భగవద్గీత

భగవద్గీతను --శ్రీమాన్ రాళ్లబండి శ్రీనివాసన్


 


భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః | తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ || 55


పరమభక్తితో నేనెంతటివాడినో, ఎలాంటివాడినో యధార్థంగా తెల్సుకుంటున్నాడు. అలా నన్ను తెల్సుకున్న తక్షణమే నాలో ఐక్యం చెందుతాడు. - ఇక్కడ రెండు రకాలుగా అన్వయం చేసుకోవచ్చు. జ్ఞాని పరంగాచూ స్తే పరమాత్మకు నామ రూపాల్లేవు. నిర్గుణుడు, నిరాకారుడు, సర్వవ్యాపియైన పరమాత్మను తన ఆత్మస్వరూపంగా దర్శించి యథార్థ తత్వాన్ని తెల్సుకున్న వెంటనే ఆ జ్ఞానయోగి అఖండ పరమానంద చైతన్య స్వరూపుడవుతాడు. అంటే బ్రహ్మైక్యం. ఇది ఒకటి. రెండోది భక్తిపరంగా - పరమాత్మకు నామరూపాలున్నాయి. నిత్యం తను ఆరాధించే సగుణ సాకార రూపంలో ఉంటాడు. తను పిలిస్తే పలికే దైవం, తను ఎక్కడ తలుస్తే అక్కడ ప్రత్యక్షం కాగల దైవం, భక్తసులభుడు, భక్త వత్సలుడు, శరణాగత వత్సలుడు అని పరమాత్మ యథార్థ తత్వం. అనన్య భక్తితో తెల్సుకున్న వెంటనే ఆయనలో ఐక్యమైపోతాడు. భక్త్యా త్వనన్యయా శక్య (11-54). భగవానుడు తన మాటని అక్షరాల నిజం చేస్తాడు. పరమాత్మ


నిర్గుణ నిరాకారానికి సగుణ సాకారానికి అభేదం చెప్పటానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం. భాగవతంలో ఇద్దరే ఇద్దరు ముఖ్యులు. ఒకడు శుకుడు - మరొకడు ప్రహ్లాదుడు. ఒకరిది నిర్గుణ నిష్ఠ. మరొకరిది సగుణ నిష్ఠ. ఒకడు లోపల భక్తుడు. పైకి జ్ఞాని. మరొకడు పైకి భక్తుడు. లోపల జ్ఞాని. . భగవద్గీతలో కర్మ భక్తి జ్ఞాన షట్కాలు మూడు. మొత్తం 18 అధ్యాయాలు. భక్తిలేని కర్మ కుంటిది. భక్తి లేని జ్ఞానం గుడ్డిది. అందుకే కర్మ జ్ఞానాల మధ్య భక్తి వచ్చి కూర్చుంది. కర్మ జ్ఞానానుషాల సమన్వయ రూపమే భక్తి. అయినా ముచ్చటగా వున్న మూడు యోగాలు మోక్ష మార్గానికి సోపానాలు. - ఇంతవరకు అర్జునుడు అడిగిన సన్యాసం త్యాగం. అంటే సాంఖ్యయోగాన్ని, కర్మ యోగాన్ని విడివిడిగా వివరించాడు. ఇపుడు బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనల్ని జ్ఞాన నిష్ఠని మరో అయిదు శ్లోకాల్లో విశదపరుస్తున్నాడు. ఈ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః | మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ || 56 ఎల్లప్పుడు సర్వకర్మలాచరిస్తూ నన్ను శరణు పొందిన భక్తుడు


నా అనుగ్రహంతో నాశనం కాని శాశ్వతమైన పరమపదం (మోక్షం) పొందుతాడు. సర్వకర్మలు అంటే నిష్కామకర్మలే కాదు కామ్యకర్మలు కూడా కలుపుకోవాలి. ఆ కామ్యకర్మలను కూడా కర్తృత్వం అహంకార మమకారాలు విడిచి చేయవచ్చునని కొందరి వ్యాఖ్య. యేతు సర్వాణి కర్మాణిమయిసన్న్యస్యమత్పరా.....సముద్దరా మృత్యు సంసార సాగరాత్.... 12 అధ్యాయం ఆరు ఏడు శ్లోకాల్లో చెప్పాడు భగవానుడు. వాటి భావం ఇదో అనన్య భక్తి యోగంతో నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తూ సర్వకర్మలు నాకర్పించిన వాళ్ళని మృత్యు సంసార సముద్రం నుంచి ఉద్దరిస్తానని హామీ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఈ శ్లోకంలో అలాంటి భరోసా ఇస్తున్నాడు. సర్వకర్మలంటే నిషిద్ధకర్మలు తీసుకోరాదు. గింజలను పిండి చేసే తిరుగలికి రెండు రాళ్ళుంటాయి. కింది రాయి స్థిరంగా ఉంటుంది. పై రాయి తిరుగుతూ ఉంటుంది. కింది రాయికి మధ్యలో ఒక చిన్న గుంజ ఉంటుంది. పైనున్న రాయికి మధ్యలో రంధ్రం. ఆ రంధ్రంలో గింజలు పోస్తూ పై రాయిని తిప్పుతారు. గింజలు పిండైపోతాయి. కాని గుంజని అంటిపెట్టుకున్న గింజలు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. భగవదాశ్రయమైన జీవులు శరణాగతులైన జీవులు కర్మ జన్మ చక్రగతిలో తగుల్కొనరు. నాశనం కారు. -


సర్వకర్మలు ఈశ్వరార్పణం గావించటమే మత్ ప్రసాదాత్. దాంతో భగవదనుగ్రహ సిద్ధి లభిస్తుంది. సర్మాత్మున్ హరి నమ్మి యుండుట భద్రమన్నాడు ప్రహ్లాదుడు. - బజారులో పండు కొని ఎవ్వరికీ ఇవ్వకుండా మనమే తింటాం. అదే పండు దేవుని ముందు పెట్టామనుకో. అపుడది ప్రసాదమవుతుంది. ఆ పండును మనమే తినాలనిపించదు. ముక్కలు చేసి ఇతరులకు పంచిపెట్టి మిగిలింది మనం తింటాం. అంటే భగవదనుగ్రహం మనకే కాదు అందరికీ లభించాలనే విశాల దృక్పథం ప్రసాదంగా భావించినప్పుడు వ్యక్తమవుతుంది. పండును భగవంతుని ముందు పెట్టగలం. కాని సర్వకర్మలు భగవదర్పితం చేయగలమా అని ప్రశ్న. ఇంట్లో భార్యాపిల్లలు చదువులు పెళ్ళిళ్ళు ఎన్నో బాధ్యతలు. ఇవన్నీ భగవదర్పితం చేయగలమా? బార్యతో నీవాడినంటాం. ఆఫీసులో బాతో నీవాడినే అంటాం. నీ సేవకుడిని అంటాం. సర్వకర్మలు అటుంచినా దేవుడా నేను నీ వాడని కనీసం అనలేకపోతున్నాం. గురునానక్ తండ్రి వ్యాపారి. ఓరోజు కిరాణాషాపులో కొడుకుని కూర్చోబెట్టి పనిమీద వెళ్ళాడు తండ్రి. గోధుమలు కావాలని వచ్చాడొకడు. గురునానక్ కొలవడం మొదలుపెట్టాడు. ఏక్ దో తీన్... దస్... తేరా. తేరా తేరా తర్వాత సంఖ్య రాలేదతనికి. మాటి మాటికి తేరా అంటున్నాడు. చుట్టు చేరారు జనం. ఆశ్చర్యపోతున్నారు. తేరా అంటే నీవాడిని అని అర్థం. ఓ దేవా నేను నీ వాడిని. నీకు చెందినవాడిని. నీ భక్తుడను. నీ సేవకుడను. మమై వాంశో జీవలోకే. నేను నీ అంశ మాత్రమే. తండ్రి వచ్చాడు. చూ శాడు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. వీడు వ్యాపారానికి పనికిరాడని నిర్ధారణకు వచ్చేశాడు. సర్వకర్మలు ఈశ్వరార్పణ చెయ్యి. మనస్సు సదా పరమాత్మపై నిలుపు అని అర్జునుని నెపంగా పెట్టుకుని మనకు ఉపదేశిస్తున్నాడు భగవానుడు ఈ క్రింది శ్లోకంలో. .


చేతసా సర్వకర్మాణి మయి సన్నస్య మత్పరః | బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ || 57


అర్జునా నిండు మనస్సుతో సర్మకర్మలను నాకు సమర్పించు. నన్నే పురుషార్థంగా భావించు. బుద్ధిని ఏకాగ్రం చెయ్. సర్వకాల సర్వావస్థలలో నీ చిత్రాన్ని నాలో నిలిపెయ్. . అర్జునా నీ చిత్తాన్ని నామీద లగ్నం చెయ్.నన్ను శరణు వేడుకో అన్నాడు ఏడో అధ్యాయం మొదట్లో. మచ్చిత్తా మద్దత ప్రాణాః - నా భక్తులు తమ చిత్రాన్ని నాకే సమర్పిస్తారు. అంతేకాదు తమ ప్రాణాల్ని సైతం నాకు ధారపోస్తారు (జటాయువు) అన్నాడు పదో అధ్యాయం తొమ్మిదో శ్లోకంలో. మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యత్మ చేతసా అన్నాడు మూడో అధ్యాయం 30 శ్లోకంలో. నావ నీళ్ళలో ఉండాలి. నావలోకి నీళ్ళు రాకూడదు. సంసారంలో ఉండు. నీలో సంసారం ఉండనీయను అన్నాడు రామకృష్ణ పరమహంస. ప్రపంచాన్ని మనస్సులో నుంచి తరిమివేసి ఆ స్థానంలో పరమాత్మకు చోటివ్వాలి. ఇది నాది, నాకోసం అన్న భావన కలుగరాదు. నాహంక. హరికి కర్త. అన్నీ ఆ స్వామి నాతో చేయిస్తున్నాడు. కర్తృత్వం మొత్తం ఈశ్వరార్పణం చేయాలి. అపుడే అహంకార మమకారాలు పటాపంచలైపోతాయి. అదే భగవదర్పిత బుద్ది. అదే చేతసా అన్న శబ్దానికి అర్థం. అపుడు మనసంతా నీవే అన్నట్లు పరమాత్మ పరమైపోతుంది. నేను నీవాడిని, నీకు చెందినవాడిని అని భక్తితో భజించేవానికి దదామి బుద్ధియోగం సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు.సంకటం వచ్చినపుడు వెంకటరమణ అని కాకుండా సతతం భగవన్నామస్మరణ సాగిస్తూ ఉండాలి. ఆ నామ స్మరణకు విశ్రాంతి లేదు. విశ్రాంతి ఇస్తే స్మరణం మరణం అవుతుంది. ఇంతే సంగతులు. భగవత్ ఉపదేశానుసారం ప్రవర్తిస్తే కలిగే ఫలం, ఆ స్వామి ఆజ్ఞను తిరస్కరిస్తే వచ్చే నష్టం ఏమిటో వివరిస్తున్నాడు.


మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి | అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి || 58 నీ చిత్తాన్ని నాకు సమర్పించు. యథాప్రకారం కర్మలన్నీ ఆచరిస్తూ ఉండు. సంసారంలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ అతిక్రమిస్తారు. అలా కాకుండా అహంకారంతో నేను చెప్పింది వినకపోతే చెడిపోతావు.


నమే భక్తః ప్రణశ్యతి 9-31లో ప్రతిజ్ఞ చేశాడు భగవానుడు. నన్ను నమ్మినవాడు చెడిపోడన్నాడు. పండరీపురంలో నడుం మీద చేతులుంచుకుని ముగ్ధమనోహరంగా నిల్చుని ఉంటాడు పాండురంగడు. నన్ను నమ్మినవారికి ఈ సంసార సాగరం నడు లోతు ఉంటుంది. కష్టాలుండవ్. నష్టాలుండవ్. ఆటంకాలుండవ్. నన్ను స్మరిస్తూ హాయిగా తిన్నగా నా సన్నిధికి చేరవచ్చు అని ఆ పాండురంగడు మనతో చెబుతున్నట్లు వుంటాడు. వేంకటేశ్వరస్వామి కూడా అంతే. ఒకటి కటిహస్తం మరొకటి అభయహస్తం అంటారు కాని కుడిచేయి తన పాదాలనూ పుతూ ఉంటుంది. నా పాదాలకు శరణాగతి చేశావంటే నిన్ను నా సన్నిధికి చేర్చుకుంటాను అన్నట్లు ఎడమ చేయి సూచిస్తూ ఉంటుంది. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః 8-14లో అంటాడు స్వామి. ఎవడు ఏకాగ్రచిత్తంతో నన్ను నిత్యం నిరంతరం స్మరిస్తూ ఉంటాడో వాడు నన్నే పొందుతాడు. నేను వాడికి అత్యంత సులభంగా దొరుకుతానన్నాడు. అలా అనన్యభక్తి యోగంలో నన్ను సతతం భజించేవారిని జనన మరణ రూప సంసార సాగరం నుండి శీఘ్రంగా ఉద్దరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు (12-7). మనపై భగవానుడు అంత కృపారసం కురిపిస్తునపుడుమనం చేయాల్సిన పని ఒక్కటే. మన చిత్తాన్ని పరమాత్మకి అప్పగించాలి. అది చేస్తే చాలు. మిగిలిన భారమంతా తానే వహిస్తాడు. యోగ క్షేమం వహామ్యహం కదా. నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నివహకరంబు నీ నామామృతపూర్ణం నీ నామము నే తలంతు నిత్యము కృష్ణా (కృష్ణ శతకం)


చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని అన్నాడు పోతన. ఇప్పటినుంచి దేవుడు భక్తి భజనలు ఎందుకు? ముందు డబ్బులు సంపాదించాలి. పిల్లల్ని చదివించాలి. పెళ్ళిళ్ళు చేయాలి. ముద్దూ ముచ్చటలు తీర్చుకోవాలి. అన్ని బాధ్యతలు ముగిశాక అప్పుడు తీరిగ్గా కూర్చుని పూజలు జపాలు భజనలు చేస్తే సరిపోదా అనే సోమరులున్నారు. అపుడు ఆ వయసులో భక్తి కూడా ముదుసలిదై పోతుంది. జవసత్వాలు ఉడిగిపోయి ఉంటాయి. అవి మనం చెప్పినట్లు వినవు. మనోబుద్ధులు అంతంత మాత్రం సహకరిస్తాయి. దయచేసి అటువంటి స్థితి తెచ్చుకోవద్దు. గాలి అంతటా వీస్తున్నా తెరచాప ఎత్తినవాడి పడవ మాత్రం నడుస్తుంది. చెట్టుకింద చేరినవాడికే నీడ లభిస్తుందని కొందరు ఉదహరిస్తారు.


ప్రతివ్యక్తి సుఖశాంతుల్ని కోరుతాడు.పరతంత్రులమైనమనం నిమిత్తమాత్రులమైన మనం సర్వస్వతంత్రుడైన ఆ పరమాత్ముని శరణు వేడాలి. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని ప్రార్థించాలి. అపుడు నీ ఉద్దారకం నేను భరిస్తానంటున్నాడు భగవానుడు. అంతకంటే భరోసా ఇవ్వగలవాడెవడున్నాడు? పో పోవయ్యా నువ్వు ఎవడవు? నాకు చెప్పటానికి అని అహంకరిస్తే వివేక భ్రష్ట సంపాతాలు తప్పవు అని హెచ్చరిస్తున్నాడు స్వామి. కనుక ఆత్మానాం ఉద్దరేత్ నిన్ను నీవు సంసార సాగరంలో నుంచి ఉద్దరించుకో. ఆత్మానం న అవసాదయేత్ మనసుని అధోగతి పాలు కానివ్వకు. తర్వాతి శ్లోకంలో ఒక విచిత్రమైన మాట చెబుతున్నాడు భగవానుడు. మనం ఒక పని చేయకూడదని తలచినా ఆ పని మనతో ఎలా చేయిస్తుందో రెండు శ్లోకాల్లో వివరిస్తున్నాడు.


యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే | మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వామ్ నియోక్ష్యతి || 59


అర్జునా అహంకారాన్ని ఆశ్రయించి యుద్ధం చేయలేను, అదే నా నిశ్చయం అంటావా, అది వ్యర్థమే అవుతుంది. అపుడు నీ క్షత్రియ స్వభావమే నీతో యుద్ధం చేయించి తీరుతుంది. నయోత్స్య ఇతి గోవిందం 2-9 లో యుద్ధం చేయనని కృష్ణునితో పలికాడు అర్జునుడు. నేను పండితుడిని. నాకన్నీ తెలుసునని అహంకారంతో ప్రగల్బాలు పలికాడు. వాస్తవానికి అర్జునుడు విడిచి పెట్టాల్సింది గాండీవం కాదు. అహంకారం. అశోకవనంలో అనేకవిధాల సీతమ్మని మాటలో హింసించాడు రావణుడు. అపుడు సీతమ్మ అన్న పలుకులు ఇవి - నేను రాముని భార్యని. దశరథుని కోడలిని. ఓరీ దశగ్రీవ భస్మ భస్మార్ట తేజసా నా పాతివ్రత్యం అనే తేజస్సుతో నిన్ను భస్మం చేయగలను. కాని అసందేశాత్తు రామస్య రామాజ్ఞ లేదు నాకు. బతికిపోయావు. తపస్సు చేస్తున్నాను అని తన పరతంత్రని ప్రకటించుకుంది. కనుక జీవుడు ఎప్పటికీ పరతంత్రుడే. పరమాత్మ చేతిలోని ఒక పనిముట్టు అంతే.


అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్నాడు. మాయ రూపంలో వచ్చాడు పరమశివుడు. ఒక పందిని చంపిన విషయంగా ఇద్దరికీ గొడవ జరిగింది. అర్జునుడు అపుడు యుద్ధం చేయటానికి క్షాత్ర తేజమే కారణం. ఉత్తర గోగ్రహణంలో భీష్మాది కురు వీరులను జయించి ఆవులను మళ్ళించడంలో శుద్ద రాజస గుణంతో కూడిన క్షత్రియ ధర్మమే కారణం. ఆ క్షత్రియ ధర్మం అర్జునుని స్వభావం. తాతలు గురువులు బంధుమిత్రులు వగైరా వగైరాలను చంపాల్సి వస్తుంది. కార్పణ్య దోషంతో మోహంతో అర్థంకాని అహంకారంతో నోటికి వచ్చినట్లు వాగాడు. యుద్ధం చేయనని మొండికేసినా వృథా ప్రయాసే. నీ మంకుపట్టు నిలబడదు. జీవకోటి మొత్తం ప్రకృతికి లోబడి ఉంది. నీవు అంతే అర్జునా. ఆ ప్రకృతే నీతో యుద్ధం చేయిస్తుందని నొక్కి చెబుతున్నాడు భగవానుడు.


కుంతీపుత్రా కౌంతేయా అర్జునా అవివేకంతో ఏది చేయనని ఇష్టపడతావో దానికి విరుద్ధంగా ఆ పని చేసి తీరుతావు. కారణం స్వభావసిద్ధమైన కర్మతో నీవు బద్దుడవు సుమా. , శ్రీ కృష్ణుడు పాండవుల పక్షాన రాయబారిగా హస్తిన చేరాడు. కుంతీదేవిమా శాడు. పాండవులు సంధి కోరుతుంటే ఆ వీరమాత యుద్ధాన్ని అభిలషించింది. తన కుమారుల్లో క్షాత్ర తేజం పురికొల్పాలని కోరింది కృష్ణుని. శౌర్య పరాక్రమాలకు ఆలవాలమైన క్షత్రియ ధర్మాన్ని ప్రోత్సహించింది. కావున అర్జునుని కౌంతేయా అని పిలిచాడు. - విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. వసిష్ఠుని బ్రహ్మరిత్వం ముందు తన క్షాత్ర తేజం బదాబదలైంది. బ్రహ్మరి అనిపించుకోవాలనుకున్నాడు. తపస్సు చేశాడు. ఎన్నో విఘ్నాలు సంభవించాయి. తన పురుష ప్రయత్నంతో మొదట రాజర్షియై తర్వాత బ్రహ్మర్షి కాగల్గాడు. అంటే పూర్వజన్మ సంస్కార బలాన్ని అధిగమించి పురుష ప్రయత్నం పై చెయ్యి కాగలింది. త్రిశంకువు బొందితో స్వర్గాన్ని చేరాలని పురుష ప్రయత్నం చేశాడు. ప్రారబ్ద కర్మని అధిగమించలేకపోయాడు. అటు భూమి ఇటు స్వర్గానికి కాకుండా మధ్యలో తలకిందులుగా పడ్డాడు. ఒక్కోసారి పురుష ప్రయత్నం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఇదంతా వారి వారి స్వభావ సిద్ధమైన కర్మకు బద్దులు కాక తప్పదు. ప్రతి వ్యక్తి తన కర్మ స్వభావంతో జడమైన ప్రకృతికి ఎదురు తిరగలేడు. దానికి ఎలా లోబడుతున్నాడో చెబుతున్నాడు ఇపుడు.


అర్జునా ఈశ్వరుడు సమస్త ప్రాణికోటి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. దేహం అనే యంత్రం ఎక్కిన కీలుబొమ్మల్లాంటివి ఆ ప్రాణులు. ఆయా జీవులు వాటి వాటి గుణాలను అనుసరించి ఉంటాయి. తన మాయతో ఆ సకల జీవకోటిని పరమేశ్వరుడు తిప్పుతున్నాడు. . సకల చేతనా చేతనాలకు నియామకుడైన వానిని ఈశ్వరుడంటారు. అహం సర్వస్య ప్రభావో 10-8 శ్లోకంలో ఈ సర్వ జగత్తు ఉత్పత్తికి నేనే మూలకారణం. నాతో ఈ జగత్తు నడుస్తోందన్నాడు. పర అపరా ప్రకృతులు నావే అన్నాడు. ఈ ప్రకృతికి నేనే అధ్యక్షుడనని సెలవిచ్చాడు. ఈ సంసారాన్ని సాగరంతో సర్పంతో కూపంతో వృక్షంతో అలా ఎన్నింటితోనో పోలుస్తున్నారు. ఇక్కడ ఆ సంసారాన్ని రంగుల రాట్నంతో పోల్చాడు భగవానుడు. పూర్వం తిరునాళ్ళు జాతరలు జరుగుతూ ఉండేవి. అక్కడ రంగుల రాట్నాలు కనిపించేవి. ఏనుగులు గుర్రాలు పులులు జింకలు గాడిదలు రకరకాల బొమ్మలు చుట్టూ కట్టబడి ఉంటాయి. పిల్లలు తమకిష్టమైన బొమ్మల్ని కోరుకుంటారు. వాళ్ళను వాటిపైకి ఎక్కిస్తారు. మధ్యలో ఒకడు ఆ రాట్నాన్ని తిప్పుతూ ఉంటాడు. మేమే తిరుగుతున్నాం అనుకుంటారు. పిల్లలు. తిప్పేవాడిని మరచిపోతారు. మనం కూడా అంతే. మనలో ఒకడు అంతర్యామిగా ఉన్నాడు. వాడు నడిపిస్తున్నాడు. తిప్పుతున్నాడు. వాడి నియంత్రణకి లోబడి ఉన్నాం మనం. ఆ పిల్లల మనస్తత్వంలా మనం కూడా స్వతంత్రులం అనుకుంటున్నాం. నేను బ్రాహ్మణుడిని. నేను క్షత్రియుడిని. వైశ్యుడిని. శూద్రుడిని. నేను పొడుగు. నేను లావు. నేను పొడగరిని. నేను ఎర్రగా ఉంటాను. నేను నల్లగా ఉంటాను. ఇలా దేహ సంబంధం కలుపుకుంటున్నాం. మాయలో పడిపోతున్నాం.


మమ మాయా దురత్యయా 7-14లో అన్నాడు. ఈ మాయ దైవీ మాయ. త్రిగుణాత్మకమైన మాయ. ముచ్చటగా మూడు గుణాలతో చిక్కుముడి పడ్డ మాయ అది. ఇక్కడ మాయని ప్రకృతి అన్నారు కొందరు. అజ్ఞానం అన్నారు. అవిద్య అన్నారు. ఏదైనా కాని మాయకు యజమాని మహేశ్వరుడు. మాయాంతు ప్రకృతిం.... మహేశ్వరం అని వేదం. అందుకే మమ మాయా అంటున్నాడు పరమాత్మ. ఆ స్వామి క్రీడార్థం వినోదార్థం సృష్టించబడింది మాయ. సమస్త లోకాల్లోని ఏ ప్రాణి అయినా బ్రహ్మదేవునితో సహా ఈ మాయకు లోబడి ఉండాలి. తప్పదు.


ఆ మాయను లోబరచుకున్న ఈశ్వరుడు ఎక్కడున్నాడని ప్రశ్న. వైకుంఠం కైలాసం అదేదీ కాదు హృదేశే తిష్ఠతి. సకల జీవుల హృదయ స్థానంలో అంతర్యామిగా ఉంటాడు. అంతర్ అంటే లోపల యామి అంటే శాసిస్తూ నియంత్రిస్తూ ఉంటాడు. అంతేకాదు పరమాత్మ సర్వవ్యాపి కూడా. అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది వేదం. లోప బయటా అంతటా వ్యాపించి ఉంటాడు. జీవుల లోపల ఉంటూ ఎలా శాసిస్తూ ఉంటాడని ప్రశ్న. మాయ యా యంత్రారూఢాని సంసారం అనే యంత్రం ఎక్కిన కీలుబొమ్మల్లాంటి జీవులను తన మాయతో తిప్పుతూ ఉంటాడు. ఎందుకు తిప్పాలని మళ్ళీ ప్రశ్న. ఆయా జీవులు చేసుకున్న వారి వారి కర్మను అనుభవించాలని భ్రామయన్ తిప్పుతున్నాడు. ఎవరే కాని తమ కర్మ ఫలానుభవం నుంచి తప్పించుకొని పోకుండా హృదయం మధ్యలో ఉండి నియంత్రిస్తూ ఉంటాడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః ... అని శ్వేతాశ్వతరోపనిషత్తులో ఓ మంత్రం ఉంది. ఈశ్వరుడు ఒక్కడే సర్వజీవరాశుల్లో అంతర్యామిగా సర్వవ్యాపిగా ఒక సాక్షిలా పర్యవేక్షిస్తూ ఉంటాడు. మాయ అనే ఉపాధితో తిప్పుతూ ఉంటాడు. అంతేకాని ఆ స్వామికర్త కాదు. కారయితా కాదు


లబ్ డబ్ అని కొట్టుకునే గుండె హృదయస్థానమా అని ప్రశ్న. కాదు. అది భౌతిక హృదయం. మామూలు హృదయం మనకు ఎడమవైపున ఉంటుంది. ఆధ్యాత్మిక హృదయం కంఠానికి కింద బొడ్డుపైన జానెడు దూరంలో కుడి ఎడమలు కాకుండా మధ్యలో ఉంటుంది. అది ఆత్మస్థానం. అందులో అంతర్యామిగా ఉంటాడు పరమాత్మ. కిందికి వేలాడుతున్న తామర మొగ్గలా ఉంటుంది హృదయం. నూటొక్క నాడులు దాన్ని చుట్టి ఉంటాయి. అందులో ఒక నాడి పేరు సుషుమ్నా. ఆ నాడి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది. ఇక ఆత్మరూపం ఎలా వుంటుంది అంటే - మన తలవెంట్రుక లోని నూరో భాగంలో నూరోభాగం ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందో అది ఆత్మ. మేలిమి బంగారు రంగులో అగ్నిశిఖలా మండుతున్న జ్యోతియే ఆత్మ. అందులో అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాత్మ ఉంటాడు. మహానారాయణ - శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇదంతా వర్ణింపబడింది.


అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఆత్మ వుంటుంది కనుకనే నైనం ఛిందంతి శస్తాణి... 2-23లో అన్నాడు భగవానుడు. ఆ ఆత్మని శస్తాలు ఛేదింపజాలవు. తుపాకులు ఏకే 47లు బాంబులు ఏవీ చంపలేవు. అగ్ని దహింపజాలదు. నీరు తడపజాలదు. గాలి ఆరిపోయేట్లు చేయలేదు. ఇక మళ్ళీ శ్లోక వివరణలోకి వస్తే - రంగుల రాట్నంలో మధ్యలో ఉన్నవాడు దాన్ని తిప్పుతున్నట్లే సంసారయంత్రంలో ఉన్న మనల్ని మన హృదయస్థానంలో ఉండి తిప్పుతున్నాడు ఈశ్వరుడు. బ్రహ్మాది దేవతలతేనేం నారదాది మహరులైతేనేం సర్వజీవకోటి ఆ విశ్వమాయలో పడితీరాలి. మాయా సంసారమూ తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు అన్నాడు ఒక సినిమా కవి. ఆ విశ్వమాయ నుంచి కర్మ జన్మ సంసార చక్రగతి నుంచి విముక్తి పొందే ఉపాయం తర్వాతి శ్లోకంలో చెబుతున్నాడు. 


తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత | తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||


ఓ భారతా అర్జునా అన్ని విధాలుగా ఆ ఈశ్వరునికి శరణాగతి చేయాలి. అపుడా స్వామి అనుగ్రహంతో పరమశాంతిని శాశ్వతమైన మోక్షాన్ని పొందగలవు. భా అంటే ప్రకాశం. బ్రహ్మవిద్య లేదా ఆత్మవిద్య అనే ప్రకాశంలో రతుడు అంటే రమించేవాడు, ఆనందించేవాడని భారత శబ్దానికి అర్థం. ఈ భారత అనే సంబోధన అర్జునునికి దాదాపు పద్దెనిమిది సార్లు ప్రయోగింపబడింది. (సశేషం)