తామస మన్వంతర గాథ

తామస మన్వంతర గాథ                                                                                                                                                                                            - కర్రి భాస్కరరావు


వేదకాలమున స్వరాష్ట్రుడను పేరుగల రాజు అనేక యజ్ఞములు చేసి జ్ఞాన సంపన్నుడై సంగ్రామములందు అపరాజితుడై జగద్విఖ్యాతి గాంచెను. సూర్యభగవానుడు అతనికి దీర్ఘాయువు ప్రసాదించెను. అతనికి నూర్గురు భార్యలుండిరి. సూర్యప్రసాదమున అతడు దీర్ఘాయువైనను, అతని భార్యలు యథా సమయమందు మృతి చెందిరి. అతని మంత్రులు, భృత్యులు కాలమునకు వశులై మృత్యువును పొందిరి. అందుచే ఉద్విగ్నుడై వీర్యహీనుడైన స్వరాష్ట్రుని పొరుగురాజైన విమర్ధుడు అనువాడు పదవీచ్యుతుని చేసెను. స్వరాష్ట్రుడు దేశమును విడిచి వనమునకు పోయి వితస్తా నది ఒడ్డున తపస్సు చేయ ప్రారంభించెను. ఋతువులలో కలిగిన మార్పులను కూడా లెక్కచేయక ఆరుబయట నిరాహారుడై తపస్సు చేయుచుండెను.


వర్షాకాలమందు ఒక రోజున నాలుగు వైపుల నుండి దట్టమైన మేఘములు కమ్ముకొని కుండపోతగా అంతులేకుండా వర్షించుటచే మహాజల సమూహములు ఏర్పడి నాలుగు దిక్కుల యందు అంధకారము వ్యాపించెను. తపస్సు చేయుచున్న రాజు నది ఒడ్డు నుండి జలప్రవాహము లోనికి లాగబడెను. అట్లు కొట్టుకొని పోవుచు ఒక ఆడుమృగము తోక చేతికి చిక్కగా దానిని ఆధారముగా పట్టుకొనెను. కొంతదూరము తర్వాత ఆ మృగముతో పాటు ఒడ్డుకు చేరుకొని ఒక మనోహరమైన వనమునకు చేరుకొనెను. అంధకారమందు ఆడులేడి తన తోకయందున్న నాడులతో రాజును స్పృశించసాగెను. స్వరాష్ట్ర రాజు కూడా ఆ అంధకారమున దాని స్పర్శచే కామాసక్త చిత్తుడై అత్యంత ఆనందమును పొందెను. ఒడ్డును చేరిన పిమ్మట రాజు దాని వీపును స్పృశించగా ఆ మృగము అతని అనురాగమును గ్రహించి ఇట్లు పలికెను. -


"ఓ రాజా! మీ స్పర్శ యొక్క భావమును గ్రహించితిని. అయోగ్యులయందు మీకు అనురాగము కలుగదు. నేను మీకు యోగ్యురాలినే. కాని మీతో సమాగమమునకు ఈ లోలుడు విఘ్నముగా నుండును". ఆ మాటలు వినిన రాజు ఆశ్చర్యముతో "నీవెవరవు? మృగమువై యుండి కూడ మానవ భాషలో ఎట్లు మాట్లాడుచున్నాడు. ఈ లోలుడు ఎవరు" అని ప్రశ్నించెను. బదులుగా మృగము, "రాజా! గత జన్మలో నేను దృఢధ్వజుని కుమార్తెను. ఉత్పలావతిని. మీ యొక్క నూరుమంది రాణులలో ప్రియతమ మహిషిని. నేను బాల్యావస్థలో ఉన్నపుడు సఖులతో కూడి ఆడుకొనుటకు వనము లోనికి వెళ్ళి ఆడు మృగముతో సంగమించుచున్న ఒక మృగమునూ చితిని. బాల్య చాపల్యముతో ఆ మృగములను కొట్టగా, ఆడు మృగము భయముతో పారిపోయెను. అపుడు ఆ మగమృగము క్రోధముతో తాను చేయుచున్న గర్భాదాన కార్యమును విఫలము చేసితివి గాన ఈ దుష్కార్యమును సహింపననెను. మనుష్యునివలె పలుకుచున్న ఆ మృగ వచనములు విని భయము చెంది "ఈ మృగ రూపమును మీరెట్లు పొందితిరని' అడిగితిని.


బదులుగా ఆ మృగము నేను నిర్వతి చక్షముని పుత్రుడను. సుతపుడనువాడను. నేను - మృగమును అభిలషించి మృగరూపమును ధరించి ఈ ఆడు మృగమును అనుసరించుచుంటిని. కాని నీవు ఆ మృగమునుండి వియోగము కలిగించితివి. అందుచే నీకు శాపమిచ్చెదనెను. నేను అజ్ఞానముచే అట్లు ప్రవర్తించితిని గాన శాపమీయవలదని వేడుకొంటిని. అట్లయిన నీవు నా యందు ఆత్మప్రదానము చేసినచో నీకు శాపమివ్వనని మునిపుత్రుడు పలికెను. అందుకు నేను అంగీకరించక, నేను మృగమును కాను. మీకు ఈ వనమందు ఇతర మృగములు లభించును. నాయందు ఈ అభిలాషను నివృత్తి చేసుకొనుడు. అంతేకాక తండ్రి చాటు కన్యనగు నేను ఏవిధముగ నిన్ను స్వయముగ వరించగలను? అతడు ఈ మాటలు విని క్రోధముతో "నేను మృగమును కాను అని నీవు పలికితివి గాన నీవు మృగమగుదువని నన్ను శపించెను. పలుమారులు వేడుకొనిన పిమ్మట అతడు కొంత ప్రసన్నత కలిగినవాడై నా శాపమునే వరముగ మార్చెను. - "నీవు మరణించిన పిదప ఇదే వనములో మృగమయ్యెదవు. అప్పుడు సిద్ధవీర్యుడగు ఎవరేని ముని యొక్క పుత్రుడు మహాబాహు లోలుడు నీ గర్భమునుండి జన్మించును. ఎప్పుడు ఆ లోలుడిని గర్భమందు పొందుదువో, నీకు పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తికి వచ్చి మనుష్యుల వలె పలుకగలవు అనెను. అంతేకాదు ఆ మహాబాహువును కన్నందున నీవు శాపము వీడి పతిద్వారా పుణ్యలోకములు పొందుదువు. తదనంతరము ఆ మహావీర్యవంతుడగు లోలుడే తండ్రి శత్రువులను జయించి మనువుగ ప్రసిద్ధి చెందును". ఈ విధముగ నాకిచ్చిన శాపమును శమింపచేసెను. "ఓమహారాజా! నేను ఈ విధముగ మునిశాపమువలన ఆడు మృగముగ పుట్టితిని. నీస్పర్శ తగలగనే నా గర్భమందు లోలుడు జన్మనందెను. అందుచేతనే మీ సమాగమందు గర్భసితుడైన లోలుడు విఘ్నము కలుగజేయునని చెప్పితిని. ఆ తరువాత ఆ మృగము శాపవిముక్తురాలై స్త్రీ రూపము పొంది సలక్షణ యుక్తుడగు పుత్రుని ప్రసవించెను. - ఆ సమయమందు వనములోని సకల ప్రాణికోటి ఆనందము పొందెను. ఋషులందరు వచ్చి ఆ బాలకుని భవిష్యత్తుని దర్శించిరి. జగత్తు యొక్క అంధకారము ద్వారా ఆవృతుడై ఇతడు తామసీయోనిని పొందిన తల్లి గర్భము నుండి జన్మించిన ఈ బాలకుడు 'తామస' అను పేరుతో విఖ్యాతి పొందును. ఆ బాలుడు ఋషుల ఆశీస్సులతో వనమునందే పెరిగి పెద్దవాడై తన తండ్రి ద్వారా తన జన్మవృత్తాంతము తెలిసికొనెను. తండ్రియగు స్వరాష్ట్రుడు తన రాజ్యపదవీ భ్రష్టత్వము, తపస్సుతో కూడిన తన గత చరిత్రను వివరించెను. తామసుడు తాను కూడ తండ్రి వలె సూర్యుని ఆరాధించి నివర్తన మంత్ర సహితముగ వివిధ దివ్యాస్తములను పొందెను. వాటి ప్రయోగముచే శత్రువులను జయించి తండ్రి వద్దకు తెచ్చి అతని ఆజ్ఞచే వారిని విడిచిపెట్టి తన ధర్మము రక్షించుకొనెను. తండ్రి మరణానంతరము తామసుడు రాజయ్యెను. అతడికి నరక్షాంతి, శాంత జాను, జంఘు మొదలగు మహాబలపరాక్రమవంతులగు పుత్రులు కలిగిరి. ఆ వంశము వారందరు రాజ్యము చేసినంతవరకు, ఆ కాలము 'తామస మన్వంతరము'గా ప్రసిద్ది చెందినది. నాల్గవదగు తామస మన్వంతర గాథ వినినవారు జ్ఞానలాభమును పొందెదరు.