ప్రమాణం 

ప్రమాణం 


                                                                                                 || కూర్మాచలం శంకరస్వామి


ఈ చరాచర జీవకోటిలో మానవజన్మ అత్యంత ఉత్తమమైనది. మహోన్నతమైనది. ప్రకృష్టమైనది. దానికి ప్రధాన కారణం మనిషికి మాట్లాడే శక్తి, విచక్షణా జ్ఞానం, ఆలోచనాశక్తి కలిగి ఉండడమే. వాక్కును (మాటను) మన పెద్దలు పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా పేర్కొన్నారు. కాబట్టి అర్థవంతమైన మాట మనిషికి గొప్ప అలంకారము. అందుకే "వాక్భూషణం సుభూషణం సుమ్మీ మానవాళికిన్" అని పేర్కొన్నాడు ఏనుగు లక్ష్మణకవి తన సుభాషితాలలో.


అనగా మానవులకు బంగారు భుజకీర్తులు,ముత్యాలహారాలు మొదలగు ఆభరణాలు నిజమైన అలంకారాలు కావని, చక్కగా అలంకరించబడిన కేశపాశమును, మంచి పూలును, పరిమళజల స్నానమును అలంకారాలు కావని, మానవుణ్ణి పవిత్రమైన వాక్కు అలంకృతుణ్ణి చేస్తుందని, అట్టి వాక్కు మంచి భూషణమని, మిగతా కనిపించే బాహ్య వస్తువులన్నీ నశిస్తాయని ఈ కవి భావం. వాక్కు అనగా మాట కాబట్టి అలాంటి మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అవి ఎప్పుడుబడితే అప్పుడు, ఎట్లాబడితే అట్లా, పరుషంగానో, పౌరుషంగానో, చికాకుగానో మాట్లాడకూడదు. మనుషుల మధ్య మ అనురాగాలను పెంచే సాధనము కూడా మాటయే. అందుకే "సూనృత వాక్కు మేయూ డగన్" అని అన్నాడు నన్నయ తన భారతంలో. అనగా నూరు మంచినీళ్ళ నూరు దిగుడు బావుల కంటే ఒక యాగం నయమని, నూరు నయమని, అటువంటి మంచి కొడుకులు నూర్గురి కంటే ఒక సత్యవాక్యము గొప్పదని ఈ వాక్యము యొక్క పరమార్థం అని శకుంతల దుష్యంతునితో చెప్పిన ఈ పరమసత్యం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ శిరోధార్యమే. కాబట్టి అలాంటి సత్యవాక్కులనే సదా మనమూ మాట్లాడాలి. సత్యవాక్కులకు మనసా, వాచా, కర్మణా కట్టుబడి ఉండాలి.


ప్రమాణం అనగా ప్రకృష్టమైన వచనం అని అర్థం. ప్రమాణం చేయడమంటే ప్రకృష్ణమైన, పవిత్రమైన వచనం లేదా మాట ఇవ్వడం అనేది ఒక అర్థమైతే, ఒట్టు పెట్టుకోవటం అనేది సామాన్య జన వ్యవహారంలో ఉన్న అర్థం. తాము చెప్పే మాటను ఎదుటివారు విశ్వసించుటకు లేదా నమ్మించుటకు చేసేదే ప్రమాణం. ఈ ప్రమాణం తమకిష్టమైన దేవుళ్ళ పైననో, లేదా తమకిష్టమైనవారిపైననో ఒట్టేసి చెప్తున్నా లేదా వాగ్దానం చేస్తున్నానని అంటారు. ఒకసారి ప్రమాణం చేస్తే దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. ప్రాణం పోయినా సరే ఆ ప్రమాణాన్ని తప్పకూడదు. ఒకవేళ తప్పినట్లయితే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయని మన పూర్వీకుల విశ్వాసం కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం విజ్ఞుల లక్షణం. "మూట బోతె దొరుకుతుంది గాని, మాట పోకూడదు" అనేది జన వ్యవహారంలో ఉన్న నానుడి. అంటే మూట అనగా సంపాదన లేదా ధనము. అట్టి ధనము ఆస్తిపాస్తులు పోతే మళ్ళీ ఎట్లాగైనా సంపాదించుకోవచ్చు. కాని ఇచ్చిన మాట తప్పినచో మళ్ళీ తిరిగిరాదు. ఒకసారి ప్రమాణం లేదా ఒట్టు పెట్టుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా నెరవేర్చడం మానవధర్మం. అట్టి ధర్మాన్ని పాటించేవారే మహనీయులుగా ఘనకీర్తి వహిస్తారు. వారిపేరే చరిత్రలో స్థిరస్థాయిగా ఈ భూమి మీద నిలుస్తాయి.


మన తెలుగు సాహిత్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడిన మహనీయులలో అగ్రభాగాన నిలిచినవారు సత్యహరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, కర్ణుడు, బలిచక్రవర్తి ముందువరుసలో చెప్పుకోదగినవారు. ఇచ్చిన మాటకోసం తన భార్యా పిల్లల్ని అమ్మి తాను కాటికాపరిగా మారినవాడు హరిశ్చంద్రుడు. అందుకే అతనిని సత్యహరిశ్చంద్రుడుగా ఘనకీర్తి వహించాడు. ఒక పావురానికి ఇచ్చిన మాటకోసం తన తొడమాంసాన్ని దానం చేసి శిబిచక్రవర్తి త్యాగశీలిగా నిలిచాడు. వామనునికి చేసిన ప్రమాణం ప్రకారం మూడడుగుల నేలను దానం చేసి బలిచక్రవర్తి వదాన్యుడయ్యాడు. మిత్రుడైన దుర్యోధనునికి మాట ఇచ్చి, ప్రమాణం చేసి చనిపోయేంతవరకు వారి పక్షాననే నిలిచాడు కర్ణుడు. అతని తల్లికుంతి ఎంత చెప్పినా, కృష్ణుడు సహితం ఎంత ఆడ పినా చేసిన ప్రమాణం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి కర్ణుడు దాన వీర శూర కర్ణునిగా చరిత్రలో నిలిచారు.


కేవలం మనుషులే కాదు ఆనాటి కాలంలో జంతువులు కూడా ప్రమాణానికి కట్టుబడి ఉండేవని తెలిపే ఒక కథను గమనించండి. "పురిక అనే పట్టణాన్ని పౌరకుడు అనే రాజు పాలించేవాడు. అతడు నిత్యము పాపకార్యములు చేయుచు కొంతకాలానికి అతను చనిపోయి ఒక నక్కగా పుట్టెను. పూర్వకర్మల ఫలితంగా తనకు నక్కజన్మ లభించినట్లు ఆ నక్క తెలుసుకొన్నది. కనీసం ఈ జన్మలోనైనా "సాధువర్తనము కలిగి బ్రతుకవలెనని" సంకల్పించుకొని జంతువులను చంపక, మాయోపాయములు పన్నక, మాంసము తినకూడదనే వ్రతము పూని ఆకులు, అలములు, పండ్లు తినుచు పొట్ట నింపుకొని కాలము గడుపుచుండెను. దాని చుట్టాలైన (బంధువులైన) మిగతా నక్కలు విరుద్ధమైన ఈ వ్రతమజూ సి సహింపక దాని కడకు పోయి "ఇది ఏమి పిచ్చి? కడుపు నిండ మాంసము తినక ఇట్లు కృశించెదవేమి? నీవు జంతువులను జంపి మాంసము దెచ్చుకొనలేకపోయిన పక్షమును మేము మాంసము దెచ్చి నీకిచ్చెదమ"ని వేడుకొన్నాయి. అప్పుడా నక్క చుట్టముల మాట వినక ఎప్పటిలాగే తన నియమాన్ని కొనసాగించింది. ఇలా గొప్ప వ్రతమును బూనియున్న నక్క వృత్తాంతమును అచటి మృగములలో ముఖ్యమైన పులి విని దాని యొద్దకు పోయి ఇట్లనియె. నీవు మిక్కిలి సౌమ్యుడవని విని నేను వచ్చాను. నాతో మైత్రి చేసి నీవు నా దగ్గరే యుండుము. నేను మిక్కిలి క్రూరుడననే పేరు కూడా కలదు. సాధు చరిత గల నీ శిక్షణలో నేను కొంతకాలము గడిపితినేని, నా క్రూరత్వము నన్ను విడిచిపెట్టవచ్చు. కావున నా దగ్గరే నీవు ఉండుము అని పులి పలుకగా, ఆ సాధువర్తన గలనక్క ఇట్లనెను. ఓ పులిరాజా! మా వంటివారికి నివాశ్రయణీయుడవు కావు. నా మనస్సు భోగముల ననుభవించుటకు ఇష్టపడకున్నది. కావున నీ మాటలు నాకు సరిపడవని నక్క పలికెను. ఆ మాటలు విని పులి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. పోనీ భోగములనుభవింపవద్దు. నాకు మంత్రివై చేయదగిన కార్యములు, చేయకూడని కార్యములు నాకు ఉపదేశించుము అని పలికిన పులి మాటలకు నక్క ఈ విధంగా పలికెను. ఓ రాజా! నీవు కోరినట్లు మంత్రి, కార్యభారములు నడుపుచుండ, తమరి మూల భృత్యులు అనగా సేవకులు నామీద గల ఈ ర్యా ద్వేషాలతో కొండెములు అనగా చాడీలు చెప్పుదురు. నీకవి ప్రియములగును. అప్పుడు నన్ను నీవు దూరంగా ఉంచెదవు. ఇన్ని కష్టములెందుకు? నన్ను నీవు మంత్రిగా నుంచుకొను పక్షమున, నీ సేవకులు జెప్పు కొండెములను నాలకింపననియు, వారి మాటలను పట్టించుకోనని ప్రమాణం" చేయుము. అట్లు చేసితివేని నీకడ నేను మంత్రిగా ఉంటానని నక్క చెప్పగానే వెంటనే పులి మరొక ఆలోచన లేకుండా ప్రమాణం చేసింది.


ఇలా కొంతకాలం గడచిన తరువాత పులి మూల భృత్యులకు (సేవకులకు) నక్కపై అసూయపుట్టెను. అంతవరకు పులినక్కను అత్యంతప్రీ తి/చూ సుకుంటున్నందుకు భరించలేక పులి సేవకులందరూ ఒక్కటై ఒకచోట జేరి ఈ విధంగా విచారించిరి. ఏమిటి ఈ విపరీతము? "ముందు వచ్చిన చెవుల కన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి యన్నట్లు" చిరకాలము నుండి రాజును కంటికి రెప్పలా కనిపెట్టుకొని బ్రతుకుతున్న మన అందరిని అణగదొక్కి ఈ బక్కనక్క ప్రభువు దగ్గర సర్వాధికారము వహించి మనపై కూడా పెత్తనం చేయుచున్నది. మన ప్రభువు కూడా దాని ఆలోచనలనే పాటిస్తూ ఉన్నాడు. అది మన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి మనలను అవమానిస్తున్నదని తలపోశాయి. అంతలో ఆ భృత్యులలోనున్నగుంటనక్క ఇట్లనియె. దీనికి నేనొక ఉపాయం సెప్పెద సావధానముగా వినండి. పులి నిమిత్తము దాచిన మాంసమును మనము అపహరించి నక్క నివసించు ప్రదేశములో పెట్టి నేరము మోపినచో పులి ఆగ్రహంతో నక్కను చంపును. దానితో మన అదృష్టము పండును అని పలుకగా ఆ గుంటనక్క మాటలు నమ్మి భృత్యువులందరూ యట్లే చేసిరి. నక్క నివాసంలో దొరికిన మాంసముడూ సి పులి నివ్వెరపడి దానిపై కొంత దురభిప్రాయము కలిగెను. అది చాలదన్నట్లు పులి మూల భృత్యులు నక్కపై లేనిపోని చాడీలు చెప్పగా విని పులి నక్కపై కోపించి దానిని పట్టుకొని చంపవలసినదిగా యాజ్ఞాపించెను.


అప్పుడు ఆ పులిరాజు తల్లి పులికడకు పోయి వానినిట్లు మందలించెను. "ఎంత వెర్రివాడవురా కొడుకా! ఇట్టి అపకారము ఎవరైనా చేయుదురా? నీ మూల భృత్యులు నిన్ను మోసపుచ్చిరి. ప్రభువుల వద్దనున్న భృత్యులెన్నొన్నో కపటోపాయములు చేయుదురు. అవి తెలుసుకొనవలదా? "బుద్దిహీనులకు బుద్ధిమంతుల మీదను, నీచులకు గొప్పవారిమీదను, కురూపికి రూపవంతుని మీదను, మనస్సులో అసూయలు పుట్టుట సహజము. అవి ఎరింగి ప్రభువు వర్తింపవలయును. అధర్మము ధర్మము వలెను, ధర్మము అధర్మము వలెను సాక్ష్యమిచ్చువారి నేర్పును బట్టి కనబడుచుండును. రాజు నిర్మలమతితో ధర్మసూక్ష్మము గ్రహింపవలయు కాని, తొందరపడరాదు. నీకు ప్రియమైన నక్క వచ్చినది మొదలుకొని మనకు చేసిన ఉపకారములెన్నో ఉన్నాయి. వాటిని తలపకుండా నిట్లు చేయుట ధర్మమా? కుటిలచిత్తులు కపటోపాయములు పన్నినంత మాత్రమున అవి నమ్మి మిత్రుండై, మంత్రియై, సువ్రతుడై ఎన్నికగన్న


వానినిట్లు చేయదగునా? చక్కగా పరీక్షించి కార్యము చేయవలదా? "దున్నపోతీనెననగా దూడను గట్టి వేయుమందురా?" కావున నిర్దోషియైన నక్కను బిలిచి గౌరవింపుము. అయినా నక్క మొదటినే ఈ విషయమున నీచేత ప్రమాణం చేయించిన సంగతి మరిచావా? చేసిన ప్రమాణం మరచినవారు, బ్రతికియున్నా చనిపోయినట్లేనని రాజనీతిజ్ఞుల సూచనలను కాలరాసి, నిరపరాధిని శిక్షించుట న్యాయమా? అని పలికిన తల్లి హితోపదేశము చేయ పులి పశ్చాత్తాపము నొంది, నక్కను రప్పించి, కన్నీరు దొరగ కౌగిలించుకొని తన నేరంబు మన్నింపుమని వేడుకొనెను. అప్పుడు నక్క పులితో ఇట్లనెను.


ఓ ప్రభూ! నాడు సకల మృగముల ఎదుట నన్ను గౌరవించినందుకు సంతసింతునా? నేడు దొంగతనము నాయందు మోపి చంపబంపినందుకు విచారింతునా? నీ నైజమెరింగియుండియే నేను నీ కడ కొలువుకు జేరునాడే నీ భృత్యుల మాటలు వినకుండునట్లు ఒట్టు (ప్రమాణం) వేయించుకొంటిని. అది నీకు జ్ఞాపకమున్నదా? ఎరిగియైనా, ఎరుగకనైనా, మొదట గట్టిగా అవమానించి, పిదప నీవు సజ్జనుడవు క్షమింపుమని వేడుకొనిన నేమి ఫలము? చేయని తప్పుకు శిక్షకు గురి అయితే అతడెంత దుఃఖమనుభవించును కదా! ప్రభువైనా, సామాన్యులైనా శిక్షించే ముందు ఒకటికి పదిమార్లు ఆలోచించవలయును కదా! కావున ఇంతటి అవమానము పొందిన మీదట నేను నీ వద్ద నుండనోపను. నేడనుగ్రహము, రేపు ఆగ్రహము గలవారిని సేవించుట కష్టము. అలాగే మాటకు కట్టుబడక చేసిన బాసలు మరిచిపోయే వారియొద్ద బ్రతకడం దుర్లభం" అని పలికి నక్క తన దారి తాను వెళ్ళిపోయెను. భృత్యుల కపటోపాయముల మాటలు విని సాధుజనుల నవమానము చేయు ప్రభువుల కడ ఉన్నత చిత్తము కలవారు చిరకాలము కొలువు చేయనోపరు. అట్టి ప్రభువుల రాజ్యముదుర్మంత్రుల స్వాధీనమైయచిరకాలముననశించునన్న సత్యాన్ని తెలుసుకొని, ఒక మంచి మిత్రుడు దూరమైనందులకు పులిమిగుల చింతించెను.


ఈ కథ ద్వారా చేసిన ప్రమాణానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని అవగతమవుతోంది. మనము చేయగలిగిన వాటిపైనే ప్రమాణం చేయాలి. చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకొనుటకు ప్రాణమున్నంతవరకు పాటుపడాలి. "ప్రమాణాలను నిలబెట్టుకొని బ్రతికేవారిపట్ల ఆ భగవంతుని కృప తప్పనిసరిగా ఉంటుంది. భక్తులను అన్నివేళలా కాపాడాలనే కంకణబద్దుడైన భగవంతుడు అనేక అవతారాలను ఎత్తవలసి వచ్చింది. మూటబోతే దొరుకుతుంది గాని మాటబోతె దొరకదు. కాబట్టి మానవులు తాము చేసిన బాసలను (ప్రమాణాలను) ఎట్టి పరిస్థితులలోను విస్మరించరాదు.