మహా మహిమోన్నతం భస్మధారణం


శివరూపం మంగళకరం. శివనామం ముక్తిదాయకం. శివశబ్దము ఆనందదాయకం. జ్ఞానదాయకం. శివరూపం మహిమాన్వితం. మంగళమూర్తియైన శివుడు లోకాలన్నింటిని అతలాకుతలం చేసే గరళాన్ని తన కంఠమునందు నిల్పుకొని గరళకంఠుడయ్యాడు. గరళముచే కంఠము నీలిరంగుగా మారడంచే నీలకంఠుడయ్యాడు. అల్ప సంతోషి. పరమ దయాసాగరుడు, దీనబాంధవుడు, సంహారశక్తిగా కనిపించే శివయ్య లోకరక్షకుడు కూడా అయ్యాడు. నిత్యము శరీరమునకు భస్మమును దరించుట చేత భస్మాంధగుడయ్యాడు. మాఘమాస శుభ తరుణాన భస్మము, భస్మధారణ మహాత్మ్యము, విశిష్టత గురించి త్రికరణ శుద్ధిగా మననం చేసుకుందాం. .


సృష్టి స్థితి లయ కారులైన త్రిమూర్తులలో లయకారుడైన శివునికి అత్యంత ప్రీ తిపాత్రమైనది భస్మము. భస్మధారణ వైదిక సంస్కృతి. శైవమతాలన్నీ వేదము నుండి స్వీకరించిన సంప్రదాయమిది. భస్మంలో అగ్ని, నీరు, పృథివి అనే మూడు ప్రత్యక్ష భూతముల మేళనముంది. భస్మమనగా "భాసనాత్ భసితం ప్రోక్తం భస్మకిల్బిష భక్షనాత్" అని శివపురాణ వాక్యము. భాసము చేత భస్మము. అనగా ప్రకాశ స్వరూపం. సర్వ పాపాలను భస్మం చేసి జ్ఞానదీప్తిని అందించేది భస్మం. అగ్నిసారమైన భస్మం ఐశ్వర్యదాయకం. కనుకనే విభూతి అని నామాంతరం. "భూతిర్విభూతి రైశ్వర్యం" అని నిఘంటువు ద్వారా తెలియుచున్నది.