శాంతము

శాంతము                                                            - భరద్వా జ


శాంతము సాత్త్విక స్వభావముగా తలంపవచ్చు. సాత్త్వికుడు ఇతరుల క్షేమమే కోరుతాడు. అపకారము చేయబూనడు. నిశ్చలమైన మనస్సుతో ఉంటాడు. కలత, వ్యాకులత లేకుండా ఉంటాడు. లభించిన దానితో తృప్తిపడతాడు. ఇటువంటివాని మానసిక స్థితే శాంతము. ఇది నవరసములలో చివరిది.. మనస్సు, ఆలోచన, ఆచరణలు క్రోధము వైపు నుండి కదులతూ వచ్చి మధ్యేమార్గంలో సమస్థితిని దాటి శాంతము వైపు పురోగమిస్తూ చివరకు చేరితే అప్పుడు శాంతము, శాంతి పూర్తిగా లభించినట్లే. ఆ స్థితి చేరడానికి క్రోధము క్రమముగా తగ్గించుకుంటూ వచ్చి మనస్సును, ఆలోచనలను శాంతస్థితిలో ఉంచుకుంటూ సాధన చేయాలి. దీనికి ఒడిదుడుకులను లెక్కచేయని ధైర్యం కావాలి. అప్పుడు ముఖం తేటగా ఉంటుంది. ముఖవర్చస్సు ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది. నడవడిక తొట్రుపాటు లేక నిశ్చలంగా ఉంటుంది. క్రోధము, శాంతము రెండూ వ్యతిరేక పదాలు. మానసిక స్థితిని తెలిపేవి. ఒకటి ఉన్నచోట మరియొకటి ఉండదు. ఒకటి మనోవ్యాకులత. తనకు, ఇతరులకు అపకారము కలుగజేస్తే రెండవది మానసిక నిశ్చలత, ఉద్వేగరహితముగా తన, ఇతరుల జీవితములకు ఒడు దుడుకులు లేకుండుట, ఆరోగ్యకరమైన సమాజాన్ని పెంపొందించుకొనుట - వీటిని కలుగజేస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. చెడు తలంపులను దరి చేరనీయదు. శాంతము అనేది ఒక గుణము. మనోభావాలను దానితో నింపినప్పుడు ఏర్పడే స్థితి శాంతి.


శాంతము అనేది ఒక గుణము. మనోభావాలను దానితో నింపినప్పుడు ఏర్పడే స్థితి శాంతి. శాంతము సౌఖ్యాన్ని కూరుస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు పెద్దలు. మనిషి యొక్క స్వానుభవము - శాంతాకారం భుజగశయనం... శ్రీ మహావిష్ణువు కూడా ఇదే.


- శాంతాకారం భుజగశయనం... శ్రీ మహావిష్ణువు 'శాంతాకారం భుజగశయనం..... శ్రీ మహావిష్ణువు మూర్తిభవించిన శాంతమూర్తి. త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని తేల్చి చెప్పడానికి ఋషులచే పంపబడిన భృగుమహర్షి తనను గుర్తించలేదనే కోపముతో శ్రీ మహావిష్ణువు వక్షఃస్థలమును కాలితో తన్నగా, సర్వ సమర్థుడయ్యు ఆయన కోపగించక మిగుల శాంతముగా ఆ మహరి పాదముల నొత్తి, అతని అహంకారమును పోగొట్టినాడు. ఇదే శ్రీ వేంకటేశ్వరస్వామివారి అవతారమునకు మూలమైనది. గౌతమబుద్ధుని వదనమెల్లప్పుడు మూర్తీభవించిన శాంతమే. ఎవరిని కలిసికొన్నను - దొగలు, దోపిడీ గాండ్రు, వ్యభిచారిణులు, ఇతర మతానుయాయులు - ఆయన గాంభీర్యము, ప్రశాంతత వదలి పెట్టలేదు. అందుకే ఎవరైనను నిశ్చలముగా యున్నవానిని 'శుద్ధ బుద్ధావతారము' అంటారు. ఏసుక్రీస్తు నిన్కొకడు చెంపపై కొట్టిన యెడల అతనికి రెండవ చెంప కూడ అందించుము అన్నాడు. అంటే ఒక చెంపై కొట్టినను, ఇంకా మిగిలిన కోపము తీర్చుకొనుటకై అతనికి రెండవ చెంప కూడా అందించి అతడు పూర్తిగా కోపము తగ్గించుకొనుటకు సహాయపడుము అని భావన. శిలువ వేయబడినప్పుడు ఏసుక్రీస్తు శాంతమును విడువక తన కపకారము చేసిన వారి యొక్క క్షేమమే కోరినాడు. తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమింపుము అని ప్రార్థించినాడు. ప్రస్తుత కాలంలో ప్రతివాడు శాంతి ప్రవచనాలను వల్లె వేస్తుంటాడు. కాని ఆచరణలో స్వార్థం కోసం కుట్రలు కుయుక్తులు మొదలగు సకల దుర్గుణ భావాలనుమనస్సులలో మననం చేసుకుంటూ వాటికి అనుగుణంగా మనసులలోని లోతులు ఇతరులకు అంతు బట్టనీయక మేకవన్నె పులులుగా ఉన్నారు. అన్నిటికీ మూలం చిత్తశుద్ధి, త్రికరణశుద్ధి లేకపోవడమే. అందువల్ల ముందు ఆ రెండింటి గొప్పతనము, ఆవశ్యకతల గుర్తించి భావాలను, కర్మలను వాటికనుగుణంగా మలచుకొంటే తాను ప్రపంచము నెమ్మదిగా ఉండవచ్చు. సుస్థిరశాంతి లభిస్తుంది.