ధర్మమున్న చోట దైవముండు


ధర్మమున్న చోట దైవముండు


మన పురాణ ఇతిహాసాలలో ధర్మ సూక్ష్మాల గురించి ఎంతోమంది కవులు వివరించినప్పటికీ ఎఱ్ఱన భారతంలోని ధర్మ రహస్యాలు అత్యంత ప్రామాణికమైనవి. అవి ఆనాటి తరానికి కాదు, ఈనాటి తరానికి కూడా ఎంతో ఆదర్శాలు, ఆచరణీయాలు. అల్పకులంలో జనించిన ధర్మవ్యాధుని చేత అనంత రహస్యాలను చెప్పించబడ్డాయి.


మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే కటికవాడు. అతడు అనుదినము తన వృత్తిలో భాగంగా మాంసమును అమ్ముచుండెను. అతని ముందట అల్ప మృగముల మాంసముండెను. మాంసము కొనుటకై వచ్చువారు వచ్చి బేరమాడువారు. బేరం దొరకక వెళ్ళిపోయేవారు, బేరం కుదుర్చుకొని కొనువారుండిరి. అదే సమయంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు అతని దర్శనార్థము అటువైపు వచ్చెను. కాని మాంసపు ప్రోగుతూ డగానే అసహ్యించుకొని అక్కడికి పోజాలక ఒక చెట్టుక్రింద నిలబడెను. బుద్ధిమంతుడైన ధర్మవ్యాధుడు కౌశికుని వృత్తాంతము తెలిసికొని యుండి తన యంగడి విడిచి అతని కడకు పోయి ఓ బ్రాహ్మణుడా, కుశలమా? నీవు ప్రయాణము సుఖముగా చేసితివా? ధర్మంబుల నేర్చుకొను ఆసక్తి నీకు మెండుగా కలదు. పతివ్రతా తిలకమైన ఆ బ్రాహ్మణ స్త్రీ నిన్ను పంపించగా పరమ భక్తితోడ నీవు నా దగ్గరకు వచ్చావు. ఇంకా ఆలస్యమెందులకుమా ఇంటికి పోదామురమ్ము అని పలికి వానిని తోడ్కొని పోయెను. ధర్మవ్యాధుని వినయ విజ్ఞాపనకు కౌశికుడు ఆశ్చర్యపడి తనలో ఇట్లు తలచుకొనెను. నేను వింతల మీదవింత సంఘటనలను చుచున్నాను. తాను చెప్పకముందే తన గురించి తెలుసుకోవడం కౌశికునికి ఆశ్చర్యం కల్గించింది. అందువల్ల ఈ కటికవాడు పరమ పూజ్యనీయుడు. ఈతని ద్వారా ధర్మరహస్యాలు తెలుసుకొని కృతార్థుడనయ్యెదనని నిశ్చయించి అతని గృహమునకేగి, అతనిచే పూజితుడై కౌశికుడు ఇట్లనియె. అయ్యా! నీవు సకల ధర్మముల నెరుగుదువు. జంతువుల సంహరించి మాంసమును విక్రయించుట నీకు ధర్మమే? అహింస పరమ ధర్మమనే యార్యుల మాట వినియుంటివి కదా! మరి ఇంతటి జ్ఞాన సంపన్నుడవైన నీవు ఇట్టి దుష్కర్మలను ఆచరించుట వలన నా మనంబు మిక్కిలి చింత నొందుచున్నది. ఇంతటి నీచవృత్తి నీవేల చేయవలయు? అని పలుకగా ధర్మవ్యాధుడిట్లు బదులిచ్చె.. ఓ బ్రాహ్మణుడా ! విప్రులకు వేదాధ్యయన మెట్టిదో, రాజులకు దండనీతి యెట్టిదో, వైశ్యులకు గృషి వాణిజ్యమెట్టిదో, శూద్రులకు బ్రాహ్మణ శుశ్రూషలెట్టివో, కిరాతులమైన మాకు వేటయు, జంతుహింసయు నట్టి పరమ ధర్మంబులు. అదియును గాక నిది నాకు వంశక్రమానుగతమైన వృత్తి. నా తండ్రి తాతలు, వారి పూర్వులు గూడ నిట్టి వృత్తియందే జీవయాత్ర చేసిరి. ఈ దేశమునకు జనకుడు రాజు. అతడు వర్ణాశ్రమ ధర్మాలను మిగుల జాగరూకతతో పరిపాలించుచుండును. కులవృత్తిని అతిక్రమించినవాడు తన పుత్రుడైనను వానిని నిష్కారణముగా పట్టి దండించును. అందుచేత విదేహ దేశంబున జన్మించిన వారందరునుతమకు ఉచితములైన వృత్తులయందే ప్రవేశింతురు. కావున నేను బ్రహ్మజ్ఞానసంపన్నుడనయ్యూ, నా తాత ముత్తాతలు చేసిన వృత్తి యందే జీవిత కాలము గడుపుచుంటిని. ఈ వృత్తి యందున్నప్పటికీ నా చేతితో ఒక్క జంతువునైనను చంపి ఎరుగను. ఎవరైనా చంపుచుండగా నేమా డలేడి. ఇతరులు ఎక్కడో దూరమున జంపి తెచ్చిన జంతువుల మాంసమును కొని తెచ్చినవానిని మాత్రమే నేను విక్రయించుచుంటిని. దురాశ చేత వస్తువులను ప్రియముగా విక్రయింపను. అబద్దమాడను. పనికి మాలిన సరుకులను బలవంతముగా అంటకట్టను. కుళ్ళిన మాంసమును ఇతరులకియ్యను. న్యాయముగా వచ్చిన ధనమునే అనుభవింతును. శిష్ఠ బ్రాహ్మణుల సేవింతును. పండితులను,


సజ్జనులను సన్మానింతును. పెద్దలను గౌరవింతును. అతిథులకు కడుపునిండా అన్నం పెట్టుదును. అభ్యాగతులను ఆదరింతును. దేవతలను అర్చింతును. సత్య శౌచములను విడువను. పరుల దూషణ చేయను. వేరేవారు చేసినా నేను వినను. నన్ను స్తుతించిన వారియందును, నిందించిన వారియందు సమానభావమును కలిగియుందును. ఏకపతీవ్రతుండను. ఇట్లు జేయుటం జేసి హీనకులంబున జన్మించినవాడనయ్యు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడనయ్యి, గౌరవాస్పదుడనయి యున్నాను. నీవు నా కడకు ధర్మంబులు తెలుసుకొనుటకై వచ్చియుంటివి. కావున నాకు తోచిన ధర్మాలను కొన్నింటిని నెటింగించెద సావధానుండవై వినుము.


ఎవరైనా తన కుల ధర్మమందు ప్రవర్తిల్లుట ఉత్తమోత్తమైన విషయం. శాంతము అన్నిటియందు ప్రధానము. ఓర్పును మించినది మరియొకటి లేదు. విషయములందు వాంఛలను విడువవలయును. పరిత్యాగము వంటి ధర్మము మరియొకటి లేదు. స్వార్థ త్యాగులకు అసాధ్యమైనది లేదు. క్రోధ, లోభములను ముఖ్యముగా విడువవలయును. ఏ కారణంబునైనా, నెరినైన క్రోధంబు కల్గిన యెడల దానిని అన్ని విషయములందు ప్రసరింపజేయుట న్యాయము కాదు. కోపము మనస్సులో పెట్టుకొని ధర్మము తప్పుట సరికాదు. అపకారము చేసినవారికి ఉపకారము చేయుట మేలైన విషయం. ఇతరులకు అపకారము యందు అసూయ పడరాదు. ఎప్పటికైనా ధర్మమే జయించును. అధర్మము జయించినట్లు పైకి కనిపించినను తుదకు అది జయింపలేదు. మనుష్యులు పాపం చేయక మానరు. చేసిన పాపములకు దగిన ప్రాయశ్చిత్తము చేసుకొనవలయును. అట్టి యుత్తమ ప్రాయశ్చిత్తమునకు విధానమిది. అయ్యో! ఈ పాపమేల చేసితినని చింతించిన సగము పాపము పోవును. ఇకముందు ఇట్టి పాపము చేయకూడదని ప్రతిన బూనుట చేత తక్కిన పాపము నశించును. ఈ ప్రాయశ్చిత్తము పేరు పశ్చాత్తాపము. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు. పాపములన్నింటిలో క్రోధ, లోభములు అధికములు. వానిని జయించినవాడే ధర్మశీలుడు.


ఓ బ్రాహ్మణుడా! ధన సంపాదన కొరకు నేను హింస చేయుచున్నానని నీవు పలికితివి. హింస యొక్క తీరు తెన్నుల గురించి కొంత వినుము. హింస జేయక మనుష్యుడు జీవింపలేడు. కొన్నిటికి చెట్లు మొక్కలు ఆహారమై యున్నవి. కొన్ని జంతువులకే అల్ప జంతువులే ఆహారమైయున్నవి. మరికొన్ని జంతువులకు ఆకులు, అలములు ఆహారమైయున్నవి. పులి, సింహములు మాంసమునే భుజించును. ఏనుగులు, మేకలు శాకములను ఆరగించును.


మానవులు శాకాహారముతో పాటు మాంసాహారము కూడా భుజింపవచ్చును. హింస చేయకపోయిన పక్షమున మానవులు క్షణకాలము కూడా ఉండలేరు. అందుచేత హింస అనేది అవశ్యకమైనది. హింస చేయకున్నా పులి ఎట్లు జీవించును? మానవులు మాంసమును విసర్జించినా, శాకాహారము కొరకు వృక్షాలనైనా హింసించక తప్పదు. ఒక్క భోజన నిమిత్తమే గాక తెలిసియు తెలియకయు మానవులు హింస చేయుచునుందురు. మనమునడుచునప్పుడు కాలికిందపడి, మరియుదున్నునప్పుడు నాగలి క్రిందపడి ననేక జంతువులు చచ్చుచున్నవి. నీటిలో జంతువులున్నవి. వాయువునందు జంతువులున్నవి. నీరు త్రాగునప్పుడు, గాలి పీల్చునప్పుడు మన ఇచ్చ లేకయే అనేక జంతువులు నశించుచున్నవి. అది నివారింతుమన్నను మన వశము కాదు. ఇది ప్రపంచ ప్రకృతి. ఐనను మాంసము మొదలగునవి విసర్జించడం మానవుల యొక్క పరమ ధర్మము. శాకముల హింసించుట తప్పకపోయినను జంతుహింస లేకపోవుట వలన కొంతమేరకు మేలు కలిగించే విషయమే. ఇంకా ఇట్టి ధర్మములు అనేకములు గలవు. ధర్మ సూక్ష్మములు తెలుసుకొనుట మహరులకు కూడా సాధ్యము కాదు. ముఖ్యంగా ఆపత్కాలమందు కూడా ధర్మము దప్పక మైత్రి తోడ జీవనము సాగించవలయును. అందువలన నీకు ఇహ పరంబులు కలుగునని ధర్మవ్యాధుడు కౌశికునకు ధర్మరహస్యాలను తన ధర్మంగా బోధించెను. అతని ధర్మమార్గాలు విని కౌశికుడు మిక్కిలి సంతోషించి ఆ ధర్మవ్యాధునకు నమస్కరించి తన స్వగృహమునకు వెళ్ళిపోయెను. ఈ విషయాలను బట్టిమానవులు మనసా, వాచా, కర్మణా ఇతరులకు హాని చేయకుండా ఉండడం గొప్ప ధర్మమని అవగతమవుతుంది. అంతేకాదు ఏ వేళలోనైనా ప్రాణాపాయ స్థితిలోనైనా తమ ధర్మాలకు కట్టుబడి ఉండడమే సనాతన ధర్మం .


ధైర్యము, ఓర్పు, మనస్సును నిగ్రహించుట, దొంగతనము చేయకుండుట,శుచిత్వం,ఇంద్రియనిగ్రహము,విద్యనార్జించుట, సత్యమునే భాషించుట, క్రోధము లేకుండుట. ఈ పది ధర్మాలకు భంగము వాటిల్లినప్పుడల్లా పరమాత్ముడు అవతారమెత్తి వాటిని పరిరక్షించినట్లు భాగవతం పేర్కొంటున్నది. ఈ పది ధర్మాలను రక్షించడానికే అవతరించడం చేత విష్ణువు దశావతార మూర్తిగా కీర్తి పొందాడు. రాక్షసులు వేదాలను దొంగిలించి సముద్ర గర్భములో దాచినప్పుడు పరమాత్ముడు మత్స్యావతారమెత్తి వాటిని పరిరక్షించి దొంగతనం చేసినవారికి ఇలాంటి శిక్షలు తప్పవని నిరూపించాడు. పాల సముద్రమథనం వేళ మందరగిరి పర్వతాన్ని నీటిలో మునిగిపోకుండా రక్షించి ఓర్పుతో, నేర్పుతో దేవ దానవుల ప్రయత్నాన్ని పరిరక్షించాడు. అహంకారంతో మదమెక్కి మనస్సు నిగ్రహం కోల్పోయి భూమండలాన్ని చుట్ట చుట్టుకుని పాతాళంలో దాగిన హిరణ్యాక్షుణ్ణి వరహావతారమెత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి మనస్సును నిగ్రహించుకోవాలని చాటి చెప్పాడు. గర్వాంధకారంతో కన్నూ మిన్నూ కాకుండా నాయంతవాడు మూడు లోకాలలో ఎవరూ లేరని విర్రవీగుతూ పసివాడూ, పరమభక్తుడైన స్వంతకుమారుడైన ప్రహ్లాదుని అనేక విధాలుగా వధించుటకు ప్రయత్నించిన హిరణ్యకశిపుణ్ణి నృసింహావతారమెత్తి వధించి దయతో ప్రహ్లాదుని రక్షించాడు. ఇంద్రియ నిగ్రహ బలంతో నా యంతటి దానశీలురు లేరని విర్రవీగు బలిచక్రవర్తిని నేర్పుతో వామన అవతారమెత్తి అతని గర్వమును అణచివేశాడు. పరశురామావతారంతో ధీరత్వం ప్రదర్శించాడు. రామావతారంతో శ్రీ కృష్ణావతారంతో రాక్షస గుణాలను, కామక్రోధాలను అణచివేశాడు.


ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీ రామ, శ్రీ కృష్ణావతారాల్లో మానవ రూపంగా జన్మించిన విష్ణువు మానవులకు ధర్మసూత్రాలను బోధించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఈ రెండు అవతారాలు మానవులకు దశ ధర్మాలను బోధించడమే కాదు. తాను స్వయముగా ఆచరియా పించాడు. ముఖ్యంగా శ్రీ రామావతారంలో ఒకటే బాణం, ఒకటే మాట, ఒకతే సతియని చాటిచెప్పి సద్గుణాలరాశిగా నిలిచాడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం 14వత్సరాలుఅడవులపాలయ్యాడు.మాయాతత్త్వాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సీత అపహరణకు గురి అయినప్పుడు, నిండూ లాలిని తానే స్వయంగా అడవులకు పంపినప్పుడు మనస్సును నిగ్రహించుకొని, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రదర్శించాడు. ఓర్పు, నేర్పును ప్రదర్శించి ఆంజనేయుడిని బంటుగా స్వీకరించి, వాలిని సంహరించి సుగ్రీవునితో మైత్రి చేసి, శరణన్న విభీషణుని చేరదీసి, కామ, క్రోధ పూరితులైన రాక్షసులను ధీరత్వంతో వధించి జగదభిరామునిగా, సుగుణాభిరామునిగా కీర్తి పొంది మానవులకు ఆదర్శప్రాయుడయ్యాడు. ఇప్పటికీ ఏ కన్నెపిల్లను నీకు ఎలాంటి భర్త కావాలని అడిగితే నాకు రాముడి లాంటి భర్త కావాలంటారు. నీకు ఎలాంటి కొడుకు కావాలంటే శ్రీ కృష్ణుని వంటి కొడుకు కావాలని కోరుకుంటుంది కడుపుతో ఉన్న స్త్రీ. ఎందుకంటే పరమాత్ముడైన విష్ణువు ఈ రెండు అవతారాల్లో పది ధర్మలక్షణాలను తాను ఆచరించడమే కాకుండా మానవులకు బోధించి సక్రమ మార్గంలో నడిపించాడు. అంతేకాదు, ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని తానే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. దశకం ధర్మ లక్షణాలలో అత్యంత ముఖ్యమైనవి సత్యం, అహింసలు. ఇవి బౌదావతారంలోనూ పేర్కొనబడ్డాయి. ఇవి సనాతన ధర్మాలని పేర్కొన్న శ్లోకాలను గమనించండి.


సర్వదా సర్వకాలాలయందు సత్యమునే మాట్లాడవలెను. ప్రియముగా మాట్లాడవలెను. ప్రియంగా ఉంది కదాయని అబద్దాలు చెప్పకూడదు. ఇదియే సనాతన ధర్మము. అంతే కాదు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడినా చేయకూడని పనులు చేయకూడదు. చేయవలసిన పని మంచిది అయినప్పుడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనైనా మానివేయకూడదు. "అహింసో పరమధర్మః" అంటుంది శాస్త్రం. ఏ జీవికీ హాని చేయకుండా ఉండుట పరమ ధర్మము. అది పరమ పవిత్రమైన తపస్సు. అహింసయేశ్రీ షమైన ధర్మం. ఈ ధర్మాలను మునులు చాలా గొప్పగా వర్ణించారు. "ధర్మో రక్షతి రక్షితః" అనగా ధర్మం తన్ను హింసించిన వారిని నాశనం చేస్తుంది. తనను రక్షించిన వాడిని తాను రక్షిస్తుంది. కాబట్టి ధర్మం ఏనాడూ ఎవరిచేతనూ నాశనం చేయదగింది కాదు. కనుక మానవులు సదా ధర్మపరులై యుండాలి. అటువంటి ధర్మపరులయందే దైవం ఉంటాడు అని పలికిన పెద్దల మాటలను మరువకూడదు.