భగవద్గీత - మోక్ష సన్న్యా స యోగం


గత సంచిక తరువాయి


కచ్చిదేతచ్చుతం పార్థ త్వయైకా గ్రేణ చేతసా | కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ || 72


పార్థా ఈ గీతాశాస్త్రం ఏకాగ్రచిత్తంతో విన్నావు కదా. అజ్ఞాన ప్రభావంతో పుట్టిన నీ మోహం తొలగిపోయిందా అని ప్రశ్నిస్తున్నాడు భగవానుడు. గురుశిష్యుల సంబంధం ఎలా ఉండాలో మళ్ళీ చెబుతున్నాడు వ్యాసభగవానుడు. తను బోధించిన విషయం శిష్యుడు పరిపూర్ణంగా అవగతం చేసుకున్నాడా లేదా అని గురువు గమనించాలి. ఒకవేళ సరిగా ఆకళింపు చేసుకోలేకపోతే మళ్ళీ చెప్పటానికి సిద్ధపడాలి గురువు. లేదా నాకు ఇంకోసారి చెబుతావా అని వినయంగా అడగాలి శిష్యుడు. ఆనాడు అర్జునునికి కృష్ణుడు ఒక్కడే గురువు దొరికాడు. ఈనాడు వీధి వీధికి ఒక గురువు. శిష్యులూ అలాగే ఉన్నారు. సద్గురువు అవసరం వుండాలంటారు చాలామంది. శుకమహర్షికి జనకుడు గురువు. శివాజీకి సమర్థ రామదాసు గురువు. వివేకానందునికి రామకృష్ణ పరమహంస గురువు. కృష్ణార్జునుల గురు శిష్యుల స్థాయి అందుకోలేకపోయినా కనీసం వివేకానంద రామకృష్ణుల స్థాయికి దరిదాపుల్లో కూడా లేరు ఈనాటి గురుశిష్యులు. నిజం చెప్పాలంటే ఈనాటి గురువు బరువు అవుతున్నాడు. కృష్ణస్వామి జగద్గురువైనా జిజ్ఞాసువుల తత్వ దర్శనుల దగ్గరికి వెళ్ళి నేర్చుకో పో అన్నాడు అర్జునుని. అంటే అంతటి శ్రీకృష్ణునిలో ఎంత నిరాడంబరత, అహంకార రాహిత్యం వుందో గమనించాలి. జ్ఞానానికి అంతం, హద్దు లేవు కదా. తెలివి ఒకరి అబ్బ సొత్తు కాదని ఓ సామెత. కొందరికి సద్గురువులుండరు. అలాంటి వారిలో రమణమహర్షి ఒకరు. అలాంటివారికి పూర్వజన్మలో గురువు వుండి తీరాలంటారు కొందరు.


రాజసూయ యాగ సందర్భంలో ఉత్తర కురుభూములను జయించి అనేక ధనరాశులను తెచ్చినందుకు ధనంజయ అని అర్జునునికి పేరొచ్చింది. ఇపుడు శోక మోహాలు జయించి కౌరవులను అంతం చేసి రాజ్యలక్ష్మిని చేపట్టాలని ధనుంజయ శబ్ద ప్రయోగం జరిగిందని భావించాలి. ఈ గీతా శాస్త్రం ఏకాగ్రచిత్తంతో అధ్యయనం చేయాలి. లేదా శ్రవణం చేయాలి. దానివల్ల నాది, నాకోసం, నేను అనే అజ్ఞాన జనిత మమత, అహంకారాలు నశిస్తాయని అర్జునుని సాకుతో మనకు ఉపదేశం చేస్తున్నాడు భగవానుడు. అర్జునుడు ఒక నిశ్చయానికి వచ్చి కృష్ణస్వామి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు.


నష్టోమోహః స్మృతిర్లబాత్వత్పసాదాన్మయాచ్యుత | స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ || 73


అచ్యుతా! కృష్ణా! నీ కృపవల్ల మోహం (అజ్ఞానం) నశించింది. స్మృతి ( జ్ఞానం) కల్గింది. సంశయాలు తొలగిపోయాయి. నీవు చెప్పినట్లు (యుద్ధం) చేస్తాను. నిహత్య ధార్త రాష్ట్రాన్న?............. (1-36). దుర్యోధనాదులను చంపి మనం బావుకునేది ఏముంది? తాతలు, గురువులు, బంధుమిత్రులను చంపటం పాపం అంటున్నాడు అర్జునుడు. తన బంధువు ఐతే చంపకూడదని, పాపం మూట కట్టుకుంటామంటున్నాడు. తన బంధువులు కాకుండా పరాయివారైతే చంపొచ్చు. పాపం రాదని అర్జునుని మాటల్లో ధ్వనిస్తోంది. కాని అక్కడ ఉన్నది భగవానుడు. ధర్మరక్షణ దుష్టశిక్షణలో నీ నా అనే మమతాభిమానాలు, ప్రేమానురాగాలు ఉండకూడదని భగవానుని అభిప్రాయం. ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషం పెట్టేవాడు మారణాయుధాలు ప్రయోగించేవాడు, నిద్రించేవాళ్ళని చంపేవాడు, పరధనం అపహరించేవాడు, పరభార్యను చెరిచేవాడు ఇత్యాదులను ఆతతాయిలంటారు. అలాంటి ఆతతాయిల్ని చంపకుండా క్షత్రియ ధర్మం విస్మరించడం పద్దతి కాదని భగవానుని వాదం. ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తుంటే, బాంబులు పెట్టి భవనాల్ని పేల్చి పారేస్తుంటే వాళ్ళని సంహరించి సమాజానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ఆ లోక కంటకుల్ని ఉపేక్షించరాదు. నిర్మూలించాలి. దానివల్ల పాపం చుట్టుకోదు. భగవానుని కర్తవ్య ప్రబోధంతో దేహాత్మ భ్రాంతి పోయింది అర్జునునిలో. ఆత్మ పరమాత్మ తత్వం తెలుసుకున్నాడు. నేను కర్తని కాను. భోక్తను కాను. పరతంత్రుడను. సర్వస్వతంత్రుడు పరమాత్మ అన్న యధార్ధ జ్ఞానం, తన క్షాత్ర ధర్మం గుర్తుకు రావటం స్మృతిర్లబా అన్నదానికి అర్ధం. ఆ స్మృతి లభించిన వెంటనే శోకమోహాలు పటాపంచలయ్యాయి. అజ్ఞానం నశించింది. నేను పరమాత్మ చేతిలోని ఒక పనిముట్టును, ఒక ఉపకరణం మాత్రమే. నిమిత్తమాత్రుడనని జ్ఞానోదయమైంది. భగవానుడు చెప్పినట్లు చేయడమే కర్తవ్యం అనుకున్నాడు. తత్ ప్రసాదాత్ నీ కృప నీ అనుగ్రహం వల్ల మోహం పోయింది. ఇక్కడ కృష్ణుని అచ్యుతా అని పిలిచాడు. అచ్యుత అంటే తను జారడు, మనల్ని జారిపోనివ్వడు. అంటే తనని ఆశ్రయించిన భక్తులను సంసార కూపంలోకి జారిపోకుండా ఉద్దరించావని భావ ప్రకటన. .


అజ్ఞానంలో మునిగిన అర్జునునికి ఆత్మ స్వరూప జ్ఞానం కలగాలని మళ్ళీ విను మళ్ళీ విను అని పదే పదే ఉపదేశించాడు. అయినా దేనికీ సమాధానం చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే అర్జునా నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. యథా ఇచ్ఛసి తథా కురు. నీకిష్టం వచ్చినట్లు చెయ్ అన్నాడు. ఆలోచించాడు అర్జునుడు. విషయాల్ని విశ్లేషించుకున్నాడు. కరిష్యే వచనం తవ. నీవు చెప్పినట్లు చేస్తాను. నేను నిమిత్తమాత్రుడిని. కర్తవ్యం ప్రకారం యుద్ధం చేస్తా. ఫలితం ఆశించను అని నిశ్చయానికి వచ్చేశాడు. గత సందేహః - సందేహాలు తొలగిపోయాయి. సంశయాత్ముడు ఈ లోకంలో పరలోకంలో సుఖపడడు. సంశయాత్మ వినశ్యతి 4-40 లో అన్నాడు. ఎప్పుడు మోహం పోయిందో అపుడే ఆత్మజ్ఞానపు వెలుగులు ప్రసరించాయి. ఇదంతా అచ్యుతునికి శరణాగతి చేసిన ఫలమని గ్రహించాలి. ఇంతటితో కృష్ణార్జున సంవాదం ముగిసింది. వేదవ్యాస మహర్షి వరప్రదానంతో దివ్యదృష్టిని పొందటం తన భాగ్యమని సంజయుడు ధృతరాష్ట్రునితో చెబుతున్నాడు. ఆ అనందాన్ని వరుస నాలుగు శ్లోకాల్లో వివరిస్తున్నాడు.


ఈ ప్రకారంగా పరమాత్మ యైన వాసుదేవునికి మహాత్ముడైన అర్జునునికి జరిగిన సంవాదం నేను విన్నాను. ఆ సంభాషణం గగుర్పాటును, ఆశ్చర్యాన్ని కలిగించింది. మహాత్ముడు అన్న శబ్ద ప్రయోగం అర్జునునికా, వాసుదేవునికా ఎవరికి అన్వయిస్తుందని ప్రశ్న. ఇద్దరూ మహాత్ములే. ఇద్దరికీ అన్వయిస్తుందన్నారు కొందరు. మహాత్ముడంటే బుద్ధిమంతుడని అర్థం గ్రహించి అర్జునునికి అన్వయించారు కొందరు. కాదు కాదు వాసుదేవునికే అన్నారు కొందరు. - మనుష్యాణాం సహసేషు - వేలకొద్దిలో ఒకడు నా గూర్చి తెలుసుకుంటాడు. ఆ వేలలో ఒక్కడు మాత్రమే తత్వః నన్ను తెల్సుకుంటాడు (7-3). అలా అర్జునుడు కృష్ణభగవానుని తత్వం తెల్సుకున్నాడు కనుక మహాత్ముడన్నది ఒక బిరుదుగా కొందరు అర్జునునికి తగిలించారు. మహాత్మా నస్తు మాం పార్థ 9-13 లో మహాత్మ అన్నమాట వచ్చింది. దైవీ సంపత్తికి చెందిన గుణాలున్నవాడు ఇదొకటి. పరమాత్మని పరబ్రహ్మంగా జగత్ కారణుడని గుర్తించినవాడు. ఇది రెండు. చిల్లర దేవతలపై మనస్సు పోనివ్వక అనన్యచిత్తంతో పరమాత్మనే ధ్యానించేవాడు. ఇది మూడు. ఇలా మూడు లక్షణాలున్నవాడు మహాత్ముడని పేర్కొన్నాడు. అసుర సంపదలకు అవకాశం ఇవ్వనివాడు అర్జునుడు. వలసి వచ్చిన ఊర్వశిని కాదన్నాడు. కామ క్రోధాల్ని జయించిన జితేంద్రియుడు భగవానుని విశ్వరూపం దర్శించాక కృష్ణుడు తన సఖుడు బావకన్నా సర్వశ్రేష్ఠుడని సకల చరాచరాలన్నింటికి శాసించే నిర్వహించే సర్వ జగద్రక్షకుడని గుర్తించాడు. సర్వమూ వాసుదేవమయం అని నమ్మి శరణువేడినవాడు మహాత్ముడే. అలాంటివాడు దొరకటం అరుదు అంటూ వాసుదేవ సర్వమితి 7-19 లో చెప్పాడు భగవానుడు. ధ్యానంలో భక్తిలో జ్ఞానంలో పరాకాష్ఠకు చేరినవారిని మహాత్ములనవచ్చునని 8-15 లో అంటాడు. శోక మోహాలతో ఉక్కిరి బిక్కిరి అయినవాడు, దేహాత్మ భ్రాంతిలో ఊగిసలాడినవాడు యుద్ధంలో అందరినీ చంపి నెత్తురుకూడు తినడం కన్నా బిచ్చమెత్తుకొని బతకటం మిన్న అని కర్తవ్య విముఖుడై కూలబడ్డాడు. భగవదుపదేశంలో శోక మోహాలు తొలగిపోగా కర్తవ్యం గ్రహించినవాడు మహాత్ముడనిపించుకోవడం సమంజసమే కదా. నర నారాయణులలోని నరుడే అర్జునుడు కనుక అతను మహాత్ముడని పిలువబడటంలో ఆశ్చర్యం లేదు. గీతను చదవడమే కాదు శ్రద్ధాభక్తులతో కృష్ణభగవానుని ఉపదేశాల్ని పాటించి శరణాగతులై సంసారం అనే ఊబిలోంచి బయటపడి భగవత్ సన్నిధి కోసం తపించేవాడు మహాత్ముల కోవలో చేరాలని వ్యాసమహర్షి ఆశయం.


కౌరవ పాండవులకు యుద్ధం నిశ్చయమైంది. ధృతరాష్ట్రునికి ప్రత్యక్షమయ్యాడు వ్యాసభగవానుడు. యుద్ధం చూస్తావా దివ్యనేత్రాలు ప్రసాదిస్తా అన్నాడు. అన్నదమ్ములు చేసే భయంకర యుద్ధం చూడలేను. యుద్ధ వార్తలు వినాలని ఉంది. వినే ఏర్పాటు చెయ్ అని గుడ్డిరాజు జవాబు. పక్కన ఉన్న సంజయుడు అదృష్టవంతుడు. ఆ పనికి ఆతనిని నియోగించాడు మహర్షి. అతనికి దివ్యదృష్టినిచ్చాడు. యుద్ధరంగంలో అతివేగంగా ఎక్కడైనా తిరగొచ్చు. అస్త్ర శస్త్రాలు తాకజాలవు. ప్రతివ్యక్తి ఆలోచనలు మానసిక స్థితిగతులు తెల్సుకోగల దివ్యశక్తిని కూడా సంజయునికి ఇచ్చాడు. భూభారం తగ్గుతుంది. ధర్మం జయించుగాక అన్నాడు. కాని యుద్ధాన్ని ఎవరూ ఇష్టపడరని పలికిన వ్యాసదేవునితో ధృతరాష్ట్రుడన్నాడు ఇలా. నా మాటని నా కొడుకులు వినలేదు. నువ్వూ అలాంటి హితవచనాలు చెప్పొద్దు. ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకి ధర్మం గెలుస్తుందని చెప్పి అదృశ్యమయ్యాడు వ్యాసభగవానుడు.


పది రోజుల యుద్ధం ముగిసింది. కురువృద్ధుడు భీష్ముడు పడిపోయాడు. ఆ పదిరోజుల యుద్ధ విశేషాలు చెప్పాలని వచ్చాడు. సంజయుడు. భగవానుని గీతోపదేశం వరకు కృష్ణార్జునుల సంభాషణం స్వయంగా విన్నాడు సంజయుడు. అదొక అద్భుతం. ఆశ్చర్యం. భగవానుని విశ్వరూప సందర్శనంలో సంజయుని శరీరం పులకరించిపోయింది. తన జన్మ ధన్యమైనట్లు భావించాడు. గీతలోని శబ్ద ప్రయోగంలో ఒక దివ్యశక్తి ఉంది. అవి శ్లోకాల్లోని అక్షరాలు కావు. జ్ఞాన కణికలు. ఆణిముత్యాలు. అన్నీ గుదిగుచ్చి అల్లిన దివ్యమాల భగవద్గీత. విశాల విశ్వ వాజ్మయంలో అపూర్వమైన జ్ఞానగ్రంథం. అందుకే సంజయుని నోట అద్భుతం రోమ హర్షణం అన్న మాటలు వచ్చాయి. ప్రపంచంలోని సాధకులందరికీ ఒక కల్పతరువు ఈ భగవద్గీత. వేదవ్యాస మహర్షికి తన కృతజ్ఞతలు తెల్పుతున్నాడు


సంజయుడు ఈ కింది శ్లోకంలో. వ్యాసప్రసాదాచ్చుతవాన్ ఏతద్దుహ్యమహం పరమ్, యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ || 75 వేదవ్యాసుని కృపతో దివ్యదృష్టిని పొందాను. పరమ రహస్యమైన ఈ యోగాన్ని (భగవద్గీతను) యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతుంటే ప్రత్యక్షంగా విన్నాను. ఆ కర్మయోగం, ధ్యానయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అలా అనేక యోగ (ఉపాయ) పద్దతులు భగవద్గీతలో ఉపదేశించబడ్డాయి. ఆ యోగాలకు యోగేశ్వరుడు కృష్ణపరమాత్మ. జ్ఞాన బల వీర్య ఐశ్వర్య తేజశ్శక్తులు కల భగవానుడు. ఆ షాడ్గుణ్యుడు చెబుతుంటే ప్రత్యక్షంగా శ్రవణం చేయగల భాగ్యం సంజయునికి దక్కింది. తనకా దివ్యశక్తి దివ్యదృష్టిని ప్రసాదించిన వ్యాసదేవుని కృతజ్ఞతాపూర్వకంగా స్మరిస్తున్నాడు. యోగం అంటే ఉపాయం. ఏమిటా ఉపాయం. జీవుడు దేవుడు ఒకటిగా ఐక్యం చెందే ఉపాయం. అదే ఒక యోగం. అదే భగవానుని నుండి జాలువారిన గీతామృతం. అందుకే అది పరమ పవిత్రమైంది. పరమ రహస్యమైంది.


భగవానుని గీతోపదేశం ప్రత్యక్షంగా ఎందరు విన్నారని ప్రశ్న. 1. అర్జునుడు 2. వ్యాసుడు 3. సంజయుడు 4. అర్జునుని రథకేతనంపై ఉన్న హనుమంతుడు - ఈ నలుగురు సాక్షాత్ భగవంతుని ముఖతః వెలువడ్డ గీతని విన్నారు. సంజయుని వల్ల విన్న ధృతరాష్ట్రుడు అయిదోవాడు అవుతాడు. ధ్యానయోగి బహిర్ముఖ వృత్తులన్నింటినీ త్యజించి అంతర్ముఖుడై పరమాత్మని ధ్యానిస్తూ ఉంటాడు. చిల్లర దేవతల్ని వదిలేసి అనేక భౌతిక సంకల్పాల్ని త్యజించి పరమాత్మ మీద అనన్యభక్తి కల్గి ప్రపంచాన్ని మరచి పోతాడు భక్తియోగి. ఇక జ్ఞానయోగి విషయానికి వస్తే లౌకిక విషయ వాసనలకు తదితర సంకల్పాలకు మనస్సులో లేశమాత్రం చోటివ్వడు. సదా ఆత్మానందంలో నిమగ్నుడై ఉంటాడు. బాహ్య స్మృతికి వచ్చినా సర్వమూ అతని దివ్య కళామయమంటూ సమతా దృక్పథంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. తాపసులకన్నా, శాస్త్ర జ్ఞానులకన్నా, సకామ కర్మాచరణ సాగిస్తున్న వారికన్నా యోగి శ్రేష్ఠుడు. యోగీ భవార్డున (6–46). అర్జునా నువ్వు యోగిగా ఉండు. ఆ యోగి పరమ శ్రేష్ఠుడు అంటాడు భగవానుడు. ఒక యోగిలా తన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సంజయుడు ఈ క్రింది శ్లోకంలో.


రాజన్ సంస్మృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ | కేశవార్జునయోః పుణ్యం హృష్యామిచ ముహుర్ముహుః || 76 ధృతరాష్ట్ర మహారాజు ఆశ్చర్యకరమైన, పుణ్యప్రదమైన


శ్రీకృష్ణార్జున సంవాదాన్ని తలచి తలచి మాటిమాటికీ ఆనందిస్తున్నాను. కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతను చదవటం వల్ల, వినటం వల్ల పుణ్యాత్ములు కాగలరు. చదివినదాన్ని లేదా వినినదాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించాలి. అంటే మరోవిధంగా చెప్పాల్సివస్తే - ముందు శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని తైలధారలా నిరంతరం ధ్యానం చేయాలి. దాంతో అంతులేని ఆనందం పొందగలం. దానినే మనన నిది ధ్యాసం అంటారు. సంజయుడు కూడా అలా వినిన దాన్ని మననం చేసి చేసి (సంస్కృత్య సంస్కృత్య అని రెండు సార్లు అన్నాడు). పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవటం వల్ల ఆనంద సాగరంలో మునకలిడుతున్నాడు. ఆనందానికి అవధుల్లేనపుడు కొందరు నృత్యం చేస్తారు. కృష్ణ చైతన్యస్వామి చిందు తొక్కేవాడట. వీధుల వెంట పాడుతూ ఆడుతూ వెళ్ళేదట మీరాబాయి.


అర్జునుడు మొదట్లో దుఃఖంతో చతికిలపడ్డాడు. గీతా శ్రవణంతో దుఃఖం పోయింది. ఉత్సాహంతో గాండీవం అందుకున్నాడు. గీతా శ్రవణంతో ఆనందపు అంచులు చేరుకున్నాడు సంజయుడు. మనసు వికలమైనపుడు గాంధీజీ భగవద్గీతను అనుసంధానం చేసేవాడట. గీతా శ్రవణం కాని, పఠనం కాని మనస్సుని ప్రశాంత స్థితికి చేరుస్తుంది. దుఃఖ రాహిత్యానికి గీతా శ్రవణం గొప్ప దివ్యౌషధం. -


తచ్చ సంస్మృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః | విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః || 77


ఓ రాజా! కృష్ణభగవానుని (హరి) అత్యద్భుతమైన విశ్వరూపాన్ని మాటిమాటికీ స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే నాకు మహదాశ్చర్యం కల్గుతోంది. మళ్ళీ మళ్ళీ ఆనందంతో పులకిత గాత్రుడనవుతున్నాను. గత శ్లోకంలో భగవానుని ఉపదేశం అనందంలో ముంచెత్తిందన్నాడు. ఇపుడు ఇక్కడ భగవానుని విశ్వరూపం అత్యద్భుతం అంటున్నాడు. అర్జునుని కోసం విశ్వరూపం ప్రదర్శించాడు స్వామి. వ్యాసభగవానునితో పాటు సంజయుడు కూడా ఆ దివ్యాద్భుత రూపం సందర్శించాడు. అది తన అదృష్టంగా తన పురాకృత పుణ్యంగా భావించాడు. ఆ విశ్వరూపం సంజయుని మనఃఫలకం మీద చెరగని ముద్ర వేసింది. దాన్ని స్మరిస్తూ స్మరిస్తూ దివ్యానుభూతిని పొందుతున్నాడు. మాటి మాటికీ సంతోషంతో పొంగిపోతున్నాడు. ఆ విశ్వరూపం ఎలా ఉందో ఒక్కసారి పదకొండో అధ్యాయంలోని కొన్ని శ్లోక భావాలను మళ్ళీ మనం కూడా స్మరిద్దాం. అర్జునా నీ మీదున్న కృపతో నా యోగశక్తితో విరాట్ రూపం చూపుతున్నాను. ఇది ఎంతో తేజోమయం. అనంతం. నా విశ్వరూపం నీవు తప్ప అన్యులెవరూ చూడలేరు.... మహా భయంకరమైన మహాకాలుని రూపం చూశాడు అర్జునుడు. భయంతో గజగజలాడాడు. నిజరూపం చూడాలని పదే పదే నమస్కరిస్తూ ప్రార్థించాడు. అపుడు చతుర్భుజ రూపాన్ని చూపాడు స్వామి. ఆ దివ్యమంగళ రూపం సంజయుని మనోవీధిలో తిరుగాడుతూ ఉంటే అంతులేని ఆశ్యర్య ఆనందాలలో మునిగి తేలుతూ చెప్పిందే చెబుతూ ఉన్నాడు. తర్వాత పాండవులకే విజయం తథ్యం అంటూ భగవద్గీతకు ముకాయింపు పలికాడు.


ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధరుడైన అర్జునుడు ఉంటారో అక్కడే సంపద, అక్కడే విజయం, అక్కడే ఐశ్వర్యం, అక్కడే స్థిరమైన నీతి ఉంటాయి. ఇది నా నిశ్చయం అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. ధృతరాష్ట్రునికి కన్నులే కాదు మనస్సు కూడా గుడ్డి. ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్దులైన నా కుమారులు పాండుపుత్రులు ఏం చేశారని గుడ్డిరాజు ప్రశ్నతో మొదలైంది భగవద్గీత. శ్రీభగవానువాచతో కాకుండా పాపిష్టి వానితో ప్రారంభమైంది గీత. గుడ్డివానికి రాజ్యార్హత లేదని ధర్మశాస్త్రం చెబుతోంది. అందుకు అతని తమ్ముడు పాండుడు రాజైనాడు. కాని విధి బలీయం. అకాల మృత్యువాత పడ్డాడు పాండుడు. ధృతరాష్ట్రుడు అంటే ధృతం రాష్ట్రం కలవాడు. రాష్ట్రం అంటే రాజ్యం. తమ్ముని రాజ్యం తనది ధృతం అని వూగులాడాడు గుడ్డిరాజు. రాష్ట్రం అంటే శరీరం అని మరొక అర్థం. ఈ శరీరం స్థిరమైంది, శాశ్వతమైనది అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. నాది, నాకోసం అని అహంకార మమకారాలు పెంచుకోవద్దని - బయట చూపు లోపలి చూపు రెండూలేని వాళ్ళుగా ఉండరాదని - ధృతరాష్ట్రులై ఉండొద్దు, అర్జునునిలా ఉండాలని వ్యాసదేవుని హెచ్చరిక. కనుకనే గుడ్డిరాజుతో గీత ప్రారంభమైంది. మరోరకంగా చెప్పాలంటే ఈ శరీరం లోపల ఉండే జీవుడు భగవంతుని సొత్తు. మనది కాని దాన్ని మనదే అనుకోరాదు.


నా కుమారులు, పాండుకుమారులని వేరుపరచాడు ధృతరాష్ట్రుడు. యుద్ధభూమిలో ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తారు. ఏం జరిగిందని అడగకుండా ఏం చేశారని ప్రశ్నించాడు. పాండవులు సత్వగుణ సంపన్నులు. హింసాకాండ వద్దనుకునే అహింసావాదులు. యుద్ధం మానేసి తన కుమారులకి రాజ్యం ఇచ్చేసి ఉంటారని ఊహించాడు గుడ్డిరాజు. అందుకే ఏం చేశారని అడిగాడు. మామకా: నా వాళ్ళు, నా కుమారులని పక్షపాత బుద్ధిని వెలగబెట్టాడు. అతని ప్రశ్నకు మొదటి అధ్యాయంలో అక్కడే ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్న. ధృతరాష్ట్రుడు రాజు. సంజయుడు మంత్రి. సేవకుడు కింద లెక్క. అడిగిన వెంటనే ఠపీమని చెబితే పరిణామం ఎలా ఉంటుందో చెప్పలేం. యుద్ధం మాని అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాలన్నదే సంజయుని కోరిక. ఆశ. ధర్మం ఎక్కడుంటుందో, కృష్ణార్జునులు ఎక్కడ ఉంటారో అక్కడే విజయం ఉంటుందని చెబితే భయపడి గుడ్డిరాజు పుత్రవ్యామోహంతో రాజీకి ఏర్పాట్లు చేయగలడని వూహించాడు సంజయుడు. కాని రాజులో స్పందన కరువైంది. వినాశకాలే విపరీత బుద్ధిః. ధృతరాష్ట్రుని దురాలోచనలు, దూర ఆలోచనలు, దుర్మార్గపు పోకడలు సంజయునిపై ప్రభావం చూపలేదు. సమ్యక్ జయం కలవాడే సంజయుడు అంటే సకల ఇంద్రియ నిగ్రహం కలవాడు. కనుకనే గీతని నేరుగా వినగల అదృష్టం వరించింది సంజయునికి. వ్యాసమహర్షి అనుగ్రహానికి భగవత్ కృపకు పాత్రుడైనాడు సంజయుడు. అలాంటి వారికి జాతి మత కులభేదాలు అడ్డురావు. పద్దెనిమిదో నాటి యుద్ధంలో సాత్యకి సంజయుని పట్టుకున్నాడు. చంపబోయాడు. వ్యాసుడు ప్రత్యక్షమై అతని ప్రయత్నం నివారించాడు. యోగేశ్వర కృష్ణః - కృష్ణుడు యోగేశ్వరుడు. కృష్ అంటే అపరితమైన ణ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. తన దరి చేరిన వారందరికీ బ్రహ్మానందం ఇచ్చేవాడు. అపరిమితంగా ఆకర్షించేవాడని కృష్ణ శబ్దానికి మరొక అర్థం ఉంది. యుద్ధం చేయనని గాండీవం జారవిడిచాడు అర్జునుడు. కరిష్యే వచనం తవ. నీవు చెప్పినట్లు చేస్తానని మళ్ళీ గాండీవం పట్టుకునేట్లు చేశాడు కృష్ణుడు.


భగవద్గీతలో 18 యోగాలున్నాయి. యోగం అంటే భగవంతుని పొందటానికి ఆ స్వామియే సాధనమని ఒక అర్థం. శరణాగతి నిష్ఠులకు ఆ భగవానుడే సాధనమని మరొక అర్థం. పశ్యమే యోగమైశ్వరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ మహాయోగేశ్వరో హరిః. ఇలా అనేక చోట్ల యోగశబ్దం ఆ స్వామికి ప్రయోగింపబడింది. అర్జునునికి ధనుర్ధారి అని శబ్దం ప్రయోగింపబడింది. తన గాండీవంతో వివిధ అస్త్ర శస్త్రాలు ప్రయోగించి కౌరవుల్ని నిర్జించి విజయం సాధిస్తాడని ఒక అర్థం. కామ క్రోధాది అరిషడ్వర్గాన్ని దైవీ సంపదలనే ధనుస్సుతో చీల్చి చెండాడుతాడని మరొక అర్థం. కర్తవ్యం. విస్మరించకుండా ప్రతి వ్యక్తి తన పని తాను చేసితీరాలి. అలా చేయటంలో ఆటంకాలు ఎదురైనపుడు వాటిని తొలగించే భారం ఆ స్వామి వహిస్తాడు. అందుకే పార్థుని ధనుర్ధరుని చేశాడు. అనన్యభక్తి, శరణాగతి - ఆ రెండూ చిత్తశుద్ధితో పాటిస్తే యోగక్షేమం వహామ్యహం అంటాడు స్వామి. చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏమాత్రం మాలిన్యం లేకుండా శుభ్రంగా శుద్ధి చేయబడటమే. నిష్కల్మషమైన వినిర్మలమైన మనస్సు ఉంటే పరమాత్మ ఆ మనస్సులో వచ్చి చేరాడు. - మాలిన్యం లేకుండు. చిత్తశుద్ధి అంటే చేయబడటమే.


భగవద్గీత మనకు ఒక వరం. ఒక విజ్ఞాన గ్రంథం. ఒక అనుష్ఠాన గ్రంథం. ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. సంసారం అనే చీకటి గుయ్యారంలో తడబడుతున్న మనకు ఒక కరదీపిక. ఒక్కో అధ్యాయం ఎంత వెలుగు జిలుగులు విరజిమ్ముతోంది. ఆ వెలుగులతో మనలోని చీకట్లు పారిపోవాలి. సర్వప్రాణికోటిలో పరంజ్యోతిగా ప్రకాశించే పరమాత్మని చూసి జన్మ చరితార్థం చేసుకోవాలి. మానవసేవ మాధవసేవ అన్నాడు స్వామి వివేకానంద. అంతకుమించి మరోమెట్టు పైకెక్కి సర్వ ప్రాణికోటిని ప్రేమించు అంటుంది గీతామాత. . ఎక్కడ కృష్ణార్జునులుంటారో అక్కడే శ్రీ (రాజ్యాది సుఖభోగాలు) విజయం (శత్రుసంహారంతో లభించేది) భూతి (ఐశ్వర్యం) నీతి (ధర్మబద్ధమైన ప్రవర్తన) ఉంటుంది. ఇది నా నిశ్చితాభిప్రాయం అని నిర్భయంగా తేల్చి చెప్పాడు సంజయుడు. పాండవులకే కాదు ఎక్కడ దైవీ సంపదలుంటాయో అక్కడ సకల ఐశ్వర్యాలు శుభకామనలు వర్ధిల్లుతాయని అంతరార్థం. ఇంతటితో తృతీయ షట్కం సంపూర్ణం. నిమిత్తమాత్రుడనైన నాచేత కృష్ణపరమాత్మ పద్దెనిమిది అధ్యాయాలు రాయించాడు. ఇందులోని మంచి అంతా సత్పురుషుల ఉచ్చిం. దోషాలన్నీ నావి. స్వప్రయోజనానికి కాకుండా ఏది పర ప్రయోజనాలకి ఉపయోగపడుతుందో అది శేషం. ఏది ఉపయోగం పొందుతుందో అది శేష. పరమాత్మ శేషి. జీవుడు శేషం. తనకోసం కాకుండా ఆ స్వామి సేవకై ఉపయోగపడేవాడు కదా జీవుడు. నాది నాకోసం అని కాకుండా భగవదాజ్ఞగా పరమాత్మ ప్రీత్యర్ధం కర్మాచరణ చేస్తున్నాం మనం. కనుక మనం శేషం. పరమాత్మ శేష. శేషభూతులమైన మన బాగోగులు యోగక్షేమాలు ఆ స్వామి చేసుకుంటాడు. పదమూడో అధ్యాయం మొదట్లో ప్రకృతిం పురుషం చైవ అన్న శ్లోకం అర్జునుడు పలికినట్లు చేర్చారు కొందరు. అలా అయితే ఒక శ్లోకం పెరుగుతుంది. అప్పుడు మొత్తం 701 శ్లోకాలు అవుతాయి. శంకరులు, రామానుజులు ఆ శ్లోకం చేర్చలేదు. బ్రహ్మగీత, శివగీత, హంసగీత, భిక్షుగీత, పరాశరగీత, అష్టావక్రగీత, వసిష్ఠ గీత ఇలా ఎన్నో గీతలున్నాయి. భగవద్గీతకున్న అశేష ఆదరణ తక్కినవాటికి లభించలేదు. ఆదిశంకరుల నుంచి నేటివరకు ఎందరో భగవద్గీతకు వ్యాఖ్యానాలు చేశారు. చేస్తున్నారు. చేస్తారు. దేశ కాలమాన స్థితిగతులను బట్టి వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. కనుక వ్యాఖ్యానాల్లో తేడా ఉండొచ్చు. ఉదాహరణకు వర్ణాశ్రమ ధర్మాలు వ్యాసుని కాలంలో అందరూ చక్కగా పాటించేవారు. కాలక్రమేణా అవి ధ్వంసమయ్యాయి. ఆనాటి సామాజిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భగవద్గీతను చూడాలి. ఈనాటి నైతిక విలువలతో పోల్చరాదు. ఏది ఏమైనా భగవద్గీత సార్వకాలికం. సార్వజనీనం అని విశ్లేషించిన వారున్నారు. గీతను బాగా అధ్యయనం చేయాలి. అనుష్టించాలి. ఆత్మానందం పొందాలి. దాన్ని అందరికీ పంచిపెట్టాలి. ఈ గీతలో అర్జునుడు మన ప్రతినిధి. కనుక మనమూ నిమిత్తమాత్రులమై నిష్కామాచరణ సాగిద్దాం. అర్జునునిలా ధన్య జీవితం భగవంతుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. భగవద్గీత నాచేత వ్రాయించిన కృష్ణపరమాత్మకి సాంజలిబంధంగా నమోవాకాలు సమర్పించుకుంటున్నా. సర్వం శ్రీకృష్ణార్పణం.


సమాప్తం


గత 5 సం||ల నుండి శ్రీవేంకటేశం పాఠకులకు భగవద్గీతను ధారావాహికంగా అందించిన శ్రీమాన్ రాళ్ళబండి శ్రీనివాసన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు. వీరి ద్వారా ప్రచురితమైన భగవద్గీతను చదివిన పాఠకులు తమకు తాము ధన్యమైనామన్న భావనను పొందామన్నారు. సామాన్య శైలిలో ప్రతి పాఠకునికి అర్థం అయ్యే విధంగా వ్రాసి గీత యొక్క ముఖ్య ఉద్దేశములను పామరుల హృదయాలలోకి తీసుకెళ్ళిన వారు శ్రీమాన్ రాళ్ళబండి శ్రీనివాసన్ గారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు మా ప్రభు తిరుమల శ్రీవేంకటేశ్వరుని సంపూర్ణ కృప కలగాలని మనసారా మా స్వామివారిని ప్రార్థిస్తున్నాను. వచ్చే నెల నుండి వీరి కలం నుండి వెలువడనున్న "శ్రీరామాయణ రత్నాకరం” అనే ధారావాహికం ప్రచురింపబడును. - ఎడిటర్, శ్రీవేంకటేశం