సంపాదకీయం ...... మేము మీ దాసులము..

సంపాదకీయం ...... మేము మీ దాసులము..


శ్రీ వేంకటేశం పాఠకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన ప్రభు తిరుమశ్రీ వేంకటేశ్వరుని కృపచే అందరూ ఆయురారోగ్యాలతో జీవించుచు, నిశ్చలమైన, ఆనందదాయకమైన మనస్సును కలిగి, అది సదాశ్రీ వేంకటేశ్వరుని యందే నిలుచునట్లుగా, ఆయన మనలను కటాక్షించగలరని ఆశించుచున్నాను. శ్రీ వేంకటేశం మాసపత్రికకు కూడా ఇది నూతన సంవత్సరము. ఈ పేరుతో ఈ పత్రికను ప్రారంభించి 13 సంవత్సరాలు కావచ్చుచున్నది. 2007 ఉగాది నుండి "నమో వేంకటేశాయ" అను పేరుతో ప్రారంభమైన ఈ పత్రిక 2008 జనవరి నుండి శ్రీ వేంకటేశం"గా పేరు మార్పు చెంది ప్రచురింపబడుచున్నది. భగవంతుని యొక్క ఈ సృష్టిలో మానవులు కూడా ఒక భాగమే. ఈ సృష్టిలోని సమస్త సంపద, చరము, అచరము, సర్వప్రాణులు, సమస్తము లోకేశ్వరుడైశ్రీ వేంకటేశ్వరునిదే. ఈ సృష్టిలో మనకంటే ముందే ఉన్న ఈ సంపద కాలానుగుణంగా కొంత కొంత భాగం ఒకరి దగ్గర నుండి మరొకరికి మారుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. దీనినెవ్వరూ ఆపలేరు. లేదా సాధించలేరు. అంతశ్రీ వేంకటేశ్వరుని దయపైననే ఆధారపడి ఉంటుంది. కాని యోగమాయ ప్రభావం వలన ఈ సంపద మన కష్టార్జితమువలననే సాధించుకున్నట్లు కనబడుచు అట్టి సంపదపైన వ్యా మోహాన్ని పొంది 'నా' అన్నదానికి బానిసై విచక్షణను కోల్పోయి చెడు పనులను చేయుచు "నాది" నేను అనే భావంతో దైవత్వానికి దూరమై, శ్రీ వేంకటేశ్వరుని కృప వలన పొందిన ఈ మానవ జన్మ పరమార్థమును వ్యర్థము గావించుచున్నాము.


నిజానికి మనం శాశ్వతం కాదన్న విషయం, ఏ క్షణంలోనైనా జీవి నశించునన్న విషయం మనకు బహు బాగా తెలిసినప్పటికీ జీవి "నా" అన్నదాని నుండి బయటకు రాలేకపోవుచున్నాడు. అందుకే మానసిక ప్రశాంతతను కోల్పోవుచు, తప్పుల మీద తప్పులు చేయుచు జన్మ చక్రబంధం నుండి బయటకు రాలేకపోవుచున్నాడు. ఇది క్రొత్త సంవత్సరము. నూతన ఆలోచనా ప్రక్రియను ప్రారంభించే సమయము. మన ఆయుస్సు, భూమిపై నివసించే రోజులలో ఒక సంవత్సరం తగ్గిపోయిందని గుర్తుంచుకోవాలి. ఈ మిగిలిన సమయమందేశ్రీ వేంకటేశ్వరుని సాధనకై ప్రయత్నించాలి. ఆయన చెప్పిన విధంగా ప్రవర్తించాలి. మంచిని గ్రహించాలి. "నా" అన్న దానినుండి సంపూర్ణంగా బయటికి రావాలి. మనమెవ్వరమన్న విషయాన్ని గుర్తించాలి. రోజులు గడిచిన కొద్దీ భగవదారాధన సమయము తగ్గుతుంది. కావున కాలాన్ని వృధా చేయరాదు. ప్రతిక్షణం, క్షణం క్షణశ్రీ వేంకటేశ్వరుని స్మరిస్తూ, ఆరాధిస్తూ ఆయన గుణగణములను పొగుడుచూ మనకున్న సర్వసంపద, భార్యాబిడ్డలు, బంధువులు, మిత్రులు, ఇల్లు, పొలాలు సర్వము ఆయనవేననే సంపూర్ణ విశ్వాసంతో జీవించాలి. కేవలం ఆయన కరుణా కటాక్షాలతోనే ప్రతిరోజు జీవించుచున్నామన్న జ్ఞానం కలిగి ఉండాలి. మనము సర్వులము ఆయన సొతు. మనదంటూ ఈ లోకంలో ఏదీలేదు. నేను నీవాడను, నీవు నావాడివి, నీకు నాలాగ ఎంతోమంది ఉన్నారు. కాని నాకు మీరు ఒక్కరే. మీరు తప్ప ఇతరులను ఎరుగను. కావున దయతో మమ్ములను కరుణించమని వేడుకోవాలి. 'నేను', 'నాది' అనువానిని వదలి 'మీరే' నావారు. నేను "నీవాడిని" అనే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మా ప్రభువు శ్రీ వేంకటేశ్వరుడు అందరినీ ఆదరిస్తాడని ఆశిస్తున్నాను. ఏ దిక్కూ లేని మాకు జన్మనిచ్చావు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, మిత్రులతోపాటు ఆస్తి అంతస్తులనిచ్చి ఇంతవరకు సుఖానిచ్చావు, ఇప్పటివరకు మేము చేసిన తప్పులను క్షమించి ఇప్పటి నుండి మమ్ము నీ దాసులుగా స్వీకరించి మా శేష జీవితమును మీ సేవకై వినియోగించే అవకాశం ఇవ్వమని ప్రార్థిద్దాం.  వినా వేంకటేశం న నాథో న నాథః | సదా వేంకటేశం స్మరామి స్మరామి||


 శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు


                   - పుల్లగూర్ల సాయిరెడ్డి గోవిందదాసు)