంటే ఎక్కువ వినయము, ఎక్కువ దయ గల కుమారుని చూచి నీవెక్కువ గర్వపడవచ్చును. నీ కుమారుడు మిక్కిలి యోగ్యుడు. తండ్రి గుణములు ఈతనియందు మెండుగా నున్నవి. కొడుకునకు తగిన కోడలు లభించుట మీ పూర్వపుణ్యము. గయ్యాళి, కలహప్రియ గాక, స్వార్థపరురాలుగాక, పతివ్రతయై, కరుణాసమేతయై వివేకియైన నీ కోడలు, భూలోకమందలి కోడండ్రకు మార్గదర్శకురాలై యుండుగాక. నీ ఇల్లాలు, నీ కొడుకు నీ వలెనే ధర్మమును రక్షించుట గొప్పకాదు. వేరేచోట పుట్టి పెరిగి వేరే పురుషుని చేపట్టి సుఖమును అనుభవింపదలచి వచ్చిన కోడలు ధర్మానుష్టాన తత్పరతయై మామగారిని, మగనిని మెప్పింపదలచుట మిక్కిలి ఆశ్చర్యము. నీ కుటుంబము వంటి కుటుంబము నేనెందును చూడలేదు. అందరూ ఒకే ధర్మపథమున నడచుట గొప్ప త్యాగము జూచి దేవతలు మహాశ్చర్య రసమున మునిగి బహువిధముల నిన్ను మెచ్చుకొనుచున్నారు యని అతిథి వేషమును దాల్చిన ధర్ముడు ప్రశంసించునంతలోనే దేవేంద్రుడు పుష్పవర్షము కురిపించెను. ఆకాశము మీద దేవదుందుభులు మ్రోగెను. నిన్నును నీ కుటుంబమును చూచుటకు సప్తమహర్షుల మనస్సులు కుతూహలపడుచున్నవి. కావున కొడుకూ, కోడలు, భార్య వెంటరాగా నీవు స్వర్గమునకు రమ్ము. స్వర్గము నీవంటివాని నిమిత్తమేర్పడినది. ఈ విధముగా నీవు అతిథిపూజ చేసినందుకు నీకు రెండు వరములిచ్చెద. సమస్త ప్రజల నడుగుట జేయునదియు, సకల నీచకర్మములకు నొడబడ జేయునదియు, సమస్త పాపముల జేయించునదియు యైన ఆకలి ఇకనుండి నీకు కలుగదు. ఆకలే కాదు. దప్పిక కూడా నీకు కలుగదు. నీవంటి , మహనీయుడు ఊర్ధ్వలోకములకు వచ్చుచున్నాడని విని బ్రహ్మ నీ కొరకు ఒక విమానాన్ని పంపును. ఆ విమానమునెక్కి నీవు బ్రహ్మలోకమునకు వెళ్ళి పరమేష్ఠిని సందర్శించి ధన్యుడవు కమ్ము. భూదానములు, గోదానములు, హిరణ్యదానములు, తపంబులు, యజ్ఞములు మొదలగునవి నిజముగా ఆకలిగొన్నవారికి వేళ ఎరిగి అన్నదానము సేయుటవంటివి కావు. కష్టపడి సంపాదించిన పదార్థము కొంచెముగానో, గొప్పగానో పాత్రమెరిగి, కాలమెరిగి అతిథులకు, అభ్యాగతులకు సమర్పణము సేయుట పరమ ధర్మములలో నెల్ల పరమ ధర్మము” అని పలికి ధర్ముడు తన నిజరూపమును జూపెను. అంతలో బ్రహ్మదేవుడు పంపిన సువర్ణ విమానం ఆకాశమార్గమున కనబడెను. అంతట సక్తుప్రస్తుడు, అతని భార్య, కొడుకు, కోడలు ధర్మునకు నమస్కరించిరి. అంతట ధర్ముడిట్లనెను. నీవు సకుటుంబముగా బ్రహ్మ విమానమునెక్కి ఈ క్షణమే పొమ్ము. బ్రహ్మర్షులు, దేవతలు నిన్ను జూడ ఎంతో కుతూహలపడుతున్నారు అని పలుకగా, అతని యాజ్ఞ ప్రకారము సక్తుప్రస్తుడు, అతని కుటుంబము సువర్ణ విమానమునెక్కి స్వర్గలోకమునకేగిరి అని ముంగిస సక్తుప్రస్థుని కథను ధర్మజుని సభవారికి చెప్పి మరియు ఇట్లనె..
అయ్యా! నేను ముంగిసనైనను, మహానుభావుడైన సక్తుప్రసుడు విమానము నెక్కి బ్రహ్మ లోకమునకు నేగుట నా బిలములో నుండి చూచి ఎంతో సంతోషించి ఆనందము పట్టజాలక కలుగులో నుండి బయటకు వచ్చి అతిథి కాళ్ళు కడుగుకున్నచోట సంచరించితిని. ఆ బురద నా శరీరానికి అంటుకొనగ అంతట నా తలయు, శరీరము సగభాగము బంగారు మయమయ్యెను. అది సక్తుప్రస్థుడి మహిమవల్లనే గాని బురద వలన కాదు. వట్టి బురదలో నెంత దొర్లినా నిట్లగునా! నాటినుండి నా శరీరము మిగతా భాగము కూడా బంగారుమయము చేసుకొనుటకు మహనీయులైన, తపోధనుల ఆశ్రమాలకు వెళ్ళితిని. యజ్ఞవాటికలకు బోయితిని. అన్నదానములు జరుగు ప్రదేశములలో చూసితిని. సిద్ధవనములెల్ల ప్రవేశించితిని. అయినా నా కోరిక ఎక్కడా నెరవేరలేదు. పాండురాజు కుమారుడైన ఈ ధర్మరాజు పేరు ప్రసిద్ధమైయున్నది. ధర్మరాజు నామధేయము ఈతనియందు సార్థకమై యున్నది. కురువంశమితని వల్ల పావనమైనది. అందువల్ల ఇతడు సేయు అశ్వమేధము లోకోత్తరమైనదిగా భావించి నా శరీరము యొక్క రెండవ భాగము ఇక్కడ సువర్ణమయమగునని తలచి ఈ యాగమునకు వచ్చితిని. ఇక్కడ బ్రాహ్మణులు భోజనములు చేసిన చోట్లలో, చేతులు కడుగుకున్న చోట్లలో, పాదప్రక్షాళన చేసుకున్న చోట్లలో, సంధ్యలు వార్చిన చోట్లలో, స్నానములు చేసిన చోట్లలో ఎంతయో దొర్లి చూచితిని. నా శరీరానికి బాధయే తప్ప మిగిలిన శరీరము బంగారు మయము కాలేదు. అందుచేత సక్తుప్రస్థుని దానము కంటే ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగము తక్కువదని తెలుపుటకు నేను సాహసించితిని. మాయ మర్మమెరుగని జంతువును కనుక మనసునందు తోచిన యభిప్రాయము సభా మధ్యమున నిర్భయముగా వెల్లడించితిని. నా యందు నేరమున్న క్షమింపుడు.
ఇప్పుడు వెల్లడించవలసిన అవసరమేమున్నదని మీరందురేమో! వినుడు. అశ్వమేధము చేసినందుకు ధర్మరాజును మీరు వేయి విధముల పొగడుచున్నారు. అతడు ఈ పొగడ్తలకు తగినవాడు కాడు. గుణము ఉన్నంతవరకే పొగడవలయును కాని, లేని గుణముల నాపాదించి పొగడరాదు. ఇట్లు పొగడుటవలన మనుష్యులు తమంతవారు లేరని గర్వింతురు. గర్వము ఎంతటివారినైనా నశింపచేయును. తగని పొగడ్త నెంతటి వానికైనా అనర్ధదాయకమే. దీనివల్ల పొగిడినవారు, పొగడ్త పొందినవారు అల్పులగుదురు. అందుచేతు ధర్మజుడు గర్వోన్మత్తుడు కాకుండుటకు మీరు ఇక మీదట యథార్థమునే చెప్పవలయునని నేను సక్తుప్రస్థుని వృత్తాంతమును చెప్పితిని అని పలికి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా ఎచ్చటికో వెళ్ళిపోయెను. ఆ మాటలకు ధర్మజునితో పాటు అక్కడే ఉన్న సభాసదులందరూ ఒక్కసారిగా విస్మయమందారు. తగని పొగడ్త సర్వఅనర్ధములు తెచ్చునని సక్తుప్రస్థుని వంటి లోకోత్తర చరిత్రుడు భూమికి అలంకార ప్రాయుడని అందరు అభిప్రాయపడ్డారు. - ఇది కేవలం కథ మాత్రమే కాదు. దీనిలో మానవ జీవితం ఉంది. ఆ జీవితాలు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సవ్యంగా సాగిపోవుటకు కావలసిన హితోక్తులు ఎన్నో ఉటంకించబడ్డాయి. ముఖ్యంగా అతి పొగడ్త అనర్ధదాయకం అని ఈ కథ ద్వారా మనకు బోధపడుతుంది. రాజసభలో ఈ విషయాన్ని చెప్పింది. ముంగిస అనే సామాన్య జంతువే అయినప్పటికీ అది చెప్పిన మాటలు అనన్య సామాన్యమైనవి. అవి ఈనాటి తరాలకు ఎంతో ఆదర్శమైనవి అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా సక్తుప్రస్తుడు అనే బ్రాహ్మణుడు చేసిన అన్నదానము అత్యంత పూజనీయమైనది. రాజులు చేసే గోదాన, భూదాన, సువర్ణదాన, వస్త్రదానముల కంటె అన్నదానము మిన్నయైనదని, అందుకే ధర్మరాజు చేసిన యాగం కంటే సక్తుప్రస్థుని అన్నదానము విశిష్టమైనదని అందుకే అతనికి మోక్షం లభించిందని తెలుస్తుంది. బాగా సంపదలు కలిగినవారు దానం చేయడం ఏమంత గొప్ప విషయం కాదు. లేనివాళ్ళు, అందులో వారం రోజుల నుండి తిండిలేక పొద్దంతా కష్టపడి నాలుగు గింజలు ఏరుకొని వచ్చి ఆకలి తీర్చుకుందామనే సమయంలో అతిథికి దానం చేయడం, అందుకు భార్య, కొడుకు, కోడలు కూడా సహకరించి వారి భాగం ఆహారాన్ని కూడా దానం చేయడం ఈనాటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమైనది.
“సిరిగలవాని కెయ్యెడల చేసిన నిష్పలంబగున్ | నెట్ గుటి కాదు పేదలకు చేసిన సత్పలంబగున్ | వరువున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేలమీద కురిసినగాక / యంబుదుల గురువగ నేమి ఫలంబు భాస్కరా” అని భాస్కర శతకకారుడు చెప్పినట్లు సంపద కల్గినవారికి దానము చేయుట వలన ఏమి ప్రయోజనం ఉండదు కాబట్టి పేదవారికి దానం చేస్తే మంచి ఫలితంబు కలుగుతుంది. ఎలాగైతే వర్షము ఎండిపోయిన చేలలో పడితే ప్రయోజనముంటుంది కాని మామూలు సముద్రంలో పడితే ఏమీ లాభం ఉండదు. కనుక ప్రతివ్యక్తి ఫలితము ఉండే పనులే చేయాలి. పాత్ర యెరిగి దానం చేయాలి తప్ప ఏదో మొక్కుబడిగా దానాలు చేయకూడదు. ముఖ్యంగా మనకై మనమే బ్రతకడం ఏమంత గొప్పకాదు. అతిథులను, అభ్యాగతులను ఆదుకోవడం మంచి సుగుణం. అందుకే అతిథి దేవోభవ అని అన్నారు మన పెద్దలు. వాళ్ళకు సేవలు చేయడం ఆ పరమాత్మునికి చేసినట్లే కాబట్టి అతిథి సేవయే గొప్ప అంతర్యామి సేవ. అట్టివారికి మోక్షం లభిస్తుందన్నది అక్షర సత్యం.