ఆముక్తమాల్యద
శ్రీ వేంకటేశ్వరుని వైభవము
శ్రీ కృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తియే గాక గొప్ప కళాతపస్వి. మరియు గొప్ప వైష్ణవ భక్తుడు. భక్తుడగుటయే కాక వైష్ణవ నియమములను బాగుగా నెరిగి అనుసరించెడివాడు. అతడు రచించిన ఆముక్తమాల్యద గ్రంథమిందులకు పరమ నిదర్శనము. ఆముక్తమాల్యదలోశ్రీ వేంకటేశ్వరునిపై రాయలు ప్రదర్శించిన భక్తి నిరుపమానము.
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములోనే శ్రీ వేంకటేశ్వరుని రాయలు స్తుతించుట, ఆ తరువాతి పద్యములలో శ్రీ వేంకటేశ్వరుని సర్వాలంకారములను పోత పోసిన విధానమున రాయలు ఆవిష్కరించుట గమనార్హము. శ్రీ లక్షీశ్రీ వేంకటేశ్వరులను రాయలు స్తుతించిన మొట్టమొదటి పద్యమిది.
ఉ ||శ్రీ కమనీయహారమణి జెన్నుగదానును, గౌస్తుభంబునం దాకమలావధూటియునుదారతఁదోప, పరస్పరాత్మలం దాకలితంబులైన తమయాకృతు లచ్ఛత బైకిఁదోపన సోకతనందుఁదోఁచెనన శోభిలు వేంకట భర్తగొల్చెదన్ కావ్యమును ప్రారంభించుటకు "ఆ శీర్ణమస్కియా వస్తు నిర్దేశావాపి తన్ముఖమ్" అను నియమము ననుసరించి నమస్కియతో రాయలు ఆముక్తమాల్యద గ్రంథారంభము గావించినాడు. మరియు శ్రీ తో కావ్యమారంభించినాడు. ఎందులకనగా "వేదములకెల్ల నోంకారమాదియైన కరణి, కృతులకునెత్తీ కారమాది గాన కవివరులెల్లరును, దానిదక్కనితర వర్ణంబులిడరు సత్కృతుల మొదల" అని శాస్త్రవచనమున్నది గనుక. సాధారణముగా శార్దూల విక్రీడితములతో కావ్యములు ప్రారంభించుట పరిపాటియై యుండగా, ఈ కావ్యములో ఉత్పలమాలతో ప్రారంభమైనది. రాయలశ్రీ వేంకటేశ్వరునకు భక్తితో నుడుగరలు ఘటించినది. ఉత్పలమాలలతోనే.
మహాలక్ష్మి, శ్రీ వేంకటేశ్వరులు ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా, కావ్యకథలోని ఆముక్తమాల్యద, రంగనాయకులు పరిణయ వృత్తాంతమును సూచించుట ద్వారా వస్తునిర్దేశము గావించినాడు రాయలు. తదుపరి వర్ణన విష్ణుమూర్తి శయనించుశేషుని వర్ణనశ్రీ దేవిని కనుమరుగుపరచిశ్రీ వేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము గల్పించిన శేషుని రాయలు స్తుతించినాడు. ఆముక్తమాల్యదలో తరువాతి పద్యములలో చాలాభాగము తిరుమలనంతయు సాక్షాత్కరింపజేసినాడు రాయలు. గరుత్మంతుని రెక్కల వలన, పాపములు దూదిపింజలవలె ఎగిరిపోవునని రాయల వర్ణన.. తిరుమలలో, బ్రహ్మూత్సవ సందర్భములో గాని, ఇతర పూజా సందర్భములలో గాని, ధ్వజారోహణ గావించి శుభారంభము గావించెడు సందర్భములలో విష్వక్సేనుని పూజించుట నేటికీపరిపాటి. అనుస్యూతముగా వచ్చుచున్న ఈ ఆచారాన్ని రాయలుష్కలమాధ్వీకఝరిన్మురారి ఆముక్తమాల్యదలో ఇలా వర్ణించాడు.
పాంచజన్య ధ్వనిచే రాక్షసులు మరణించుటయే కాదు, రాకా పున్నమి నాటి చంద్రుని తెల్లని కాంతిగల హరి శంఖము వెలుగులీనుచు, కళ్యాణ సమృద్ధిని గూడ ఒనగూర్చునని రాయల శుభాశంసన. శంఖు చక్ర గదా ధరుడని కర్రీ వేంకటేశ్వరుని స్తుతి. కాని రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. సుదర్శన చక్రము యొక్క విశిష్టత అట్టిది. సర్వశత్రు నిరాసకంబైన ఆ కౌముదకీ గద మదీయ శత్రు నిరాసకం బొనరించుగాత అని రాయలు వర్ణించెను. శాప్తధనువు అను విల్లు కూడ చాలా ప్రశస్తి గాంచినది. పాపములనియెడు తీగల యొక్క శ్రేణిని పటాపంచలము చేయగల సామర్థ్యము కలది నందక ఖడ్గము. -
మ || ప్రతతోర్వాధర భాగపీఠయుగళీభాస్వత్సరుస్తంభ సం స్థితిఁ దీండ్రించెడు జాళువా మొసలివా దీపార్చిగాఁ గజ్జలా న్విత ధూమసిత రేఖపై యలుగగా విజ్ఞానదీపాంకురా కృతి నందంబగు నందకంబఘలతాత్రే ణిచ్చిదం జేయుతన్ ||
శ్రీ వేంకటేశ్వరునకు, అతనికి సంబంధించిన శంఖు చక్ర గదాదుల నెంతగా పైరీతి రాయలు స్తుతించుటయే గాక శ్రీ వైష్ణవమతానుయాయి కనుక, తన్మతప్రతిష్టమ్ మూలకారకులైన పన్నిద్దరాళ్వారుల నిట్లు స్తుతించినాడు. -
మ || అలపన్నిద్దలు సూరులందును సముద్యల్లీలగా పున్నవె గలపుం దాపముఁబాపనా నిజమనః కంజాత సంజాతపు రాయలుష్కలమాధ్వీకఝరిన్మురారి సొగియంగాఁజొక్కి ధన్యాత్ములౌ నిలపన్నిదఱు సూరులందలతు మోక్షేచ్చామతిం దివ్యులన్
స్వామి కంటె అతని భక్తులకే పెద్దపీట వేయించడం శ్రీ వేంకటేశ్వరుని విశిష్టత. అన్నమయ్యకు అదేవిధంగా స్వామి నేటికీ ప్రశంసలు కురిపిస్తున్నాడు కదా. ఇక్కడ పన్నిద్దరాళ్వారుల గురించి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ద్రావిడ దేశంలో క్రీ.శ.10 వ శతాబ్దికి పూర్వం, ద్వాదశాదిత్యులవలె, మహావైభవంతో ద్వాదశ దివ్యసూరులు పన్నిద్దరాళ్వారులు అవతరించి తమ దివ్యగాన ప్రబంధం చేత, పరమ పవిత్రచరిత్ర చేత దేశాన్ని భక్తిరస సాగరంలో ముంచెత్తారు. వీరు మైమరచి ద్రావిడభాషలో గానం చేసిన భగవన్మహిమను వివరించే గ్రంథరాజములే దివ్య ప్రబంధములు. దక్షిణదేశానికి చెందిన వైష్ణవాలయాలు వీరి ప్రబంధాలు గానం చేయనిదే, వీరి శిలావిగ్రహములను ప్రతిష్ఠించి పూజించనిదే దివ్యస్థలమనే మహారాజ గౌరవం వచ్చేది కాదు. దివ్యప్రబంధాలకు దాక్షిణాత్య శ్రీ వైష్ణవులు వేదప్రామాణ్యాన్ని ఒసంగారు. దివ్యప్రబంధములు 24. వీనిలోని పాశురములు అంటే ద్రావిడ పద్యముల సంఖ్య 4000. నేటికీ తిరుమలలో ఈ పాశురములను అనునిత్యం గానం చేస్తూనే ఉంటారు. ఆముక్తమాల్యదను శ్రీ వేంకటేశ్వరున కంకితమీయ గోరినవాడు శ్రీ కాకుళాంధ్రదేవుడు. ఈ దైవ నిర్ణయము అద్భుతము. లోక కళ్యాణ కారకము.శ్రీ కాకుళాంధ్రదేవుడే రాయలకిట్లు సెలవొసంగినాడు.
| అంకితమోయన నీకల వేంకటపతి యిష్టమైన వేల్పగుట దదీ యాంకితముసేయుమొక్కొక సంకేతమ కాకతడరసన్నేగానే
సాధారణంగా షష్ట్యంత పద్యాలలో కావ్యాలను అంకితమిచ్చునపుడు, వారి పైవారి గొప్పదనములను వివరియా వారికి కృతిని సమర్పించుట సాహితీ లోకములో పరిపాటి, సంప్రదాయము. అనేక ప్రబంధరాజములనుకృతిగన్న కృతిభర్త చక్రవర్తి కృష్ణదేవరాయలు. అతనికే కాక సమస్త భువనములకు చక్రవర్తి యైన లోకైక నాథుడు వేంకటేశ్వరుడుఇంద్రాది దేవతలకే దిక్కెన, ఆ నరసింహాకృతి దాల్చిన శ్రీ వేంకటేశ్వరునికి ఈ క్రింది విధముగా ఆముక్తమాల్యదను సమర్పించాడు. ఆ పద్యం ఇది.
క||అంబోధికన్యకాకుచ కుంభంభిత ఘుసృణ గురువక్షునకున్; జంభారిముఖాధ్యక్షున కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్
స్వామి హర్యక్షునకున్ అను పదములో ఒక చమత్కారమున్నది. సామి = అంటే అర్ధభాగం. హర్యక్షునకున్ = సింహమగు వానికి అనికదా అర్థం. అంటే నరసింహాకృతి దాల్చినవానికి అని అర్థం. చమత్కారమేమిటంటే నరులలో సింహశ్రీ కృష్ణదేవరాయలైతే, ఆ నరసింహునకే నరసింహుడు శ్రీ వేంకటేశ్వరుడుశ్రీ వేంకటేశ్వరునిపై రాయలకు ఎంత భక్తిఆముక్తమాల్యదలో శ్రీ వేంకటేశ్వరునిపై రాయలు రచించిన భావాలలో అవకాశం, సందర్భం అల్పమే అయినా, అతడు భక్తితో ఉడుగరలు ఘటించినది అనల్పం. అతడు వర్ణించనిశ్రీ నివాసుని ప్రత్యంగదేవతలు కాని, ప్రదేశములు కాని లేవుశ్రీ వేంకటేశ్వరుని శ్రీ దేవి, భూదేవుల, తిరుపతి మరియు తిరుమలలోని అన్ని ప్రదేశములను మనముందుంచినాడు రాయలు.
ఈ షష్ట్యంత పద్యాలన్నింటిలోను సామాన్యమైన ఒక విశేషం గోచరిస్తుంది. అదేమిటంటే రాయలశ్రీ వేంకటేశ్వరుని శతృసంహారకునిగా అధికభాగం వర్ణించడం. ఎన్నో యుద్దాలు చేసిన రాయలు శ్రీ వేంకటేశ్వరుని, అనేక సందర్భాలలో మానసికంగా పరిపూర్ణంగా కొలుచుకున్నాడు. దాని ఫలితమే రాయలు సర్వరాజన్య సార్వభౌముడై, సర్వ కవికుల సార్వభౌముడై, ప్రశాంత జీవనం గడపగలిగాడు. ఆ కృతజ్ఞతను ఈ షష్ట్యంత పద్యాలలో ఆముక్తమాల్యదలో కనపరచాడు. తెలుగు సాహిత్యంలోనే అత్యంత వర్ణనాప్రియుడైన రాయలు ఈ ఆముక్తమాల్యదలో ఆ షష్ఠ్యంతాలను తెలుగులోనే చాలా చిన్న వృత్తమైన కందపద్యాలలో వర్ణించడం విశేషం. ఈ చిన్నపద్యాలలోనే అనంతమైన ఆ అనంతుని వైభవాన్ని ఇంకా ఇలా వర్ణించాడు.
క|| మర్దిత కాళియ ఫణికి గ పర భృదజబింబితాచుపదనఖ ఘృణికిన్ దోర్దండ శాకిణి కఘ కరమ దినమణికి దనుజకరివరసృణికిన్
ఇదేవిధంగా ఆశ్వాసాంత, ఆశ్వాసాది పద్యములలో శ్రీ వేంకటరమణుని స్తుతించినాడు రాయలు. ఆ సందర్భములో కూడ కాకాసురుని శిక్షించిన వానిగా, మరియు హిరణ్యాక్షుని వంటి అనేక దనుజుల శిక్షించిన వానిగా, నరసింహావతార వరాహావతార విశేషరూపునిగ రాయలు శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని నుతించాడు. అనితర సాధ్యమైన విష్ణు సాక్షాత్కారం విష్ణుచిత్తునకు లభించినట్లు, ఆముక్తమాల్యదలోని వర్ణన. ఈ ఘట్టములోనే రాయలు విష్ణుచిత్తునిచే దశావతార వర్ణనను గావించినాడు. ఈ క్రింది కంద పద్యంలో రాయలు దశావతార వర్ణనను ఎంత అద్భుతంగా వర్ణించాడో గమనించండి.
|| జలచరకిటి హరి వటు భృగు కుల రఘుకుల సీరిబుద్ధ ఘోటి ప్రముఖో జ్వల జనికృతజనరక్షా యలమేల్మంగాభిధేందిరాలయవక్షా!
ఈ దశావతారములతోశ్రీ వేంకటేశ్వరుడు తన వైభవంతో జనరక్ష సదా చేయుచునే యున్నాడు. ప్రాచీనాంధ్ర వాజ్మయంలో నాయికా నామములో వెలసిన ప్రబంధము ఆముక్తమాల్యద. రాయలు మహావిష్ణు భక్తుడు, తాతాచార్యులవారి శిష్యుడు. శ్రీ వేంకటేశ్వరునకు పరమభక్తుడైన రాయలు తన లోహవిగ్రహాన్ని, దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవుల యొక్క లోహ విగ్రహాలను నిర్మింపచేసి, తిరుమలలోని దేవాలయ ప్రాంగణంలో స్వామికభిముఖంగా ప్రతిష్ఠింపచేశాడు. ఆముక్తమాల్యద కేవలము ఆంధ్రులు గర్వింపదగ్గ గ్రంథరాజమే కాక, యావద్భారతీయ విజ్ఞాన సంస్కృతులకు గనిశ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని చాటి చెప్పే సుదర్శన చక్రము, స్వామి మెడలోని కౌస్తుభమణిహార సదృశము.