శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
నవవిధ భక్తి మార్గాలలో మొదటిది "శ్రవణం". దీనికి ఉదాహరణకు పరీక్షిత్తు మహారాజును చెప్పుకోవాలి. తను మునికుమారుని శాపం వలన ఎలాగైనా మరణిస్తానని తెలిసి భాగవత పారాయణ శ్రవణం వలన ముక్తిని పొందాడు. రెండవది "కీర్తనం". నిత్యం స్వామిని కీర్తిస్తూ శ్రీ మద్బాగవతాన్ని బోధ చేసి, ముక్తిని పొందినవాడు శుకబ్రహ్మ. మూడవది "స్మరణం". "రాక్షస కులంలో పుట్టినా, నారద మహర్షి ఉపదేశం వలన మహావిష్ణువు గొప్పదనం తెలుసుకుని నిరంతరం స్మరిస్తూ ముక్తిని పొందాడు ప్రహ్లాదుడు". నాలుగవది "పాదసేవనం". పాలకడలిని మధించినపుడు స్వామి కోసమే జన్మించిన శ్రీ మహాలక్ష్మి నిరంతరం స్వామి పాదాల వద్దే తన స్థానం అని తెలుసుకొని స్వామి హృదయంలో కొలువైంది. " ఐదవది "అర్చనం". పృథు చక్రవర్తి నిత్యం త్రికాలాలు స్వామిని అర్చించి స్వామిలో ఐక్యం చెందాడు. ఆరవది "నమస్కారం". అక్రూరుడు నిత్యం స్వామిని అర్చిస్తూ నిరంతరం తన నమస్కారముద్ర వలన ముక్తిని పొందాడు.
ఏడవది "దాస్యం". నిరంతరం తన మనసులో శ్రీ రామ నామం తప్ప మరియొకటి ఎరుగని హనుమంతుడు దాస్యం చేస్తూ "చిరంజీవి"గా మిగిలిపోయాడు. ఎనిమిదవది "ఆత్మనివేదన". వచ్చినది అసురాంతకుడని, తనకు మరణం తప్పదని, మూడడుగుల నేల కోసం వచ్చిన "వామనుడు"కి తన సర్వస్వం దానం క్రింద ధారపోసిన "బలిచక్రవర్తి" ఆత్మనివేదనగా తనను తాను సమర్పించుకున్నాడు. ఆ తర్వాత భవిష్యత్తు తరాలకు ఇంద్రపదవి చేపట్టటానికి సిద్ధంగా ఉన్నాడు. తొమ్మిదవది "సఖ్యత ". అర్జునుడు నిరంతరశ్రీ కృష్ణునితో సఖ్యత కలిగి ఉండడంతో మహాభారత యుద్ధంలో విజయం సాధించటం తెలిసిందే. ఈ నవవిధ భక్తి మార్గాలను మనం ఆచరిద్దాం. ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. .