శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి41. ఓం హరయే నమః


 శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి


41. ఓం హరయే నమః


హరి స్వరూపుడైన వేంకటేశునకు నమస్కారము "నమః కృష్ణాయ హరయే పరస్మె బ్రహ్మరూపిణే - సహేతుక సంసారం హరతీతి హరిః" - అని శంకరాచార్యులు హరి శబ్దమును నిర్వచించారు. సహేతుకమైన సంసారమును నిర్మూలించువాడు హరి. "హరణ మింతకు జేసి హరినైతి" అని నాచన సోముని ప్రయోగము. మహాప్రళయ కాలమునందు సమస్తమును హరించువాడు, దుష్టులను సంహరించేవాడు, భక్తజనుల పాపాలను హరించేవాడు హరి. ఈ హరియే వేంకటాద్రిపై వెలసిన వేంకటేశుడు.


శ్లో|| హరిర్హరతి పాపాని దుష్ట చిత్తె రపి స్మృతః | యదృచ్ఛయాపి సంస్పృష్టో ది హత్యేవ హిపావకః||


దుష్ట చిత్తము గలవారైనను తనను స్మరించినచోశ్రీ హరి అతని పాపములను పోగొట్టును. అగ్ని తన స్వరూపమునకు తగినట్లుగా అబుద్ధిపూర్వకముగ తనను తాకిన వానిని కూడ దహించి వేయును గదా! అట్లే శ్రీ హరియైన వేంకటేశ్వరుడు అబుద్ధిపూర్వకముగ తనను స్మరించినను వాని పాపములు పోగొట్టును. -


శ్లో|| యత్ర కుత్రచిదాసీనః తస్మిన్ దివ్యే మహాగిరౌ | దేవదేవం సమారాధ్య య ఉపాస్తే జనార్ధనమ్ | కరోతి తస్య సాన్నిధ్యం భగవానాదికృత్ హరిః||


భగవంతుడగుశ్రీ హరి నారాయణగిరి యందు ఎక్కడో ఒకచోట, అన్నిచోట్ల, అన్ని రూపములలో నివసించి యున్నాడు. కనుక ఈ పర్వతండ్రి నివాసునారాధించినను, ఉపాసించినను, ఏ వస్తువును దర్శించినను వాసుదేవుని దర్శించినట్లగును. అందుచే అతని పాపములన్నియు నశించును.


హరియను రెండక్షరములు , హరియించును పాతకంబు అంబుజనాభా!


అని భక్తప్రహ్లాదుని మాట. పరవాసుదేవునకు (పరబ్రహ్మకు) గల లక్షణములలో సృష్టి, స్థితులతో పాటు జగత్సంహారకత్వము కూడ గలదు. అట్టి సర్వశక్తిగశ్రీ హరియే నారాయణాద్రిపై వెలసిన వేంకటేశుడని ఈ హరినామము తెలుపుచున్నది. -


"శాస్త్రాణాం పరమో వేదో దేవానాం పరమోహరిః| తీర్ణానాం పరమం తీర్థం స్వామిపుష్కరిణీ నృప||


వేంకటాచలమున అసంఖ్యాకములైన పుణ్యతీర్థములు ఉన్నాయి. అనేక పుణ్యతీర్థాలకు నిలయమవడం చేత వేంకటాద్రికి తీర్థాద్రి అను సార్థక నామధేయం కలిగింది.


శ్లో|| కాపిలం నామ యతీర్ణం తస్య పశ్చిమ భాగతః| పంచతీర్థమితి ఖ్యాతం పావనం పుణ్యవర్ధనమ్ || విప్ర క్షత్రియ విట్ శూద్రాయే చాంత్యాః పపాయోనయః| తేషాం క్రమేణ తీర్థాని పంచతాని నరోత్తమ!||


కపిల తీర్థమునకు పశ్చిమమున పంచతీర్థములు ఉన్నాయి. అవి విప్రతీర్థం, క్షత్రియతీర్థం, వైశ్యతీర్థం, శూద్రతీర్థం, పంచమతీర్థం అను పేర్లతో పిలువబడుతున్నాయి అని వామదేవుడు పంచతీర్థముల ఉనికిని, నామములను, వాటి మహిమలను తెలియజేశాడు. (పూర్వం భక్తులు కపిల తీర్థంలో స్నానము చేసి పవిత్రులై, దానికి పడమట నున్న కాలిబాటలో నడిచి, ఎక్కి తిరుమల చేరేవారు. ఆ కాలిబాట ప్రక్కనే క్రమముగా ఈ పంచ తీరాలున్నాయి) వామదేవుడు నిమి పుత్రుడగు జనక రాజునకు చెప్పిన వృత్తాంతమునే తర్వాతి కాలములో శతానందుడు సీత తండ్రియగు జనక రాజునకు చెప్పినాడు.


శ్లో॥ వారాహరూపీ భగవాన్ విష్ణుభకానుకంపయా| తేషు పంచసు తీరేషు సాన్నిధ్యం కురుతే సదా||


వరాహరూపి యగు విష్ణుదేవుడు భక్తుల యందలి దయతో ఆ పంచ తీర్థములలో నిత్య సాన్నిధ్యము కలిగి యున్నాడు. అందుచే ఆ పంచ తీర్థములలో స్నానము చేసిన ఆయా వర్ణముల వారి పాపములు తొలగిపోవును. మనోరథములు సిద్ధించును. - మన ప్రాచీనులు వర్ణాశ్రమ ధర్మములను పాటించి ఈ పంచ తీర్థముల విభజన, నామకరణము చేశారు. ఇది సంఘజీవనంలో నాటి కట్టుబాట్లను వెల్లడించుచున్నది. సాంఘిక వ్యవస్థలో కాలానుగుణమైన మార్పులు సహజము గదా!