ముక్తికి సోపానం - చింతలపాటి శివశంకర శాస్త్రి
మృగశిరా నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల మాసమును మార్గశిర మాసమని అంటారు. ఈ మాసం విష్ణువుకపీ తికరం. మార్గము అనగా దారి. శిరము అనగా తల. మానవ శరీరమునకు శిరము ఏవిధంగా దిశానిర్దేశం చేయునో, అదేవిధంగా ఈ మాసము ఆధ్యాత్మికత వైపు డారి పుతుంది. భగవదారాధనకు విశేషమైన కాలం. సౌరమానం ప్రకారం ధనుర్మాసం అని అంటారు. ధనుర్మాసంలో నారాయణుని ఆరాధన విశేష ఫలాన్ని ఇస్తుంది. "సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి". సకల దేవతలకు చేసిన నమస్కారం కేశవునికి చెందుతుంది. "మాసానాం మార్గశీరోహం ఋతూనాం కుసుమాకరః". భగవద్గీతలో మార్గశిరమాసం సాక్షాత్తూ తన స్వరూపమని చెప్పాడు.
"సస్యాద్యత్వాత్ శీతాతప శూన్యత్వాత్ మార్గశిర మాస ప్రాధాన్యమ్". పంటలు బాగా పండి చేతికి వచ్చే కాలం. సమశీతోష్ణ స్థితి గల కాలమగుటచే మార్గశిర మాసమునకు ప్రాధాన్యమేర్పడినది. మార్గశిర మాసమునకు మార్గ, సహా, ఆగ్రహాయణిక" అని పేర్లు కలవు. కైవల్య కారకమైన ఈ మాసము రమణీయం, మహనీయం, కమనీయం మరియు జగద్రక్షాకరం. అనంతుడు, అచ్యుతుడు, అప్రమేయుడు, జ్యేష్ఠుడు, సనాతనుడు, ఆశ్రిత భక్తజన వత్సలుడు, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. భక్తుల కష్టాలను గట్టెక్కించి వారి కోర్కెలు తీర్చే ఆ దేవదేవుని ప్రతిరూపమే సాలగ్రామము. సర్వపాపహరమైనది, అన్నివిధాల కష్టాల నుండి రక్షించేది. సకలమైన పుణ్యఫలాలను అందించేది. సర్వదేవతా పూజ ఫలితాలను అందించేది. సర్వ శ్రీ యస్కరమైనది. సర్వోత్కృష్టమైనది ఆ సర్వాంతర్యామి యొక్క ప్రతిరూపమైన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగంలో మనకు లభించడం మన అదృష్టము. సాలగ్రామ శిలల గురించి వరాహ పురాణంలో ఈ విధంగా చెప్పబడి యున్నది.
పూర్వం శాలంకాయనుడు అను ఒక ముని ముక్తిపద క్షేత్రంలో అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ క్షేత్రములో 'సాల' అనే ఒక వృక్షము ఉన్నది. ఆ వృక్షము నుండి పరిమళ భరితమైన సుగంధము వెలువడుతూ ఉండేది. చాలా కాలము నుండి తపస్సు చేస్తూ యున్న కారణంగా ఆయనకు అలసట కలిగినది. ఆయన తన సమీపంలో ఉన్న సాల వృక్షము క్రింద విశ్రాంతి తీసుకొనసాగాడు. ఆయన మనస్సులో విష్ణుమూర్తిని దర్శనము చేసుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఆ సమయంలో తూర్పువైపు కూర్చుని పశ్చిమం వైపు ముఖం పెట్టి ఆసీనులయ్యారు. ఆ సమయంలో మాయ ఆయనను జ్ఞాన శూన్యునిగా చేసింది. అందువలన విష్ణుమూర్తి ఆయనకు కనిపించలేదు. కొన్ని రోజులైన తర్వాత వైశాఖ మాసంలో ద్వాదశి తిథినాడు తూర్పుదిశలో విష్ణుమూర్తి దర్శనం ఆయనకు కలిగింది. అమితానందంతో ముని విష్ణుమూర్తిని స్తుతించాడు. ఆస్తుతులకు ప్రసన్నుడైన విష్ణుమూర్తి "మునివర్యా! మీ స్తుతులకు నేను సంతుష్టుడనయినాను. నీ తపశ్చర్య వలన సిద్దిఫలము ప్రాప్తించింది. నీకు ఏదైనా వరము ప్రసాదించెదను కోరుకొనుమనగా ముని "దేవా! సర్వజనుల హితార్థము మీరు గండకీ నదీతీరంలో సాలవృక్ష రూపంలో ఆవిర్భవించండి" అని ప్రార్థించాడు. ముని కోరిక ప్రకారం విష్ణువు గండకీ నదీతీరంలో సాలవృక్ష రూపంలో వెలసినాడు. అంతట మహిమగల సాలగ్రామ వృక్షమును భక్తి శ్రద్ధలతో శాస్త్ర ప్రకారం అభిషేకించిన అనంత పుణ్యఫలితము కలుగును. -
మహావిష్ణువు సాలగ్రామం అనే శిలారూపాన్ని ధరించడం వెనుక అనేక కథలున్నాయి. అందుకు సంబంధించిన ఒక వృత్తాంతమే శివపురాణంలో చెప్పబడిన జలంధర సంహారం. పూర్వం జలంధరుడనే రాక్షసుడుండేవాడు. బ్రహ్మదేవుని గురించి ఘోర తపమాచరించి పలు వరాలను పొందాడు. వరగర్వముచే అహంకరించి దిక్పాలకులను బంధించి, మునులను బాధించసాగాడు. ఆతని దురాగతములను భరించలేని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొర బెట్టుకొని రక్షించమని ప్రార్థించారు. అంతట బ్రహ్మదేవుడు వారందరినీ తీసుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మొర బెట్టుకున్నారు. విష్ణువు జలంధరుడు భీకర యుద్ధం చేశారు. కానీ జలంధరుడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. జలంధరుని భార్య వృంద. ఆమె మహా పతివ్రత. ఆమె పాతివ్రత్యమునకు భంగం కలిగితే తప్ప జలంధరుని సంహరించలేమని విష్ణువు గ్రహించి మాయోపాయముచే జలంధరుని రూపం ధరించి ఆమె వద్దకు వెళ్ళి ఆమెతో రమించగా ఆమె తన పాతివ్రత్యాన్ని కోల్పోతుంది. శివుడు జలంధరునితో యుద్ధము చేసి అతనిని సంహరిస్తాడు. తన పాతివ్రత్య భంగానికి కారకుడైన విష్ణువుని సాలగ్రామ శిలగా మారుతావని శపిస్తుంది. వృంద శాపకారణంగా విష్ణువు సాలగ్రామ శిలగా మారాడు. ఈ సాలగ్రామ శిలలు గండకీ నదీతీర భాగాన కలవు. ఆనాటినుండి విష్ణువు సాలగ్రామ శిలగా అర్చావతారమెత్తి పూజలందుకుంటున్నాడు.శ్రీ మహావిష్ణువు సాలగ్రామ విశేషాలను గురించి బ్రహ్మవైవర్త పురాణం, అన్ని పురాణాలలో చక్కగా విశదీకరించబడింది. సాలగ్రామంపై ఉన్న చక్రాలను బట్టి వాటికి వివిధ రకాలైన పేర్లున్నాయి. తెలుపు, చామన, నలుపు, నీలం, అవిసెపువ్వు వన్నె (ముదురురంగు) బంగారు వన్నె, ఇత్తడి రంగు, పసుపురంగు, కంచురంగు, ఎరుపు కుంకుమ పువ్వు వన్నె, తేనెరంగు, ఖర్జూరరంగు, కెంపువన్నె మొదలైన భేదములన్నింటిని చక్రములుగల శిలలందు గుర్తించారు. సాలగ్రామము తెల్లనివైనచో సర్వపాపములను హరించును. పసుపు పచ్చనివి సంతానమునిచ్చును. నీలవర్ణము గలవి సర్వసంపదలను ఇచ్చును. ఎరుపురంగు గలవి రోగములను కలుగజేయును. వక్రముగా ఉన్నది దారిద్యమును కలుగజేయును. సాలగ్రామములను సరిసంఖ్యలో పూజించవలెను. రెండు చక్రములుగల శిలలను పూజింపవలెను. అనగా శిల ఎంత చిన్నదైతే ఫలము అంత అధికముగా ఉండును. శిల విరిగినా, పగిలినా, చక్రము ఉన్నచో శుభప్రదమైనది యగును. చక్రములు గలిగిన సాలగ్రామములను బ్రాహ్మణులు నిత్యము పూజించవలెను. క్షత్రియులు పూజించరాదు. శూద్రుడు, ఉపనయనము కానివారు, పతితులు, స్త్రీలు సాలగ్రామములను తాకరాదు. తాకినచో నరక లోకమును పొందుదురు. సాలగ్రామమును పరీక్ష చేసి పూజకు పనికి వచ్చేదా, కాదా యని తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష ఉంది.
సాలగ్రామమును పాలలో ముంచిగాని, బియ్యములో కొంచెంసేపు ఉంచినా, అది మొదటి కంటె ఏ మాత్రం బరువు ఎక్కువైన యెడల దానిని పూజించుటకు తగినదిగా బుద్ధిమంతులు గ్రహిస్తారు. ముక్తినాథాలయానికి దగ్గరలో వ్యాపించిన కొండలకు సాలగ్రామపు కొండలు అని పేరు. ఆ ప్రదేశముబ్రహ్మయొక్క సమీపమున ఉండుటవలన క్షేత్రములలో ఉత్తమమని చెబుతారు. అక్కడ చక్రతీర్థము అనునది బ్రహ్మచేత సృజింపబడింది. ఆ కొండలపై గల శిలలన్నీ వజ్రకీటకముల చేత చక్రపు గుర్తులు కలవిగా చేయబడుతున్నాయి. దానికి కారణము పాతాళగంగ యొక్క ప్రతి నీటి బిందువులలో కీటకములు ఉద్భవించుచున్నాయి. ఆ కీటకములను "వజ్ర కీటకములు" అని పిలువబడుతున్నాయి. పొడవుగా, సన్నగా మరియు నేర్పుగలవిగా యుండి, ఆ నదిలో పుట్టి, వెలుపల బడిన రాళ్ళను మరియు నదిలో గల రాళ్ళను అరువదేండ్లు తొలచి చక్రములు ఏర్పరుస్తున్నాయి. చిన్న చక్రము మహాపుణ్యము, నడిమి చక్రము శుభం, పెద్దచక్రము పుణ్యమును కలుగజేయును.
ప్రపంచము నందలి దేశములలో పలు రంగులున్న శిలలున్నాయి. ఏ రంగైనా, చక్రములున్నచోశ్రీ ష్ఠతరమైనవిగా పండితులు నిర్ణయించారు. సాలగ్రామమును దర్శించినా, స్మరించినా, నమస్కరించినా సమస్తమైన పాపాలు పరిహరించబడతాయి. సాలగ్రామ తీర్థము అత్యంత పవిత్రమైనది. ఈ తీర్థాన్ని సేవించిన వెయ్యిసార్లు పంచామృతాన్ని సేవించిన ఫలితం కంటే అధికమైన ఫలితం కలుగుతుంది. పునర్జన్మ ఉండదు. భక్తి శ్రద్ధలతో శాస్త్ర ప్రకారం పూజించి అభిషేకించిన కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితము కలుగుతుంది.
సాలగ్రామము ఉన్నచోటశ్రీ హరి సన్నిహితుడై యుండును. అచ్చటనేశ్రీ మహాలక్ష్మి, అన్ని తీర్థములతో కూడి అక్కడనే ఉండును. అనేక జన్మములలో చేసిన పాపములన్నియు సాలగ్రామ పూజవలన నశించును. కలియుగమునందు సాలగ్రామమును పూజించు భాగ్యము మానవులమైన మనకు కలుగుట నిజముగా మన అదృష్టము. ఇట్టి అవకాశమును వినియోగించుకొని మన జీవితమును ధన్యము గావించుకొని శాశ్వతానందమును పొంది ముక్తిని పొందుదాము. "సర్వేజనాః సుఖినోభవంతు"