శేషాద్రి


శ్రీమహావిష్ణువు వైకుంఠంలో సతీ సమేతంగా పాలకడలిలో విశ్రమిస్తున్నవేళ ఆదిశేషుని మరొక అంశ బయట ద్వారం వద్ద కాపలాదారునిగా కాపు గాస్తూ లోపలికి ఎవరినీ అనుమతించకుండా శ్రీహరి తనకిచ్చిన ద్వారపాలకుని యొక్క పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.


కొంతసేపటికి పెనువేగంతో వాయుదేవుడు విష్ణుమూర్తిని కలవాలని వైకుంఠ ధామానికి వచ్చాడు. అక్కడ ద్వారపాలకునిగా యున్న ఆదిశేషుడు “వాయుదేవా! ఇప్పుడు స్వామివారు శయనిస్తున్నారు. ఎవరు వచ్చినా లోపలికి అనుమతించవద్దని చెప్పారు. కాబట్టి నువ్వు మరలా వచ్చి స్వామివారిని కలుసుకోవలసింది” అని చెప్పాడు. ఆ మాటలకి వాయుదేవుడు "ఆదిశేషా! నేను స్వామివారితో అత్యవసర విషయాలు మాట్లాడవలసిన పనిపడి వచ్చాను. నన్ను లోపలికి పోనిమ్ము. లేనిచో నిన్ను శపించెదను” అని


బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నించాడు. వాయుదేవుడు తన మాట వినకుండా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడంతో ఆదిశేషుడు అతడిని లోపలికి వెళ్ళకుండా అడ్డగిస్తూ "ఓరీ! గర్వాధమా! నన్ను శపించెదవా? నేను చెప్పిన మాట ఆలకించకున్న నిన్ను మింగివేయుదును సుమా!” అని హెచ్చరించాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కలహం పెద్దది కాసాగింది. ఆవిధంగా ఒకరినొకరు దూషించుకుంటూ పెద్దగా అరవసాగారు. ఆ అరుపులకి తెలివివచ్చిన విష్ణుమూర్తి బయటికొచ్చాడు.స్వామివారిని చూచి ఇరువురు మిన్నకుండిపోయారు.


ఆదిశేషుడు స్వామివారితో "పరంధామా! ఈ వాయుదేవుడు నా మాటను వినకుండా లోపలికెళతానంటూ నాతో కలహించడమే కాక నన్ను శపిస్తానంటూ దురుసుగా మాట్లాడాడు. ఇంతకూ మా ఇద్దరిలో ఎవరు బలవంతులో మీరు తెలియజేయండి” అన్నాడు.


ఆదిశేషుడి మాటలు విన్న విష్ణుమూర్తి “తను వాయుదేవుడి కన్నా బలవంతుడిననే గర్వం శేషుడికి పెరిగిపోయింది. కాబట్టి అతడి గర్వాన్ని అణచాలన్న సంకల్పంతో ఆ ఇద్దరితో “మీరిద్దరూ బలవంతులే. అయితే ఎవరు బలవంతులు అన్న విషయంలో నాకు కూడా సందేహం ఉంది. నా సందేహం తీరాలంటే మీరిద్దరూ ఒక పని చేయాలి. కాబట్టి ఆదిశేషా! నువ్వు భూలోకంలో అంజనాదేవి తపస్సు చేస్తున్న ప్రాంతానికి పోయి పర్వతాకారము దాల్చి పరుండి ఉండుము. వాయుదేవుడు తన బల పరాక్రమాలతో నిన్ను ఉన్నచోటు నుండి కదల్చివేసిన అతడు నీకంటే బలవంతుడని గ్రహింపము. ఒకవేళ అతడు నిన్ను కదల్చలేకపోయిన అప్పుడు నువ్వే బలవంతుడిగా ప్రకటితమగును” ఆ అంతట ఆదిశేషుడు విష్ణుమూర్తి అనుమతితో అంజనాదేవి తపస్సు చేస్తున్న ప్రాంతమునకు వచ్చి తన శరీరమును ఏడు చుట్టలుగా చుట్టి పర్వతాకారము దాల్చి విష్ణునామస్మరణతో తపస్సు చేయసాగెను. ఆదిశేషుడు అంజనాశ్రమ ప్రాంతంలో తపస్సు ప్రారంభించాడని తెలుసుకున్న వాయుదేవుడు అతడిని ఎట్లేనా ఉన్న చోటు నుండి కదల్చివేసి తను మాత్రమే బలపరాక్రమవంతుడిగా ప్రఖ్యాతిని పొందాలన్న ఉద్దేశ్యంతో ఆదిశేషుడు తపస్సు చేసుకొనుచున్న ప్రాంతమునకు వచ్చి అతడితో యుద్ధము ప్రారంభించెను. అంత వాయుదేవుడు భయంకర రూపమును దాల్చి ఆదిశేషుని మీద తన శక్తినంతా ప్రదర్శింపసాగెను. వాయుదేవుని ప్రచండ ఝంఝామారుతానికి భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయినాయి. వృక్షాలు నేలకూలసాగాయి. ప్రజలందరూ భీతిల్లసాగారు. పవనవేగం రోజురోజుకీ విజృంభించి సమస్త ప్రపంచాన్ని భయకంపితుల్ని చేయసాగింది. ముల్లోకాలు తల్లడిల్లసాగాయి. వాయుదేవుడి ప్రచండమైన గాలులకు ఆదిశేషుడు ఒకింత చలించినా పట్టు విడవకుండా మరింత శక్తిని పుంజుకుంటూ తనే బలవంతుడనే కీర్తిని స్వంతం చేసుకోవాలని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎవరికి వారు తామే శక్తివంతులమని నిరూపించుకోవాలన్న సంకల్పంతో చేస్తున్న వారి యుద్ధం అనేక సంవత్సరాలు సాగింది. వారి బలపరాక్రమాలకు తట్టుకోలేని భూదేవి భయకంపితురాలైంది. స్వర్గం చలించిపోయింది. దేవతలు భయభ్రాంతులైరి. భూదేవితో సహా దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి భూలోకంలో వాయుదేవుడు, ఆదిశేషుని మధ్య జరుగుచున్న ఘోర యుద్ధమును వివరించి తమని రక్షించుమని మొర పెట్టుకున్నారు.


బ్రహ్మదేవుడు విషయాన్ని తన మనోనేత్రంతో గ్రహించి కైలాసం వెళ్ళి ఈశ్వరునితో కలిసి వైకుంఠ థామానికి వెళ్ళి శ్రీహరితో “దేవాదిదేవా! వాయుదేవుడూ అదిశేషుడూ కలహించుకుని భీకరంగా యుద్ధం చేస్తున్నందువల్ల సమస్త జీవులు తల్లడిల్లుచున్నవి. భూలోకవాసులు తట్టుకోలేక పక్షులవలె పైకెగిరి సముద్రములలో పడి మరణించుచున్నారు. కావున మీరు తక్షణము భూలోకం విచ్చేసి వారిని శాంతింప జేయవలసిందిగా ప్రార్థించుచున్నాము” అని ప్రార్థింపగా విష్ణుమూర్తి వారి వెంట బయలుదేరి వాయు, శేషుల వద్దకు వచ్చినాడు. - బ్రహ్మాది దేవతలతో తన దగ్గరకు వచ్చిన శ్రీమహావిష్ణువును చూసి ఇరువురూ యుద్ధం మాని శిరములు వంచి అనేక విధములుగా వారిని స్తుతింపసాగారు. అప్పుడు విష్ణువు వారితో "ఓ వాయుదేవా! ఆదిశేషూ! మీరిరువురూ పోట్లాడుకోవడం వలన సమస్త జీవకోటికి ఎంతో కష్టనష్టములు కలుగుచున్నవి. లోకములు అల్లకల్లోలములు అగుచున్నవి. మీరిరువురును సమాన బలపరాక్రమములు కలవారే. ఒకరినొకరు ద్వేషించుకోకుండా మాలో ఎవరు గొప్ప అన్న అహంతో ప్రవర్తించకుండా స్నేహితులుగా కలిసి మెలిసి తిరుగుతూ ప్రాణికోటికి శుభాలు కలుగజేయండి. ఆదిశేషూ భవిష్యత్తులో నేను శ్రీవేంకటేశ్వరుడను పేరుతో అవతరించుచున్నాను. కనుక నీవీ శేషాచల రూపమున ఇచ్చటనే నిలిచి యుండుము. తగు సమయమున నేను లక్ష్మీ సమేతముగా ఇచ్చట అవతరించగలను. నీ శిరస్సుపై నివసించి సజ్జనులకెట్టి నష్టములు కలుగకుండా కాపాడుచుందును. వాయుదేవా కోపము విడిచి శాంతించి నీ చల్లటి గాలులతో నన్ను పారవశ్యానికి గురిచేసే రోజులు త్వరలో రానున్నాయి. నీ వాయు విశేషములతో నన్ను ఆనందింపచేయబోతున్నావు” అని చెప్పినాడు.


త్రిమూర్తుల ఆశీర్వాదము పొందిన వారిరువురూ ఎంతో సంతోషిస్తూ తర్వాత మిత్రులై సఖ్యంగా ఉండసాగిరి. ఆనాటినుండి ఆదిశేషుడు పర్వతరూపంలో నిలిచియుండి దేవదేవుని రాక కొరకు ఎదురు చూడసాగాడు. తదనంతర కాలములో శ్రీమహావిష్ణువు శేషాద్రి శిఖరంగా వెలసిన ఆదిశేషునిపై శిలారూపమున శ్రీవేంకటేశ్వరునిగా రూపుదాల్చి భక్తులను రక్షిస్తూ ఆర్తత్రాణ పరాయణుడిగా, పిలిచిన పలికే దైవంగా, కలియుగ దైవంగా పూజింపబడుతున్నాడు.