శబరిమల అయ్యప్ప


శబరిమల అయ్యప్పస్వామి గురించి 1970 వరకు తెలుగువారికి అంతగా తెలియదంటే అతిశయోక్తి కాదుశ్రీశ్రీశ్రీ విమోచనానందస్వామి శబరిమలలో తపస్సు గావించి దేశం నలుమూలలా పర్యటించి శబరిమల అయ్యప్పస్వామి గురించి తెలియజేసి పలువురిని తనతో యాత్రకు తీసుకువెళ్ళి శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేయించారు. అలా అయ్యప్పస్వామి మీద నమ్మకం, భక్తి కలిగించి దేశంలో పలుచోట్ల అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి నాంది పలికారు. అలాగే గొల్లపూడిలో 1975లో శ్రీ విమోచనానందస్వామివారి పర్యవేక్షణలో భక్తుల విరాళాలతో అయ్యప్ప దేవాలయం తెలుగు రాష్ట్రాలలో తొలి దేవాలయంగా రూపుదిద్దుకుంది. 1979లో నంబియార్ నిర్మించిన 'స్వామి అయ్యప్ప' సినిమా పలువురు చూ సి కేరళలో ఉన్న శబరిమల అయ్యప్పస్వామి గురించి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక చింతనాపరులు, యాత్రాభిలాషులు శబరిమల వెళ్ళి స్వామివారిని దర్శించి రావాలని కొందరు వెళ్ళి స్వామివారిని దర్శించి వచ్చారు. 1980 తరువాత జేసుదాసు పాడిన పాటలకేసెట్లు విని భక్తితో ఎందరో పులకించిపోయి మాలలు ధరించి, మండల దీక్ష బూని శబరిమల యాత్ర చేసి వచ్చారు. ముందు ప్రముఖ పట్టణాలు, నగరాలలోనే వ్యాపించిన అయ్యప్పస్వామి కీర్తి మెల్లగా పల్లెలకు ప్రాకింది. పెక్కుసార్లు యాత్ర చేసిన ఆధ్యాత్మిక చింతనాపరులు


కొందరు గురుస్వాములుగా బాధ్యత స్వీకరించి స్వామి అయ్యప్ప దీక్ష, శబరిమల యాత్ర గురించి అన్ని విషయాలు తెలియజేసి మాలాధారణ చేసి, సక్రమంగా మండలదీక్ష చేయించి ఇరుముడి కట్టి శబరిమల యాత్ర చేయించి అయ్యప్పస్వామి దర్శనం చేయించి సురక్షితంగా ఇంటికి చేర్చేవారు. 1980కి ముందు శబరిమల యాత్ర చాలా కష్టంగా ఉండేది. పంపాతీరంలోను, శబరిమల సన్నిధానంలో కూడా ఆకులతో వేసిన పందిళ్ళు మాత్రమే ఉండేవి. వాటినే 'విరి' అనేవారు. శబరిమల సన్నిధానంలో మాత్రం దేవస్థానం వారి బిల్డింగ్ ఒకటి, స్వామి అయ్యప్ప సినిమా తీసిన నంబియారు కట్టించిన బిల్డింగ్ ఒక్కటే పక్కా బిల్డింగులు ఉండేవి. అడవిలో దొరికే ఆకులు, కర్రలతో నిర్మించబడిన పందిళ్ళు, పాకలే భక్తులు ఉండడానికి 'విరి' పేరుతో నిర్మించి అద్దెకు ఇచ్చేవారు. అందులో నేలపై పడుకోడానికి చాపలు ఇచ్చేవారు. భోజన పలహారశాలలు ఉండేవి కావు. టీషాపులు, బిస్కట్లు, అరటిపళ్ళు వంటివి మాత్రమే దొరికేవి. కేరళ సంప్రదాయంలో వండే కప్పగంజి అని అమ్మేవారు. అందుకే ఆ రోజులలో శబరిమల యాత్ర చేసేవారు వంటసామగ్రి తమతో తెచ్చుకుని వంటలు చేసుకుని తినేవారు. ఇరుముడి వెనుక భాగం సంచిలో బియ్యం, పప్పులు, పోపు సామాన్లు వగైరాలు అందులో ఉంచేవారు. ఇరుముడి ముందు భాగంలో స్వామివారికి సమర్పించే ముద్రకాయ, పూజాద్రవ్యాలు ఉంచి గురుస్వామి ఇరుముడి కట్టేవారు. అందుకే శబరిమల యాత్రకు బృందాలుగా వెళ్తారు కానీ ఒంటరిగా పయనించరు. అడవిలో క్రూరమృగాల బెడద కూడా ఎక్కువగా ఉండేది. అందుకే బిగ్గరగా స్వామి శరణాలు చెబుతూ, మధ్య మధ్య మందుగుండు సామగ్రి పేలుస్తూ యాత్ర చేస్తారు. బాంబుల పేలుడు శబ్దానికి క్రూరమృగాలు, ఏనుగులు దూరంగా పోయేవి. ఎరుమేలి మార్గము జనవరి 1వ తేదీ నుండి 14వ తేదీవరకు యాత్రకు అనుమతించేవారు. దారిలో మంచినీరు దొరికేది కాదు. మధ్య మధ్య పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకున్న టీషాపులు మాత్రమే ఉండేవి. వారే పెద్దపందిళ్ళు వేసి ఉంచడం వలన స్వాములు అక్కడ టీ త్రాగి కొంతసేపు విశ్రమించేవారు. వంట చేసుకునేవారు ఆ పరిసరాలలో వంటలు చేసుకునేవారు. ఎరుమేలి మార్గం సుమారు 70 కి.మీలు ఎత్తైన కొండలపై, దట్టమైన అడవిలో ప్రయాణం వలన అనుభవమున్న గురుస్వామితోనే బృందాలుగా యాత్ర చేసేవారు. పగలు నడవడం కష్టమని తెల్లవారు ఝామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నడిపించేవారు. అందుకే ప్రతి ఒక్కరు కొత్త బ్యాటరీలు వేసిన టార్చిలైట్లు చేతిలో పట్టుకొని భుజాన షోల్డర్ బ్యాగ్, తలపై ఇరుముడితో స్వామి శరణాలు చెబుతూ పయనిస్తూ ఉంటే ఆ భక్తితత్పరతే వేరు. - సర్వమానవ సౌభ్రాతృత్వం అనే పదానికి శబరిమల యాత్రలోనే మొదటిసారి అర్థం తెలుస్తుంది. ముక్కు ముఖం తెలియకపోయినా చేయూత ఇచ్చి సాయం చేస్తారు. అలసిపోయిన వారికి గ్లూకోజ్, పిప్పరమెంట్ బిళ్ళలు, నిమ్మకాయ డిప్పలు ఇచ్చి సేద తీరుస్తారు. నడవలేక ఇబ్బంది పడేవారికి కర్ర సాయంతోనో, భుజం మీద చెయ్యివేసి నడిపించి అడవిలో సాయపడి శబరిమల సన్నిధానం చేరుస్తారు. పంపా తీరం చేరాక అక్కడ వసతి సౌకర్యం, కాఫీ ఫలహారాలు దొరుకుతాయి. చాలామంది అక్కడ పంబసద్ది అని వంట చేసుకుని తింటారు. పంపా తీరం నుండి 6 కిలోమీటర్ల దూరమైన నీలిమాల, అప్పాచి ఏడు కొండలు కొంచెం నడవడానికి ఇబ్బంది పెడతాయి. పంపలో స్నానం చేయగానే ఎరుమేలి నుండి నడిచి వచ్చిన శ్రమ పోతుంది.


భక్తి, వైరాగ్యం, నమ్మకం ముఖ్యం. ఇరుముడిలో ముద్రకాయలో నెయ్యభిషేకమంటే మన శరీరాన్ని, ఆత్మను స్వామివారికి అర్పించడమే ముఖ్య ఉద్దేశం. ఆ రోజులలో ఫోన్ సౌకర్యం కాని, సెల్ ఫోన్లు కాని లేకపోవడంతో మనసంతా స్వామివారిపైనే లగ్నమై ఉండేది. ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులకు ఇరుముడి కట్టుకుని బయలుదేరాక ఇంటికి వచ్చేవరకు క్షేమ సమాచారాలు తెలిసేవి కావు. భక్తితో ఇంట్లో కూడా పూజలు, భజనలు చేసేవారు. అందరిలోను భక్తి కనిపించేది. నేడు శబరిమలలో పక్కా వసతిగృహాలు, కాఫీ భోజన హోటళ్ళు, అన్నదాన సౌకర్యాలు వచ్చాక శబరిమల స్వరూపం మారిపోయింది. మినరల్ వాటర్ బాటిళ్ళు, కరెంట్ సౌకర్యాలు పెరగడంతో భక్తి సన్నగిల్లుతోంది. సెల్ ఫోన్స్ వచ్చాక శబరిమల యాత్రకు వచ్చినా సంసార జంజాటం తప్పకపోవడంతో భక్తి కొరవడుతోంది.