మధ్వాచార్యుడు - కౌతా నిర్మల

మధ్వాచార్యుడు - కౌతా నిర్మల


కన్నడ రాష్ట్రంలో నివసించే నారాయణభట్టు, వేదవతి దంపతులకు దైవ కృప వలన విజయదశమినాడు ఒక కుమారుడు జన్మించాడు. అతడికి వాసుదేవుడు అని నామకరణం చేశారు. ఆ బాలుని వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. విద్యాబుద్ధులు, సకల శాస్త్రములు నేర్పించారు. మూడేళ్ళవయసప్పుడు వాసుదేవుడు ఇంట్లో కనిపించకపోవడంతో తల్లితండ్రులు గాభరా పడ్డారు. అతని గురించి వెదకసాగారు. కొడుకు గురించి అన్వేషిస్తుంటే ఉడిపిలోని అనంతేశ్వర ఆలయంలో ఆ బాలుడు కనిపించాడు. తమ కుమారుని జాడ తెలియడంతో వారెంతో సంతోషించారు. అంత చిన్న వయసులో ఉన్న తమ కుమారుడు ఒంటరిగా ఆ ఆలయానికి ఎలా చేరుకున్నాడో వారికి అర్థం కాలేదు. అతను ఆ ఆలయానికి ఎలా వచ్చాడని, ఎవరితో కలిసి వచ్చాడని, ఒంటరిగా ఆ కోవెలకు ఎట్లా చేరుకున్నాడని తల్లితండ్రులు వాసుదేవుని ప్రశ్నించారు. "నాన్నగారూ నేను ఒక్కడినే ఇక్కడకు రాలేదు. దేవుడితో కలిసి ఈ గుడికి చేరుకున్నాను. నాన్నగారూ మరో విషయం చెప్పమంటారా? శివలింగం అంటే శివుడు కదా! కానీ నేను ఈ శివలింగంలోశ్రీ మన్నారాయణుని దర్శించాను" అని చెప్పాడు. తనయుని మాటలకు అప్రతిభులయ్యారు తల్లితండ్రులు. ఈశ్వరునిలో శ్రీ హరిని దర్శించగలిగిన భక్తి తత్పరత ఈ బాలునిలో ఎలా కలిగిందా అని అబ్బురపడ్డారు. ఐదుసంవత్సరాలవయస్సుకే వాసుదేవుడుసకల శాస్త్రాలు, వేదాలు అభ్యసించాడు. అది అతని పూర్వజన్మ సుకృతం. శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉంచుకుంటే విద్యను చక్కగా ఒంట బట్టించుకోవచ్చని అందరికీ చెప్పేవాడు. వాసుదేవుడు మంచి ఆరోగ్యంతో, దేహదారుఢ్యంతో ఉండేవాడు. అతనికి పదకొండు సంవత్సరాల వయస్సు వచ్చింది. వాసుదేవుడు పదకొండేళ్ళ వయస్సులో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని తల్లితండ్రులకు తెలియజేసి వారి అనుమతిని కోరాడు. "వాసుదేవా ! నీవు ఒక్కడివే మాకు కొడుకువి. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేము ఎట్లా ఉండగలమురా తండ్రీ" అని తల్లి బాధపడుతుంటే "అయితే మీకు మరో కొడుకు పుట్టేవరకు నేను మీతోనే ఉంటాను. ఆ తర్వాత నేను సన్యాసినవుతాను" అని చెప్పాడు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత నారాయణ భట్టు, వేదవతి దంపతులకు మరొక కుమారుడు జన్మించాడు. పన్నెండు సంవత్సరాల వయస్సులో వాసుదేవుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. సన్యాసాన్ని స్వీకరించిన తరువాత ఆయన పేరు 'ఆనందతీర్థుడు' అయింది. ద్వైత మతాన్ని స్థాపించాడు. ద్వెత మతాచార్యునిగా, వేద పండితునిగా ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఎందరో వేదపండితులతో పోటీపడి తన తర్క వితర్కాలతో వాదించి, వాగ్వివాదాలతో చాలామంది మీద గెలుపు పొందాడు.


ఎంతోమంది ద్వైతమతాన్ని స్వీకరించి ఈయనకు శిష్యులయ్యారు. మధ్వాచార్యులు అన్నపేరు ఏర్పడింది ఆనందతీర్థునికి. మధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి దేశ పర్యాటనం చేస్తూ, ద్వెతమతాన్ని ప్రచారం చేశాడు. గీతాభాష్యం రచించి వేదవ్యాస మహర్షికి అంకితమిచ్చాడు. మధ్వాచార్యులు ద్వైతమతం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాడు. ఎంతో మంది ఆ మత తత్వాన్ని అర్థం చేసుకుని ఆయనకు అనుచరులయ్యారు. చిన్నవయస్సులోనే ఇహలోక బంధాలను తెంచుకుని, సన్యాసిగా మారిన మధ్వాచార్యులు ఎంతో గొప్ప వ్యక్తి, మహానుభావుడు.