వేంకటాచల మాహాత్మ్యం (స్కాంద పురాణాంతర్గతం)

  గత సంచిక తరువాయి



(స్కాంద పురాణాంతర్గతం) గత సంచిక తరువాయి ఈ అధ్యాయంలో శ్వేత వరాహావతారశ్రీ వేంకటాచల క్షేత్ర వైశిష్ట్యం మొదలైన విషయాలు వివరించబడుతున్నాయి.


పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మునులు లోక కళ్యాణమునకై పన్నెండు సంవత్సరములు సత్రయాగాన్ని చేశారు. అక్కడకు వ్యాసమహర్షి శిష్యుడు, రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడనే పౌరాణికోత్తముడు వేంచేశాడు. శౌనకాది మునులా సూతమహర్షిని అర్య పాద్యాదులతో పూజించి 'మహాత్మా! రోమహరణా! సర్వజా! పురాణార్థ విశారదా! ఈ విశ్వమెలా ఆవిర్భవించింది? ఈ ప్రపంచ సృష్టికి కారకులెవరు? భూలోకంలో ఉన్న ప్రధానమైన పర్వతాలేవి? వాటి మాహాత్మ్యాన్ని మీ ద్వారా వినాలని కుతూహలంగా ఉంది. కావున మాయందు దయతో తెలియజేయండి' అని ప్రార్థించారు. అప్పుడు సూతమహర్షి వారితో 'పూర్వం గంగానదీ తీరంలో ముశ్రీ ష్టుడైన వ్యాసమహర్షిని నేను ఈ విషయాన్నే అడిగాను. మా గురుదేవుడు నాకు చెప్పిన విషయాలనే నేను మీకు తెలియజేస్తా'నని ఇలా చెప్పనారంభించాడు.


1.విశ్వసృష్టి :


పూర్వం అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో భరద్వాజాశ్రమానికి వెళ్ళి ఆ మహర్షిని సందర్శించి, నమస్కరించి 'మహాత్మా! కల్పాదిలో భగవంతుడు ప్రాణులనెలా సృష్టించాడు? ఈ పంచభూతాలెలా ఆవిర్భవించినాయి? అని ప్రశ్నించాడు. అప్పుడు భరద్వాజ మహర్షి అర్జునునితో ఇలా అన్నాడు - "అర్జునా! ఆపదలను పోగొట్టి సంపదలను ప్రసాదించి భుక్తిముక్తులను ప్రసాదించేశ్రీ మన్నారాయణుడు కల్పాదిలో ప్రాణులను ఏవిధంగా సృజించాడనే విషయాన్నంతా చెబుతాను. సావధానంగా విను. సృష్టిని గురించి విచారిస్తున్న భగవంతుడి మహాతేజస్సు రజోగుణ ప్రధానమైన బ్రహ్మగా ప్రసిద్ధమైంది.


శ్రీ మన్నారాయణుని ముఖాన్నుండి త్రిలోకాధిపతియైన దేవేంద్రుడు, అన్నిటిని దహించే అగ్ని జనించారు. నిత్యం దయాశీలుడవటం వలన ఆయన చల్లని మనస్సునుండి ఓషధులన్నింటికి అధిపతి, స్నేహశీలురకు రక్షకుడు అయిన చంద్రుడు పుట్టాడు. ఆయన నేత్రాల నుండి ప్రపంచాన్ని ప్రకాశింపచేసేవాడు. శీతోష్ణ వర్షకాలాలకు కారకుడు. తేజస్సులకు నిధి అయిన సూర్యుడు ఆవిర్భవించాడు. ఆయన ప్రాణాల నుండి జగత్పాణుడైన సమీరుడు - గ్రహ నక్షత్రాలను, ఆకాశగంగను, విమానాలను ధరించేటటువంటి మహాబలశాలి యైన వాయువు ఉద్భవించాడు. నారాయణుని నాభి ప్రదేశం నుండి అంతరిక్షం ఉత్పన్నమైంది. ఆయన శిరస్సు నుండి ప్రాణుల ఉత్పత్తికి కారణమైన ఆకాశం జనించింది. ఆయన పాదపద్మాల నుండి ప్రాణికోటికి ఆధారమైన భూమి ఉద్భవించింది. చెవుల నుండి దిక్కులన్నీ ఏర్పడ్డాయి. శ్రీ మన్నారాయణుని సంకల్పం వలన భూలోక భువర్లోకాదులు, యక్ష రక్షోగణాలకు ఆయాలైన పాతాళాది లోకాలు పుట్టినాయి. ఓ అర్జునా! ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రాదులు జన్మించారు. వేదాలు, యజ్ఞాలు, అశ్వాలు, గోవులు, వృషభాలు, పొట్టేళ్ళు, వికాదులు ఆయన మహత్తర ప్రభావం వలన ఉత్పన్నములైనాయి. శ్రీ మన్నారాయణుని సంకల్పం వలన చరాచరాత్మకమైన సకల ప్రాణిజాతం. అలాగే భూత భవిష్యద్వర్తమాన కాలాలు సృజించబడినాయి. ఆయన బడబానలం రూపంలో సముద్ర జలాలను తాగి, తనయందుంచుకొని కల్పాంతంలో ఆ నీటిని విసర్జిస్తాడు. సూర్యచంద్రుల రూపాన్ని ధరించి, అంధకారాన్ని పోగొట్టి, కాలధర్మాలను ప్రవర్తింపచేసి, సర్వప్రాణుల వ్యవహారాలను నడుపుతున్నాడు. శ్రీ మన్నారాయణుడు ప్రళయకాలంలో లోకాలను తనకుక్షిలో ఉంచుకుని, లీలాశిశువు రూపం ధరించి సముద్రంలో వటపత్రశాయిగా ఉంటాడు. శుభకరమైన గొప్ప ఆదిశేషుని శరీరంతో నిర్మించబడిన భోగతల్పం. దేవితో కూడి యోగనిద్రను పొందుతాడు. సకల జగత్పభువైనశ్రీ మన్నారాయణుడు తన నాభి అనే సరస్సు నుండి పుట్టిన కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మను సృజించాడు. ఇదంతా సంకల్పమాత్రం చేతనే జరిగే గోవిందుని లీల. ఆయన్ను యథార్థంగా ఎవరూ తెలుసుకోలేరు. ఎప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో, దేవతా సమూహానికి ఎప్పుడు పెద్ద కష్టాలు కలుగుతాయో, రాక్షసులు గర్విష్టులై నివారించ శక్యం కానివారై వృద్ధి చెందుతారో, భూమికి - భూలోక వాసులకు ఎప్పుడు గొప్ప భయం సంభవిస్తుందో, ఎప్పుడు సాధువులైన తన భక్తులకు అనివార్యమైన మహాభయంకరమైన విపత్తు సంభవిస్తుందో అప్పుడు దానికి తగిన రూపాన్ని కుతూహలంతో ధరించి వెంటనే అధర్మాన్ని పోగొట్టి, లోక కళ్యాణం చేస్తాడుశ్రీ మన్నారాయణుడే రజోగుణాన్నాశ్రయించి ప్రపంచాన్ని సృజిస్తాడు.శ్రీ హరిగా సత్త్వగుణోపేతుడై లోకాలను రక్షిస్తాడు. హరునిగా తమోగుణ నిష్ఠుడై ప్రపంచాన్ని లయింప చేస్తున్నాడుశ్రీ మన్నారాయణుని మహిమను తెలిసినవాడు ఎవడూ లేడు.


2. వరాహస్వామి భూమిని ఉద్దరించడం : |


దేవేంద్రనందనా! లోకనాథుడైన శ్రీ మహావిష్ణువు యజ్ఞాంగములచే సమస్త అవయవములను కూర్చుకొన్న వరాహరూపాన్ని ధరించి వేంకటాచలంపై ఎలా నెలకొన్నాడో చెబుతాను విను. బ్రహ్మ యొక్క రాత్రి పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని మరల ప్రాణులను సృష్టించడానికి సంకల్పించాడు. భగవంతుని మనస్సులో 'భూదేవి తప్ప ఇతరులు ప్రాణి సమూహాలను ధరించటానికి సమర్థులు కారు' అని తోచింది. ఆయన పాతాళంలో ఉన్న, మిక్కిలి భయకంపితురాలయిన అపరిమిత జలసమూహంతో పరివేష్టితురాలైన భూమిని ధ్యానదృష్టితో దర్శించాడు. శ్రీ మన్నారాయణుడు భూమిని ఉద్దరించడానికి తగిన దివ్య వరాహరూపాన్ని ధరించాడు. ఆయనకు ఉపాకర్మయే పెదవులు. అగ్నిహోత్రం నాలుక. ఓంకారం గర్జనం. నాలుగు వేదాలు నాలుగు పాదాలు. ప్రాయశ్చిత్తాలే డెక్కలు. యజ్ఞశాల పురోగృహమే శరీరం. ప్రకాశించే దర్భలే రోమాలు. ప్రవర్యమనే యాగ విశేషమే నాభి. దక్షిణాగ్నియే ఉదరం. స్రుక్కు తుండము (మూతి). సకలవిధ యజ్ఞ సామగ్రులు అవయవ సంధులు. దివ్యసూక్తముజూ లు. పరబ్రహ్మ శిరస్సు. హవ్యకవ్యములు వేగం. పరిశుద్ధమైన యజ్ఞ పశువు మోకాళ్ళు. ఉదాత్తానుదాత్త


స్వరితపుత స్వరూపమైన ఛందోమార్గ తంత్రం బలం. ఈ విధంగా శ్రీ మన్నారాయణుడు సర్వ యజ్ఞాంగాలతో కూడిన దివ్యమైన వరాహరూపాన్ని ధరించాడు. ఆయన బాలచంద్రునిలా ప్రకాశిస్తున్న తన దంష్టల కాంతి సమూహాలతో భూమిని వెతకటానికి హఠాత్తుగా సముద్ర జలాల్లోకి ప్రవేశించాడు. ఆ కాంతి పుంజాలతో ప్రళయకాల సమయంలో వ్యాపించే అంధకారం పోగొడుతూ మేఘగర్జనలను తిరస్కరించే గాఢమైన 'ఘురు ఘురు' శబ్దాలతో బ్రహ్మాండాన్నంతా ప్రతిధ్వనింపచేశాడు. తన కాలిగిట్టల విన్యాసంతో శిథిలి శరీరుడైన ఆదిశేషుని ఇటు అటు కదుపుతూ, తీవ్రమైన నిశ్శ్వాస పవనాలతో, సముద్రం యొక్క అధోభాగాన్ని పాతాళ పర్యంతం కనబడేటట్లు చేస్తూ, నీటిలో మునుగుతూ, లేస్తూ, చాలా పొడవైన తన మూతితో వరాహరూపంతో సముద్ర జలాలను సంక్షోభితం చేస్తూ నీటిలోనికి ప్రవేశించాడు.


వరాహస్వామి సప్త పాతాళలోకాల క్రింద ఉన్న, భయంతో ఉద్విగ్నురాలై వణుకుతున్న భూదేవినిచూ చి సంతోషంతో ఆమెను తన కోరల చివరి భాగాన ఎక్కించుకుని జనలోకవాసులైన మునులు స్తుతిస్తుండగా సముద్రం నుండి పైకి వచాడుశ్రీ మన్నారాయణుడు మతో వసుంధరను ఎత్తుకోగా సముద్రజలం క్షణకాలం మంగళోచితమైన తెరగుడ్డగా ఏర్పడింది. భూదేవిని ఉద్దరించే సమయంలో వరాహరూపుడైన శ్రీ మన్నారాయణుని గంభీరఘోషలతో సముద్రం మంగళధ్వనిని పొందింది. ఉత్తుంగ తరంగాలనుండి వెలువడిన నీటి తుంపరలు ముత్యాల సమూహాలవలె మంగళాక్షతలుగా విలసిల్లినాయి. వరాహస్వామిచే పైకి తీసుకురాబడిన భూదేవి నీటితో తడిసి గాఢానురాగం వలన ఏర్పడిన స్వేదముతో ఆచ్చాదించిన శరీరం కలదిగా ప్రకాశించింది. ఈ విధంగా వరాహస్వామి పాతాళలోకం నుండి భూదేవిని ఉద్దరించి సముద్ర జలమధ్యంలో స్థిరంగా స్థాపించాడు. అప్పుడు భూమ్యాకాశాలు సముద్రజలంలో నిండిపోయాయి. సముద్రజలం భగవంతుడు చేసిన నియమాన్ని అతిక్రమించినట్లయింది. ఈ విధంగా భూమిని సంస్థాపించి, దానికి ఆధారంగా దిగ్గజాలను, ఆదిశేషుని, కూర్మాన్ని ఉంచాడు. వాటన్నిటికి ఆధారంగా దయాసముద్రుడై శ్రీ మన్నారాయణుడు ఆదరంతో అవ్యక్తరూపమైన తన శక్తిని నియోగించాడు. ఈ విధంగా భూదేవిని ఉద్దరించిన వరాహరూపాన్ని ధరించిన విష్ణువును జనలోకవాసులు, సనకాది మహరులు ఆరాధించి సంతోషాన్ని పొందారు. శ్రీ మన్నారాయణుని ఆజ్ఞచేత బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పూర్వమున్నట్లే మరల సృజించాడు అనగా విని అర్జునుడు 'ప్రళయకాల జలంలో మునిగిన ఈ భూమి ఎలా ఉంది? సప్త పాతాళ లోకాల క్రింది భాగంలో దీనికి ఏమి ఆధారంగా ఉన్నది? ఈ భూమికి కల్పకాలం ఎంత? దాని ప్రవృత్తి ఎటువంటిది? ఈ విషయాలన్నీ నాకు వివరించి చెప్పవలసింది' అని భరద్వాజ మహర్షిని అడిగాడు.


3. యుగాలు, మన్వంతరాలు, కల్పాలు :


అర్జునుని ప్రశ్నకు భరద్వాజమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు - 'ఆరు వినాడికలు కలిస్తే ఒక నాడిక అవుతుంది. అటువంటి ఆరు నాడికలు కలిసి ఒకరోజు అవుతుంది. ముప్పె రోజులు శుక్ల, కృష్ణ పక్షాలతో కూడిన ఒక నెల అవుతుంది. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు ఋతువులు శీత - వర్ష - ఎండా కాలాలతో కూడిన, ఉత్తర - దక్షిణ అయనాలతో కూడిన ఒక సంవత్సరమవుతుంది. సూర్యుని సంచార భేదం వలన ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు అయనాలు ఏర్పడతాయి. వాటిలో దక్షిణాయనం దేవతలకు రాత్రి, రాక్షసులకు పగలు. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రిగా పరిగణించబడుతుంది. 43,24,000 మానవ సంవత్సరాలు కృతే త, ద్వాపర, కలి యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది. డెబ్బె ఒక్క మహాయుగాలు ఒక మన్వంతరం. ఈ శ్వేతవరాహ కల్పంలో పుట్టిన మనువులు : మొదట స్వాయంభువ మనువు, తరువాత స్వారోచిష మనువు, ఆ తరువాత తామస మనువు, ఆపైన రైవత మనువు, ఆపైన చాక్షుష మనువు పుట్టారు. ఈ ఆరుగురు పూర్వమనువులు ఇంద్ర - దేవ - ఋషులతో పాటు గతించారు. అర్జునా ! ఇప్పుడు ఏడవవాడైన వైవస్వత మనువు ఉన్నాడు. ఆ కాలంలో సూర్య - వసు - రుద్రాది దేవతా సమూహాలు ఉండినాయి. వారిలో తేజశ్శాలి నూరశ్వమేధ యాగాలు చేసి దేవేంద్ర పదవిని పొందాడు. విశ్వామిత్రుడు, నేను (భరద్వాజుడు) అత్రి, జమదగ్ని, కాశ్యపుడు, వసిష్ఠుడు, గౌతముడు ఈ ఏడుగురం సప్త ఋషులుగా ప్రఖ్యాతి చెందాము. శూరులు, మహాబలులు, నిత్యం ధర్మమార్గ ప్రవర్తకులు అయిన ఇక్ష్వాకు వంశ ప్రముఖులు వసుధను పరిపాలించారు. సూర్య, దక్ష, బ్రహ్మ, ధర్మ, రుద్రాదుల పుత్రులు సావర్ణి, రౌచ్య, భౌమాదులు భవిష్యత్తులో వచ్చే ఏడుగురు మనువులు.


బ్రహ్మ యొక్క పగటికాలంలో పధ్నాలుగు మంది మనువులుంటారు. దానిని కల్పమంటారు. ఆ తరువాత బ్రహ్మకు రాత్రి వస్తుంది. అప్పుడు భూమ్మీద నూరు సంవత్సరాలు భయంకరమైన అనావృష్టి సంభవిస్తుంది. దానివలన భూమి నిస్సారమై దుర్భిక్షమేర్పడి చతుర్విధ భూతాలు నశిస్తాయి. అప్పుడు సూర్యుడు కాల్చిన బాణాల వలెనున్న అగ్నిజ్వాలల వంటి కిరణాలతో ఉంటాడి. అప్పుడు భూమ్మీద గ్రామాలు, నగరాలు, పర్వతాలు, వృక్షాలు, అడవులు అన్నీ నశించి భూమి తాబేలు డిప్పవలె, కాల్చిన ఇనుపముద్ద వలె ఉంటుంది. అప్పుడు చతుర్ముఖుని శరీరం నుండి పుట్టిన ఆకాశాన్ని ఆచ్ఛాదిస్తూ భయంకరంగా గర్జిస్తూ మేఘాలు తెలుపు, పసుపు, ఎరుపు, నలుపులతో చిత్ర వర్ణాలు కలవై భయంకరాలై పర్వతరాజాలు, సౌధాలు, వృక్షాలు మొదలైన అనేక రూపాలతో కూడినవై నూరు సంవత్సరాలు మహావృష్టిని వర్షిస్తాయి. ఆ జలంతో సూర్యుని వలన పుట్టిన మహానలం శమిస్తుంది. మరల ఆ మేఘాలు తొమ్మిది సంవత్సరాలు భయంకరంగా వర్తిస్తాయి. ఆ నీటితో సముద్రాలు ఉప్పొంగి తమ తీరాలను అతిక్రమిస్తాయి. ప్రళయాంతంలో ఆ మేఘాలు వర్షించిన నీరు లోకాలను ముంచెత్తుతుంది. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకాలను గాఢాంధకారం ఆవరిస్తుంది. భూమి పాతాళ లోకంలో ఒకమూల నీటిలో మునిగి బ్రహ్మశక్తిని ఆధారంగా చేసుకొని నశించకుండా ఎలాగో ఉంటుంది. బ్రహ్మదేవుని నిశ్శ్వాసాల నుండి పుట్టిన వాయువు ప్రళయకాలంలో పుట్టిన మేఘాలన్నింటిని చెల్లాచెదురు చేస్తాడు. ఈ విధంగా విజృంభించిన వాయువు నూరు సంవత్సరాలు నివారించడానికి వీలుకాని వేగంతో వీస్తాడు. ఆ ఉగ్రుడైన వాయువును వదలి పరమేష్టి ఆ నీటిలో శ్రీ మన్నారాయణుని నాభికమలంలో యోగనిద్రను పొందుతాడు. యోగనిద్రలో ఉన్న బ్రహ్మకు పగలు ఎంత ప్రమాణమో రాత్రి కూడా అంతే ఉంటుంది. రాత్రి గడిచిన తరువాత బ్రహ్మదేవుడు మేల్కొని భగవదాజ్ఞతో పూర్వం వలె సర్వప్రాణులను సృష్టిస్తాడు.


4. శ్వేతవరాహావతారం :


శ్రీ మహావిష్ణువు ప్రతికల్పంలో అనుకూల రూపాలతో జగత్తును పరిశీలిస్తాడు. అందువలన ఈ కల్పంలో శ్వేత యజ్ఞ వరాహ రూపాన్ని ధరించాడు.శ్రీ మన్నారాయణుడు భూలోకంలో వరాహరూపంతో విహరిస్తూ తాను పూర్వమే ఆవాసంగా నిర్ణయించుకునశ్రీ వేంకటాచలంపై నెలకొన్నాడు. దామోదరుడు స్వామి పుష్కరిణీ తీరంలో చాలాకాలం విహరిస్తూ పరమభక్తితో కూడిన చతుర్ముఖునూ చాడు. బ్రహ్మదేవుడు లోకరక్షకుడైశ్రీ మన్నారాయణ చి 'స్వామీ! అనాది, దివ్యమునైన తమ నిజ స్వరూపాన్ని ధరించండి' అని ప్రార్థించాడు. ఈ విధంగా బ్రహ్మ ప్రార్థించగా వరాహస్వామి తన రూపాన్ని వదిలి అనితరసాధ్యమైన సర్వవ్యాపక శరీరాన్ని పొందాడు. ఆ విధంగా ఆ పర్వతంలో మూర్తీభవించిన ఉత్సాహరూపంలో ఉన్న ఆ దేవదేవుని చాలాకాలం వరకు జనులు దర్శించలేకపోయారు. ఈ విధంగా భరద్వాజుడు చెప్పగా విని అర్జునుడు 'ఓ భరద్వాజ మహర్షీ! దర్శన స్మరణాదులకు అగోచరుడైన శ్రీ మన్నారాయణుడు మానవులకు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ప్రపంచంలోని జనులకు కనబడనటువంటి ఆ ప్రభువుని ఆరాధించి ఎవరు ప్రత్యక్షం చేసుకొని ధన్యులైనారు? ఈ కథను నివేదించండి శ్రీ హరి కథాశ్రవణం వలన పాపాలు నశిస్తాయి. సకలాగమవేత్తలైన తమరు విష్ణుకథలను చెప్పండి.ఓ మునిపుంగవా! మీ దర్శనం వలన నేనిప్పుడున్న పుణ్యాత్ములలో అగ్రగణ్యుణ్ణియ్యాను" అన్నాడు.