మోజు మోక్షసన్నా స యోగం
సర్వభావన అంటే అంతర్యామియైన పరమాత్మను పూర్ణమనస్సుతో శరణాగతి చేయాలని అంటారు కొందరు. మాయను దాటటానికి అన్నివిధాల శరణు పొందటం శ్రేయస్కరం అన్నారు కొందరు. తమేవ పరమేశ్వరునే శరణు పొందాలి. చిల్లర దేవతలను శరణు పొందితే అల్పఫలమే లభిస్తుంది. సంపూర్ణ సిద్ది కాని, పరమపదం కాని, శాశ్వతశాంతి కాని లభించదు. సర్వభావేనా అంటే తొమ్మిది రకాల సంబంధాలు చెప్పారు కొందరు.
1. పితృ పుత్ర భావం - పరమాత్మయే సర్వజీవకోటికి తండ్రి. జీవులందరూ ఆ స్వామి సంతానం. 2. రక్ష్య రక్షక భావం - పరమాత్మయే సర్వప్రాణి రక్షకుడు. సంసార సముద్రంలో మునిగిపోకుండా మనల్ని రక్షిస్తాడు. 3. శేష శేషి భావం - స్వప్రయోజనాలకు కాకుండా లోకహితం కోసం ఉపయోగపడేదాన్ని శేషం అంటారు. ఏది ఉపయోగం పొందుతుందో అది శేషి. ఇక్కడ పరమాత్మ శేషి.జీవుడుశేషం. తనకోసం కాకుండా ఆ స్వామి సేవకై ఉపయోగపడేవాడు జీవుడు. రాముడు శేషి. లక్ష్మణుడు శేషం. నాది నాకోసం అని కాకుండా భగవదాజ్ఞగా పరమాత్మప్రీ త్యర్థం కర్మాచరణ చేస్తున్నాం మనం. కనుక మనం శేషం. పరమాత్మ శేషి. శేషభూతులైన మన బాగోగులు యోగ క్షేమాల భారం ఆ స్వామిదే కదా.
4. భర్త భార్యా భావం - చేతనా చేతనాత్మకమైన ప్రాణుల్ని, అండ పిండ బ్రహ్మాండాలను భరిస్తున్నాడు పరమాత్మ. కనుక భగవంతుడు భర్త. సర్వప్రాణికోటి స్త్రీ స్వరూపం. జీవులమైన మనం పరతంత్రులం. పరమాత్మ ఒక్కడే సర్వ స్వతంత్రుడు. పరమాత్మ ఒక్కడే పురుషుడు. సర్వజీవులన్నీ స్త్రీత్వం కలిగి ఉంటాయని లోగడ మీరాబాయి ఉదంతంలో చెప్పుకున్నాం.
5. జ్ఞాతృజ్జీయభావం - ప్రపంచంలో ఎన్నోపనికిమాలినవాటిని తెలుసుకోవాలని ఆరాట పడుతున్నాం. మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడని తెల్సుకోవాలి. అలా ఆత్మజ్ఞానంతో తెల్సుకోదగినవాడు పరమాత్మ.
6. స్వ స్వామి భావం - సకల ప్రాణికోటి పరమాత్మ సొత్తు. ఆయన స్వామి. నేనాయన సొమ్ము అన్న భావం కల్గి ఉండాలి.
7. ఆధార ఆధేయ భావం - మత్ స్థాని సర్వభూతాని - (9-4) సర్వభూతాలు జగదాధారుడైన జగన్నాథునిపై ఆధారపడి ఉన్నాయి. మనం ఆ స్వామిపై ఆధారపడి ఉన్నాం.
8. శరీరాత్మ భావం - ఆత్మలు పరమాత్మకు శరీరం లాంటివి. మమైవాంశో జీవలోకే (15-7) అన్నాడు. పరమాత్మ లేకపోతే ఆత్మలుండవు. భగవానునికి నేను శరీరం. నాకు పరమాత్మ ఆత్మ.
9. భోక్త భోగ్య భావం - సర్వ యజ్ఞాలకు భోక్తను ప్రభువును నేనే. అహంహి సర్వ యజ్ఞానాం భక్తాచ ప్రభురేవచ (9-24) అన్నాడు. కనుక ఫలభోక్త మనం కాదు. పరమాత్మయే. ఈ తొమ్మిది రకాలసంబంధ జ్ఞానం సర్వభావేన అన్నశబ్దానికి వ్యాఖ్యానంగా చెప్పవచ్చు అన్నారు పెద్దలు. అంతర్యామియైన శ్రీ మన్నారాయణుని గుర్తించగలవాడు భగవదనుభవంలో నిమగ్నుడై ప్రశాంతిని పొందుతాడు.
ఈ తొమ్మిది రకాలసంబంధ జ్ఞానం సర్వభావేన అన్నశబ్దానికి వ్యాఖ్యానంగా చెప్పవచ్చు అన్నారు పెద్దలు. అంతర్యామియైన శ్రీ మన్నారాయణుని గుర్తించగలవాడు భగవదనుభవంలో నిమగ్నుడై ప్రశాంతిని పొందుతాడు.
చేసే ప్రతిపనిలో ప్రతి సేవలో పరమాత్మపై మభాన నింపటమే చాలు. అది సర్వభావాలకి సమానం అంటారు కొందరు. మనో బుద్ధీంద్రియాలను పరమాత్మ వైపు పయనింపచేయటమే సర్వభావన అంటారు కొందరు. అహంకారం దర్పం క్రోధం ఇత్యాది అసుర సంపత్తి నుంచి దూరమై దైవీసంపత్తితో పరమాత్మ ఒక్కడే పరమగతి అని భావించటమే సర్వభావన అంటారు కొందరు. తిరుగలి రాయిని గుంజని చేరిన గింజలు కలిగి పిండి కావు. అలాగే నీ పాదమే శరణు అని సర్వవిధ భావనలన్నీ నీవే స్వామి అని భగవంతుని ప్రార్థించటం వల్ల ఈ మాయా చక్రబంధం నుంచి విముక్తి ఖాయం. కంచిలోని వరదరాజస్వామి వారికి వింజామర వీస్తూ సేవలు చేసే మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఒక వైశ్యుడు. పేరు కాంచీపూర్ణులు. తిరుక్కచ్చినంబి అని కూడా పిలుస్తారు ఆయన్ని. ఆ పరమ భాగవతుని తన గురువుగా భావించి గౌరవించాడు భగవద్రామానుజులు. కంచి వరదుని మీద దేవరాజ అష్టకం సంస్కృతంలో విరచించాడు తిరుక్కచ్చినంబి. అందులో చివరి శ్లోకం - త్వదీక్షణ సుధా సింధు.... అన్న శ్లోకభావం ఇది. స్వామీ నీ కన్నుల్లో కృపారసం నిండి ఉంది. నీ కరుణా కటాక్ష వీక్షణాల్ని ఒక్కసారి నా వైపు ప్రసరింపచెయ్. చాలు. తక్షణమే నాలో ఉన్న దోషాలన్నింటినీచూ పులు కడిగివేస్తాయి అని ప్రార్థించేవారు. కాంచీపూర్ణులు.
తత్ ప్రసాదాత్ ఆ పరమాత్మ కృపా కటాక్షం వల్ల పరాం శాంతిం శాశ్వతస్థానం మోక్షాన్ని ప్రాప్యసి పొందుతావు. పధ్నాలుగు లోకాల్లో ఎక్కడికి పోయినా తిరిగి భూమ్మీదికి రావాలి. మళ్ళీ జన్మ ఎత్తాలి. కాని ఒక్కసారి పరమపదం చేరితే పునర్జన్మ ఉండదు. తిరిగిరాని స్థితి. జాతి మతం కులం స్త్రీ పురుష పశు పక్షి తేడా లేకుండా ఎవరైనా అక్కడికి చేరవచ్చు. అదే పరమధామం. అదే మోక్షం. పరమశాంతి అక్కడే. దుఃఖరాహిత్యం అక్కడే. శాశ్వతస్థానం అదే. అక్కడికి చేరాలంటే మనం చేయాల్సినదల్లా ఒక్కటే. ఈశ్వరునికి శరణాగతి చాలు. అంతే. ఇపుడు భగవద్గీతకు ముక్తాయింపు పలుకుతూ ఈ గీతా శాస్త్రం లేదా జ్ఞానధనం అతి రహస్యమైందంటున్నాడు భగవానుడు.
ఈవిధంగా రహస్యాల్లోకెల్లా పరమ రహస్యమైన గీతాతత్వం జ్ఞానం) నీకు చెప్పాను. దీన్ని పూర్తిగా విచారణ చెయ్. బాగా ఆలోచించు. తర్వాత నీకిష్టమైనట్లు ఆచరించు. - ఇతి అనేది సంస్కృత భాషలో ముగింపును సూచించే శబ్దం. రెండో అధ్యాయం పదకొండో శ్లోకంలో మొదలై ఇక్కడితో భగవానుని ఉపదేశం ముగిసిందని భావించాల్సి వస్తోంది. ఇది గుహ్యాత్ గుహ్యతరం అన్నాడు. అంటే రహస్యాల్లోకెల్లా పరమ రహస్యమైనదని అర్థం. 15వ అధ్యాయంలో కూడా ఇతి గుహ్యతమం శాస్త్రం అన్నాడు. తమః ప్రత్యయం ప్రయోగించాడు. గీతాశాస్త్రం 15వ అధ్యాయంతో ముగిసిందని కొందరి అభిప్రాయం. అలాకాదు 18వ అధ్యాయం 63వ శ్లోకంతో ముగిసిందని మరికొందరి అభిప్రాయం. ఆ గొడవలో తల దూర్చకుండా గీతాశాస్త్రం గుహ్యతమం అన్నాడు కదా అదేమిటో ఆలోచిద్దాం. భగవద్గీత కొన్ని చోట్ల గుహ్యం అని పరమగుహ్యం అని ఇలా కొన్ని శబ్దాలు ప్రయోగింపబడ్డాయి. వేదాల్లో చివర ఉండేవి ఉపనిషత్తులు. వేదం అంతంలో ఉంటున్నాయి కనుక వేదాంతం అని పిలువబడ్డాయి. వాస్తవానికి ఉపనిషత్ విద్య రహస్య విద్య అంటారు పెద్దలు. ఈ భగవద్గీత కూడా ఉపనిషత్ సారమే కదా. అందుకే అక్కడక్కడ తమః ప్రత్యయంతో కూడిన గుహ్యం అన్న శబ్దం గీతలో ప్రయోగింపబడింది. -
తత్వబోధకు పరమ రహస్యమైన శాస్త్రం వినటానికి అర్జునుడు అధికారి. యోగ్యుడు. అందుకే గీతోపదేశం చేసిన కృష్ణభగవానుడు అంటున్నాడు. అర్జునా ఇంతవరకు కర్మ ధ్యాన భక్తి జ్ఞాన యోగాలు నీకు వివరించాను. నేను చెప్పిందే చేసి తీరాలని నీమీద నా పెత్తనం ఉండదు. నీ భావ స్వేచ్ఛకు అడ్డురాను. నీ వ్యక్తిత్వాన్ని భంగపరచను. విమృశ్య - నిశితంగా విచారణ చేసుకో. ఆలోచించుకో. తర్వాత యథా ఇచ్ఛసి తథా కురు - నీకేది ఇష్టమో ఆ రీతిగా చెయ్. చెప్పటమే నా వంతు. నా విధి. నా ధర్మం. నిర్ణయం నీ పని. చేయాల్సింది నువ్వే. పూర్వం గురుకులాల్లో గురువు శిష్యులకు అలాంటి స్వేచ్ఛను ఇచ్చేవాళ్ళు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకునేవారు శిష్యులు. గుర్రాన్ని నీటితొట్టి వరకు తీసుకెళ్తాడు రౌతు. నీళ్ళు తాగాల్సింది గుర్రమే. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః | ఇషోసి మేదృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ || 64 అర్జునా రహస్యాలన్నింటిలోకి రహస్యమైన శ్రీ భ్రమైన మాటల్ని విను. నీవు నాకప్రీ తిపాత్రుడవని నీ హితాన్ని కోరి మళ్ళీ చెబుతున్నాను. పరమ రహస్యమైంది భక్తి శాస్త్రం. సర్వకర్మలు జ్ఞానంతో కలిసి పోతాయని చెప్పినప్పటికి భక్తిని మించింది లేదని తమ అనుభవజ్ఞానంతో తేల్చి చెప్పారు సాధకులు. నారదమహర్షి భక్తి సూత్రాలు రచించాడన్న విషయం మనం మరువరాదు. 63వ శ్లోకంలో గుహ్యాత్ గుహ్యతరం అన్నాడు. ఇక్కడ సర్వగుహ్యతమం అన్నాడు. గుహ్యం గుహ్యతరం గుహ్యతమం ఇది ఆర్డర్. తమః ప్రత్యయం ప్రయోగించబడింది అంటే అంతకు మించిన పరమ రహస్యం మరొకటి లేదని అర్థం. అత్యంత రహస్యమైన విషయం కనుక మళ్ళీ మళ్ళీ చెప్పడంలో దోషం లేదు. పదో అధ్యాయం మొదట్లో భూయ ఏవ శృణు మే పరమం వచః - మహాబాహూ అర్జునా నీ హితాన్ని కోరి నేను మళ్ళీ చెబుతున్నా విను అన్నాడు.
షట్ శాస్త్రాలున్నాయి. తర్కశాస్త్రం, వ్యాకరణశాస్త్రం, వైద్యశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ధర్మశాస్త్రం, మీమాంసశాస్త్రం. ఇవికాక న్యాయశాస్త్రం, వాస్తుశాస్త్రం, పాకశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే భక్తి శాస్త్రాన్ని మించిన గొప్పది ఏదీ లేదని భగవానుని అభిప్రాయం. అందుకే భూయః శృణు మళ్ళీ విను అంటున్నాడు. యాజ్ఞవల్క్యుడు కూడా తన భార్య . యికి బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తూ ఇదం శ్రుణు మళ్ళీ విను అని ఎన్నోతత్వరహస్యాలు చెప్పాడు. ఇక్కడ భగవానుడు మళ్ళీ మళ్ళీ విను అన్నాడు. ఎందుకని ప్రశ్న. యుద్ధం చేసి విజయం సాధించి రక్తపుకూడు తినలేనన్నాడు. అర్జునుడు. క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయాలి. పాపం మూటకట్టుకోవని హామీ ఇచ్చాడు భగవానుడు. అయినా మిన్నకున్నాడు పార్థుడు. నీవు చంపకపోయినా నీ ప్రవృత్తి ఆ పని చేయిస్తుందన్నాడు. దానికి జవాబు లేదు. నన్ను నమ్మినవాడు చెడిపోడు. నాపై భారం వుంచు. నేను చూ చుకుంటా అన్నాడు. ఆ లేదు ఊ లేదు. ఉలుకు పలుకు లేకుంఆ ఉన్నాడు శిష్యుడు. గురువుగారికి కోపం రాలేదు. చెడిపోతాడని బాధ. శిష్య వాత్సల్యంతో మళ్ళీ చెప్పసాగాడు. అర్జునుడు అంత తెలివితక్కువవాడు కాదు. అతన్ని సాకుగా పెట్టుకుని మన స్థాయికి దిగివచ్చి మళ్ళీ చెప్పడం మనకోసం అని మరచిపోకూడదు.
ఏ మతాలు పుట్టని కాలం పుట్టింది భగవద్గీత. కర్మజన్మ చక్రబంధం నుంచి సర్వమానవ జాతిని ఉద్దరించాలని భగవానుని సంకల్పం. ఒక్క మానవ జాతికే కాదు సర్వభూత హితేరతాః (5-25) అన్న మహోదాత్త భావన పరమాత్మది. విముఖులమైన మనల్ని ఉదాసీనులమై ఉన్న మనల్ని పాపపు రొంపిలో మునగానాం తేలానాంలా ఉన్న మనల్ని పైకెత్తి తనవైపు లాక్కోవాలని భగవానుని తాపత్రయం. అందుకే మళ్ళీ మళీ విను అంటూ రెండు శ్లోకాల్లో మోక్షానికి చాలా పుతున్నాడు. మన్మనా భవ మద్భకో మద్యాజీ మాం నమస్కురు | 2 మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో7సిమే || 65 నీ మనస్సు నాలో నిలుపు. నా భక్తునిగా ఉండు. నన్ను పూజించు. నాకు నమస్కరించు. అలా చేస్తే నన్నే పొందగలవు. అర్జునా నీవు నాకెంతో ప్రియమైనవాడివి గనుక ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. ఇది సత్యం. ఈ శ్లోకంలో అయిదు ముఖ్య విషయాలున్నాయి. 1. నీ మనస్సు నాకిచ్చెయ్ 2. నామీద భక్తి పెంచుకో 3.నన్ను పూజించు 4. నాకు నమస్కరించు. ఈ నాల్గింటి ఫలితం భగవదైక్యం అయిదోది.
గత శ్లోకంలో అర్జునుడు తనకిష్టమన్నాడు. ఇపుడు ఇక్కడ ప్రియమైనవాడన్నాడు. ఇష్టం ప్రియం రెండూ ఒకటిగా తోచినా ప్రియం శబ్దం కాస్త గొప్పదిగా కనబడుతుంది. అదొక పొగడ్త కాదు. ఒక సర్టిఫికెట్. అలా భగవానుని నోట ఇష్టుడని ప్రియుడని రావడం అది అర్జునుని అదృష్టం. బ్రహ్మాది దేవతలకు సనక సనందాది మహర్షులకు లభ్యం కాని విశ్వరూపాన్ని దర్శించాడు అర్జునుడు. అతడంటే కృష్ణభగవానునికి ఎంత ఇష్టమో చెప్పటానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. ఎవరికీ అబ్బని గీతోపదేశం ఉండనే ఉంది. అసలు రహస్యం వివరిస్తే కృష్ణార్జునులు నరనారాయణులే కదా. వన విహారాదుల్లో, భోజన శయ్యాసనాదుల్లో ఇద్దరూ కలిసే ఉండేవారు. అర్జునుని చంపటానికి నాగాస్త్రం శక్తి ఆయుధాలు కర్ణుని దగ్గర ఉన్నాయి. వాటిని భగ్నం చేసేవరకు కృష్ణుని మనసు మనసులో లేదు. నాగాస్త్ర ప్రయోగంలో రథాన్ని అయిదు అంగుళాలు నేలలో దిగబడేట్లు చేశాడు. శక్తి ఆయుధం ఘటోత్కచుని చంపేసింది. భీముని కొడుకు చనిపోయినందుకు అందరూ ఏడుస్తుంటే అర్జునునికి మృత్యుభయం లేదని ఆనందంతో నృత్యం చేశాడు కృష్ణుడు. ఇష్టుడు ప్రియుడు అనడం కంటే అర్జునుడు కృష్ణునికి ఆరోప్రాణం అనడం సమంజసం.
కృష్ణుని పట్ల అర్జునుడు అలాగే బావా బావా అంటూ ఎంతో ప్రియ సఖునిలా ప్రవర్తించాడు. కృష్ణ నిర్యాణమైంది. ద్వారక సముద్రంలో మునిగిపోకముందే కృష్ణుని భార్యలను ధనరాశులను హస్తినకు తరలిస్తున్నాఉ అర్జునుడు. బోయలు వచ్చారు. ధనరాశుల్ని దోచేశారు. అర్జునునికి దివ్యాస్త్రాలు దివ్యశక్తులు అంతరించిపోయాయి. గాండీవం చుట్టుముట్టినవారిని మోదాడు. అష్టమహిషులను రక్షించాడు. ఆ సమయంలో ధర్మరాజుతో అతడన్నమాటలు - మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుడు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియెశ్రీ కృష్ణుని అర్జునుడెంతగా ఆరాధించాడో పై మాటల వలన తెలుస్తోంది. ఇలాంటి శ్లోకమే తొమ్మిదో అధ్యాయం చివర్లో కొద్ది తేడాలో ఉంది. ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు అదనంగా చేర్చబడింది అంతే. కృష్ణుడునికి అచ్యుతుడని పేరు ఉంది. చ్యుతం కానివాడు. తను జారిపోడు. తనని ఆశ్రయించిన వాళ్ళని జారిపోనీడు. తను సత్యం. తన మాట సత్యం. తన ప్రతిజ్ఞ సత్యం. యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు. పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు భీష్మపితామహుడు. తన ప్రతిజ్ఞని భంగపరచుకొని భక్తుని ప్రతిజ్ఞ నెరవేర్చిన భక్తవత్సలుడు భక్తప్రియుడు కృష్ణ భగవానుడు. - మన్మనాభావ - నాలోనీమనస్సుని ఉంచు.లేదా సమర్పించు. మచ్చిత్తా మద్దత ప్రాణాః 10-9 లో అన్నాడు. అహర్నిశలు భగవంతుని మీదే మనస్సు లగ్నం చేయాలి. భగవదర్పితం కాకుండా ప్రాపంచిక విషయ సుఖాలపై మనస్సు నిలిపితే అది దుఃఖభూయిష్టం. బంధ కారకం. అలౌకికమైన పరమాత్మపై నిలిపితే ఆ ఫలం అనల్పం. శాశ్వతానందం. - చంచలం అస్థిరం మనః 6-26లో అంటాడు అర్జునుడు. మనస్సు చాలా ప్రమాదకరమైంది. నమ్మరాని చుట్టం. ఎంతటివాడినైనా యోగభ్రష్టుని చేయగలదు. మనయేవ మనుష్యాణాం. కారణం బంధమోక్షయోః అన్నారు పెద్దలు. రజో తమో గుణాల సంపర్కంతో బంధం - శుద్ధ సత్వ గుణంతో మోక్షం. భూమి లోపల అపార నిధి ఉందని తెల్సింది. పలుగు పారా పట్టుకు రావాలి.నడుం వంచాలి. తవ్వాలి. తవ్వుతున్న కొద్దీ మట్టి వస్తుంది. విసుగు విరామం లేకుండా శ్రమించాలి. అపుడే దానికి తగిన ఫలం లభిస్తుంది. అయితే మనసు మొండికేస్తుంది. మన మాట వినదు. పట్టునుంచి తప్పించుకొని పారిపోవాలని చూ స్తుంది. కొంచెం సడలించినామో ఇంతే సంగతులు. మనస్సు మనకు అందకుండా పోతుంది. పాదరసంలా పట్టుకుంటే జారిపోయేలా ఉన్న మనస్సుని నిగ్రహించుకో. తర్వాత నాకు సమర్పించుకో అంటున్నాడు.
మనస్సు పట్టుతప్పి పోతోంది అంటావా, భక్తుడివి కాలేవా అంటున్నాడు. దేవుడా నాకేం తెలియదు. పాల ముంచినా నీవే, నీట ముంచినా నీదే భారం అంటూ శరణాగతి చేయలేవా. నీ పాదమే శరణని భజించలేవా. అది సాధ్యం కాదా, పోని పత్రమో పుష్పమో ఫలమో పట్టుకొచ్చి నాకు సమర్పించు. నా పాదాలపై ఉంచు. కృష్ణాష్టకమో రామాష్టకమో చదువుతూ పూజించు.
పండ్లు పూలు కొనుక్కురావాలంటే ఖర్చు కదా. పైసా కూడా నాకోసం ఖర్చు పెట్టలేనంటావా నాకు ఒక్కసారి నమస్కరించు. రెండు చేతులెత్తి నమస్కారం చేయడం ఒక పద్ధతి. సాష్టాంగ నమస్కారం చేయడం రెండోది. మనస్సు బుద్ది అహంకారం అణగిపోయేలా తలవంచి అంజలి ఘటించడం మూడోది.. బద్దేనాంజలినా నతేనశిరసా..... అంటాడు కులశేఖరాళ్వార్లు. చేతులతో అంజలి ఘటించాలి. తల వంచి నిలబడాలి. శరీరంలోని ప్రతి అణువూ గగుర్పాటు చెందాలి. కంఠం గద్దదం కావాలి. స్వామీ నా అపచారాల్ని దోషాల్ని క్షమించు అని ప్రార్థించడంలో మనకు తెలియకుండా కన్నుల్లోంచి కన్నీరు కారిపోవాలి. ఈ దీనునికి నీ పాదపద్మాలు అనే అమృతం పానం చేయగల బతుకును ప్రసాదించు అని ఆ శ్లోకం భావం. - ఒక్కసారి కృష్ణునికి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేయటంతో సమానమట. అన్ని చేసి పుణ్యలోకాలకు వెళ్ళినా మళ్ళీ కర్మజన్మ బంధం తప్పదు. కాని కృష్ణునికి ప్రణమిల్లితే పునర్జన్మ ఉండదట.
భగవంతునికి మనం చేసే సేవలు నాలుగు రకాలు. 1. ఔపచారికాలు - అర్చామూర్తిని తాకకుండా చేసే సేవలు. వింజామరతో విసరడం, కర్పూర నీరాజనం సమర్పించడం. 2. సాంస్పర్శికాలు - దివ్యమంగళ విగ్రహాన్ని తాకి తిరుమంజనం (స్నానం) చేయించడం, బొట్టు తిలకం దిద్దడం, చందనం పూయడం, పూలతో అలంకరించడం. 3. అభ్యవహారికాలు - పాలు, అన్నం, పప్పు కూరలు, తినుబండారాలు, ద్రాక్ష జీడిపప్పు వగైరాలు నైవేద్యం సమర్పించడం. 4. సాందృష్టకాలు - స్వామికి కుడివైపుకి కూర్చుని కాని నిలబడి కాని ధూపం సమర్పించడం. దీపం దర్శింప చేయడం. స్వామికి అటు ఇటు రెండు వైపులా దీపారాధన చేసి ఉంటాం. అవి కాకుండా విడిగా మరొక ప్రమిదలో వత్తులు నూనె వేసి వెలిగించి ఉంచాలి. దీపం దర్శయామి అన్నపుడు ఆ ప్రమిదని ఎత్తి స్వామికి పాలి. .
ఈ 65వ శ్లోకాన్ని విపర్యంగా అంటే వెనక్కి తిప్పి చదివితే మరోవిధమైన అన్వయం వస్తుంది. ముందు నాకు నమస్కరించు. అలా ప్రతినిత్యం నమస్కారం చేస్తుంటే నన్ను పూజించాలనిపిస్తుంది. అందుకోసం పూలు తీసుకురావడం, అలంకరించం, నామావళి చదవడం జరుగుతుంది. అలా స్వామిని సేవిస్తూ రాగా క్రమేణా భక్తి కుదురుతుంది. నిరంతరం భక్తి తత్పరతతో మనస్సుని భగవదర్పితం చేయగల సిద్ధి చేకూరుతుంది. అలా సాధన చేయగ అనన్య చింతనతో భగవత్ సన్నిధి చేరటం ఖాయం. మనస్సు నాకు సమర్పించు అనేది జ్ఞాన యోగానికి, భక్తుడవు కావాలి అనేది భక్తి యోగానికి, నన్ను పూజించు అనేది కర్మయోగానికి చెందుతాయని భావించాలి.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణ వ్రజ | అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || 66 అర్జునా సమస్త ధర్మాల్ని విడిచి నన్ను ఒక్కడినే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. శోకించవద్దు. రెండో అధ్యాయం పదకొండో శ్లోకం నుంచి పద్దెనిమిదో అధ్యాయం 66వ శ్లోకం వరకు గీతామృతం అందించాడు భగవానుడు. కనుక ఇది భగవానుని ఉపదేశంలో కట్టకడపటి శ్లోకం. చరమశ్లోకం అని కూడా అంటారు. అర్జునుని విషాద యోగంలోని 47 శ్లోకాలు, సాంఖ్యయోగంలోని 10 శ్లోకాలు వెరసి మొత్తం 57 శ్లోకాలు భగవద్గీతకు పూర్వపీఠిక. 18వ అధ్యాయం 67వ శ్లోకం నుండి 78 వరకు అంటే 12 శ్లోకాలు ఉత్తర పీఠిక అని చెబుతారు పెద్దలు .
ఈ 18వ అధ్యాయం కర్మ భక్తి జ్ఞానయోగాల సమ్మేళనం అనుకున్నాం కదా. జ్ఞాన పరాకాష్ఠకి ప్రతీక అనుకున్నారు శంకరులు. భక్తికి పరాకాష్ఠ అన్నారు మధుసూదన సరస్వతీ స్వాములు. కర్మనిష్ఠకి పరాకాష్ట ఎందుకు కాకూడదు అన్నారు. శ్రీ ధరులు ఇత్యాదులు. ఈ చరమ శ్లోకం ఆ మూడింటికి అన్వయించారు కొందరు. ఈ చరమ శ్లోకం ఒక మంత్రం అన్నారు. చరమ దశలో అంటే మరణ కాలంలో ఈ శ్లోకం ఒక మంత్రజపంలా ఆచరిస్తే మోక్షం సిద్ధిస్తుందంటారు వైష్ణవులు. ఎవరెలా చెప్పినా సాధకుల ముక్తి మార్గానికి అత్యంత ప్రధానమైంది ఈ శ్లోకం. ఇందులోని శరణాగతి ప్రపత్తి జీవోదారణకు పరమోపాయం. ఉపేయం కూడా. పంచసంస్కార సమయంలో అష్టాక్షరీ ద్వయమంత్రంతో పాటు ఈ చరమశ్లోకం కూడా ఒక మంత్రంగా ఉపదేశిస్తారు వైష్ణవస్వాములు. యత్ జ్ఞాత్వా అన్యత్ జ్ఞాతివ్యం - ఏది తెల్సుకుంటే మళ్ళీ ఇంకొకటి తెల్సుకోవాల్సిన అవసరం లేదో (7-2) ఆ అనుభవ జ్ఞానమే ఈ చరమశ్లోకంలోని శరణాగతి. ఆ ప్రవృత్తిని ఆశ్రయిస్తే సమస్తం పొందిన వాళ్ళమవుతాం. అపుడు కర్మ ధ్యాన భక్తి జ్ఞాన సాధనలు ఇతర ధర్మాలు కర్మలు వేటితో దేనితో పనిలేదు. మామేకం నన్నే శరణం వ్రజ శరణు పొందు. దానివల్ల లాభం ఏమిటంటే సర్వపాపేభ్యోసకల పాపాల నుంచి విముక్తి. నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా ఆస్తి నా బ్యాంక్ డిపాజిట్లు ఇలా సర్వవిధ కోరికలు బంధాలు వదిలేసి భగవానుని శరణు వేడాలంటే ఎంతో ధైర్యం ఎంతో త్యాగం ఎంతో వైరాగ్యం ఎంతో భక్తి ఉండాలి. దేవునిపై నమ్మకం ఉండాలి. అలాంటివాడు మనుష్యాణాం స షు (7-3). , ఈ 66వ శ్లోకంలో మొదటి పాదం మన కర్తవ్యాన్ని రెండోపాదం పరమాత్మ అనుగ్రహాన్ని తెలియజెప్పటం ఒక విశేషం. సమస్త ధర్మాలు కర్మలు త్యాగం చేయాలి. దానికి ప్రతిఫలంగా సర్వ పాపాల నుంచి దుఃఖాల నుంచి విముక్తి. ఇది శ్లోక సారాంశం.
బ్రహ్మచారికి చెందిన ధర్మాలు, గృహస్థాశ్రమ ధర్మాలు, సన్యాస ఆశ్రమ ధర్మాలు, స్వాభావిక గుణధర్మాలు ఇవి కాకుండా దేహధర్మాలు, ఇంద్రియ ధర్మాలున్నాయి. కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సహకారంతో చేసే కర్మాచరణలున్నాయి. యజన యాజనాలు (యజ్ఞ చేయడం, చేయించడం) అధ్యయన, అధ్యాపనలు (చదువుకోవడం, చదివించడం) దాన ప్రతిగ్రహాలు (దానం ఇవ్వడం, తీసుకోవడం) వగైరా వగైరాలన్నీ మనమే చేస్తున్నామా అని ప్రశ్న. శరీరంతో చేస్తున్నాం . ఇది ఒకటి. లోపల ఉన్న జీవుడు చేస్తున్నాడు. ఇది రెండోది. జీవునిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ చేయిస్తున్నాడు. ఇది మూడోది. మనమే చేయిస్తున్నామన్న మాట కుదరదు. నాహం కర్తా హరిః కర్తా అంటూ చెయ్. నీ పని నీవు చేస్తే, నా పని నేను చేస్తా అని భగవానుడు అనడంలో ఒక భరోసా ఉంది. సర్వ కర్మలు వదిలేసి సోమరిగా కూర్చో అనలేదు. యుద్ధం మానెయ్ అని చెప్పలేదు. ఫల సంగ కర్తృత్వాలు వదిలెయ్ - సర్వ పాపాల నుంచి విముక్తి కల్గిస్తా అనేది ఒక హామీ పత్రం. ఒక గొప్ప భరోసా.
అయితే ఆ భరోసా ఆ హామీ మొదట్లో ఇచ్చి ఉండొచ్చు కదా. 17 అధ్యాయాలు అయ్యాక అది చెయ్ ఇది చెయ్ అని లెక్కలేనన్ని సలహాలిచ్చి తర్వాత ఈ ఉపదేశమేమిటి అని ప్రశ్న. మొదట్లో చెప్పి ఉంటే అర్జునుడు నమ్ముతాడా? ఈ చరాచర ప్రకృతి అంతా నా అధీనంలో ఉంది. ఇదో నా విభూతులని ఏకరువు పెట్టాడు. అప్పటకీ నమ్మకం కుదరలేదు అర్జునునికి. నీ విశ్వరూపం డాలని ఉందన్నాడు అనుమానం తీర్చుకోవాలని. శిష్యుడు దారిలోకి వస్తున్నాడని సంబరపడిపోయాడు గురువు. చర్మచక్షువులూ డలేవు అని దివ్యనేత్రాలిచ్చాడూ శాడు అర్జునుడు. దిక్కు తోచలేదు. భయంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. నమస్కారం చేశాడు. మనసు కుదుట పడలేదు. వేలకొద్ది నమస్కారాలన్నాడు. ముందు నమస్కారం. వెనుక నమస్కారం. మళ్ళీ మళ్ళీ నమస్కారాలు. భయాందోళనలతో ఊగిపోయాడు. బుద్ది గడ్డితిని విశ్వరూపంచూ డాలని కోరినందుకు చింతించాడు. అంతవరకు కృష్ణుడు బావ. సారథి అనుకున్నాడు. ఇపుడు భగవానుడని, సర్వలోకేశ్వరుడని తెలుసుకున్నాడు. కృష్ణా నీ మహిమ తెలియక నిన్ను సఖునిగా భావించాను. విహార శయ్యాన భోజనాది సమయాల్లో చనువుతో ప్రవర్తించి ఉంటాను. ఎన్ని అపచారాలు, ఎన్ని పరిహాసాలు చేశానో ప్రభో నా అపరాధాలన్నింటినీ క్షమించు అని వేడుకున్నాడు. (సశేషం)