మహేంద్ర పర్వతం మీద పాండవుల ఆలయాలు - కౌతా నిర్మల
మార్పు కనుమల్లో, ఒడిశాలో మహేంద్ర పర్వతాలు లూ ఉన్నాయి. ఈ పర్వతాలకు ఓ ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే పూర్వం పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లుగా తెలుస్తోంది. పరశురాముడు మహేంద్రగిరి మీద తపస్సు చేసినట్లుగా తెలుపబడింది. కుంతీదేవికి ఒక గుడి ఉంది. ఆ గుడికి సమీపంలోనే ధర్మరాజు గుడి ఉంది. కొంతదూరంలో భీముని కోవెల ఉంది. నకుల, సహదేవులకు గుడులు ఉన్నాయి. అర్జునుడికి మాత్రం గుడి లేదు. అర్జునుడి పర్వతం ఉంది. శివలింగం పాతాళంలో ఉంది. అయితే ఇక్కడ ఒక సొరంగం కూడా ఉందనీ, ఆ సొరంగమార్గం ద్వారా పాండవుల రాకపోకలు జరిగేవనీ చెప్తారు. ఇక్కడ ప్రతి గుడిలోనూ శివలింగాలున్నాయి. పాండవులు శివుని పూజించిన నిదర్శనంగా, అవి ఉన్నాయని స్థానికులు చెప్తారు. పాండవులు ఆ పర్వతం మీద శివుని గురించి తపస్సు చేసినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది.
మహేంద్ర పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. పైగా అక్కడకు చేరుకోవడం చాలా కష్టం. ఎత్తు పల్లాలతో, లోయలతో కూడి ఉంటుంది మహేంద్రగిరి. సంవత్సరమంతా ఎవ్వరూ ఆ పర్వతాల మీద ప్రయాణం చేయరు. శివరాత్రి పర్వదినానికి రెండు మూడు రోజుల ముందుగా కొండల మీదకు భక్తులు చేరుతుంటారు.శ్రీ కాకుళం జిల్లాలో ఉండే మందస అనే గ్రామం చేరుకుని, అక్కడకు నలభై కిలో ఈటర్ల దూరంలో ఉన్న సాబకోట ప్రాంతానికి చేరుకోవాలి. సాబకోట గ్రామం నుంచి కాలి నడకన మహేంద్రగిరి వెళ్తారు భక్తులు. పూర్వం మందసను పాలించిన రాజైన మణిదేవుడు యాత్రికుల సౌకర్యార్థం సత్రాన్ని నిర్మింపచేశాడు. అక్కడ ఒక సెలయేరు కూడా ఉంది. మందర పర్వతం మీద శివరాత్రినాడు గుళ్ళను దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు సెలయేరులో స్నానం చేసి వంటలు చేసుకుని ఆహారాన్ని భుజిస్తారు. పగటి సమయంలోనే పర్వతాల మీదకు ప్రయాణం చేస్తారు.
సాబకోట అడవి ప్రాంతంలో సాబకోట నుండి ఏడుగంటలు నడిచిమహేంద్రగిరికి చేరుకుంటారుభక్తజనం.ఒకకొండ దాటితే మరో కొండ, ఒక కొండ చరియ దాటితే ఇంకొక కొండవాలు దాటాలి. అతి జాగ్రత్తగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. కష్టసాధ్యమైన ప్రయాణం అయినప్పటికీ అసంఖ్యాకమైన భక్తులు ఆ కొండల మీదకు చేరుకుని శివరాత్రికి పాండవులు, పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశాలు, శివాలయాలు దర్శిస్తారు. శివరాత్రికి గుళ్ళకు జనరేటర్ సహాయంతో విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తారు. కుంతీ ఆలయంలో ఒక బావి ఉంది. అతి ఎత్తయిన కొండమీద, బండరాళ్ళలో బావిని ఎలా తవ్వారా అన్నది అందరినీ విస్మయపరిచే విషయం. ఆ బావి నీళ్ళను యాత్రికులు ఉపయోగించుకుంటారు. భీముని గుడిని అయిదారు అతి పెద్ద బండరాళ్ళతో నిర్మించారు. ఆ గుడిలోకి వెళ్ళి శివలింగాన్ని దర్శించాలంటే ఒక బండరాయిని తొలిచి, ఏర్పాటు చేసిన సన్నటి ద్వారం గుండా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మహేంద్ర పర్వతాల మీద ప్రకృతి సౌందర్యం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. సూర్యోదయాన్ని తిలకించడం అద్భుతంగా, అతి మనోహరంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడు క్రమేపీ పైకి వస్తుంటే భక్తులు కొబ్బరికాయలు కొట్టి, హారతిని సమర్పిస్తారు. ఒడిశా సాంప్రదాయ పద్ధతిగా, 'ఉలాలు' నైవేద్యంగా సమర్పిస్తారు. శివరాత్రి నాడు రాత్రంతా శివనామస్మరణ చేస్తూ పంచాక్షరీ మంత్రం జపిస్తూ, భజనలు చేస్తూ జాగరణ చేస్తారు భక్తులు. సుప్రభాత సమయమవగానే జాగరణ పూర్తవుతుంది. వారి యాత్ర కూడా ముగిసిపోతుంది. ఇక్కడ గుళ్ళలో ఒడిశా పూజారులు ఉంటారు.
కొండలను ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ, ఎత్తు పల్లాలను గమనిస్తూ క్రిందకు దిగవలసి ఉంటుంది. గుంపులు గుంపులుగా భక్తులు హరహర మహాదేవ శంభోశంకర, ఓం నమశ్శివాయ అని ఉచ్చరిస్తూ కొండను ఎక్కుతూ, దిగుతూ తమయాత్రనుపూర్తి చేస్తారు. తమయాత్రానుభవాన్ని తలచుకుంటూ వచ్చే శివరాత్రికి కూడా మహేంద్రగిరికి రావాలని మనస్సులో స్థిరనిర్ణయం చేసుకుంటారు. ప్రకృతి సౌందర్యాన్ని, రమణీయతనూ వీక్షించాలని వచ్చిన యాత్రికులలో కూడా ఆధ్యాత్మికత ఏర్పడి, వచ్చే సంవత్సరం శివరాత్రికి మహేంద్రగిరికి రావాలన్న సంకల్పం వారి మనస్సుల్లో కూడా కలుగుతుంది.