షోడశోపచారాలు 


షోడశోపచారాలు                                                                       - పి.ఎల్.నరసింహాచార్య దాసన్


లక్ష్మీనారాయణులకు తో పూజ చేస్తారనుకోండి. ఆవాహయామి - అక్కడే ఉందిగా విగ్రహం. కొత్తగా రమ్మనడమేమిటి? కాదు. స్వామి రండి. కూర్చోండి. మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నారు అన్న భావన. ఆసనం సమర్పయామి. సింహాసనంలో కూర్చోండి. ఈ ఉపచారాలు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది. మనస్సులో ఎదురుగా పరమేశ్వరునికే ఇస్తున్నానన్నభావనచేత పారవశ్యాన్ని పొందారు. అంత సంతోషాన్ని పొంది చిట్టచివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీటమీద నుండి లేచి బయటికి వచ్చారు. మనిషి పుట్టుక నుండి శరీరం విడిచిపెట్టే వరకు పదహారు సంస్కారాలు. చంద్రుడికి పదహారు కళలు. పూజలో పదహారు ఉపచారాలు. పదహారు చేయడానికి సమయం లేకపోతే కనీసంలో కనీసం అయిదు చేయాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు. "పంచ సంఖ్యోపచారిణీ". అనంతకోటి సుఖాలు మనం అనుభవిస్తున్నాము అంటే అయిదు ఇంద్రియాలలో నుంచే. ఈ అయిదు ఇంద్రియాలు శ్రీ మన్నారాయణుడిచ్చాడు. విచ్చలవిడిగా వాడుకున్నావు. నిద్రా కాలిక సుఖాన్నిచ్చాడు. నిద్రలో మళ్ళీ ఈ ఇంద్రియాలకి శక్తినిచ్చాడు. నిద్రలేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇచ్చినందుకు ఆయనకు చెప్పాలి. అందుకే పూజ ప్రాతఃకాలంలో. దీపంతో పూజ ప్రారంభం. ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు. సాత్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్విక పదార్థాలని ఆయనకు నైవేద్యం చేస్తున్నావు. స్పర్శను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. చెవులతో ఎన్నో విని మురిసిపోతున్నావు. వీటికి కృతజ్ఞత చెప్తూ పువ్వులతో ఉపచారం చేస్తున్నావు. అన్నింటికన్నా పెద్ద గౌరవం ప్రసాదానికి ఇస్తారు. ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. పువ్వుల కొరకే తుమ్మెదలు ధ్వని చేస్తాయి. పువ్వు కనపడితే ధ్వని ఆపి మకరందం తాగుతుంది. ఆ నామములు చెప్పడం చేత మనస్సు వికాసాన్ని పొందాలి. అందుకే వినేటటువంటి చెవులు ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. అనంతమైన సుఖాలు అనుభవించడానికి ఈ అయిదు ఇంద్రియాలే కారణం. ఈ అయిదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్ళీ శక్తినిచ్చినందుకు నారాయణా! ముందు నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంలాగా. ప్రొద్దున పూజచేసి ఇంద్రియాలను వాడుకోవడం మొదలుపెడతాడు. అంటే ఈ శరీరాన్ని ప్రసాదంగా వాడుకుంటున్నావు. ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడౌతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. మీరు భగవంతునికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్లే. మీరు కూడా పూజనీయులవుతారు. లోకం చేత గౌరవింపబడే శీలవంతులవుతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకని పూజలో అయిదు ఉపచారాలు. ఆయనకి లేక కాదు. మనయొక్క మర్యాద పించుకోవడానికి ఆ పరంధామునికి ఈ పంచోపచారాలు చేస్తాం. Ⅱ